రివ్యూ

మిస్సైన లైన్ అండ్ లెంగ్త్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌసల్య కృష్ణమూర్తి ** ఫర్వాలేదు
**
తారాగణం: ఐశ్వర్య రాజేశ్, రాజేంద్రప్రసాద్, శివకార్తికేయన్, ఝాన్సీ, వెనె్నల కిషోర్, శశాంత్, రవిప్రకాష్ తదితరులు
సంగీతం: దిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాత: కెఎ వల్లభ
సమర్పణ: కెఎస్ రామారావు
కథ: అరుణ్ రాజా కామరాజ
దర్శకత్వం: భీమినేని శ్రీనివాస రావు
**
నాన్న కళ్లలో నవ్వు చూడాలంటే, క్రికెట్‌లో భారత్‌ను గెలిపించడమే లక్ష్యంగా ఎదిగిన రైతు కూతురు -కౌసల్య. ఈ లైన్ చదివుతున్నపుడే మైండ్ స్క్రీన్‌మీద టైట్ స్క్రీన్‌ప్లేతో సినిమా ఊహించుకుంటాం. కారణం కథను ఎంతైనా విస్తృతం చేయడానికి అవకాశమున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కనుక.
కాడి బాధల్ని కావిట్లో మోస్తూ -కూతురి క్రికెట్ కల నెరవేర్చడానికి కన్నీళ్లను కళ్లలో అదిమిపెట్టిన తండ్రి -కృష్ణమూర్తి. ఈ లైన్ చదివినపుడూ మైండ్ స్క్రీన్‌మీద స్ట్రగుల్డ్ స్క్రీన్‌ప్లేతో మరో సినిమా ఊహిస్తాం. కారణం -ఎమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లగల సంప్రదాయ వ్యవసాయం బ్యాక్‌డ్రాప్ కనుక.

ఒక్క బుర్ర ఒకేసారి రెండు కథల్ని వింటే -మైండ్ హీటెక్కుతుంది. ఒక్క స్క్రీన్‌మీద రెండు సినిమాలు కలగలిపి చూస్తే -అనుభూతి మిస్సవుతుంది. ‘కౌసల్య-కృష్ణమూర్తి’కి అదే జరిగింది.

మైదానం సజెషన్‌లో -ఆవల కనిపించే ఎమోషన్స్‌ని జెర్సీ, మజిలీలాంటి సినిమాలు చూపించేశాయి. క్షేత్రంలో రైతు కష్టాల్నీ హైజీనిక్ బడ్జెట్‌తో వచ్చిన చిరంజీవి, మహేష్‌బాబు సినిమాల్లో చూసేశాం. వాటికి భిన్నమైన కోణమన్న ఆలోచనతో -సాంప్రదాయ సాగు స్ట్రగుల్ పాయింట్‌గా.. లైఫ్ సజెషన్ నుంచి మైదానాన్ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పైన చెప్పుకున్నట్టు -ఈ ప్రయోగం ఏదోక పాయింట్‌పై జరిగివుంటే సినిమా మరోలా ఉండేది. రెండు సినిమాల్ని టచ్ చేసే సరికి -సారం పల్చనైపోయింది.
**
‘ఏడుస్తున్నావెందుకు నాన్నా. ఇండియా ఓడిపోయిందనా?’ అంటూ కృష్ణమూర్తిని -ఏడేళ్ల కూతుడు కౌసల్య అడగటం నుంచి అసలు కథ మొదలవుతుంది. నాన్న కళ్లలో నవ్వు చూసేందుకు క్రికెట్‌పట్ల మమకారం పెంచుకుంటుంది కౌసల్య. లక్ష్య సాధనకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తూ ఆమె జర్నీ మొదలవుతుంది. వద్దని వారించిన అమ్మని.. జట్టు కూడగట్టమన్న డ్రిల్ మాస్టారిని.. ఆడపిల్లకు ఇదేం చోద్యమన్న ఊరిని.. ఇలా ఒక్కోక్కరినీ ఒప్పించుకుంటూ.. అన్నాల్లాంటి అబ్బాయిలతో కలిసి క్రికెట్ సాధన చేస్తుంది. ఆసక్తి, అధ్యయనం, కృషి.. వెరసి -క్రికెట్‌లో స్పిన్ బౌలర్ అవుతుంది. వీధి జట్టునుంచి మొదలైన ప్రయాణం టోర్నమెంట్‌కు, స్టేట్ సెలక్షన్స్ నుంచి మొదలైన జర్నీ మహిళల టి 20 వరల్డ్ కప్‌లో ఆడే నేషనల్ టీం వరకూ సాగుతుంది. అలాంటి ‘కౌసల్య’ క్రెకెట్ ప్రస్థానాన్ని ఆసక్తికరంగా చెప్పే అవకాశముంది. కాకపోతే -కృష్ణమూర్తి కోణంలో రైతు కథను మేళవించటం, తమిళ ‘కణ’ను గుడ్డిగా ఫాలో అయిపోవడం మైనసైంది. రీమేక్ సక్సెస్‌ల హీరోగా దర్శకుడు భీమనేనికి క్రెడిబిలిటీ వున్నా, పరిస్థితుల పరిధి దాటకుండా చేసిన ప్రయత్నం ఫలితమివ్వలేదు. ఇటీవల హిట్టుకొట్టిన రీమేక్‌లన్నీ - మాతృకలోని కంటెంట్‌ను నేటివిటీ ఇంపాక్ట్‌తో చెప్పినవే. దానికి భిన్నంగా సంప్రదాయ రీమేక్ స్టయిల్‌నే భీమనేని అనుసరించటం.. బడ్జెట్ నియంత్రణలో భాగంగా ‘కట్ అండ్ పేస్ట్’ని కంటిన్యూ చెయ్యడం కొంపముంచింది. రీమేక్ ప్రణాళిక కనుక రాజేంద్రప్రసాద్ పార్ట్‌ను షూట్ చేసినా, మాతృక నుంచి తీసుకున్న మెటీరియల్‌కు కనెక్ట్ చేయడంలోనూ వేరియేషన్ కనిపించటం మరో మైనస్. ‘కణ’లో ఆ పాత్రను పోషించిన సత్యరాజ్ తెలుగువాళ్లకూ సుపరిచితం కనుక, చిత్ర అనువాదానికి పరిమితమైనా మూడ్ మరోలా ఉండేది.
సినిమాలో ఏ సన్నివేశం తరువాతా -ఏం జరుగబోతోందన్న ఉత్కంఠ రేకెత్తదు. క్రికెట్ కథ చెప్పడానికి క్రియేటివిటీ అక్కర్లేదన్న ధోరణిలోనే సన్నివేశాలు సాఫీగా వెళ్లిపోతుంటాయి.
కాలం కలిసిరాక మెకానిక్ అయిన ఒకప్పటి గ్రేట్ క్రికెటర్ ఇప్పటి కోచ్ (శివకార్తికేయన్) రంగంలోకి దిగిన దగ్గర్నుంచీ సినిమా స్పీడ్ అయిన భావన కలుగుతుంది. కోచ్‌ని చులకనగా చూసే సీనియర్ ప్లేయర్లు, అతనిపై నమ్మకంతో జట్టుకట్టిన మరో టీం.. వాళ్ల మధ్య సాగే మ్యాచ్.. కోచ్ సూచించిన ప్రాబబుల్స్‌ని సెలెక్టర్లు ఎంపిక చేయకపోవటం.. ఇలా బాగా అలవాటైపోయిన స్క్రీన్‌ప్లేతో సన్నివేశాలు వెళ్లిపోతుంటాయి.
అదేక్రమంలో టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ మొదలవ్వడం.. ఇరగవరం ఊళ్లో సంబరాలు.. కౌసల్య బౌలింగ్ స్పిన్ బౌలింగ్ టెక్నిక్.. భారత్ ఓడిపోతుందేమోన్న టెన్షన్.. ఇవే సన్నివేశాలు నడుస్తుంటాయి. తన టెక్నిక్‌తో కౌసల్య బౌలింగ్ చేసేసి ఇండియాని గెలిపించేస్తే మనం పెవిలియన్‌కు పోవచ్చని ఆడియన్స్ ఎదురు చూపులు మాత్రం -ఎంతకూ ఫినిషింగ్‌కు రావు. సాగదీత క్లైమాక్స్, పాత్రల కళ్లలో గ్లిజరిన్ వాటర్.. ఈ షాట్స్ అన్నీ అయిపోయాక -ఇండియాని గెలిపించిన ప్లేయర్‌గా కౌసల్య స్పీచ్ మాత్రం బలంగా గుండెల్లో దిగిపోతుంది. అదొక్కటే ఆడియన్‌కి పెద్ద రిలాక్స్.
‘కణ’లో క్రికెటర్ ఐశ్వర్య రాజేష్, తెలుగులోనూ ఆ పాత్ర పోషించి మరికొంత ఇంప్రొవైజేషన్ చూపించింది. కొత్తగా బౌలింగ్ చేస్తున్నపుడు, సాధన తరువాత చేసే బౌలింగ్ పెర్ఫార్మెన్స్.. ఈ కంటిన్యుటీ చూపించటం బావుంది. టీంతో ఉన్నపుడు మాత్రం -పక్కనున్న వాళ్లంతా ఒరిజినల్ క్రికెటర్లు కావడంతో కౌసల్య మ్యానేజ్ చేయడం కష్టమైనట్టే అనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్ టైలర్ మేడ్ క్యారెక్టర్ చేసినా, పాత్రని తీర్చిదిద్దిన విధానంలో ఇంటెన్సిటీ కనిపించదు. భారత రైతుల కష్టమంతా ఆయన ముఖంలోనే ఉన్నట్టు మేకోవర్ చేయడం -సహజంగా ఆయన ఇవ్వగలిగే ఎక్స్‌ప్రెషన్స్‌ని మింగేసింది. ఝాన్సీది గుర్తుండిపోయే పాత్ర. భర్తకు తగినట్టు, కూతురిపై కనిపించని మమకారం, ఊరి సూటిపోటి మాటల్ని తట్టుకోలేని తనం.. డిఫరెంట్ వేరియేషన్స్‌ని అద్భుతంగా పండించటంలో ఝాన్సీ అనుభవం కనిపించింది. ఇక శివకార్తికేయన్ సీన్లన్నీ ‘కణ’నుంచి తీసుకున్నవే. సాంకేతికంగా సినిమా బడ్జెట్‌కు తగినట్టే ఉంది. ‘ముద్దబంతి’ పాట -ఆడియన్స్‌ని హాయైన మూడ్‌లోకి తీసుకెళ్లింది. ‘ఆడి గెలవడం కాదు, పోరాడి గెలవాలి’, ‘గెలుస్తానని చెప్పేవాడి మాట ప్రపంచం వినదు. గెలిచి చెప్పినోడి మాటే వింటుంది’లాంటి కొన్ని సంభాషణలు అద్భుతం.
ముక్తాయింపు: ఓవరాల్‌గా -దర్శకుడిచ్చిన సన్నివేశాలను మైండ్‌లోనే ఎడిట్ చేసుకుని ఒక కోణంలో సినిమా చూస్తే అద్భుతం. మొత్తం సినిమాను ఆస్వాదించాలంటే మాత్రం -కొంచెం కష్టమే.

-విజయ్‌ప్రసాద్