రివ్యూ

శృతిమించిన యాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** యాక్షన్
**
తారాగణం: విశాల్, తమన్నా, ఆకాంక్ష పూరి, ఐశ్వర్యలక్ష్మి, రాంకీ, యోగిబాబు, ఫారా, షాయాజీ షిండే, ఆరవ్‌చౌదరి, భరత్‌రెడ్డి, కబీర్ దేహాల్‌సింగ్, వినె్సంట్ అశోకన్, ఛాయాసింగ్ తదితరులు
కెమెరా: డుడ్లీ
సంగీతం: హిప్ హాప్ తమిళ
నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు
కథ, దర్శకత్వం: సుందర్ సి
**
ఒకప్పుడు- యాక్షన్ ఇరగదీశాడూ అంటే.. హీరో అద్భుతంగా నటించేశాడన్న భావన ఉండేది.
ఇప్పుడు- యాక్షన్ ఇరగదీశాడూ అంటే.. గాల్లోకెగిరి కిందపడి తన్నుకు చచ్చారన్న అర్థాన్ని వెతుక్కుంటున్నాం.
ఇదే ప్రాతిపదికన యాక్షన్ సినిమాను చూడాల్సివస్తే మాత్రం హీరో విశాల్ తన యాక్షన్‌ను ఇరగదీశాడు. శృతిమించి మరీ సినిమాను ఆరేశాడు.
*
‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే.. ఏదీ అతిగా ఉండకూడదని. ఉంటే ఫలితం వ్యతిరేకంగా ఉంటుందని అంతరార్థం. సరిగ్గా ఈ ఉపమానం ‘యాక్షన్’ సినిమాకూ వర్తిస్తుంది. పేరు యాక్షన్ అని పెట్టాం కదా అని సినిమాలో చాలాభాగం యాక్షన్ సన్నివేశాలకే అంకితం చేసేసి మిగిలిన విభాగాలు -ముఖ్యంగా ఏ పిక్చర్‌కైనా పునాదిలాంటి కథపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దాంతో సహజంగా వ్యతిరేక రియాక్షన్ వచ్చింది.
కల్నల్ సుభాష్ (విశాల్)కు కాబోయే భార్య మీరా (ఐశ్వర్య లక్ష్మి), అన్న (రాంకీ) ఓ రాజకీయ సభలో తీవ్రవాది సయ్యద్ ఇబ్రహీం మాలిక్ (కబీర్‌దేహాల్‌సింగ్) మాస్టర్ మైండ్‌తో జరిపిన బాంబ్ బ్లాస్ట్, తదనంతర పరిణామాల్లో చనిపోతారు. వాళ్లను కనిపెట్టి అంతం చేయడానికి మిలటరీలో తన కొలీగ్ దియా (తమన్నా)తో కలిసి హీరో సందీప్ కిషన్ ఎలాంటి యాక్షన్‌లోకి దిగాడన్నది మిగతా కథ. దుండగుల్ని పట్టుకోవడం వగైరా సంగతులు ప్రతి కమర్షియల్ చిత్రంలో వాడి వాడి వదిలేసిన స్ట్ఫ్. దానికి లండన్, ఇస్తాంబుల్, అజర్‌బైజాన్, లాహోర్‌వంటి ప్రాంతాల నేపథ్యం వాడుకుని ఎంత సుందరంగా చేద్దామని దర్శకుడు సుందర్ సి అపయత్నించినా అది ఫలవంతం కాలేదు. కారణం సినిమా చూస్తున్న ప్రేక్షకుడు, ఏ పాత్రలోనూ లీనం కావడానికి సరిపోయే సరంజామాపై డైరెక్టర్ దృష్టి పెట్టకపోవడమే. దీనికిమించి సుదీర్ఘమైన పోరాట దృశ్యాలు ఫిలిమ్‌ని మరింత అనాసక్తికరం చేశాయి. ముందే చెప్పినట్టు ఆ ‘అతే’ వీక్షకులకు గుడిబండై కూర్చుంది. మిలటరీ నేపథ్యమూ, తీవ్రవాదుల్ని పట్టుకునే తతంగం, ఎయిర్‌పోర్టు సీన్లు కాస్తంత కొత్తదనం కల్పించాయన్నమాట నిజమే కానీ, అక్కడ సన్నివేశాలకు సంబంధించిన లాజిక్‌ని విస్మరించడంవల్ల అవి రక్తికట్టాల్సినంత రక్తికట్టలేదు. ఉదాహరణకు అంత పేరుమోసిన అంతర్జాతీయ తీవ్రవాది శిబిరానికి సుభాష్, దియా ఏదోక మామూలు రౌడీ డెన్‌కి వెళ్లినట్లు చూపించారు. అంతకన్నా అతను వినియోగించిన ప్రొఫెషనల్ కిల్లర్ కైరా (ఆకాంక్షాపూరి)ని పట్టుకునే చేజ్ బాగా తీశారు. ఇక లాహోర్ ఎయిర్‌పోర్టు సీన్సు తదితరాలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. టేకాఫ్ అయిపోయిన ఫ్లైట్‌ని ఆపడానికి చేసిన ప్రయత్నాలూ తదితరాలు చాలా కృతకంగా వున్నాయి. ఇక కంప్యూటర్ హ్యాకర్ పాత్రలో యోగిబాబు హాస్యం చిరాకు తెప్పించింది. బాధాకరమైన అంశమేమిటంటే తమన్నా, ఐశ్వర్యలక్ష్మి పాత్రల్ని సరిగా ఉపయోగించుకోకపోవటం.
చిత్రంలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే బ్లాక్‌లో లండన్ వీధుల్లో, బిల్డింగ్స్ మొదలైన వాటిపై తీసిన ఛేజింగ్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఈ యాక్షన్ సీన్స్ డైరెక్టర్ ప్రత్యేక అభినందనీయుడు. అలాగే పతాక సన్నివేశాల్లో చూపిన కొన్ని కట్స్ బానే ఉన్నా అవన్నీ హాలీవుడ్ చిత్రాల పక్కా అనుకరణగా అనిపించాయి. మరి వాటి క్రెడిట్ ఎవరికివ్వాలో చిత్రబృందమే చెప్పాలి. సుభాష్‌గా విశాల్ నటనపరంగా కంటే ఉన్న పరిధిలో పోరాట దృశ్యాల్లో బాగా కష్టపడ్డాడు. ముఖ్యంగా బైక్ చేజింగ్ దృశ్యల్లో విశాల్ చూపిన యాక్షన్ బాగుంది. అయితే చిత్ర ప్రచార సందర్భంగా తనిప్పటివరకూ నటించిన 27 చిత్రాల్లో ఇదే ప్రత్యేకమైనదన్న విశాల్ అభిప్రాయంతో ప్రేక్షకులు ఏకీభవించలేరు. ఎందుకంటే అతని గత చిత్రాల్లో కొన్ని ఇందులోని యాక్షన్‌ని మించిన పర్ఫెక్ట్ సినిమాలున్నాయి కనుక. స్ర్తి పాత్రధారిణుల్లో కైరాగా నటించిన ఆకాంక్షాపూరియే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒకరకంగా ఆమెవున్న సన్నివేశాల్లో హీరో విశాల్‌ను సైతం డామినేట్ చేసేసింది. ఐశ్వర్యలక్ష్మి చూపులతో ఆకట్టుకున్నా, పాత్ర పరిధి పరిమితం కావడంతో ఎక్స్‌పోజర్ తక్కువైంది. అలాగే తమన్నాకూ తగినంత పాత్ర లేదు. ఫస్ట్ఫాలో అయినా చాలా తక్కువ చోట్ల ఆమె పాత్ర వస్తుంది. హిప్ హాప్ తమిళ అందించిన బాణీల్లో ఆఖర్లో ఖవాలీ ఛాయల్లో వచ్చిన సాంగ్ మాత్రమే ఓ మాదిరిగా వుంది.
డుడ్లీ కెమెరా పనితనం ఎన్నదగినదే. చిత్రం మొత్తం వన్ పాయింట్ ఎజెండా- పోరాట ప్రధానంగా సాగింది కనుక ప్రస్తుతం ఫిల్మ్ నడిచిన రెండున్నర గంటలను, రెండు గంటలకు శ్రీకాంత్ (ఎడిటర్) కుదించివుంటే బావుండేది. పైన చెప్పుకున్నట్టు ఇది కంప్లీట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ కనుక సంభాషణలూ తదితరాలపై ఎలాంటి ఫోకస్ చేయలేదు. కానీ ఓ పాత్ర చేత నీకు ‘ఒకర్తీ’, నాకు ‘ఒక్కర్తే’ అంటూ చేయించిన మాటల చమత్కారం బాగుంది. అలాగే ట్రాకింగ్‌కన్నా టేకింగ్ అన్న డైలాగూ ప్రేక్షకులకు బాగా కనెక్టైంది.
సినిమా విడుదల సవ్వడి సమసిపోకముందే అమెజాన్ ప్రైమ్‌లో వీక్షకుడికి సదరు చిత్రం అందిపోతున్న ఈకాలంలో చిత్రాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే తప్ప నిలబడదన్న మాటను దర్శకుడు సుందర్ సి గ్రహిస్తే అనుకూల ఫలితాలు ఆశించడానికి అవకాశముంది.

-అనే్వషి