రివ్యూ

కరవైన జార్జ్’మెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* జార్జ్‌రెడ్డి
*
తారాగణం: సందీప్ మాధవ్, అభయ్, చైతన్యకృష్ణ, సత్యదేవ్, మనోజ్ నందం, తిరువీర్, శత్రు, ముస్కాన్ ఖూబ్‌చందని
నేపథ్య సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: సుధాకర్ యెక్కంటి
నిర్మాత: అప్పిరెడ్డి
దర్శకత్వం: జీవన్‌రెడ్డి
*
1970ల కాలం..
ఉస్మానియా వర్శిటీలో -బలహీనుల సమూహంనుంచి బలమైన గొంతొకటి ప్రతిధ్వనించింది. అసమానత, అణచివేత ధోరణి, ఆధిపత్యపోకడను అధిగమించే ఆశయంతో ధిక్కార ధ్వనిగా మారింది. వ్యక్తి‘త్వ సంఘర్షణతో పిడికిలి బిగించింది. అలాంటి ‘ఆకారం’ కోసం ఎదురుచూస్తున్న నేల చూపుల తలలన్నీ -ఆకాశంవైపు చూశాయి. చైతన్యస్ఫూర్తినిచ్చిన వ్యక్తిని వ్యవస్థగా మార్చుకున్నాయి. ఆ ఎరాకు పేరుపెడితే -జార్జ్‌రెడ్డి. ఏ వర్శిటీలో ఏ కదలికైనా జాతీయస్థాయిలో ప్రకంపించే కాలమది. సో, దేశవ్యాప్త విద్యార్థి రాజకీయాలకు జార్జ్‌రెడ్డి చుక్కాని అయ్యాడు. తెలివైన చదువరి బడుగులకు బలమవడంతో, విద్యార్థి సమూహం జార్జ్‌రెడ్డి అడుగులో అడుగేశాయి. అతన్ని అనుసరించాయి. అలా జార్జ్‌రెడ్డి -ఐడియాలజీగా అవతరించాడు.
**
అలాంటి విద్యార్థి నాయకుడికి నివాళిగా దర్శకుడు జీవన్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం -జార్జ్‌రెడ్డి. తొలుత -ఇదొక విప్లవ జీవితానికి బయోపిక్ అన్నంత ప్రచారం జరిగింది. తెరలేపగానే -సంఘటనలు, పాత్రలు కల్పితమేనంటూ డిస్‌క్లెయిమర్ పడింది. జార్జ్‌రెడ్డికి ప్రకటించే నివాళిలో ‘నిజాయితీ’ని శంకించడానికి ఇదొక్కటి చాలు. బయోపిక్ కాదనేశారు కనుక -అతని గురించి అంతకుమించిన సమాచారమేదో స్క్రీన్‌మీద చూపిస్తారన్న భ్రమలూ మాయమయ్యాయి. అందుకే -గూగుల్ చేస్తే కనిపించే జార్జ్‌రెడ్డినే స్క్రీన్‌మీద సినిమాటిక్‌గా చూసి బయటికి రావాల్సి వచ్చింది.
**
వర్శిటీలు దేశానికి పట్టుగొమ్మలు. అలాంటి ఓ వర్శిటీలో జార్జ్‌రెడ్డి ఓ వేవ్. కాకపోతే అందుకు భిన్నంగా స్క్రీన్‌పై చూపించారు. అధాటున లేచిన కెరటానికి కండలద్ది చూపించారే తప్ప, ఆశయ సెగలోని ఆద్యంతాలను చూపించలేకపోవడం దారుణాతిదారుణం. జార్జ్‌రెడ్డి బాల్యంలోనూ ‘ఫైటర్’కే ప్రాధాన్యమివ్వటం -అతని ఐడియాలజీని ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నారో అనిపిస్తుంది. బాల్యంనుంచే అతనిలోని ధిక్కార మనస్తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వేసుకున్న సీనే్ల -అసలు విషయాన్ని పక్కదారి పట్టించాయి. యుక్త వయస్కుడిగా జార్జ్‌రెడ్డిని బస్సులో పరిచయం చేసినపుడూ -ఆడవాళ్లని వేధించే ఆకతాయిల్ని చితక్కొట్టి.. హెచ్చరికగా సీటుపై పేరు రాస్తాడు. -్ఫక్తు తెలుగు సినిమా హీరోయిజం ఇంట్రొడక్షన్‌గా కమర్షియల్ ఎలిమెంట్‌కు తావివ్వడంతో -‘జార్జ్‌రెడ్డి’ చూస్తామన్న మూడ్ మాయమైపోయింది. ఈ సీన్‌కి ఫినిషింగ్ టచ్ -‘వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డూ/ వాడి చూపుల్లో వుందీ చెగువీరా ట్రెండ్ అంటూ సాగే హీరోయిన్ ఐటెమ్ సాంగ్.
సినిమాను కమర్షియల్ లైన్‌లోకి తెచ్చేందుకు దర్శకుడికి దొరికిన అద్భుతమైన ప్లేస్ ఇది. ఆ అవకాశాన్ని వేస్ట్ చేయలేదు. ఇక్కడి నుంచి పడే సీన్లన్నీ -‘జార్జ్‌రెడ్డి’ ఇమేజ్‌లో తీసిన కమర్షియల్ సినిమా అన్న విషయాన్ని చెప్పకనే చెబుతాయి. అడ్డొచ్చిన వాళ్లను చితక్కొట్టగలిగే ఫైటర్‌గా జార్జ్‌రెడ్డిని ప్రొజెక్ట్ చేయడం ఆ సన్నివేశాల సారాంశం. జార్జ్‌రెడ్డి ఆగ్రహావేశాలకు కారణం? అసమానతలపై గొంత విప్పాల్సిన అవసరం? ఆశయసిద్ధికి నాందిపడిన అంశం? ఉత్తమ చదువరి నుంచి ఉద్యమంవైపు ప్రయాణించాల్సిన అవసరం? విద్యార్థి రాజకీయాలకు ఎదురెళ్తూ తానో శక్తిగా ఎదగాలన్న నిశ్చయం? లాంటివి కనిపిస్తాయేమోనని ఆడియన్స్ ఎదురు చూడకూడదు. సమస్యేదైనా సమాధానం పిడిగుద్దులేనంటూ.. బయోపిక్ భౌతికాంశానే్న దర్శకుడు చూపించాడు తప్ప -జార్జ్‌రెడ్డిలోని అంతఃస్సంఘర్షణ, బుద్ధిసూక్ష్మత, చైతన్యదీప్తి ఇసుమంతైనా ఒడిసిపట్టి చూపించక పోవడం.. ఆయన ఐడియాలజీని అవమానించినట్టే.
కలబడిపోవడమనే కమర్షియల్ ఎలిమెంట్‌తో ఘర్షణల్ని మొదలుపెట్టడంతో -విద్యార్థి సంఘాల అంతఃస్సంఘర్షణ చూపించే అవకాశం లేకండాపోయింది. ఎదురుపడిన ప్రతిసారీ కలబడిపొవడమనే ఫార్స్ కొనసాగడంతో -ఆత్మలేని జార్జ్‌రెడ్డే ఆన్‌స్క్రీన్‌పై అగుపిస్తాడు. ఇక -కథనంలోని ఎగుడుదిగుళ్లు మరింత కన్ఫ్యూజన్‌కు దారిచ్చాయి. ఉదాహరణకి.. జార్జ్‌రెడ్డి స్పీచ్‌కు ముందు సీన్‌లో అతని పిలుపునకు విద్యార్థులు స్పందించలేదన్న అసహనాన్ని జార్జ్ మిత్రబృందంలో చూస్తాం. అంతలోనే.. అతని స్పీచ్‌కు ఐదువేల మంది హాజరయ్యారన్న ఆశ్చర్యాన్ని వైరిబృందంనుంచి వింటాం. ‘సీట్ ఎడ్జ్’ సీన్‌ని పేలవంగా చూపించటంతో -జార్జ్‌రెడ్డి స్పీచ్ సన్నివేశం ఏమాత్రం పండలేదు. క్లారిటీలేని కథనం, ఎడిటింగ్ మిస్టేక్స్.. వెరసి ఆడియన్స్ అయోమయంలో ఉండిపోవాల్సి వచ్చింది.
జార్జ్‌రెడ్డిని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో ఆదినుంచీ జరిగిన పొరబాట్లు -అతని జీవితం ఎలా ముగిసిందన్న సన్నివేశాల్లోని ఫీల్‌ని మింగేసింది. యాక్షన్ సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ, జార్జ్‌రెడ్డి ఆత్మను ఆవిష్కరించటంపై పెట్టివుంటే ఫలితం మరోలా ఉండేదేమో. అలా చేయకపోవడం వల్ల థియేటర్ నుంచి బయటికొచ్చిన ఆడియన్స్ ఫైర్‌బాల్ ఫైట్, బ్లేడ్ ఫైట్‌ల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. బయోపిక్ కాకున్నా -అర్థాంతరంగా ముగిసిపోయిన ఆదర్శ విద్యార్థి బతుకు బొమ్మను చూపించే కళాత్మకతకు సినిమాలో పిసరంతైనా చోటు దక్కలేదు.
పాత్రపరంగా సందీప్ మాధవ్ తనవంతు న్యాయం చేశాడు. సహనటుల్లో అభయ్, చైతన్యకృష్ణ, అవమానభారాన్ని అద్భుతంగా చూపించిన తీరువీరు, సినిమాను మోసే బాధ్యత తీసుకున్న మనోజ్, శత్రు.. గట్టి కృషే చేశారు. చూడ్డానికి బానేవున్న ముస్కాన్, అభినయపరంగా సినిమాకు ఏమాత్రం ప్లస్ కాలేదు. జార్జ్‌రెడ్డిని సినిమాగానైనా గుర్తించేందుకు -టెక్నికల్ టీం టాలెంటే కీలకమైంది. హర్షవర్థన్ బ్యాగ్రౌండ్ స్కోర్, సుధాకర్ సినిమాటోగ్రఫీలో వంకలేని పనితనం చూస్తాం. ఎడిటింగ్ అస్తవ్యస్తం. నిర్మాణ విలువలు సముచితం.
ఫైనల్‌గా..
జార్జ్‌రెడ్డి క్యాంపస్ కొట్లాటలకే పరిమితమయ్యాడు తప్ప.. చైతన్యాన్ని రగిలించి క్యాంపస్‌ను నడిపించిన నాయకుడిగా కనెక్ట్ కాలేకపోయాడు. ఏ సన్నివేశంలోనూ ఎమోషనల్‌గా దగ్గర కాలేకపోవడం ఒక వైఫల్యమైతే.. విద్యార్థి రాజకీయాలపై అతను ఎలాంటి ముద్ర వేశాడో చూపించకపోవడం మరో వైఫల్యం. ఆచరణ, అనుసరణల మధ్య ఆశయం, ఆత్మను స్క్రీన్‌పై బలంగా ఆవిష్కరించటంలో దర్శకుడు విఫలమయ్యాడు. దీంతో జార్జిరెడ్డి పేరు వద్దే ఆగిపోయి -్ఫల్ వరకూ రాలేకపోయాడు.

-మహాదేవ