రివ్యూ

బలహీన కవచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్ర కవచధర గోవిందా * బాగోలేదు
*
తారాగణం: సప్తగిరి, వైభవి జోషి, అర్చనాశాస్ర్తీ, అవినాష్, అప్పారావు, శ్రీనివాసరెడ్డి, రాకెట్ రాఘవ, గెటప్ శ్రీను, అనంత్ తదితరులు
సంగీతం: బుల్గానిన్
నిర్మాతలు: నరేంద్ర ఎడ్ల, జివిఎన్ రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్ పవార్

*
హాస్యం కవచంగా ధరించిన సప్తగిరి వజ్రపు వేటలో ‘వజ్ర కవచధర గోవిందుడు’గా అవతారం ఎత్తాడు. తన సహజ ధోరణి అయిన కామెడీతోపాటు ఇతర ఎలిమెంట్స్ ‘వజ్రకవచ..’లో దట్టించినా, అవేవీ చిత్రంపై ఆసక్తి రేకెత్తించడానికి పనికిరాకపోగా నింపిన హాస్యమూ ‘జబర్దస్త్’ (అన్నట్టు ఈ సినిమాలో దాదాపు చిన్నతెర ‘జబర్దస్త్’ బృందం, అందులోని బాలనటుడు సహా దర్శనమిచ్చారు)గా ఉండి చాలాచోట్ల చిరాకెత్తించింది.
నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌లా, ఉద్దానంలో కిడ్నీ వ్యాధిలా గోవిందుని (సప్తగిరి) గ్రామంలో క్యాన్సర్ చికిత్సకు ఆసుపత్రి లేకపోవడంతో, దాని నిర్మాణార్థం మొదట చిన్నసైజు దొంగగా, తర్వాత బాబాగా అవతారమెత్తుతాడు. ఈక్రమంలో వజ్రాల అనే్వషణా బృందం తారసపడుతుంది. వారితో చేతులు కలిపిన గోవింద, ఆ వజ్రం ఎలా సాధించాడు? తన లక్ష్యమైన ఆసుపత్రి నిర్మాణం జరిగిందా? అన్నదానికి దొరికే సమాధానాలతో చిత్రానికి శుభంకార్డు పడుతుంది. గుప్తనిధులూ, వజ్రాలవేట నేపథ్యంలో అన్ని భాషల్లోనూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో వజ్ర లభ్యత కోసం వెతుకులాటకంటే, అనాకర్షణీయ కామెడీపైనే అరుణ్ పవార్ (దర్శకుడు) పవర్ చూపించారు. దాంతో సెకెండాఫ్ అంతా దానిపైనే దొర్లింది. అలా అలా వెళ్లి సినిమా మొత్తం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు నడిచింది. అక్షరాలా అది నత్తనడకే. ఎక్కడా వేగం లేదు. దీన్ని పక్కకుపెట్టి చూసినా ఏ సన్నివేశమూ లాజిక్కుకు అందదు సరికదా, చేసిన జిమ్మిక్కూ కన్విన్సింగ్‌గా లేదు. ఉదాహరణకు ఎంఎల్‌ఏ ప్రసన్నలక్ష్మి పాత్ర తీర్చిదిద్దిన వైనం. రాజకీయ నాయకులు -అవినీతి -వెన్నుపోట్లు సంగతిలో ఎవరికీ రెండో అభిప్రాయం లేకపోయినా, ఈ చిత్రంలోలా ఏ శాసనసభ్యురాలూ అంతమంది జనం మధ్య మరో వ్యక్తిని కాల్చేయదు. ఇందులో ఇంకో విరుద్ధ విషయం ఏమిటంటే, అదే ఎంఎల్‌ఏ సమక్షంలో హీరో విలన్ని కాల్చేస్తాడు. ఈ మొత్తం అసంబద్ధ వ్యవహారంలో ఎక్కడా పోలీసు కనబడడు. ఉన్న ఎంఎల్‌ఏ అంగరక్షకులు ఏమీ చేయరు. సినిమా వెయిటేజీ పెంచుకోడానికి ఇలాంటి సీన్లు ఉపకరించినా, ఇవి సమాజంపై ఏ రీతి ప్రభావం చూపుతాయో ఒక్కసారి దర్శకుడు దృష్టిపెడితే బావుండేది. ‘చేసే పని కాదు, దాని వెనుక ఉద్దేశ్యం చూడాలి’ అన్న వాక్యాన్ని ఈ చిత్రంలో కధానాయకునితో అనిపించారు. అంటే ఉద్దేశ్యం (సినిమాలో పేదలకోసం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం) మంచిదైతే దొంగతనాలు లాంటివి చేసి సంపాదించడం సరా? చిత్రాంతంలో ఆ వజ్రం హీరో తీసుకోకపోవడం వంటివి జరిగినా, సినిమా మొత్తం అయాచిత సంపదపై అనుచిత దృష్టి చుట్టూనే నడిచింది కదా? ఈ ధోరణి సరైంది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ బాపతు హాస్యాస్పద సన్నివేశాలు నాన్‌స్టాప్‌గా దొర్లేశాయి. అసలు చిత్ర నిర్మాణ ప్రక్రియ జరుగుతున్నపుడు తీద్దామనుకున్న సన్నివేశాలు, తీసిన సన్నివేశాల్ని ఓ పేపర్‌పై రాసుకుని అరుణ్ పవార్ సమీక్షించుకుంటే సీన్స్ స్థితి ఇంతటి దిగువ శ్రేణిలో ఉండేవి కావు. సినిమా బరువు మొత్తం సప్తగిరే గోవిందుని పాత్ర మోసే రీతిలో వున్నా, ‘జబర్దస్త్’ బ్యాచీ ఆ బాధ్యతను కొంత తీసుకున్నాయి. సప్తగిరి విషయానికొస్తే అతని మునుపటి చిత్రాలకంటే మాడ్యులేషన్‌లో మార్పుతెచ్చారు. హాస్య సన్నివేశాలు ఎలాగూ కొట్టిన పిండే! దాంతోపాటు సెంటిమెంట్ సీన్సూ కొన్నిటిలో కంట్రోల్డ్‌గా నటించిన పద్ధతీ బావుంది. కానీ వీటన్నింటికీ బలాన్నిచ్చే కథావస్తువు పోకడ స్ట్రాంగ్‌గా లేకపోవడంతో సప్తగిరి కృషి అనుకున్న హైట్స్‌కు చేరలేకపోయింది. గోవిందుని ప్రేమించిన త్రిపురసుందరిగా వైభవి జోషి పాత్ర పరిచయ సన్నివేశం వీరలెవల్‌గా చూపినా, అనంతర సన్నివేశాల్లో ఆ పాత్రకంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడంవల్ల ప్రేక్షకుల దృష్టిని ఆమె ఆకర్షించలేకపోయింది. విలన్ బంగారప్ప పర్సనాల్టీ ఆకట్టుకుంది. జబర్దస్త్ బృందంలో అవినాష్, అప్పారావుల పాత్ర పరిధీ ఎక్కువ కనుక ఫర్వాలేదు. కానీ అప్పారావు పాత్ర సైడ్‌లోవుండి, హీరోతో వేయించిన డ్రామా సీన్సూ వగైరా ఓవర్ అనిపించాయి. ఎంఎల్‌ఏ ప్రసన్నలక్ష్మి పాత్రలో అర్చన ఉన్నంతలో ఓకె.. కానీ ఆ పాత్రకు ఇచ్చిన మేకప్ చాలా ‘అతి’గా ఉండి కొన్నిచోట్ల ఆడ్‌గా అనిపించింది. చిత్రంలో చెప్పుకోదగ్గ అంశం సంభాషణలు (నల్గురు రచయితలు రాశారు). చిన్న చిన్న మాటల ద్వారా మంచి హాస్యం చిలికించడానికి ప్రయత్నించారు. ‘మాస్టర్ ప్లాన్’ అన్నమాటకు ఈ ప్లాన్ నీది కాదా? మీ మాస్టర్‌దా? అనడం బాగా పేలింది. అలాగే హీరోకు గతాన్ని గుర్తు చేయడానికి వచ్చిన హిప్నాటిస్టు పాత్రతో ‘ఇంతవరకూ మా ఆయనే నాకాళ్లు ఇన్నిసార్లు పట్టుకోలేదు’ అనిపించడం బాగా పండింది. కానీ ఆయుర్వేద వైద్యం సన్నివేశంలో ‘్ఫను’ నేపథ్యంగా అల్లిన డైలాగ్స్‌ని సెన్సారు ఎలా వదిలేసిందో అర్థంకాదు. ‘సన్నీలియోన్ కోసం వెళితే సందులో సరోజ దొరికింది’ లాంటి సంభాషణలు హద్దుల్లోవుండి అలరించాయి. బుల్గానిన్ స్వరాల్లో గుర్తుండుపోయేది ఏదీ లేదు. ‘కీచురాయి..’ పాటొక్కటే ఓ మాదిరిగా వుంది. అండర్‌వాటర్, గుహ సన్నివేశాల్లో కెమెరా పనితనం బాగుంది. పేరు పెద్దది పెట్టడం ద్వారా వైవిధ్యం వెతికిన చిత్ర యూనిట్, సినిమా సన్నివేశాల కూర్పులో వెరైటీ కనపర్చివుంటే ఆనందంగా వజ్ర...ను ఆస్వాదించే పరిస్థితి కొంతైనా ఉండేది.

-అన్వేషి