రివ్యూ

ప్రయత్నం వరకూ హిట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు**హిట్
**
తారాగణం: విశ్వక్సేన్, రుహానీ శర్మ, బ్రహ్మాజీ, భానుచందర్, మురళీశర్మ, చైతన్య, హరితేజ మొదలైనవారు.
సంగీతం: వివేక్‌సాగర్
కెమెరా: ఎస్ మణికందన్
నిర్మాత: ప్రశాంతి త్రిపిర్నేని
సమర్పణ: నాని
దర్శకత్వం: శేలేష్ కొలను
**
‘ముందేం జరగబోతోంది’ అన్న ఉత్కంఠే థ్రిల్లర్ సినిమాలకు ఆక్సిజన్. అయితే ట్విస్ట్‌ను విప్పేటప్పుడు దానికో సమంజసత అవసరం. అయితే హిట్‌లో ఉత్కంఠ పుష్కలమే అయినా.. చిక్కువిప్పే తీరులో మిస్సైన లాజిక్ ఫట్టయ్యింది. ఫైనల్‌గా -్ఫర్వాలేదన్న భావన దగ్గరే ఆగిపోయింది. సినిమాలోని మరో ప్రధాన బలహీనత చాలావాటికి క్లారిటీనివ్వకపోవడం. హిట్‌ని విస్తృతం చేస్తే -హోమిసైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్. పోలీసు శాఖలో ప్రత్యేక భాగమైన ఈ విభాగాన్ని కాస్త విపులంగా చెప్పివుంటే బావుండేది. దానిగురించి ఆడియన్స్‌కి సరైన ఇంట్రో దొరక్కపోవడంతో -సినిమా అసమగ్రం అనిపించింది.
విక్రమ్ (విశ్వక్సేన్) ఓ పోలీస్ కాప్. లైఫ్‌లో ఎదురైన ఓ చేదు అనుభవంతో తీవ్ర వత్తిడికి గురై -పానిక్ ఎటాక్ బారిన పడతాడు. చిన్న విషయాలకే భావోద్వేగాలకు గురవ్వడం, కోపంతో రెచ్చిపోతుండటం చేస్తుంటాడు. పోలీస్ విధి నిర్వహణకు రెండూ విరుద్ధం కనుక ‘జాబ్‌నైనా మానెయ్, కొన్నాళ్లు సెలవైనా పెట్ట’మని.. అతన్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ సజెస్ట్ చేస్తుంది. ‘వృత్తి నా బలహీనత. సో, జాబ్ మానలేను’ అంటాడు విక్రమ్. ఈక్రమంలోనే పద్దెనిమిదేళ్ల ప్రీతి మిస్సింగ్ కేసు ఇనె్వస్టిగేషన్‌కు విక్రమ్‌కు వస్తుంది. అది జరిగిన కొన్ని రోజులకే విక్రమ్ గాళ్‌ఫ్రెండ్ నేహా (రుహానీ శర్మ) కూడా మిస్సవుతుంది. ఈ రెండు కేసులకూ ఏమైనా సంబంధముందా? అన్న కోణంలో దర్యాప్తు సాగించిన విక్రమ్ -చివరకు ఏం సాధిస్తాడు? కిడ్నాప్‌లు ఎవరు, ఎందుకు చేశారు? మొదలైన విషయాలకు జవాబుతో సినిమా ముగింపుకొస్తుంది. చాలావరకూ డిపార్ట్‌మెంట్ అంశాలను నిబద్ధతతో తీయడానికి ప్రయత్నించినా -కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నారు. వాటిలో కొన్నిటిని తేలిగ్గా అవాయిడ్ చేసేవి ఉన్నా, చేయకపోవడం సినిమాకు మైనస్సే. ఉదాహరణకు -నిందితుడు తీవ్ర నేరప్రవృత్తిగలవాడో, తప్పించుకుంటాడన్న అనుమానాలుంటేనే.. అదుపులోకి తీసుకున్న వెంటనే సంకెళ్లు వేస్తారు. కానీ ఇందులో ముద్దాయిని అదుపులోకి తీసుకున్న వెంటనే సంకెళ్లు వేసేస్తారు. ఆరకంగా షీలా, స్వప్న పాత్రధారిణులకు సంకెళ్లు వేసేశారు. అదొక అనవసర తతంగం. అలాగే రోహిత్ చనిపోకముందు విక్రమ్‌కు రాసిన లేఖలో ‘నువ్వెలాగైనా ఈ కేసును సాల్వ్ చేస్తావని నాకు తెలుసు..’ అంటూ హీరో సమర్థతపై అంతులేని విశ్వాసం ప్రదర్శిస్తాడు. మరి అంత విశ్వాసంవున్న హీరో, రోహిత్ నేరం మరొకరిపై రావాలని తప్పుడు ఆధారాలు సృష్టించి ఓ పెద్ద ప్రక్రియ నడపడం హాస్యాస్పదం అనిపించింది. అతను సృష్టించిన ఆధారాలు కూడా బలహీనమైనవే. అనాధాశ్రమ నిర్వాహకురాలు తల వెంట్రుకలు.. డెడ్‌బాడీపై దొరికినట్టు సృష్టించడం. మొదటే కొట్టిపడేయదగ్గ ఇలాంటి వాటివెంట విక్రమ్ కొంత టైమ్ స్పెండ్ చేయడమూ సరిగ్గాలేదు. ప్రధానంగా ప్రీతిని హత్య చేయడానికి ఎప్పుడో ‘మా చెల్లెలికి జరిగిన అన్యాయం’ వగైరా అని స్వప్న చెప్పడమూ అంత కన్విన్సింగ్‌గా లేదు. ఎందుకంటే అది జరిగి చాలాకాలమైంది. తర్వాత స్వప్న, పోలీసాఫీసరు రోహిత్ భార్యగా సంతోషకర జీవితాన్ని సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరహా అక్కసు రావడం, అది తీర్చుకోవడానికి అక్రమ మార్గంలో వెళ్లడం నమ్మశక్యంగా లేని అంశం. ప్రీతి పాత్ర చిత్రణ తదితరాలు ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఓ కేసును కొంతవరకూ మనకు గుర్తుచేస్తుంది. కొన్ని ప్రధాన అంశాలలో వేసిన తొట్రుపాట్లు తప్ప మిగిలిన చిత్రీకరణను అనుకున్నట్టే తీయడంలో దర్శకుడు ఎలాంటి వాణిజ్య అంశాల జోలికి పోకపోవడం అభినందనీయం. ఏ చీప్ కామెడీయో, అవుట్‌స్కర్ట్స్‌లో సినిమా మొత్తం తిరిగింది కదా అని ఏదో ఒక డాబా సాంగ్ అంటూ వదలకపోవడం సినీ క్రియేషన్‌పై దర్శకుడికున్న కమిట్‌మెంట్‌ను తెలియజేస్తోంది. నటనపరంగా ఎటునుంచి ఎటు చెప్పుకోవాలన్నా విక్రమ్ పాత్రధారి విశ్వక్సేన్‌నే చెప్పుకోవాలి. అతనున్న పరిస్థితిలో మానసిక పరిస్థితి ఎలా వుంటుందో అదేవిధంగా నటించి మెప్పించారు. నేహాగా రుహానీ శర్మ పాత్రకు సినిమాలో స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగా చేసింది. విక్రమ్ కొలీగ్ రోహిత్ పాత్రదారి కూడా బాగా నటించారు. స్నేహితుని విధానం విధి నిర్వహణలో చాలా కఠినంగా వుంటుందని షీలా పాత్రధారిణిని సన్నద్ధం చేయడం వగైరా సన్నివేశాల్లో ఆ పాత్రధారి ఎన్నదగిన నటన కనబర్చారు. మురళీశర్మ పాత్ర ఇంకాస్త ఉపయోగించుకంటే బావుండేది. చాలాకాలానికి భానుచందర్ ఇందులో పోలీస్ అధికారిగా కన్పించాడు. తోటి ఆఫీసర్‌తో ఎంతగా విభేదాలున్నా ఇందులో విక్రమ్ -అభిలాష్ బాహాటంగా పోరాడుకున్నట్టు సీన్లులాంటివి జరగవు. ఇలాంటివి తొలగిస్తే బావుండేది. మోరల్ పోలీసింగ్ చేసే ప్రొఫెసర్ పాత్రను ‘నీ వయసెంత’ అని విక్రమ్ అడిగితే ‘ఏభై తొమ్మిది’ అని చెప్తాడు. మహా అయితే మరో పదేళ్లు బ్రతుకుతావేమో నువ్వు? మరి నీ తర్వాత సంస్కృతీ పరిరక్షణ ఎలా అంటూ వ్యంగ్యంగా అన్న డైలాగ్ ఆడిటోరియంలో బాగాపండింది. అలాగే ఇచ్చిన పనిని సరిగ్గా చేయని స్కెచ్ ఆర్టిస్టునుద్దేశించి, ఈయనకు ‘ఆటో డబ్బులు కూడా ఇవ్వకుండా పంపేయ్’ అన్నదీ బాగా రిసీవైంది. ఇలాంటి సినిమాల్లో పాటలకు చోటుండదు కనుక సంగీత దర్శకుడు తన ప్రతిభను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లోనే చూపించాలి. ఆ పని మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ బాగానే చేశాడు. మనం చెప్పబోయే ఏ అంశమైనా అది బాగా చేరాలంటే చెప్పే విధానంలో స్పష్టత ముఖ్యం. అలా క్లారిటీ అంశానికి 2021లో రాబోయే హిట్-2లో పెద్ద పీట వేస్తే సినిమా మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌తోపాటు మామూలు ఆడియెన్స్‌కీ సులభంగా చేరుతుంది.

-అనే్వషి