రివ్యూ

అదే.. వదిలేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వదలడు * బాగోలేదు
*
తారాగణం: సిద్ధార్థ్, కేథరిన్ ట్రెస్సా, కబీర్‌సింగ్, సతీష్, అదుకొలమ్ నరేన్, మధుసూదన్‌రావు, స్టంట్ సెల్వ, ఎలాంగో కుమార్‌వేలు, మనోబాల.. సంగీతం: ఎస్‌ఎస్ తమన్
కెమెరా: ఎన్ ఏకాంబరం
నిర్మాత: ఆర్ రవీంద్రన్
రచన, దర్శకత్వం: సాయిశేఖర్
*
ఈమధ్య పేపర్లో ఓ వార్త వచ్చింది. కేంద్ర మంత్రి ఎంతో ముచ్చటపడి ఢిల్లీలోని ప్రసిద్ధ మార్కెట్‌నుంచి తెప్పించుకున్న ఆపిల్ పళ్లకూ మైనం పూత పొసినవని. ఇలా సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్యులే ఆహార కల్తీబారిన పడితే ఇక సామాన్యుడిని వదులుతుందా కల్తీ భూతం? వదలదన్న ఒపీనియన్‌తోనే -వదలడు సినిమా తయారైంది. తాగే పాలు కల్తీ, తినే పప్పు కల్తీ, వాడే నూనె కల్తీ, ఆఖరికి పేదోడు వినియోగించే బ్రెడ్‌లోనూ కల్తీయే! మరి ఇలా ఇందుగలడందులేడన్న రీతిలో సర్వవ్యాపిగా విస్తృతించిన కల్తీ మహమ్మారిని అంతం చెయ్యాలన్న నిశ్చయంతో.. కల్తీలేని ఆహారం నా కల అంటూ కథానాయకుడు చేసిన పోరాటం ఎలా సాగింది? -వదలడు ఇతివృత్తం ఇదే. ఇతివృత్తంగా ‘వదలడు’ అభినందనీయ ప్రయత్నమైనా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు సాయిశేఖర్ అనుసరించిన విధానం నిస్సారమైనది కావడంవల్ల ప్రేక్షకుడు నిరాశకు గురయ్యాడు.
కేవలం ఆహార పదార్థాల వాసన చూసి వాటి ప్రమాణాలు నిర్థారించే నేర్పుగల అధికారి జగన్నాధం (సిద్ధార్థ్). తన తనిఖీల్లో అలా కల్తీ జరిపిన సంస్థల్ని మూసివేయించడంలాంటివి చేస్తాడు. దీనిపై కత్తిగట్టిన వాణిజ్య బృందం (కబీర్‌సింగ్, మధుసూదనరావు, స్టంట్ సెల్వ తదితరులు) జగన్నాధాన్ని అంతం చేస్తారు. ‘కల్తీలేని ఆహారం నాకల’ అంటూ తపించిన జగన్నాధం, తన కల నెరవేరకుండానే.. దోషులకు శిక్షపడకుండానే అంతమైపోవడంవల్ల, తన అసంపూర్ణ కార్యం పూర్తి చేయడానికి ఆత్మరూపంలో తాను ప్రేమించిన జ్యోతి (కేథరిన్ ట్రెస్సా)లో ప్రవేశించి పని పూర్తిచేస్తాడు. ఆహార కల్తీ నిరోధానికై పోరాడటం వరకూ ఓకె. కాని అది సఫలమవడానికి ఆత్మలు ప్రవేశాలంటూ రొటీన్ డెవిల్ ఫార్ములాకు రావడంతోనే సినిమా గ్రాఫ్ పడిపోయింది. అంటే దీన్నిబట్టి వ్యక్తిగా సాధించలేనిది ప్రేతాత్మల ద్వారానే పూర్తి చెయ్యగలం అన్న తప్పుడు సంకేతాలకు తెరతీసినట్టయ్యింది. ఇది ఎలా చూసినా ఆహ్వానించతగ్గ అంశం కాదు. దీన్ని సృజనకారులూ అంగీకరిస్తారు. అయినా చిత్ర వాణిజ్య కోణంనుంచి చూసి ఇలాంటివి పెట్టినట్టున్నారు. ఆ కోణమూ వదలడు నివారించలేదు. పోనీ దెయ్యం ఆవహించడం తదితరాలను పక్కకుపెట్టి ‘వదలడు’ని పరిశీలించినా, ప్రేక్షకుని మెదడుని వదలని అనేక అంశాలు ఇందులో తామరతంపరగా దొర్లాయి. చిత్ర కథానాయకుడికి ఏ పదార్థాన్నైనా వాసన చూసి దాని తత్వాన్ని పసిగట్టే నేర్పునిచ్చారు. అసలిలా కేవలం వాసనచూసి వాటి పరిస్థితిని పట్టేయడం అన్ని ఆహార పదార్థాల విషయంలోనూ కుదరదు. అలాగే దీనికి పూర్తి విరుద్ధంగా వాసననే కనిపెట్టలేని లక్షణంగల స్ర్తిగా కథానాయిక కేథరిన్ ట్రెస్సాను మలిచారు. వైద్య పరిభాషలో ఈ లక్షణాన్ని ‘అనోషిమా’ అంటారు. అయితే చిత్రం మధ్యలో తిరిగి ఈ ఘ్రాణశక్తి (స్మెల్లింగ్ సెన్స్) వచ్చేసినట్టు చూపారు. ఇది ఎలా వచ్చింది అన్న దాన్ని క్లారిటీగా చూపలేదు. ఓ దశలో ‘ఆత్మ’చేసే భీకర మారణకాండ (మనుషుల్ని చంపేయడం), తప్పుచేసినవారిని శిక్షించే పని చట్టం చేస్తుందని జ్యోతి చెప్తుంది. అయినా ఆమె కూడా చిత్రం పతాక సన్నివేశంలో తాను చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ‘జగన్, నువ్వు చెప్పిందే కరెక్టు, వీళ్లని చంపేయ్, నరికేయ్..’ అంటూ చెప్పడం మరీ శోచనీయం. అలా తప్పుచేసిన వ్యక్తుల్ని ఎవరికివారు చంపేస్తూ పోతేనే ఇలాంటివాటికి పరిష్కారమా? వీళ్లు పోతే మరొకరు వస్తారు కదా! అందుకని చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారాలు చూపాలి, ప్రజల్లో ఆహార కల్తీకి వ్యతిరేకంగా ఎవేర్‌నెస్ పెంచాలి.
**
ఒకచోట జగన్నాధం, తన పైఅధికారికి, తాను ఆధార సహితంగా కల్తీకి కారకుల్ని పట్టిచ్చే వీడియో ప్రెజెంటేషన్ చేస్తాడు. ‘నువ్వు ఆధారాలు నాకిచ్చేయ్, నే చూసుకుంటా’ అంటాడా అధికారి. అందుకు ప్రతిగా జగన్నాధం ‘ఎందుకు, మీకిస్తే వాటిని ఈ తప్పులు చేసిన దోషులకు ఇవ్వడానికా?’ అని ప్రశ్నిస్తాడు. మరి తన పైఅధికారి దుండగుల గ్యాంగ్‌తో కుమ్మక్కైన వ్యక్తిగా గుర్తించినపుడు ‘ఎందుకొచ్చినట్టు’ అని స్ఫురించే సామాన్య ప్రశ్నకు ‘ఇప్పుడైనా మీరు మారతారన్న ఉద్దేశ్యంతో’ అన్న చాలా అమాయక సమాధానమిస్తాడు. ఇది ఎంత అవివేకంగా ఉందో గమనించవచ్చు. అంటే ఆ రీత్యా స్టంట్‌కీ, తదితర సన్నివేశాలకీ లీడ్ చేసుకున్నారు కానీ, అంతవరకూ తెలివైన ఆఫీసర్‌గా చూపిన క్యారెక్టరు ఒక్కసారిగా ఈ సీన్‌వల్ల ఎంతగా నీరసపడిపోయిందీ ఆలోచించినట్టు లేదు. ఇక జగన్నాధానికి చావు చెట్టుపై వచ్చింది కనుక, ఆ చెట్ల మొదట్లో మూత్రవిసర్జన, మద్యపానం చేసిన వాళ్లను సైతం ఆత్మగా చావబాదడం తదితరులు చూపడం మరింతగా దర్శకుని తృతీయశ్రేణి అభిరుచికి దర్పణం. ఇవన్నీ వదిలేస్తే జగన్నాధంగా సిద్ధార్థ్ తనదైన సోఫిస్టికేటెడ్ నటనను బాగానే చేశారు. కానీ సినిమాకిచ్చిన అనవసర మలుపులూ, అర్థంలేని సన్నివేశాలు ఆ ప్రతిభను ఎలివేట్ చేయలేకపోయింది. అలాగే జ్యోతిగా కేథరిన్ ట్రెస్సాకిచ్చిన రోల్ క్లిష్టమైన లక్షణాలు కలది. ‘మీరందరూ ఆహారాన్ని చూడగానే అది ఎలాంటిదో గ్రహిస్తారు. కానీ నేను అది తింటేనేగాని గ్రహించలేను’ అంటూ తనకున్న ప్రధాన లోపం (వాసనను గుర్తించలేని లక్షణం) వ్యక్తపరిచిన తీరులోనూ ‘చీమకు కూడా అపకారం చేయని నేను, ఈ హత్యకు కారణం ఎలా అవుతాను?’ అంటూ తన ఆవేదనను వెళ్లబోసిన తీరులోనూ బాగా నటించారు. ఓరకంగా ఈ పాత్ర కథాపరంగా తెరపై సిద్ధార్థ్ పాత్రకంటే ఎక్కువగా ఆకట్టుకుంది. మళ్లీ ఇది కూడా పరిపూర్ణంగా ప్రతిఫలించకపోవడానికి కారణం ఇందాక చెప్పినట్టు సన్నివేశాల అసంపూర్ణ ఆవిష్కరణలే! మిగతా పాత్రలేవీ పెద్దగా ఆకట్టుకునే స్కోపులేనివి. జగన్నాధం సహోద్యోగి, ఫేస్‌బుక్ లవర్ పాత్రలో సతీష్ కాస్తంత మెరిసాడు. ఈతరహా సినిమాల్లో అనవసరంగా పాటలు పెట్టడం అర్థరహిత కామెడీని కల్పించకుండా నిగ్రహం పాటించిన దర్శకుడు తప్పక ప్రశంసనీయుడే. అందుకే తమన్ (సంగీత దర్శకుడు) తన టాలెంట్‌ను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో చూపారు. సంభాషణల్లో ఏ ఆహార పదార్థంలో ఏది కలుపుతారో (్ఫర్మాలిన్, మెలమిన్, కాస్టిస్ సోడా తదితరాలు) విడమర్చి చెప్పడం బాగుంది. ఇలా జరిగే కల్తీలవల్ల దీర్ఘకాలంలో మనిషి కాన్సర్‌వంటి రోగాల బారిన పడతాడని చెప్పి, అది చివరగా ఎలా తయారయ్యిందో అన్నదానికి ఉదాహరణగా ‘ఈ రోజు కాన్సర్ వ్యాధి కాదు, వ్యాపారం’ అంటూ ప్రస్తుత పరిస్థితిని సూటిగా చెప్పడం ప్రేక్షక హృదయాల్ని నేరుగా తాకింది. అలాగే కోడిపిల్లలు నిర్ణీతకాలంకంటే సత్వరంగా పెరగడానికి వ్యాపారంలో అవలంభించే మార్గాలూ, అలాంటివాటిని వినియోగించడంవల్ల వచ్చే అనర్థాలు కళ్లకు కట్టినట్లు సంభాషణల ద్వారా వివరించడం ఆలోచనీయంగా వుంది. ఇలాంటి చిత్రాల్లో కెమెరాకు పని ఎక్కువ ఉంటుంది. ఆ పనిని కెమెరామెన్ ఏకాంబరం ఏకాగ్రతతో చేశారు.
‘కల్తీలేని ఆహారం నా కల’ అన్న ఈ చిత్ర నాయకుడి ఆశయం అమలులోవున్న చట్టాల ఆలంబనగా సిద్ధించినట్టు చూపితే ‘వదలడు’ వీక్షకుల మనసులకి పట్టేదేమో!

-అన్వేషి