రివ్యూ

భావోద్వేగ ప్రేమ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** లవ్ ఆజ్ కల్
***
తారాగణం: కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్, రణదీప్ హూడా, ఆరుషి శర్మ తదితరులు
సంగీతం: ప్రీతమ్, ఇషాన్ చబ్ర
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
ఎడిటింగ్: ఆర్తి బజాజ్
నిర్మాత: దినేష్ విజన్
దర్శకత్వం: ఇంతియాజ్ అలీ
***
ప్రేమ.. ఆకర్షణ -రెండూ విరుద్ధ భావాలు. నిజమైన ప్రేమేదో.. కోరికతో కూడిన ఆకర్షణేదో మనకు మనమే గ్రహించాలి. ప్రశాంత మనసు వీటిగురించి తరచూ హెచ్చరిస్తూనే ఉంటుంది. చుట్టూ సమాజం, పరిస్థితులూ అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. అయినా -ఆకర్షణల విష వలయంలో కూరుకుపోతుంటాం. ఆ తరువాతి జీవితం -తీరిగ్గా కూర్చొని బాధపడటానికి. పశ్చాత్తాపంతో కన్నీటి గాధలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఎందుకంటే -అప్పటికే అంత అయిపోయి ఉంటుంది కనుక.
***
మనషులు క్రమంగా స్వతంత్ర ఆలోచనలకు దూరమవుతున్నారు. పరిచయమైన ప్రతి వ్యక్తినీ పరీక్షించి -ఇతనిలా ఉండాలనో, ఉండకూడదనో నిర్ణయించేసుకుంటూ.. జీవితాన్ని లాగించేయడానికే అలవాటు పడుతున్నారు. కొద్దిమంది మాత్రమే -ఆ చట్రం నుంచి తొందరగానే బయటికొచ్చి.. తమను తాము ప్రశ్నించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
***
ఈ రెండంశాలను సమన్వయంతో అల్లే ప్రయత్నమే -లవ్ ఆజ్ కల్. స్టూడియో మెడాక్, విండోసీట్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైనె్మంట్ సమర్పణలో దర్శకుడు ఇంతియాజ్ అలీ సృష్టించిన ‘ప్రేమ అలజడి’ ఇది.
వీర్ (కార్తీక్ ఆర్యన్) జీవితం పట్ల ఖచ్చితమైన భావాలతోవుంటాడు. ఎవరినైనా ప్రేమిస్తే నూరుశాతం నిజాయితీ ఉండాలి. ఎంతగా అంటే -వాళ్లలోని ప్రతి ఆలోచనని అర్థం చేసుకునేంతగా. సెక్స్, తాగటం, తిరగటంలాంటివి కాదు, జీవితమంటే ఓ మంచి తోడు అన్న ఆలోచనతో ఉండాడు. మరోవైపు జోయ్ చౌహాన్ (సారా అలీఖాన్)కు తన లక్ష్యం ముఖ్యం. ఐదేళ్లలో భారీ ఈవెంట్స్ నిర్వహించే కంపెనీ స్థాపించాలి. తరువాత డబ్బున్న వాడినొకడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేయాలి. ఈలోపే -చిన్నా, పెద్దా అన్ని ఆనందాలూ రుచి చూసేయ్యాలి. అదే లైఫ్ అన్నట్టు బతుకుతుంటుంది.
వీర్ -తొలి చూపులోనే జోయ్‌ని ఇష్టపడతాడు. ఆరాధిస్తుంటాడు. కాని, జోయ్ తిరస్కరిస్తుంది. ఇలాంటి సీరియస్ ప్రేమలు తనకు అస్సలు పడవంటుంది. ‘కావాలంటే సరదాగా ఉందాం. నాకు నా కెరీర్ ముఖ్యం’ అన్న ధోరణి చూపిస్తుంది. తల్లి ఎలా చెబితే అలా తలాడిస్తుంది జోయ్.
ఇక -మరో అంకం 30ఏళ్ల క్రితంనాటిది. ఎప్పుడో 1990లనాటి ప్రేమ కథని -ఓరకంగా తన ఆత్మకథగా రఘు (రణదీప్ హూడా) జోయ్‌కి చెబుతుంటాడు. ప్రేయసి లీనా (ఆరుషి శర్మ)తో సాగిన ప్రేమ కథ అది.
చివరకు వీర్ -జోయ్ కలిశారా? అప్పటి రఘు-లీనాల ప్రేమకథ ఏమైంది? అనేది 2 గంటల 15 నిమిషాల నిడివిలో దర్శకుడు ఇంతియాజ్ అలీ సినిమా చూపించేశాడు.
ఇందులో -రెండు కథలూ సమాంతరంగా నడుస్తుంటాయి. ఒకటి వీర్-జోయ్‌ది, రెండోది రఘు చెప్పే.. రఘు-లీనాల కథ. వీర్‌గా, చిన్నప్పటి రఘుగా రెండు పాత్రలనీ కార్తీక్ ఆర్యను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. తన పెర్ఫార్మెన్స్‌తో పాత్రలకు ఆత్మనిచ్చాడు. 2020 లవ్ స్టోరీ కంటే, 1990 ప్రేమ కథలో అద్భుతం చూపించడానికే ఎక్కువ అవకాశముంది. ఆ చాన్స్‌ని కార్తీక్ ఆర్యన్ అస్సలు వేస్ట్ చేసుకోలేదు. సినిమా చూస్తున్నామన్న భావనకంటే, మనకు తెలిసిన స్నేహితుని కథ కంటితో చూస్తున్నామన్నంత సహజంగా చిత్రీకరించటం బావుంది.
1990లనాటి రఘు కథలో జోడీగా కనిపించిన లీనా (ఆరుషి శర్మ) తన నటనతో ఆ కథకు వనె్నలద్దింది. కొలమానపూర్వక పెర్ఫార్మెన్స్ అన్నట్టు.. భావోద్వేగాలను తూకం తూచినంతగా చూపిస్తూ ఆడియన్స్‌కి మాటలేకుండా చేసింది. ఇక -సినిమాకు ప్రధాన ఆకర్షణ జోయ్. అందం, అభినయం రూపుదిద్దుకుంటే జోయ్ అన్నంత చలాకీగా, హుషారైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సారా అలీఖాన్. తల్లి మాట వినే కూతురిలా.. రఘు స్నేహితురాలిలా.. చివర్లో వీర్ ప్రేమకై తపించే ప్రేమికురాలిగా.. తాగి తందనాలాడాలనుకునే కేర్‌లెస్ అమ్మాయిగా -ఇలా ఎన్నో షేడ్స్‌ని పలికించటంలో సారా సక్సెస్ అయ్యింది. పెద్ద రఘు పాత్రలో రణదీప్ హూడా నటన ఎంత చెప్పినా తక్కువే. సినిమా సగానికి పైగా రఘు-లీనా ఫ్లాష్‌బ్యాక్ కనుక.. ఆ స్పేస్‌ని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. 45 ఏళ్లు పైబడిన వ్యక్తి జీవిత సారాన్ని రంగరించి అందిస్తున్నాడన్నంత సహజత్వాన్ని చూపించాడు. గుండెల్లో టన్నుల కొద్దీ బాధలు, సుడులు తిరుగుతోన్న భావాలను ముఖంలో చూపిస్తూ -మెస్మరైజ్ చేశాడు.
రెండు కథలని సమన్వయం చేయటంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. కానీ, రెండు పదార్థాలు వడ్డించి ఏది బావుందో చెప్పమన్నట్టే ఉంటుంది. కాకపోతే -ఒకదాన్ని మించి మరో పదార్థం రుచులుంటే సరే. కాని ఒకటి బ్రహ్మాండమై, మరొకటి ఆ స్థాయిని అందుకోలేకపోతే -ఎలాంటి భావన కలుగుతుందో ఈ కథల్లోనూ ఆడియన్స్ అలాంటి రుచినే చూడాల్సి వచ్చింది. రెండూ దర్శకుడి సృష్టే. కాకపోతే -1990ల నాటి ప్రేమకథలో ఆత్మను ఆవిష్కరించాడు. ప్రతీ సన్నివేశాన్ని మాటల్లో చెప్పలేనంతగా తీర్చిదిద్దాడు. ప్రతి వ్యక్తి జీవితంలో స్కూల్, కాలేజీ.. ఇలా చిన్నతనపు జ్ఞాపకాలని ఫ్రేముల్లో చూపించి కొత్త అనుభూతిని తట్టిలేపాడు. ఆ తొలి ప్రేమ తియ్యని జ్ఞాపకాలు హృదయంలోంచి కళ్లలోకి శరీరమంతా చేరి మురిసిపోతాం. 2020ల ప్రేమ కథనూ అలాగే తీయాలని ప్రయత్నించినా, భావోద్వేగాల కూర్పు అమరలేదు. సినిమాలో పాటలు బావున్నాయి. సందర్భానికి తగినట్టు (శాయద్ కభీ న కహూంగా) -ఎప్పటికీ నా ప్రేమను చెప్పలేననుకుంటా అంటూ వచ్చే గీతం గుండెను తడిపేస్తుంది. మిగిలిన పాటలూ వినసొంపే. ఇక సంభాషణల్లో తాత్విక చమత్కారం చూపించటం ఆకట్టుకుంటుంది. ‘ఈలోకంలో సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు’, ‘లోకంలో ఎన్నో జంటలు కనిపిస్తాయి. అవన్నీ నిజం కాదు’లాంటి వాఖ్యాలు జీవిత సత్యాలు అనిపిస్తాయి.
మనిషికి జీవితంలో కెరీర్ ముఖ్యమో? జీవిత భాగస్వామి ముఖ్యమో? ఏది ముందు? అనే ఓ అందమైన ప్రశ్నను.. ముఖ్యంగా ఇప్పటి యువత తీవ్రంగా ఆలోచించే బర్నింగ్ టాపిక్‌ని ఎంచుకోవడంలోనే దర్శకుడు విజయం సాధించాడు. ఇక రఘు పాత్ర చాలాకాలంపాటు వెంటాడటం ఖాయం. అంతేకాదు, ఎలా బతకొద్దో చెప్పే ప్రయత్నమూ చేస్తుంటుంది. ఒద్దికైన భావోద్వేగ కథకు తగినట్టే టెక్నీషియన్లు మంచి సహకారం అందించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఒకే టికెట్‌పై నేర్పుగా రెండు ప్రేమకథల్ని చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఇంతియాజ్ అలీ ప్రశంసార్హుడు.

-మధుర మురళి