రివ్యూ

రుచించని ఉత్తర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* ఉత్తర
*
తారాగణం: శ్రీరామ్, కారుణ్య కత్రీన్, టిల్లు వేణు, అదిరే అభి,
అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
కెమెరా: క్రాంతికుమార్ కె
నిర్మాతలు: శ్రీపతి గంగదాస్
దర్శకత్వం: తిరుపతి ఎస్‌ఆర్.
*
ప్రతి ఊళ్లోనూ అల్లరి చిల్లరి బ్యాచ్‌లు కామన్. అదే ఇతివృత్తంతో పల్లెటూరి నేపథ్యంగా వచ్చిన చిత్రం -ఉత్తర. అసలు ఉత్తర అంటే ఎవరు? అనేది సినిమాలో సరైన క్లారిటీ లేదు. ఆమె పాత్ర చాలా తక్కువే. ప్రేమించిన అమ్మాయి కోసం ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అనుకోవడం ఒక ఎత్తయితే, కష్టపడి సంపాదించే హీరో పాతతరంవాడైతే, కొత్తతరం హీరో ఈజీగా డబ్బు సంపాదించాలి అనుకోవడమే ఇక్కడ ట్విస్ట్. ఆ డబ్బు ఎలా సంపాదించే ప్రయత్నం చేశారు? అనేదే ప్రధాన కథాంశం.
ఊళ్లో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు అశోక్ (శ్రీరామ్). డిగ్రీ పూర్తిచేసినా సరైన దారి దొరక్క ప్రేమా దోమా అంటూ కనిపించిన అమ్మాయిలతో అల్లరి చేస్తుంటాడు. చివరికి స్వాతి (కారుణ్య కత్రీన్) ప్రేమలో పడతాడు. యథాప్రకారంగా ప్రేమికుల తల్లిదండ్రులు ప్రేమకు అడ్డం పడతారు. ఎలాగైనా సరే డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోవచ్చన్న ఆలోచనతోవున్న అతనికి ఓ మార్గం కన్పిస్తుంది. అదే ఉత్తర అనే అమ్మాయి చనిపోయి పాడుబడ్డ ఇల్లు. ఆ ఇంట్లోకి ఎవరూ పోరు. ఉత్తర బతికి ఉన్నప్పుడు ఎవరూ ఆ అమ్మాయిని ఆదరించలేదు. ఎందుకంటే, ఆమెకు నా అనేవాళ్లు ఎవరూ లేరు. సంఘం ఒంటరిగా వున్న అమ్మాయిని ఎలా సూటిపోటి మాటలతో ఇబ్బందిపెడుతుందో చెప్పే ప్రయత్నం ఈ చిత్రంలో చేశారు. చివరికి ఉత్తర ఎవరు? ఆమె ఎందుకు చనిపోయింది? ఆమె ఇంట్లో ఈజీ మనీ ఏంటి? అది కధానాయకుడు తన ప్రేమను పండించుకోవడానికి సాధించాడా? అనేది వెండితెరపై చూడాలి.
మొదటి సగమంతా హీరో హీరోయిన్లమధ్య నడిచే ప్రేమకథా సన్నివేశాలతో గడిచిపోతుంది. పాత్రలన్నీ తెలంగాణ మాండలికంతో సరదా సరదా సంభాషణలతో మాట్లాడటంతో ఓ ఫ్లేవర్ కన్పించింది. దానికితోడు పల్లె వాతావరణం సహజత్వానికి దగ్గరగా చిత్రీకరించడంతో వెండితెర నిండా ప్లే పరచుకున్నట్లుగా వుంది.
పల్లెటూరి ప్రేమకథతో ప్రారంభించిన సన్నివేశాలు రెండవ సగానికి హారర్ స్టోరీకి వెళ్లిపోవడంతో అతుకుల బొంతగా మారింది. ప్రధానాంశం ప్రేమికులిద్దరిపై వున్నది కనుక ఆ టైటిల్ పెట్టకుండా ఉత్తర అనే టైటిల్ పెట్టడంతో ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవుతారు. పోనీ ఆ పాత్రనైనా పూర్తి నిడివితో చిత్రీకరించారా? అంటే అదీ లేదు. పాత్రల ద్వారానే చెప్పిస్తే టైటిల్‌కు న్యాయం జరుగుతుందా? చివరికి ఒంటరిగావున్న స్ర్తిలపై అత్యాచారాలు, అవమానాలు కూడదు అన్న ఓ సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ఉత్తర. హారర్ సన్నివేశాల చిత్రీకరణ పేలవంగా సాగింది. గతంలో అనేక హారర్ చిత్రాలు చూసిన ప్రేక్షకుడికి ఈ సన్నివేశాలు రుచించవు. ఆ సన్నివేశాలకందించిన నేపథ్య సంగీతం కూడా అతకలేదు. ఓ మంచి గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమాగా ప్రారంభించి చివరికి సరైన ముగింపు ఇవ్వలేక చతికిలబడ్డారు. అనవసరమైన హారర్లు, సందేశాలు సినిమాను మింగేసింది.
నటీనటుల్లో హీరోయిన్ కారుణ్య ఓకె అన్పించింది. శ్రీరామ్ మరింత మెచ్యూరిటీ సాధించాల్సిన అవసరం వుంది. ఇక ఎవరి గురించీ పెద్దగా చెప్పలేకపోయినా హీరో స్నేహితులుగా చేసినవారందరూ నవ్వించే ప్రయత్నం చేశారు. దర్శకత్వ పరంగా మరింత సాధన స్క్రిప్ట్‌పరంగా చేయాల్సిన అవసరం వుంది. నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రంగా ఉండడంతో రుచించని ఉత్తరంలా సినిమా మిగిలింది.

-‘ఆర్’