రివ్యూ

ఆ బాహుబలే.. ఈ సాహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహో ** ఫర్వాలేదు
**
తారాగణం: ప్రభాస్, శ్రద్ధాకఫూర్, జాకీష్రాఫ్, మురళీశర్మ, వెనె్నల కిషోర్, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీపాండే, ప్రకాష్ బెలమూడి, టినూ ఆనంద్, లాల్, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ, ఎల్వీన్ శర్మ తదితరులు
స్వరకల్పన: తనిష్క్ బాగ్చీ, బాద్షా, శంకర్ ఎహ్‌సాన్ లాయ్, గురు రంధానా
నేపథ్య సంగీతం: జిబ్రాన్
ఎడిటర్: ఎ శ్రీకర్ ప్రసాద్
ఛాయాగ్రహణం: ఆన్ మది
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
రచన, దర్శకత్వం: సుజిత్
**
మాహిష్మతి -ఓ మహా సామ్రాజ్యం. అవిటివాడు రాజ్యాధికారానికి అనర్హుడు కనుక -బిజ్జలదేవుడు సింహాసనానికి దూరమయ్యాడు. తమ్ముడు విక్రమదేవుడు రాజయ్యాడు. రాజు కొడుకే రాజవ్వాలన్న రాజనీతిజ్ఞతతో -విక్రముడి కొడుకు అమరేంద్ర బాహుబలి రాజయ్యాడు. తండ్రి అవిటితనం తనకెందుకు శాపం కావాలన్న కోపంతో బిజ్జలదేవుడి కొడుకు బల్లాలదేవుడు విలనయ్యాడు. కుట్రపన్ని.. వెన్నుపోటు పొడిచి.. రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. బల్లాలదేవుడి కుట్ర కారణంగా అజ్ఞాతంలో పెరిగిన వీరుడు మహేంద్ర బాహుబలి. కాలం క్లూ ఇచ్చింది. విషయం తెలిసుకుని బల్లాలదేవుడిపై యుద్ధం ప్రకటించాడు. గెలిచి మాహిష్మతికి పట్ట్భాషిక్తుడయ్యాడు. రామాయణ సారమైన స్ర్తికాంక్ష పార్శ్వాన్ని ఎడిట్ చేస్తే -చరిత్ర సృష్టించిన బాహుబలి కథ ఇది.
**
భారీగా తెరకెక్కిన బాహుబలి ఎపిక్‌తో -ప్రభాస్‌కు తిరుగులేని ఇమేజొచ్చింది. శిఖరాగ్ర ఇమేజ్‌ను నిలబెట్టుకోవాలన్న ఆలోచనల నుంచి మరో భారీ ప్రాజెక్టుకు బీజం పడింది. అదే -సాహో. కాకపోతే -ముందు మూలానే్న మళ్లీ చేస్తున్నామన్న విషయాన్ని గ్రహించలేదు. అలా, బాహుబలి లైన్ క్రైమ్ జోనర్‌లో సాహో అయ్యింది.
***
కథ చూద్దాం.
వాజీ -ఓ క్రైమ్ కింగ్‌డమ్. వాజీ కేంద్రంగా విస్తరించిన మాఫియా ప్రపంచానికి రాజు పృధ్వీరాజ్ (టిను ఆనంద్). క్రైమ్ స్టేట్‌కు కొడుకు దేవరాజ్ (చుంకీ పాండే)ను కింగ్ చేయాలనుకున్నాడు పృధ్వీరాజ్. కాకపోతే అప్పటికే తను చేరదీసిన రాయ్ (జాకీష్రాప్) అనధికార రాజయ్యాడు. రాయ్ గ్రూప్ పేరిట క్రైమ్ సిండికేట్‌ను విస్తరించాడు. కోట్లకు పడగలెత్తిన క్రైమ్ ప్రపంచం -సామంతుడి చేతిని ముద్దాడటం పృధ్వీరాజ్ కొడుక్కి నచ్చలేదు. పగబట్టాడు. విలనయ్యాడు. కుట్ర పన్ని రాయ్‌ని నడిరోడ్డుపై చంపించేశాడు. అజ్ఞాతం వీడి రాయ్ స్థానంలో కూర్చోడానికి రెడీ అయిన కొడుక్కి విషయం తెలిసింది. ముల్లును ముల్లుతోనే తీయడానికి పోలీస్ డ్రామా ప్లే చేశాడు. బలపరాక్రమ ప్రదర్శనతో భారీ పోరాటం సలిపాడు. తలెత్తిన మూకల తలలు తుంచి -క్రైం వరల్డ్‌కు కింగయ్యాడు. ఇదే -సాహో కథ.
**
హీరో సేమ్. థాట్ సేమ్. బడ్జెట్టూ ఇంచుమించు సేమ్. ఆర్టిస్టుల, టెక్నీషియన్స్ స్టామినా, యాక్షన్ స్ట్రెంగ్త్, సీజీ వర్క్.. అన్ని విభాగాలదీ అంతే విస్తృతి. కాకపోతే బాహుబలి చరిత్ర సృష్టించింది. సాహో చరిత్రగా మిగిలింది.
ఒకే పాయింట్‌తో ఇద్దరు దర్శకులు ఒకే కాలమానంలో వేర్వేరు జోనర్లలో అల్లుకున్న రెండు కథలైనా -మూలసూత్రం మాత్రం ఒక్కటే.
**
కోటితో తీసినా, కోట్లుపెట్టి చేసినా -సినిమాకు కథ ముఖ్యం. దాన్ని చెప్పే విధానం ప్రాణం. ఈ విషయంలోనే సాహోకి ఆక్సిజన్ అందలేదు. బాహుబలి తరువాత చేస్తున్న భారీ సినిమాగా -స్కేల్, సేల్ చూశారే తప్ప, స్టోరీ స్ట్రెంగ్త్‌పై దృష్టి పెట్టలేదు. ఇండియన్ స్క్రీన్‌పై హాలీవుడ్ సినిమా చూపిద్దామన్న కంగారులో.. నేటివ్ ఆడియన్స్ కోరుకునే ఎమోషనల్ డ్రైవ్‌ను గాలికొదిలేశారు. దాంతో భారీ విగ్రహానికి ఆత్మకరవై -సాహో ‘శిలాశిల్పం’లా మిగిలింది.
సినిమా ఇంటెన్స్ సీన్‌తో మొదలవ్వడంతో -ఆడియన్స్ అలెర్టయ్యారు. అండర్ వరల్డ్ క్రైమ్.. అపోజిట్‌లో సెంట్రల్ మినిస్టర్.. ఫ్యామిలీ కిడ్నాప్.. ఇలా సీన్లు పడుతుంటే -కుర్చీల అంచుకు చేరారు. కాకపోతే -ఐదు నిమిషాలు తిరగేసరికి మెటాలిక్ మూడ్‌లోకి వచ్చేశారు. కారణం -్భరీ సెట్లు, సీజీ గ్రాఫిక్స్ మాయతో తెరపై రిచ్‌నెస్ కనిపించిందే తప్ప -రియాలిటీ భావనకు రాలేకపోవడమే. పైగా దండెత్తివస్తున్న ‘కాలకేయుల్ని’ హీరో వరుసపెట్టి ఉతికేస్తున్నా -ఆ సీన్‌తో మనకు సంబంధం లేదన్నట్టే కళ్లప్పగించి చూశారు. కార్డ్‌బోర్డ్ విలన్ల తుక్కు రేగ్గొట్టేసిన హీరో -ఇక మనల్ని పరిగెత్తిస్తాడని మళ్లీ ప్రిపేరైన ఆడియన్స్‌కు.. అసలు నీరసం అప్పుడే మొదలైంది. ‘అండర్ కవర్ కాప్’గా సీన్‌లోకి దిగిన ప్రభాస్ -ఊహించని క్యారెక్టరైజేషన్ చూపిస్తుంటే.. కథలో చురుకుదనం కోసం చకోరపక్షుల్లా చూస్తూండిపోయారు. ‘రెండు లక్షల కోట్ల’ కథను వెనక్కినెట్టి.. ‘రెండు వేల కోట్ల’ దోపిడీ కథను నిదానంగా, నీరసంగా చూపిస్తుంటే -తెరపై సీన్ కన్ఫ్యూజింగ్ చూస్తూ కూర్చోవడమే ఆడియన్స్ వంతైంది. ‘రన్ రాజా రన్’ అంటూ చిన్న సినిమాను పరిగెత్తించిన దర్శకుడు సుజీత్ -సాహో సన్నివేశాల్ని మరింత పరిగెత్తిస్తాడని ఆశించిన ఆడియన్స్‌కు ఆశాభంగమైంది. సీన్లన్నీ ఫ్లాట్‌గా వెళ్తుంటే -కన్ఫ్యూజింగ్ కంటెంట్ ఫస్ట్ఫాలో రాజ్యమేలేసింది. తెరపై పాత్రలు పూర్తిగా అర్థమయ్యేసరికే ట్విస్ట్‌లు తలెత్తడంతో -కథను ఆస్వాదించటం కష్టమైంది.
యాక్షన్ థ్రిల్లర్ అంటే అదొక్కటే ఉంటుందనుకోవద్దు -అంటూ ప్రభాస్ పలికిన ప్రమోషనల్ పలుకులకూ సినిమాకూ సంబంధం లేదనిపించింది. జోనర్‌ను జస్టిఫై చేసేలా తెరనిండా యాక్షనే కనిపించింది. ఆశించిన మేరకు అక్కడక్కడా రొమాన్స్‌కూ స్కోపిచ్చారు. ‘ఆడియన్స్ అంచనాలను సంతృప్తిపర్చాలి’ అన్న నీతిని పాటిస్తూ -్ఫస్ట్ఫా ఎండింగ్‌లో ఓ బలమైన ట్విస్ట్ వేసేశారు.
సెకెండాఫ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా కూర్చున్నా -అక్కడా మ్యాటర్ కంటే మేజిక్కే ఎక్కువైంది. క్లైమాక్స్ కోసమైనా కథను నడిపించాలి కనుక -నిస్సారమైన సీన్లు, నిస్తేజమైన పాటలు.. జోనర్‌కు తగిన సుదీర్ఘ పోరాట ఘట్టాలతో నిండిపోయింది. ట్విస్ట్‌లు, స్టంట్లుతో సాహో పెట్టే సవాలక్ష పరీక్షలకు -సరైన సమాధానాల్ని ఆడియనే్స కనిపెట్టాల్సి వచ్చింది. *
మహా శివలింగాన్ని పెకళించి భుజాన మోసిన బాహుబలి.. మహా జలపాతాన్ని అధిగమించి పర్వతాగ్రానికి చేరిన బాహుబలి.. -సాహోలో నీరసంగా కనిపించాడు. బాహుబలిని చూసిన కళ్లతో సాహోని చూళ్లేక -హీరోని ఓన్ చేసుకోవడానికి కష్టపడ్డారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో వినా, ప్రభాస్ ఎందుకో చురుగ్గా లేడు. పైగా కొన్ని సీన్లు సిల్లీ చేసేశారు. ఓ భారీ చేజ్ సీక్వెన్స్‌లో ‘జెట్‌మ్యాన్’ ఫైట్ డిజైన్ చేశారు. జెట్‌మ్యాన్ సూట్లో మనుషులు ఎగరడమే ‘రోబో గేమ్’లా అనిపిస్తే, ఆ సూట్‌ని హీరోకీ తగిలించటం దారుణం. వందల అడుగుల ఎత్తులోంచి పడిపోతున్న హీరోయిన్‌ని అమాంతం గాల్లో క్యాచ్ చేసి హీరో ల్యాండవుతుంటే -్భవిష్యత్‌లో రాబోయే ‘డైహార్డ్‌మ్యాన్’ సినిమాకు సంకేతం అనిపిస్తుంది. ఈ సీన్ జస్ట్ఫికేషన్ కోసం మరోచోటా -అత్యంత ఎతె్తైన పర్వతం నుంచి హీరో గాల్లోకి ఎగిరి పారాచూట్‌ను అందుకోవడాన్ని చూపించటం మరీ సిల్లీ.
పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చరుకైన చిరుతలా పరిచయమైన శ్రద్ధాకఫూర్, తోడుకోసం తల్లడిల్లే లేడిపిల్లలా కొన్ని సన్నివేశాల్లో బేలగా కనిపించింది. ‘బాధాతప్త హృదయ విదారక’ కథలో -ఎమోషన్ వర్కౌట్ కాలేదు. అటు హిందీ, ఇటు తమిళ పరిశ్రమల నుంచి జెమాజెట్టీల్లాంటి ఆర్టిస్టుల్ని పికప్ చేసుకున్నా -ఏ ఒక్కరికీ ఆడియన్స్‌తో కనెక్టయ్యేంత టైమ్, టైమింగ్ ఇవ్వలేదు. భారీ బడ్జెట్ సినిమా అన్నందుకు క్వాలిటీకి తక్కువ లేదు. ఎంచుకున్న విదేశీ లొకేషన్లు అబ్బురపర్చాయి. వాటిని చూపించటంలో కెమెరా పనితనం కనిపించింది. సినిమా మొత్తం క్లౌడ్ షాడో కలర్‌లో చూపించటం -హాలీవుడ్ సినిమా భావనకు దగ్గర చేసింది. జోనరే యాక్షన్ థ్రిల్లర్ కనుక, అందుకు పడిన కష్టం తెరపై కనిపించింది. ఒకింత హోరు ఎక్కువైనా -జిబ్రాన్ నేపథ్య సంగీతం బావుంది. సినిమా రిచ్‌నెస్‌కి నిదర్శనంగా -పాటల లొకేషన్లు సూపర్బ్. చిత్రబృందం ప్రకటించిన లెక్కల ప్రకారం సినిమా బడ్జెట్ -350 కోట్లు. బడ్జెట్ బలం యాక్షన్‌పై ఎక్కువవ్వడంతో -కథను నడిపించే సన్నివేశాలు బలహీనపడ్డాయి.
ముక్తాయింపు:
తండ్రిని చంపిన గ్యాంగ్‌స్టర్స్ కుత్తుకలు కత్తిరించి కుర్చీని ఆక్రమించిన పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసికి, ఫ్రెంచ్ స్టోరీ ‘లార్గో వించ్’కీ షాడోలా అనిపించిన సినిమా -సాహో.

-విజయ్‌ప్రసాద్