రివ్యూ

లార్జ్ పెగ్.. లెస్ కిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* 90ఎంఎల్
*
తారాగణం: కార్తికేయ, నేహాసోలంకి, రావురమేష్, రవికిషన్, పోసాని కృష్ణమురళి, సత్యప్రకాష్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: ఎస్‌ఆర్ శేఖర్
ఛాయాగ్రహణం: జె యువరాజ్
నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ
దర్శకత్వం: శేఖర్‌రెడ్డి ఎర్రా
*
ఫాస్డ్. ఇదో వ్యాధి. ఫెటల్ ఆల్కహాల్ స్ప్రెక్ట్రమ్ డిజార్టర్. గర్భిణి మద్యానికి బానిసైతే -పుట్టే పిల్లల భవిష్యత్‌ను మింగేసే భయానక వ్యాధి. అపసవ్యంగా పుట్టడం.. అస్తవ్యస్తంగా ఎదగడం.. గ్రహించే గుణాన్ని కోల్పోవడం లాంటివి -పర్యావసానాలు.
అయితే వ్యాధి కారణాలు మూసేసి.. లక్షణాలు దాచేసి.. కథకు కాక్‌టెయిల్ టేస్ట్ ఇవ్వాలని -‘్ఫస్డ్’ని పవర్‌ఫుల్ వెపన్‌గా వాడాడు దర్శకుడు శేఖర్‌రెడ్డి ఎర్రా. రోగాన్ని నిజాయితీగా కథావస్తువు చేసుంటే -అక్కడపుట్టే ‘ప్రేమ’ భావోద్వేగానికి గురిచేసేదేమో. టేస్ట్ మార్చాలనుకున్న ప్రయత్నంలో కిక్కు మిస్సైంది. అదే -90ఎంఎల్.
ఫాస్డ్.. దానికి బలైన కుర్రాడి స్ట్రగుల్‌నుంచి హీరోయిజం పుట్టుంటే కచ్చితంగా కథ మరోలాఉండేది. ఆ పాయింట్ నుంచే రియల్ హీరోయిజం పుట్టించే అవకాశం దొరికేది. లేదూ ఆ అపసవ్యత నుంచి ఒకింత స్వీట్ పెయిన్ పుట్టించే హీరో కథైనా పుట్టుకొచ్చేది. కానీ, దర్శకుడు ఫాస్డ్ తీవ్రతను గాలికొదిలేశాడు. ‘పూటకో పెగ్గేయకపోతే చస్తాడు’ అన్న రాంగ్ అప్లికేషన్‌కు ఫిక్సైపోయాడు. ‘ఆథరైజ్డ్ డ్రింకర్’ అన్న ప్లాస్టిక్ కార్డు దగ్గరే ప్లాట్ ఆగిపోవడంతో -కథను ముందుకు తీసుకెళ్లే జీవం కనుమరుగైంది. పైగా -‘ఎక్కడబడితే అక్కడ తాగడానికి అవకాశమిచ్చే అడ్మిట్ కార్డు’ అన్న స్పృహ మిగిల్చింది. ‘ప్రాణం తీసే విషం.. ప్రాణం పోసే అమృతమెలా అయ్యిం’దన్న పాయింట్‌ని గట్టిగా పట్టుకున్నా -90ఎంఎల్ ఇచ్చే కిక్కు యమా స్ట్రాంగ్‌గా ఉండేది.
ఆర్‌ఎక్స్ 100లో తెగతాగిన హీరోని ఆడియన్స్ నెత్తిన పెట్టుకున్నారన్న ఏకైక కానె్సప్ట్‌తో -ఈ ‘మందు’ కథకూ ముగ్దుడయ్యాడు హీరో కార్తికేయ. నేరేషన్ టైంలోనూ -‘పూటకో లార్జ్’ దాటని కథపై లోతుగా తర్కించలేకపోయాడు. ‘అలా ఎలా?’ అన్న చిన్న ప్రశ్న వేసుకునుంటే -కథాబృందం నుంచి కొత్త కథ తయారయ్యేదేమో. ‘ఉగ్గు’దాటని అనుభవంలో ‘పెగ్గు’ కథకు ఓకే చెప్పడమే కొంపముంచింది. పైగా -అద్భుతమైన కథగా భావించి స్వీయ నిర్మాణానికీ సిద్ధపడటం మరో తప్పిదం.
నిజానికి -అనివార్యంగా మందుకొట్టాల్సిన హీరో.. మందువాసనే తెలీని సువాసనతో ప్రేమలో పడినపుడు భలే కాన్ఫ్లిక్ట్ అన్న భావన కలిగింది ఆడియన్స్‌లో. ఆమెను ఎలా ప్రేమలోకి దింపుతాడు? పద్ధతైన ఆమె కుటుంబాన్ని ఎలా ముగ్గులోకి లాగుతాడు? తను కోరుకున్న అమ్మాయిని ఎలా పొందుతాడు? లాంటివెన్నో చూసేయడానికి రెడీ అయిపోతారు. ఆ ఇంట్రెస్ట్ కలిగించే ఎపిసోడ్‌కి దర్శకుడు కామెడీ పాకం పట్టడంతో ఆడియన్స్ ఆశ నీరుగారిపోయింది. పైగా ఆ కామెడీ కోసం ముఖ్యమైన పాత్రల్ని జోకర్లు చేసెయ్యడంతో -ఈ సినిమాను బాగు చేయలేమన్న నిర్థారణకు వచ్చేశారు. ఏ సన్నివేశాన్నైనా భుజాన మోసేసే రావ్ రమేష్ ఉన్నాడు కనుక -అతని కుటుంబాన్ని కామెడీ చేసేస్తే సరిపోతుందనుకున్నారు. ఇక్కడే -అసలు కథను చర్చించాల్సిన విలువైన సమయాన్ని వృధా చేస్తున్నామన్న స్పృహ మిస్సైంది. రిపీట్ సన్నివేశాల సాగదీతే కామెడీగా ఆడియన్స్ ఫీలవ్వాలన్నట్టు -చూపించిందే చూపించటం పెద్ద బోర్. రావ్ రమేష్‌లాంటి సమర్థుడైన నటుడితో కథకు బలంపెంచే సన్నివేశాలు వేయకుండా -ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే ఫ్యామిలీ బఫూన్‌లా చూపించటం ‘90ఎంఎల్’ కథలోనే సాధ్యమైందేమో. అంతకుమించిన బఫూన్‌లా విలన్‌ను చూపిస్తూ.. విచిత్ర వేషధారణ, పబ్‌లో పిచ్చివేషాలు, తాగిన మైకంలో రోజుకో గెస్ట్‌ని ఇంటికి తేవడం..లాంటి సన్నివేశాలతో కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడో దర్శకుడికే తెలియాలి. హీరోపై పగబట్టడానికి కారణం, అసలు తన ప్రత్యర్థి ఎవడో తెలుసుకోడానికి చేసే ధ్యానం సన్నివేశాలు చూసి -ఆడియన్స్ అబ్బో అనుకోవాల్సిందే. హీరో రహస్యం హీరోయిన్‌కి ఎలాగైనా తెలుస్తుందనేది ప్రేక్షకుడు ఊహించలేని విషయం కాదు. కనీసం దాన్నైనా ఫన్నీ ఇన్సిడెంట్‌తో దాటాల్సిన దర్శకుడు -అదే ఇద్దరి మధ్య క్లాష్‌కు కారణంగా చూపించటం విడ్డూరం. ‘మందు తాగడం మహా నేరం’ అన్న పురాతన నిబద్ధతను ఇప్పటి ట్రెండ్‌లో చూపిస్తే ఎంతగొప్పగా ఉంటుందోనన్న ఆలోచన దర్శకుడికి రాకపోవడం విచారకరం.
తనకున్న వ్యాధిని నిజాయితీగా చెప్పి హీరోయిన్‌ని కన్విన్స్ చేయడం కష్టమేమీ కాదు. దాన్ని పక్కనపెట్టి, దాగుడుమూతలకు తెరలేపి సినిమాను నడపాలనుకున్న ప్రయత్నం -మరోలా పుట్టాల్సిన కథకు అడ్డంపడింది. హీరోయిన్ కన్విన్స్ కావడమే క్లైమాక్స్ అని ముందే ఫిక్సైపోవడంతో -మధ్యలో సినిమా మొత్తాన్ని అసందర్భ పునరావృత సన్నివేశాలతో నింపక తప్పలేదు. సినిమా సమీక్షలో సైతం చెప్పిందే చెప్పి, మళ్లీ మళ్లీ చెప్పాల్సి వస్తోందంటే -90ఎంఎల్‌లో ఎంత కథ దాగివుందో అర్థం చేసుకోవాలి.
ఆర్‌ఎక్స్ సక్సెస్ నుంచి కార్తికేయ కాస్త పక్కకుజరిగి కెరీర్‌ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఆ గ్రేస్‌నుంచే భవిష్యత్ కథలనూ జడ్జి చేస్తే మాత్రం -కెరీర్ ఇబ్బందులు తప్పవేమో. ఏకబిగిన సినిమాలు చేస్తున్నా -90ఎంఎల్‌లో అతని పెర్ఫార్మెన్స్ ‘ఉగ్గు’ దాటినట్టు అనిపించదు. నేహాసోలంకిలో అట్రాక్షన్ మిస్. అంతకుమించి పెర్ఫార్మెన్స్ లెస్. రావురమేష్, రవికిషన్ లాంటి పెర్ఫార్మ్‌డ్ ఆర్టిస్టుల కష్టం -కథ కారణంగా వృధాపోయింది. సత్యప్రకాష్, ప్రగతిల ‘అతి’ ఆద్యంతం విసిగించింది. అక్కడక్కడా సంభాషణలు ఒకే అనిపించినా -పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. కథే బలహీనం కావడంతో -మిగిలిన విభాగాల పనితనం మురికిలో పోసిన మందైపోయింది. ఎంత బడ్జెట్ పెట్టినా -కథలో కిక్కులేకుంటే సినిమా ఎంత పేలవంగా ఉంటుందో చెప్పడానికి 90ఎంఎల్ పెద్ద ఉదాహరణ.

-మహాదేవ