కథ

ఇరుకు గది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతారత్నమ్మ ఇద్దరు కుమారులు రాజవరంలో నివసించేవారు. పెద్దవాడు రాహుల్ ఆఫీసులో పనిచేస్తూ పెద్ద ఇంటిలో హుందాగా ఉండేవాడు. చిన్నవాడు రాకేష్ మామూలు గుమాస్తాగా పనిచేస్తూ ఇరుకు గదిలో ఉండేవాడు.
ఆ రోజు సీతారత్నమ్మ చాలా హడావుడి పడసాగింది. దానికి కారణం ఆమె అన్నయ్య చంద్రశేఖర్ అమెరికా నుండి రావడమే. ఇరవై ఏళ్లు అమెరికాలో ఉన్న చంద్రశేఖర్ హైదరాబాద్‌కు వచ్చి రాజవరం వస్తున్నానని సోదరికి కబురు పెట్టాడు.
సీతారత్నమ్మకు ఇద్దరు కొడుకులకు వివాహం జరిపించినా పెద్దకుమారుడు అంటేనే మక్కువ. ఆఫీసర్ కనుక అడిగినప్పుడల్లా సీతారత్నమ్మకు లేదనకుండా ఇచ్చేవాడు. చిన్నవాడు మామూలు గుమాస్తా కనుక పొరపాటున ఎప్పుడైనా అడిగినా పైసలు లేవమ్మా అని అంటే ముఖం చిన్నబుచ్చుకునేది.
అందుకే ఇద్దరు కొడుకులను, కోడళ్లను పిలిచి చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి ‘పిల్లలూ! మీ మేనమామ అమెరికా నుండి వస్తున్నాడు. ఓ పదిహేను రోజులు ఇక్కడే ఉంటాడు. మీకు తోచిన రీతిలో మనకు మాట రాకుండా నడచుకోవాలి’ అంది.
ఇరవై సంవత్సరాల తరువాత వస్తున్న మేనమామ అనేసరికి రాహుల్, రాకేష్ ఇద్దరిలో ఉత్సుకత తొంగి చూసింది. ‘తప్పకుండానమ్మా! మామయ్య ఉన్నన్ని రోజులు ఏ లోటు రాకుండా చూసుకుంటాం’
సీతారత్నమ్మ రాకేష్‌తో ‘బాబూ! నీ దగ్గర మహా అంటే ఒక్కరోజు ఉండటమే కష్టం. నీ ఇరుకు గదిలో నీ భార్య, పిల్లవాడితో ఉండడమే గగనమంటే నేను, మీ మామయ్య ఎలా ఉండగలుగుతామో అనే భయం పట్టుకుంది’
తల్లి మాటలకు రాకేష్ ముఖం చిన్నబోతే, రాహుల్ ముఖం ట్యూబ్‌లైట్‌లా వెలిగింది. ‘అమ్మా! నీవేం బాధపడకు మామయ్య ఉన్నన్ని రోజులు నా దగ్గరే ఉంటాడు. కావలిస్తే తమ్ముడిని కూడా నా దగ్గరనే ఉండమను’ అని అన్నాడు రాహుల్.
రాకేష్ భార్య సీత బావగారిని వారిస్తూ ‘ఎందుకు బావగారూ! మాకు తోచిన రీతిలో మేం సత్కరించుకుంటాం బాబాయిని’ అంది.
సీతారత్నమ్మ మూతి మూడు వంకరలు తిప్పుతూ ‘ఆ ఒక్కరోజు మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు’ అంది.
అత్తగారి మాటలకు పెద్ద కోడలు రజని ముసిముసి నవ్వులు నవ్వగా సీత చిన్నబుచ్చుకొంది.
* * *
మరునాడు చంద్రశేఖర్ కారులో సీతారత్నమ్మ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు మేనల్లుళ్లనుచూసి నవ్వుతూ ‘ఏరా! మామయ్యను మర్చిపోయారా? చిన్నప్పుడు వదలకుండా తిరిగేవారు’ అన్నాడు.
చంద్రశేఖర్ మాటలకు -రాహుల్ బిగ్గరగా నవ్వి ‘మీకు బోర్ అనిపించేవరకు ఇక్కడ ఉండి వెళ్లవచ్చు’ అన్నాడు.
‘వెరీగుడ్! రాకేష్ నువ్వేం మాట్లాడవేంరా?’ అన్న మేనమామ మాటలకు ఇబ్బందిగా కదిలాడు.
రాహుల్ వ్యంగ్యంగా ‘వాడిది ఇరుకుగది మామయ్యా! మీరేం ఉండగలుగుతారు. కావాలంటే వాడిని, వాడి కుటుంబాన్ని ఇక్కడికే పిలిపించుకొందాం’ అన్నాడు.
అన్నయ్య మాటలకు కళ్లల్లో నీళ్లు తిరగటంతో పక్కకు తిరిగి కళ్లు తుడుచుకున్నాడు రాకేష్.
ఈ విషయం గమనించిన చంద్రశేఖర్ మాటల్ని వేరేవైపు మళ్లించాడు.
* * *
వారం రోజులు రాహుల్ ఇంట్లో గడిపిన చంద్రశేఖర్ ఆ రాత్రి పడుకోగానే రాహుల్ గదిలోంచి మాటలు వినపడసాగాయి. ‘ఏమండీ! బాబాయిగారు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? మనకు ప్రైవసీ లేకుండా పోతోంది కదండీ!’
రజని మాటలకు రాహుల్ ‘వారం రోజులకే ఇలా మాట్లాడితే ఎలా డార్లింగ్! మామయ్య ఎన్ని రోజులుంటాడో ఏమో కొద్దిగా ఓపిక పట్టు’ బుజ్జగించాడు.
* * *
మరునాడు చంద్రశేఖర్ నిద్రలేవగానే రాహుల్‌తో ‘ఏరా! రాకేష్ దగ్గర రెండు రోజులు ఉండి వద్దామనుకొంటున్నాను’ అన్నాడు.
రాహుల్ బిత్తరపోతూ రాత్రి మాటలు మామయ్య విన్నాడా? అనుకొని ‘తొందరేముంది మామయ్యా! మరికొన్ని రోజులు ఉండండి’
‘లేదురా! చిన్నవాడు బాధపడతాడు కదా! రెండు రోజులు వాడి దగ్గర ఉండి వస్తాను’
రాత్రి భార్య మాటలకు రాహుల్ కూడా ఎక్కువ బలవంతపెట్టకుండా సరేనన్నాడు.
* * *
మరునాడు చంద్రశేఖర్ రాకేష్ ఇంటికి వెళ్లాడు. రెండు చిన్నరూంల గదులు. ఇరుకుగా ఉన్నాయి. చంద్రశేఖర్ ఇబ్బందిగానే ఇంటిలోకి నడిచాడు.
సీత, రాకేష్‌లు సంతోషంగా చంద్రశేఖర్‌ను ఆహ్వానించారు. వారి ముఖాల్లో సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోయాడు చంద్రశేఖర్.
రాకేష్ ‘మామయ్యా! ఇరుకు గదిలో సర్దుకుంటారా?’
లోపల ఇబ్బందిగా ఉన్నా పైకి మాత్రం ‘అదేమిటిరా! అలా అంటున్నావ్. నువ్వొకటి, రాహుల్ ఒకటా’ అన్నాడు.
రాత్రి భోజనాలు పూర్తి కాగానే తాము పడుకునే గదిని చంద్రశేఖర్‌రావుకు కేటాయించారు. భార్యాభర్తలు హాలులో పక్క వేసుకున్నారు.
అది చూసిన చంద్రశేఖర్ మనసు కలుక్కుమంది. వౌనంగా వారి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకొని పడుకున్నాడు. కాని నిద్ర రాలేదు.
ఒక రాత్రి రాకేష్ భార్యతో ‘సీతా! మామయ్యకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అసలే మన ఇల్లు ఇరుకు. ఆయన అమెరికా నుండి రాకరాక వచ్చాడు. నువ్వేమంటావ్?’ అన్నాడు.
‘్భలేవారండీ! బాబాయి ఎన్ని రోజులున్నా వారికి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటాను. సరుకులు నిండుకుంటే నా మంగళసూత్రం తాకట్టు పెట్టి ఐనా సరుకులు తీసుకొని వచ్చి మీకు మాట రాకుండా చూసుకొంటాను’
సీత మాటలకు రాకేష్ ‘నా అర్ధాంగి అనిపించావ్. గుమస్తా ఉద్యోగం చేస్తున్న నాకు అన్ని విధాలుగా అండగా ఉండి నా బరువు బాధ్యతలు పంచుకుంటున్న నీకు నేనేమివ్వగలను’
భర్త మాటలకు సీత ముసిముసి నవ్వులు నవ్వుతూ ‘మీరు నాకు భర్తకావడమే నా అదృష్టం’ అంది.
వారి మాటలు విన్న చంద్రశేఖర్ ఒక నిర్ణయానికి వచ్చి హాయిగా నిద్రపోయాడు.
* * *
తెల్లవారిన తర్వాత చంద్రశేఖర్ సీతారత్నమ్మను పిలిచాడు. ‘చెల్లెమ్మా! నా శేష జీవితం రాకేష్ దగ్గర గడపాలనుకొంటున్నాను. నాకు పిల్లల్లేరు. సీతను నా కూతురుగా ప్రకటిస్తున్నాను. ఇరుకు గదిలో ఉంటున్న నా అల్లుడు, బిడ్డకు 3 బెడ్‌రూముల ఇల్లు కట్టించి, నా ఆస్తి సీత పేరు మీద మారుద్దామనుకుంటున్నాను’ అన్నాడు.
సీతారత్నమ్మ ఆశ్చర్యంతో ‘అన్నయ్యా! పెద్దవాడైన రాహుల్‌ని వదిలిపెట్టి ఈ ఇరుకుగదులున్న ఇల్లు ఎలా నచ్చింది’ అంది.
‘చెల్లెమ్మా! రాకేష్ కుటుంబం నివసించేది ఇరుకు గది అయినా వారి హృదయాలు విశాలమైనవి’ అని జరిగిన విషయమంతా చెల్లెలికి తెలియజేశాడు.
అన్నయ్య మాటలతో ఇన్ని రోజులు రాకేష్‌ను చిన్నచూపు చూసినందుకు మనసులోనే పశ్చాత్తాపపడింది సీతారత్నమ్మ.
*

-ప్రతాపురం రామానుజాచారి
ఇం.నెం.6-7-20
బ్రాహ్మణవాడ,
హన్మకొండ - 506 011

-ప్రతాపురం రామానుజాచారి