రంగారెడ్డి

మున్సిపాలిటీల్లో సమీకృత మోడల్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్/శంషాబాద్, ఫిబ్రవరి 20: ప్రతి మున్సిపాలిటీల్లో సమీకృత మోడల్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు, 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించబోనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మల్లికా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పట్టణంలో నాణ్యమై, పరిశుభ్రమైన కూరగాయలు, పండ్లు, నాన్ వెజ్ ఆహార పదార్థాలు ఒకే ప్రాంతంలో అందించేందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి మున్సిపాలిటీల్లో ఎకర స్థలం గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ప్రతి నెల రూ.148కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో షీ-టాయిలెట్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో స్థానికులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు వార్డుల వారీగా యువకులు, మహిళలు, విద్యావంతులు, సీనియర్ సిటిజన్లు 60మందితో కమిటీలను వేయాలని మంత్రి సూచించారు. మున్సిపాలిటీలకు ప్రతి ఏడాది రూ.800కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని వివరించారు. రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.130కోట్ల నిధులు వస్తున్నాయని తెలిపారు. వచ్చిన బడ్జెట్‌లో 10శాతం నిధులు హరితహారానికి కేటాయించేందుకు మున్సిపల్ చైర్మన్లు కృషి చేయాలని అన్నారు. రానున్న రెండు నెలల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి పనులతోపాటు అభివృద్ధి పనుల్లో అలసత్యం వహిస్తే చైర్మెన్లు, కౌన్సిలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వార్డు వారీగా స్వచ్ఛ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, ప్రతి మున్సిపాలిటీలో ఆట స్థలాలను ఏర్పాటు చేయడంతోపాటు చెరువులను, కుంటలను సుందర పార్కులుగా తీర్చిదిద్ధాలని అన్నారు. నిరక్షరాస్యతను నిర్మూలించి అక్షరాస్యతను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి అభివృద్ధియే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వెళ్లాలని అన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో మొక్కలు నాటి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపాలిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.47వేల కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రణాళిక బద్ధంగా పట్టణ ప్రగతి పనులు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ తరహాలో పట్టణాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పట్టణాల రూపురేఖలు మారే విధంగా చైర్మెన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.