రివ్యూ

2 అవర్స్ కాలక్షేపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2 అవర్స్ లవ్ * బాగోలేదు
*
తారాగణం: శ్రీపవార్, కృతిగార్గ్, అశోక్‌వర్థన్, తనికెళ్ల భరణి, నర్సింగ్ యాదవ్ తదితరులు
సంగీతం: గ్యాని
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి
ఎడిటర్: శ్యామ్
నిర్మాణం: శ్రీ కనిక క్రియేటివ్ వర్క్స్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపవార్
*
కవితకేదీ కాదు అనర్హం. శ్రీశ్రీ అంతటివాడే చెప్పాడు కనుక -‘దేనిమీదైనా’ కవిత రాయొచ్చు. గోడమీద కవిత రాయాల్సి వస్తే.. -‘గోడ’ను కవితా వస్తువు చేసుకునే వాడొకడు. రాయడానికి బొగ్గు ముక్క ఏరి తెచ్చుకునే వాడు ఇంకొకడు. స్థారుూభేదాలను పక్కనపెడితే -రెండు ప్రయత్నాల్లోనూ లోపాలు చూడలేం.
***
అరగంట తింటాం. ఐదు గంటలు నిద్రపోతాం. పది గంటలు పని చేస్తాం. కొత్తేముంది. మరి -రెండు గంటలు ప్రేమించుకుంటే. ఇదీ నోవెల్ పాయింట్. అందుకే శ్రీపవార్‌లోని రచయిత బయటికొచ్చాడు.
కథను నడిపించే నాయకుడు విజయ్ దేవరకొండ అయితే బావుంటుంది. కాని ఆలస్యమైంది. -యూత్ సెనే్సషన్ ఇమేజ్‌తో కొండపైనున్న దేవరకొండను దించటం కష్టం. అందుకే శ్రీపవార్‌లోని దర్శకుడు రాజీపడ్డాడు.
ఎవరో వస్తారని/ ఏదో చేస్తారని/ ఎదురు చూసి పోసపోవద్దన్న శ్రీశ్రీ మాటలు గుర్తుకొచ్చాయి. ధైర్యే సాహసే లక్ష్మీ అనుకుంటూ -నిర్మాణానికి సిద్ధపడి సినిమా తీశాడు.
కథానాయకుడికి ఉండాల్సిన లక్షణాలు తనలో ఏంతక్కువ. పైగా కథకు -రచయిత, దర్శకుడు, నిర్మాతను నేనే. న్యాయం చేయగలనన్న నమ్మకం కలిగింది. హీరోగా శ్రీపవార్ స్క్రీన్ మీదికొచ్చాడు. అలా.. మల్టీ టాస్కింగ్ ప్రోడక్ట్‌గా వచ్చిన చిత్రమే -2 అవర్స్ లవ్.
అయితే-
ఒక వ్యక్తిలో నిభిఢీకృతమైన నైపుణ్యాలన్నీ సమూహపడితే -ప్రయత్నం ఫలిస్తుంది. ఒకదాన్ని మరొకటి డామినేట్ చేస్తే -ప్రయత్నమే మిగులుతుంది. ఈ ఈక్వేషన్ ప్రామాణికంగా తీసుకుంటే -రిజల్ట్ లేని గొప్ప మల్టీ టాస్కింగ్ ఎఫర్ట్.. 2 అవర్స్ లవ్.
చిన్న సినిమా అన్న చీప్ థాట్స్‌ని ప్రేక్షకుడు ఎప్పుడో వదిలేశాడు. మంచి కథైతే చాల్లేనన్న పెద్ద మనసుతోనే థియేటర్‌కు వస్తున్నాడు. ఈ కోణాన్ని సంతృప్తిపర్చడంలోనూ -రెండు గంటల ప్రేమ విఫలమైంది. కొత్త కానె్సప్ట్‌తోనే వచ్చినా -కథని ఆడియన్స్‌కి కనెక్ట్ చేసే విషయంలో ‘మల్టీ టాస్కింగ్ మిస్టేక్స్’ జరిగిపోవడమే కారణం.
ప్రేమకథలు ఆడియన్స్‌కి కొత్త కాదు. అయినా చూస్తున్నారు. ఎందుకంటే -పాత విషయాన్ని కొత్తగా చెప్పడం వల్ల. లేదూ కొత్త విషయాన్ని అర్థవంతంగా చెప్పడం వల్ల. రెంటికీ మధ్యలో నలిగిపోయింది -రెండు గంటల ప్రేమ కథ.
కథ:
తనకు ప్రపోజ్ చేసిన లవ్ అట్ ఫస్ట్ సైట్ గాళ్‌ని రిజెక్ట్ చేస్తాడు హీరో అదిత్ (శ్రీపవార్). మరుక్షణంలోనే కాస్త దూరంలో కూర్చున్న అవిక (కృతిగార్గ్)తో లవ్ అట్ ఫస్ట్ సైట్‌లో పడతాడు. ప్రపోజల్‌కు ఓకే అంటుంది అవిక. అయితే, తన బిజీ షెడ్యూల్ వివరించి -ఈవెనింగ్ 4 టు 6 బ్లాంక్ అంటుంది. 2 అవర్స్ లవ్‌కు అభ్యంతరం లేదంటుంది. కానె్సప్ట్ అర్థంకాకున్నా, కొత్తగా అనిపించి ఓకే అనేస్తాడు అదిత్. అయితే, రూల్స్ బ్రేక్ చేస్తే బ్రేకప్ తప్పదంటూ కొన్ని కండిషన్స్‌తో అగ్రిమెంట్ తీసుకుంటుంది అవిక. అదిత్‌కి కష్టాలు మొదలవుతాయి. మొదట ముచ్చటగా అనిపించిన ‘కండిషన్డ్ లవ్’లోని కష్టాలను -మేల్ ఈగో డామినేట్ చేయటంతో క్రైసిస్‌లా మారుతుంది. సిట్యుయేషన్ అర్థం చేసుకున్న అవిక -కష్టాలకు రెస్ట్ కావాలంటే ‘లవ్ లీవ్’ ఒక్కటే మార్గమంటూ కొత్త ట్విస్ట్ ఇస్తుంది. కట్‌చేస్తే -ఇద్దరూ దూరమవుతారు. ఎడబాటు ఎంత భయానకమో అర్థమయ్యాక -మళ్లీ కలుసుకోడానికి ఒకరికి తెలీకుండా ఒకరు కిడ్నాప్ డ్రామా ఆడతారు. రొమాంటిక్ కిడ్నాప్ డ్రామాలో చిన్న అపశృతి చోటుచేసుకుని -అదిత్ తలకు బలమైన గాయమవుతుంది. అక్కడితో ‘లాస్ ఆఫ్ మెమరీ’ లైఫ్ ముగిసి -ఒరిజినల్ లైఫ్‌లోకి వస్తాడు అదిత్. అంటే.. ఒరిజినల్ లైఫ్‌లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ‘లాస్ ఆఫ్ మెమరీ’కి గురై -ఆ కండిషన్‌లోనే అవికతో ‘కండిషన్డ్ లవ్’ ట్రావెల్ సాగించాడన్న ట్విస్ట్ ఆడియన్స్‌కి రివీలవుతుంది. మరి -ఒరిజినల్ లైఫ్‌లో లవర్ నయన ఏమైంది. తన ఈగోతో దూరం చేసుకున్న నయన ఇంతకాలం ఎక్కడుంది. ఆమె గుర్తుకొచ్చినపుడు అదిత్ ఆలోచనలు ఎలా సాగాయి? కథ క్లైమాక్స్‌కు చేరేసరికి -నయన దగ్గరైందా? అవిక సొంతమైందా? అసలు అదిత్ మనసులో ఉన్నదెవరు?లాంటి ఆసక్తికరమైన సమాధానం సినిమా ముగింపు.
ఆడియన్స్‌లోని ఆసక్తి చచ్చేంత కసిగా కథ సాగటాన్ని జీర్ణించుకోలేం. నిజానికి శ్రీపవార్‌లోని ‘మల్టీ టాస్కే’ సినిమాకు ఆక్సిజన్ అందకుండా చేసేసింది. అన్ని టాస్క్‌ల్లోనూ డెబ్యూ కనుక -ఒక టాస్క్‌ని మరో టాస్క్ డామినేట్ చేసేసింది. దీంతో -అసలు కథకు న్యాయం జరగలేదు. రెండు కత్తులు ఒక ఒరలో ఇమడనట్టే -అహం, ప్రేమ.. రెండూ ఒక లైఫ్‌లో ఇమడవన్న విషయాన్ని చెప్పడానికి ‘దుష్టవంకర్లు’ వెతుక్కోవడం అనుభవరాహిత్యానికి పరాకాష్ట. అదే పనిగా తింటే -అజీర్తి, అదే పనిగా ప్రేమిస్తే -లవ్‌జీర్తి తప్పదన్న సైంటిఫిక్ సారాన్నీ ప్రయోగాత్మకంగా చూపించే ప్రయత్నమైతే చేశాడు కాని -్ఫలితమే తడబడింది. ‘2 అవర్స్ లవ్’లోని అంతస్సూత్రాన్ని అర్థవంతంగా చెప్పడంలో శ్రీపవార్ అనుభవం సరిపోలేదు. అన్ని టాస్క్‌ల్లోనూ ‘డెబ్యూ’ అన్న జాలిని గుండెల్లో నింపుకుంటే మాత్రం -ప్రయత్నం మెచ్చుకోతగ్గదే.
లవ్ ఫెయిల్యూర్‌కి అవగాహనా లోపమే కారణమన్న సూత్రీకరణ పాతదే అయినా -కథాపరంగా మరోసారి గుర్తు చేయడం బావుంది. హీరో, హీరోయిన్ల కనెక్టివిటీకి డిజైన్ చేసిన ‘పప్పీ’ ఎపిసోడ్ రియల్లీ సూపర్బ్. ఆ రెండు నిమిషాల సీన్‌లో ‘క్యూట్ పప్పీల’ ప్రజెన్స్ -ఆడియన్స్‌కి అతి పెద్ద రిఫ్రెష్‌మెంట్. గ్యాని సింగ్ బాణీలకు తగిన డ్యాన్స్ కంపోజిషన్ లేక -ఎలివేట్ కాలేదు. నేపథ్య సంగీతం, ముఖ్యంగా పప్పీల సీన్‌కు ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్బ్. ప్రవీణ్ వనమాలి కెమెరా కన్ను కొన్నిచోట్ల మనసుని సంతృప్తిపర్చింది. చిన్న సినిమా అనలేనంత రిచ్‌గా క్వాలిటీవున్నా, కథను చెప్పే విధానంలో తడబాటు ఫలితాన్ని మింగేసింది. ప్రేమే ఓ భావోద్వేగం. ఆ ఎమోషన్‌ను రుచి చూపించటంలో లీడ్‌రోల్స్ ఫెయిలయ్యాయి. నాటకీయత తప్ప, నిజాయితీ కనిపించదు. హీరోయిన్ కృతిగార్గ్ పెర్ఫార్మెన్స్ మాత్రం కొంతలోకొంత రిలీఫ్. క్లైమాక్స్‌లోని సాగదీత సన్నివేశాలు -శ్యామ్ పేలవమైన ఎడిటింగ్‌ను చెప్పకనే చెబుతుంది. కథకు ఏమాత్రం సంబంధంలేని విలన్ గ్యాంగ్ సీక్వెన్స్ -నిడివి కోసమే అన్నట్టే ఉంది. అశోక్ వర్థన్ వెగటు కామెడీ భరించలేం. లాజిక్‌లేని సన్నివేశాలు స్క్రీన్‌మీద సా..గుతూ వెళ్తుంటే -మల్టీ టాస్క్‌లో మెరుపులు కొసనైనా కనిపించకపోతాయా? అని ఆడియన్స్ ఓపిగ్గా కూర్చోక తప్పదు.

-విజయ్‌ప్రసాద్