రంగారెడ్డి

సమ్మె హోరు.. నినాదాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 15: ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్‌ల సాధన కోసం చేపట్టిన సమ్మె రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మంగళవారం చెంగిచర్ల, ఉప్పల్ బస్‌డిపో వద్ద సమ్మె హోరును కొనసాగించారు. ప్రదర్శనలు, రాస్తారోకోలు, నిరసనలతో సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు జోరు విన్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వారి డిమాండ్‌లను పరిష్కరించాలని రాస్తారోకోలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఉప్పల్ బస్‌డిపో వద్ద రాస్తారోకో, నిరసనలతో హోరెత్తించారు. బీజేపీ పీర్జాదిగూడ కమిటీ అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా రాస్తారోకోలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరుగడటంతో ఓ కార్మికుడు సొమ్మసిల్లి పపిపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేశ్, నరిసింహ, మహేష్, బీజేపీ నాయకులు ఏనుగు లక్ష్మయ్య, దాసరి మహేష్, జనిగె వెంకటేశ్, కే.గురునాధ్, లీలావతి, రాధిక రెడ్డి, గీత, సుజాత, సంధ్య, విజయ పాల్గొన్నారు.
ఉప్పల్: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీరామ ఆర్టీసీ కాలనీలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ మహిళలు చందన, సౌజన్య, సువర్ణ, సృజన, విజయ, సుజాత మంగళవారం కమిషనర్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్ సమస్యలను పరిష్కరించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ పై సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మహేశ్వరం: మహేశ్వరం డిపో పరిధిలో మంగళవారం కార్మికులు సమ్మె హోరును కొనసాగించారు. రాస్తారోకో, మానవహారం డిపో ఎదుట నిరసనలు చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు డిమాండ్లను పరిష్కరించాలని న్యాయవాదుల జేఏసీ నాయకుడు ఆశోక్ అన్నారు. మహేశ్వరం గేటు వద్ద రాస్తారోకో నిర్వహించగా మహేశ్వరం సీఐ వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీసులు బందోబస్తు చేపట్టి కార్మికులను అరెస్టు చేసి వదిలిపెట్టారు. కందుకూర్ మండలం పలు అభివృద్ది పనులకు హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఇబ్రహీంపట్నం: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. రోజుకో వినూత్న రీతిలో కార్మికులను సమ్మెను ఉధృతం చేస్తున్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో కార్మికులు సాగర్ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్ గౌడ్, చందర్, సదానందం మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్నారని అన్నారు.
మేడ్చల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉద్ధృతమవుతున్నది. సమ్మెలో భాగంగా 11వ రోజైన మంగళవారం ఆర్టీసీ కార్మికుల ఆందోళనలతో మేడ్చల్ ప్రాంతం దద్దరిల్లింది. ఆర్టీసీ కార్మికులు మానహారం, ర్యాలీ, రాస్తారోకో తదితర కార్యక్రమాలతో హోరెత్తించారు. సమ్మెకు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులతో పాటు సీఐటీయూ శ్రేణులు కూడా మద్దతు పలికారు. డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకులు విక్రంరెడ్డి, మోహన్ రెడ్డి, జగన్‌గౌడ్ కార్యక్రమంలో పాల్గొని కార్మికుల్లో ధైర్యాన్ని నింపారు. ఆర్టీసీ డిపో ఆవరణలో మానహారం నిర్వహించి ర్యాలీగా హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆర్టీసీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు.
షాద్‌నగర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. మంగళవారం షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు ఏఐటీయూసీ, సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి పర్వతాలు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుందని ఆరోపించారు. సీపీఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు రాజు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. బీకెఎంఓ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య, ఎఐటీయుసీ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీను, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి పవన్, సీపీఐ నాయకులు చందర్‌బాబు, లింగం, అంజయ్య, సీఐటీయూ నాయకులు ఈశ్వర్ నాయక్, శ్రీను నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ నేత ప్రశాంత్, శివశంకర్ పాల్గొన్నారు.
శంకర్‌పల్లి: ప్రభుత్వం వెంటనే ఆర్‌టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశే్వశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్‌టీసీ కార్మికులకు మద్దతుగా శంకర్‌పల్లిలో మంగళవారం ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. కార్మికులను చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
వికారాబాద్: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉండి పోటారం చేస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా పట్టణంలోన ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. సమ్మెకు మద్దతుగా ప్రసాద్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలనను తలపిస్తుందని, నాడు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, ఇదే కేసీఆర్ తెగపొగడారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చి.. ఇప్పుడే అనలేదు అన్నట్లుగా మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఎంపీపీ చంద్రకళ, నాయకులు జాఫర్, కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి ఉన్నారు.
రాజేంద్రనగర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ రాజేంద్రనగర్ జోన్ కార్యదర్శి ఎస్.రాజు వెల్లడించారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వారిని బెదిరింపులకు గురిచేస్తే ఊరుకునే సమస్య లేదని అన్నారు. విద్యా సంస్థలు 19 వరకు పొడిగింపు చేయడం వెనుక కారణం.. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఐక్యం అవుతారో అనే భయం కేసీఆర్‌లో ఉందని అన్నారు.
కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
రాజేంద్రనగర్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశే్వశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 11 వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. రాజేంద్రనగర్ డిపో ముందు నిరసలు మిన్నంటాయి. డిపో నుంచి రాజేంద్రనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం రాజేంద్రనగర్ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న ఆందోళనకు కాంగ్రెస్ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాజేంద్రనగర్ శాఖ, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల సంఘం మద్దతు పలికి సంఘీభావం ప్రకటించారు. చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశే్వశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పరిపాలన ఇలాగే కొనసాగితే ప్రజలే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తారని హెచ్చరించారు. కేసీఆర్ మొండివైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ట్విట్టర్‌లోనైనా మంత్రి కేటీఆర్ స్పందించాలని కోరారు. టీయూడబ్ల్యూజే నేత ఏ.్భమయ్య, నాయకులు ఏపీ చారి, ఎం.ప్రేమ్‌రాజ్, సూర్యనారాయణ, సత్యం గౌడ్, సూర్యకిరణ్, బాబురావు, వరకాల చందు, సుజీవన్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీకాంత్, గద్దె యాదగిరి, శివచరణ్ గౌడ్, ఇంద్రసేన పాల్గొన్నారు.