రివ్యూ

తెనాలి.. రాని’కృష్ణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెనాలి రామకృష్ణ
*
తారాగణం: సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ, వరలక్ష్మీ శరత్‌కుమార్, అయ్యప్పశర్మ, వెనె్నల కిషోర్, సప్తగిరి, ప్రభాస్ శీను, అన్నపూర్ణ తదితరులు
సంగీతం: సాయకార్తీక్
సినిమాటోగ్రఫీ: సాయ శ్రీరామ్
నిర్మాతలు: నాగభూషణ్‌రెడ్డి, సంజీవరెడ్డి, రూపా జగదీష్, శ్రీనివాస్ ఇందుమూరి
దర్శకత్వం: జి నాగేశ్వర రెడ్డి
*
రాయల కాలం రామకృష్ణ భౌతికంగా బలహీనుడు కనుక -కుశాగ్ర బుద్ధితో దర్బారుని దడదడలాడించాడు. ఈ-కాలం రామకృష్ణ బుద్ధిని మించిన బలవంతుడవడంతో -వాదించటం మానేసి వాయించటంతో థియేటర్‌ని బడబడలాడించే ప్రయత్నం చేశాడు. సింపుల్‌గా ఇదీ -బిఎబిఎల్ యాడ్ చేసుకున్న తెనాలి రామకృష్ణ కథ.
‘ఒక కేసు వాదిస్తే మరొకటి ఫ్రీ’ అన్న నేలబారు కామెడీనుంచి హీరోని రివీల్ చేయడంతోనే -దొరికిపోయాంరా బాబూ అనిపిస్తుంది. ఎప్పుడైతే గండరగండుల్లాంటి విలన్ల గ్యాంగ్‌ని మామిడితోటలో మడతెట్టి కుమ్మేసి కుదేశాడో -ఇక తట్టుకోవడం కష్టమనిపిస్తుంది. ఇద్గిదీ -సమీక్షకు ముందు మరీసింపుల్‌గా చెప్పుకోవాల్సిన సారాంశం.
సమీక్షకు సిద్ధపడ్డాం కనుక -కథ ఒడ్డూ పొడూగూ ఒక్కసారి చూద్దాం. సీమను తన కబంధ హస్తాల్లో పెట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు సింహాద్రినాయుడు (అయ్యప్ప శర్మ). అదే సీమను ఉద్దరించటానికి దిగివచ్చిందని జనం కొలిచే మహాతల్లి వరలక్ష్మి (వరలక్ష్మీ శరత్‌కుమార్). వీళ్లిద్దరూ కర్నూలుకు అటు ఇటు దిక్కులు. ఈ దిక్కుల మధ్య ఆధిపత్య పోరాటంలో -కొండారెడ్డి బురుజు దగ్గర ఓ జర్నలిస్టు మర్డరవుతాడు. వర్గ రాజకీయాల్లో వరలక్ష్మిని తొక్కేయడానికి -ఆమెను మర్డర్ కేసులో ఇరికిస్తాడు సింహాద్రినాయుడు. ధర్మం దారితప్పినపుడు అవతారమెత్తడం హీరో లక్షణం కనుక -సీన్‌లోకి లాయర్ తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) దిగుతాడు.
అప్పటికి లాయర్‌గా కేసుల్లేక అల్లాడుతున్న రామకృష్ణ -కోర్టులో పెండింగ్ సివిల్ కేసుల్ని మెట్లమీద ‘సెటిల్’ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. అతని సిల్లీ తెలివి తేటలకి శ్రీమంతుడైన క్రిమినల్ లాయర్ చక్రవర్తి (మురళీశర్మ) కూతురు, లాయర్ రుక్మిణి (హన్సిక) ఢామ్మని ప్రేమలో పడిపోతుంది. ఈ క్రమంలోనే -పెద్ద కేసొకటి తగిల్తే ప్రతాపం చూపిద్దామని ఎదురు చూస్తున్న రామకృష్ణ కాలికి.. ఓ మామిడితోపులో వరలక్ష్మి కేసు తగుల్తుంది. అక్కడే నులకమంచం మీద కూర్చుని స్కెచ్ వేసుకుంటున్న విలన్ల గ్యాంగ్‌కు -మీ పాపం పండిందంటూ హెచ్చరిక చేస్తాడు రామకృష్ట. తనకున్న ‘వికట’తెలివి ఉపయోగించి -నిందితురాలైన వరలక్ష్మిని నిర్దోషిగా బయటకుతెస్తాడు. కథ కంచికి చేరిందనుకుంటున్న టైంలో -కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. -హీరో సైతం హుతాశుడయ్యే ట్విస్టొకటి బయటికొచ్చి కొత్త కథ మొదలవుతుంది. తనకు తెలిసిన భయానక నిజాన్ని దిగమింగి, పర్యావసానాలను ఎదుర్కొనే పని మొదలెడతాడు రామకృష్ణ. అష్టకష్టాలు పడి అతి తెలివిని ఉపయోగించి -హీరోగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. ఈ కథకు ట్విస్టే ప్రాణం. తెలుసుకోవాలనుకుంటే -తెనాలికి పోవాల్సిందే.
కామెడీ కథల్ని తెరకెక్కించటంలో దర్శకుడు నాగేశ్వర రెడ్డిదో స్టయిల్. వెటకారం, హాస్యం.. రెండూ ఒకే తాను ముక్కలన్న భ్రమలో -ఆయన గతంలో రూపొందించిన సినిమాలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతాయి. ఆ స్టయిల్లోనే నాన్‌స్టాప్‌గా నవ్వించడం కోసం సంబంధంలేని సీనే్లసుకున్న కథ -తెనాలి రామకృష్ణ. బాగా పరిచయమున్న ‘వికటకవి’ పాత్రను టైటిల్లోకి తెచ్చుకున్నాడు కనుక -కుశాగ్రబుద్ధి కలిగిన కుర్రాడు పవర్‌ఫుల్ పొలిటీషియన్స్‌ని ఎలా ఎదుర్కొన్నాడన్నది చూపిస్తాడేమోనని ఆశగా థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ అంచనాలకు దర్శకుడు అందలేదు. ఎప్పట్లాగే ఎందుకు చెప్పాలనుకున్నాడో ఏమో.. మామిడితోటలో హీరోతో చొక్కా మడతేయించి పిల్లిమొగ్గల ఫైటింగ్‌లుపెట్టి ‘శ్రీమంతుడు’ సీన్ వేయడంతో -నవ్వులు కురిపించాల్సిన తెనాలి రామకృష్ణ కాస్తా కండలు చూపించే కర్నూలు రామకృష్ణ అయిపోయాడు. కథ కర్నూల్లోనే బిగుసుకుపోయింది. కామెడీ సినిమాగా ప్రచారం చేశారు కనుక.. నవ్వించడానికి నానా విధాలా చేసిన ప్రయత్నాలు ఒక్కటీ ఫలించలేదు. మాటల్ని పాటలు చేసిన సత్యకృష్ణన్ పాత్ర ఒక్కటే ఓకే అనిపిస్తుంది. ఎలా’గోలా నవ్వించడానికి ఏకైక దిక్కైన జబర్దస్త్‌ను ఎంచుకుని -చమ్మక్ చంద్రను చమ్మక్ చంద్రికగా సీన్‌లోకి తెచ్చి.. డబుల్ మీనింగ్స్‌ని ఆశ్రయించినా నవ్వించలేకపోయారు. కామెడీ కురిపించాల్సిన హీరోని సైడ్ చేసేసి -కమెడియన్లతో పావుగంట కథ నడిపినా అనవసరపు శ్రమయ్యిందే తప్ప ఆశించిన ఫలితమైతే దక్కలేదు.
కాలంచెల్లిన కథకు కాంటెంపరరీ సెటైర్లు జోడించటం వెటకారమే తప్ప హాస్యం కాదన్న విషయాన్ని దర్శకుడు గ్రహిస్తే బావుండేది. అదీ జరక్క -ఏ సీన్ మూలనైనా ఆవగింజంత హాస్యం అగుపిస్తుందేమోన్న ఆశతో కళ్లను కితకితలకు ముడేసి కాలక్షేపం చేయాల్సి వచ్చింది ఆడియన్స్. క్రైమ్ కేసు పట్టుకుని చెట్టుకింది ప్లీడరు చింత చెట్టెక్కడమనే పరమ రోటీన్ పాయిట్‌ను నడిపించడానికి దర్శకుడు ఎక్కువే కష్టపడ్డాడు. అందుకే కామెడీ పేరుతో కాలక్షేపం సీనే్లసుకుంటూ కథ నడిపించే ప్రయత్నం చేశాడు.
ఆమధ్య హిందీ, తమిళం, తెలుగు భాషల్ని చుట్టేసిన సందీప్ కిషన్ -ఇప్పుడు వివిధ జోనర్లనూ తనదైన స్టయిల్లో చుట్టేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ‘నిను వీడని నీడను నేనే’ అంటూ హారర్ థ్రిల్లర్‌ని ట్రై చేసిన సందీప్ -ఈసారి కామెడీ జోనర్‌తో రావడం బెస్ట్ చూజింగ్. కానీ, హీరోయిజంలో కామెడీ కంటే, కామెడీలో హీరోయిజాన్ని చూపించే ప్రయత్నం చేసుంటే బావుండేది. ఇక.. ఇన్నాళ్లూ సొట్టబుగ్గల సొగసుతో నెట్టుకొచ్చిన హన్సిక -స్లిమ్‌నెస్ కోసం శరీరాన్ని ఎండబెట్టడంతో కళతప్పి వికారమొచ్చేసింది. సందీప్, హన్సిక కెమిస్ట్రీలో అస్సలు ఫీల్ మిస్సైంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ అలవాటైన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా -ఆహార్యంలోని సొబగు పాత్ర చిత్రీకరణలో మిస్సై పాత్ర తేలిపోయింది. మురళీ శర్మ పాత్ర పరమ రొటీన్. సప్తగిరి, వెనె్నల కిషోర్ పాత్రలు నిడివి పెంచాయే తప్ప కామెడీ పంచలేకపోయాయి.
టెక్నికల్‌గా -సాయికార్తీక్ శృతిమించిన సంగీతం సంభాషణల్ని సగం మింగేస్తే.. వినిపించిన ఒకటీ అరా డైలాగుల్లో ‘పేదలకు ఇళ్లపట్టాలు పంచినట్టు ఈమెకు లాయర్‌పట్టా పంచేసినట్టున్నారు’, ‘సహజీవనం చేసి సెటిల్‌మెంట్ చేసుకోవడం లేటెస్ట్ ఫ్యాషన్’, కోడికత్తి కేసులో ‘జైలుకెళ్లిన నాయకుల పొలిటికల్ ఫ్యూచర్ నాగార్జున సిమెంట్‌తో కట్టినంత గట్టిగా ఉంటుంది’, ‘తెనాలి.. వినాలి’ లాంటి చాతుర్య సంభాషణలు కాస్త రిలీఫ్. సాయిశ్రీరామ్ తన సినిమాటోగ్రఫీతో కామెడీ ఫ్రేమ్స్‌కంటే -క్వాలిటీ ఫ్రేమ్స్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడనిపించింది. ఇది కామెడీ సినిమా అన్న స్పృహలో ఎడిటర్ చోటా కె ప్రసాద్ ఉండివుంటే -రోడ్డుమీద నిలబడి పెళ్లాంమీద ఎగిరే అనామకుడితో.. ‘సార్ నా కళ్లలోకి చూడండి. మీ స్ట్రెస్ తగ్గిపోయి రిలాక్సవుతారు’ అంటూ హన్సిక చేసిన చెత్త కామెడీ సన్నివేశాల్ని ఏరిపారేసేవాడేమో.
మొత్తంగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ సరదా సన్నివేశాలతో ప్రయాణం చేయాల్సిన కథ -‘తెనాలి’ రాకుండా కర్నూల్లోనే ఆగిపోయిందనాలి. ప్రపంచంలోని రియల్ లైఫ్ కామెడీని.. మొబైల్ డిజిటల్ ఫ్రేమ్స్‌లో చూసేస్తున్న ‘ఈ’కాలంలో -బిగ్ స్క్రీన్‌మీద ఇంత వీక్‌గా చూడ్డం చాలా చాలా కష్టం.
తెనాలి రామకృష్ణుడి చమత్కార కథల్లో -ఓ మెరుపుంటుంది. ఓ విరుపుంటుంది. టైటిల్ పెట్టుకున్నందుకు లేశమాత్రమైనా ఆ ‘ఆత్మ’ కానరాని కథగా -ఈ బిఎఎఎల్ కథ ఉండిపోయింది.

-విజయ్‌ప్రసాద్