రివ్యూ

ఎటో వెళ్లిపోయింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన్మథుడు -2 * బాగోలేదు

తారాగణం: నాగార్జున, రకుల్‌ప్రీత్, వెనె్నల కిషోర్, సీనియర్ లక్ష్మి, ఝాన్సీ, దేవదర్శిని, నికిత, రావు రమేష్ తదితరులు
సంగీతం: చైతన్య భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్, బి నాగేశ్వర రెడ్డి
నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
నిర్మాతలు: నాగార్జున, పి కిరణ్
స్క్రీన్‌ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
========================================================
ఇప్పటికే ఓ ఫ్రెంచ్ కథకు కొత్త‘ఊపిరి’ పోసిన నాగార్జున, పక్కా అనుమతితో అక్కడినుంచే తెచ్చుకున్న మరో కథను ‘హాస్య శృంగారం’లో ముంచి తేల్చేందుకు చేసిన ప్రయత్నమే -మన్మథుడు 2.

ఫ్రెంచ్ మాతృక -ప్రెతే మోయి త మే. ‘ఐ డు’, ‘రెంట్ ఏ వైఫ్’ టైటిల్స్‌తో విడుదలైన సినిమా. కథాసారాన్ని తెలుగులో ఒక్క పంక్తిలో చెప్పుకోవాలంటే -ముదురు మొగుడు అద్దెకు తెచ్చుకున్న కుర్ర పెళ్లాం. తెలుగు ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్వించేందుకు ఇంతకంటే గొప్ప స్పాన్ ఏముంటుంది? వయోభేదం కోణంలో -సున్నిత హాస్య శృంగార భావోద్వేగాలు పండించేందుకు అవకాశమున్న థ్రెడ్. అందుకే -‘ఐ డు’.. నేను చేయగలనన్న నిర్ణయానికి వచ్చాడు నాగార్జున. మొదటి మన్మథుడికి రెండోకోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు.
కష్టాలతో కన్నీళ్లు పెట్టించి.. కథలోంచి పుట్టిన కితకితలతో తుడిచేస్తూ అనిర్వచనీయ అనుభూతి కలిగించిన -చి.ల.సౌని తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఇలాంటి కథకు అతనే సమర్థుడని దర్శకత్వ బాధ్యతలిచ్చారు. కత్తివిడిచి ‘కుర్ర’సాము చేయాల్సిన జోనర్ కనుక -సాగరానికి ఆవల సాగే తెలుగోడి కథగా తెరకెక్కింది మన్మథుడు 2. పక్కా ప్రణాళికాత్మక సినిమాను ప్రేక్షకుడు ఎంత ఆనందించాడో సమీక్షలో చూద్దాం.
**
క్లుప్తంగా కథ:
మూడు తరాల కిందట -కొన్ని తెలుగు కుటుంబాలు పనికోసం వలసపోతూ పొరబాటున పోర్చుగల్‌కు చేరాయి. కాసాండ్ర చేరిన కుటుంబాలు -వృద్ధిచెందిన సంతతితో కసాంధ్రగా మార్చేశాయి. అలా కలిసికట్టు జీవనంలో పోర్చుగల్ గడ్డమీద తెలుగు సంస్కృతి పరిఢవిల్లింది. అలాంటి వాతావరణంలో తాత పోలికలతో.. ముత్తాతల నాసికా నైపుణ్యంతో పుట్టి పెరిగినోడే సాంబశివరావు (అక్కినేని నాగార్జున). షార్ట్‌కట్‌లో సామ్. పనె్నండేళ్ల వయసులోనే తండ్రి దూరమవ్వడంతో -కొడుకు, కూతుళ్ల (ఝాన్సీ, దివ్య, దర్శిని)కు అన్నీ తానై పెంచింది తల్లి (లక్ష్మి). హద్దుల్లేని అమ్మా, చెల్లెళ్ల ప్రేమ కారణంగా సామ్ తను ప్రేమించిన అమ్మాయి (కీర్తిసురేష్)కి దూరమవుతాడు. ఆ బాధను తరిమేసేందుకు ఆనందాన్ని వెతుక్కునే క్రమంలో ప్లేబోయ్‌గా మారతాడు. ఆ రాసలీలలు తెలీని కుటుంబం -సామ్ వర్జినే అనుకుంటుంది.
అనారోగ్యం కారణంగా.. తనువు చాలించే సమయం వచ్చిందని భయపడిన తల్లి -సామ్‌కు పెళ్లి చేయాలనుకుంటుంది. తల్లిప్రేమను అందించగలిగే పిల్లకోసం వెతుకులాట మొదలవుతుంది. ముదురు బెండకాయలా మారిన సామ్ -పిల్లను వెతికే కుటుంబం ప్రయత్నాలను అసిస్టెంట్ కిశోర (వెనె్నల కిషోర్) సాయంతో తిప్పికొడుతుంటాడు. తల్లి, చెల్లెళ్ల నుంచి మరింత వత్తిడి రావడంతో -కొత్త స్కెచ్ వేస్తాడు. ఆ క్రమంలో లవ్వర్‌గా అవంతిక (రకుల్‌ప్రీత్‌సింగ్)ను అద్దెకు తెస్తాడు. తనకున్న సెంటిమెంట్ సమస్య పరిష్కారానికి డబ్బే ప్రధానం కావడంతో -ఆమె కూడా ఓకే అంటుంది. కుటుంబానికి అవంతికను పరిచయం చేసి, రెండు వారాల్లోనే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాడు సామ్. పెళ్లి రోజున అవంతిక చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే, సమస్య నుంచి తప్పించుకోవచ్చన్నది సామ్, కిశోర స్కెచ్. అది ఫలిస్తుంది. అవంతిక వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిమాత్రం సగం కోమాలోకి వెళ్తుంది. అసలు విషయం తెలుసుకున్న చెల్లెళ్లు ఏంచేశారు? పెళ్లి చూడ్డానికి పోర్చుగల్ వచ్చిన మేనమామ (రావు రమేష్) అనుమానాలేంటి? సమస్యల నుంచి బయటపడి సామ్ తన తల్లిని రక్షించుకోడానికి వేసిన కొత్త స్కెచ్ ఏమిటి? ఆ స్కెచ్‌లోకి మళ్లీ వచ్చిన అవంతిక పాత్రేమిటి? ఇవన్నీ అసలు కథను నడిపించే ఆయువుపట్టు సీన్స్.
**
అంతా బాగానే ఉంది. ఆలోచనకే ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది. ఆలస్యం అమృతం విషం -అన్న నానుడి మన్మథుడు 2కి అన్వయించాలేమో. ఎందుకంటే -పదమూడేళ్ల క్రితం వచ్చిన ‘ఐ డు’, తరువాతొచ్చిన ‘ది ప్రపోజల్’ కంటెంట్‌ను ఇప్పటికే చాలా భాషల్లోని చాలా సినిమాలు పూర్తిగా వాడేశాయి. స్వర్ణయుగం కాలంనాటి తెలుగు చిత్రాల్లోనే ‘కాంట్రాక్ట్ కంటిన్యుటీ’ కంటెంట్‌ను మిస్సమ్మలాంటి సినిమాలు చూపించేశాయి. సో, అలాంటి ఫ్లేవర్‌తో తెలుగులో వచ్చిన సినిమాలూ, సన్నివేశాలు తక్కువేం కాదు. ఆధునిక కాలంలో -ముతక ఆలోచన మరీ మాసిపోవడంతో మన్మథుడు 2 చూడ్డం కొంచెం కష్టమైంది. -ఉద్వేగంతో ‘ఊపిరి’ బిగపట్టడం, కిసకిసా కడుపుబ్బ నవ్వుకోవడానికి ఆడియన్స్‌కి చాన్స్‌లేకుండా పోయింది.
మన్మథుడు 2 టైటిల్‌కు -సినిమా జోనర్, ఇండస్ట్రీలో నాగ్ ఇమేజే కారణం కావొచ్చు. కాకపోతే ప్లేబోయ్‌గా నాగ్‌ను ఆడియన్స్‌కి కనెక్ట్ చేయగలిగే సీన్స్ లేకపోవడం -పెద్ద మైనస్. మధ్య వయస్కుడన్న విషయాన్ని సెటారికల్ డైలాగ్స్‌తో తిప్పితిప్పి చెబుతూనే, కుర్రాడిలా చూపించేందుకు తాపత్రయపడటం -క్యారెక్టర్ ఇంపాక్ట్ మిస్సైంది. నాగ్ మేనరిజమ్స్, మన్మథుడి స్టయిల్ డిజైన్ సైతం ఆకట్టుకునేదిగా లేదు. సీక్వెల్ టైటిల్ కారణంగా -పదిహేడేళ్ల క్రితం వచ్చిన మన్మథుడిని మైండ్‌లో మోస్తూ థియేటర్‌కొచ్చిన ఆడియన్స్‌కు అసంతృప్తే మిగిలింది. కాస్ట్యూమ్స్‌పరంగా నాగ్ ఓకే అనిపించినా -కామెడీలో మాత్రం ఆ మోతాదు కనిపించలేదు. అందుక్కారణం -లీడ్‌రోల్‌ని సైడ్ క్యారెక్టర్ (వెనె్నల కిషోర్) పూర్తిగా డామినేట్ చేసేయడమే. హీరోకి కనెక్టయ్యే అవకాశం లేక -స్క్రీన్ మీదకు వెనె్నల కిషోర్ ఎప్పుడొస్తాడా? అని ఆడియన్స్ ఎదురుచూడ్డం మొదలెట్టారు. అవంతికగా రకుల్ క్యారెక్టరైజేషన్‌లోనూ ‘ఆత్మ’ లోపించి హాస్యం వికటించింది. ద్వితీయార్థంలో హీరోని ఆడుకునే సన్నివేశాల్లో ‘చమక్కు’లు లేవు. దీంతో అవంతిక పాత్ర అంతగొప్పగా పరిమళించలేదు. క్లైమాక్స్‌లో తల్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, సందేశ సారాంశం మాత్రం హృదయాలను తాకుతుంది. దర్శకుడిగా రాహుల్ ఎఫిషియన్సీ కనిపించేది ఇక్కడే. లక్ష్మి, రావురమేష్, ఝాన్సీ, దేవదర్శిని.. అలవాటైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి సేదతీర్చారు. అతిథి పాత్రల్లో కీర్తిసురేష్, సమంత మురిపించారు.
సాంకేతికంగా నిర్మాణ విలువలు ఉన్నతం. చైతన్ భరద్వాజ్ తగిన సంగీతం సమకూరిస్తే, సుకుమార్ కెమెరా పనితనం కళ్లకు విందుచేసింది. పోర్చుగల్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతాలే చూపించాడు. కాస్టూమ్స్, ఆర్ట్ వర్క్ విభాగాల నైపుణ్యం క్వాలిటీకి తోడైంది. స్క్రిప్ట్ రాసుకున్నపుడు డబుల్ మీనింగ్స్ ఏమాత్రం నా మైండ్‌లోకి రాలేదని దర్శకుడు పదేపదే చెప్పినా -సంభాషణల్లో శృతిమించి మసాలా ఉందన్నది నిజం. దర్శకత్వపరంగా చి.ల.సౌలోని ఇంటెన్స్ ఇసుమంత కూడా ఇందులో కనిపించదు. పరాయి కథను సొంత కథగా మలుచుకోవడంలో జరిగిన టీమ్ వైఫల్యమే -సినిమా రిజల్ట్‌గా మిగిలింది.
ముక్తాయింపు: మన్మథుడుతో ఒక కోణం చెప్పాం. మన్మథుడు 2తో రెండో కోణాన్నీ చెబితే -సర్కిల్ పూర్తవుతుందని ప్రమోషన్స్ టైంలో నాగార్జున వ్యాఖ్యానించారు. పదిహేడేళ్లుగా ఆయన మోస్తున్న ‘మన్మథుడు’ ఇమేజ్ భారాన్ని ‘మన్మథుడు 2’తో దింపేసి ఫ్రీ అయిపోయానన్న విషయాన్ని సింబాలిక్‌గా చెప్పారా? అనిపిస్తుంది, సినిమా చూస్తే.

-మహాదేవ