రివ్యూ

దారితప్పిన అభినేత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు *అభినేత్రి -2
*
తారాగణం: ప్రభుదేవా, తమన్నా, నందితాశే్వత,
డింపుల్ హయత్, కోవైసరళ, సప్తగిరి,
సోనూసూద్, తదితరులు.
సంగీతం: సామ్ సి.ఎస్.
నిర్మాతలు: అభిషేక్‌నామా, ఆర్.రవీంద్రన్,
రచన, దర్శకత్వం: ఆర్.ఎల్.విజయ్.
*
‘‘లాజిక్ అడగొద్దు- మ్యాజిక్ చూడు’’-ఇది ఈ చిత్రంలో కోవైసరళ పాత్రతో ఓ సందర్భంలో అనిపించిన మాట. ఇదే ఈ చిత్రంపై అభిప్రాయంగా అనుకుందామా అంటే లాజిక్ సంగతి దేవుడెరుగు, కనీసం వాళ్లు చెప్పిన తద్వారా సినిమాలో చేసిన ‘మ్యాజిక్’ ఏవీ కనపడక వీక్షకులంతా రెండు గంటల ఆరు నిమిషాలు (చిత్రం నడిచిన సమయం) సేపు ఏ భావాలూ లేక ‘మ్యూటీ’ అయిపోయారు. అయితే ప్రభుదేవా, తమన్నాల మ్యాజిక్‌పైనే చిత్రం గెలుపుపై భరోసా పెట్టుకుని తీసిన చిత్రంగా దీన్ని చెప్పుకుందామన్నా, ఆ కోణమూ ఫలవంతం కాలేదు. ఇది 2016లో వచ్చిన ‘అభినేత్రి’కి కొనసాగింపు అని పేర్కొన్నారు. అందులో దేవి, రుబీ (తమన్నా ధరించిందా పాత్రల్ని) పరంగా చూపిన ఆత్మల సందడి ఇందులో అలెక్స్- రంగారెడ్డి పాత్రలు కృష్ణ(ప్రభుదేవా)పై ఆవహించడం, వాటిని వదలకొట్టి అతన్ని మామూలు మనిషిగా దేవి (తమన్నా) ఎలా చేసిందన్నది ‘అభినేత్రి-2’ కంటెంట్. సాధారణంగా ఒక ఆత్మ ప్రవేశం- నిష్క్రమణలోనే కావల్సినంత సినీ స్వేచ్ఛ తీసుకుని దర్శకుడు ఎలా రెచ్చిపోతారో అనేకానేక ప్రేతాత్మల, చిత్ర పరంపరలో ఆమూలాగ్రం చూసేశాం. ఇందులో డబుల్ ధమాకాలా రెండు ఆత్మల సందడి ఉండడం, అవి కథానాయకుణ్ణి ఆవహించడం తతంగం ఇంకెంతగా డైరెక్టర్ని విజృంభించేలా చేస్తుందో ఆలోచించచ్చు. కానీ విచిత్రంగా ఆ బాపతు విన్యాసాన్ని, ఇందులో విజయ్ (దర్శకుడు) విజయవంతంగా చేయలేకపోయారు. సారా (నందితాశే్వత) ఈషా (డింపుల్ హయత్)లతో ప్రభుదేవాతో పాటలు పెట్టినా వాటిలో యాంత్రికతే కన్పడింది తప్ప సజీవకత ఏ కోశానా కన్పడలేదు. అలాగే ఆఖర్లో సోనూసూద్ ఇలావచ్చి అలా వెళ్లిన సీన్లో పెట్టిన స్టంట్ సీనూ రాణించలేదు. మధ్యమధ్యలో పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ తదితరుల చిత్రాల తాలూకు స్పూఫ్‌లు పెట్టినా అవేవీ సినిమాకు స్కోరు తెచ్చిపెట్టలేకపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ సీనూ ఒక ఫోర్స్‌డ్ ఫార్సుగా అనిపించింది తప్ప ఎక్కడా ఎవరూ కనెక్ట్‌అవలేదు. సినిమా ఆరంభంలో జ్యోతిష్కుడు చెప్పాడంటూ ప్రభుదేవా, తమన్నా, ఉన్న ఒక్క పాపనీ, అమ్మమ్మ ఇంట్లో వదిలేసి మారిషస్‌కు రావడం ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు. ఇలా ఫస్ట్ బేసిక్ పాయింటే పునాది లేనిదిగా స్పష్టమవడంతో, మిగతా సీన్లకోసం చిత్రబృందం ఎంతగా కసరత్తు చేసినా ఏమాత్రమూ రాణించలేదు. నటీనటుల్లో అగ్ర తాంబూలం, సినిమాకోసం కష్టపడ్డదీ దేవి పాత్రధారిణి తమన్నాయే. ఏమీలేని దాంట్లో ఏదోఉందన్న భావనను తన నటనలో కలగచేయడానికి తమన్నా తన శక్తివంచన లేకుండా కృషిచేసింది. ‘‘ఆత్మలు, దెయ్యాలు నిజమే అయితే వాటినుంచి రక్షణకోసం దేవుణ్ణే నేను నమ్ముకుంటా’’అని ఆవేదనతో అన్న సన్నివేశంలో తమన్నా నటన బాగుంది. ఐదుపదుల వయస్సులోనూ, కాళ్లు, చేతులతో కావల్సిన రీతిలో నృత్యభంగిమలు చేయగల్గినందుకు ప్రభుదేవాను ప్రశంసించాల్సిందే. అంతకు తప్ప ఆయనకు మరే గొప్పదనమూ ఈ చిత్రపరంగా ఆపాదించలేం. ఉన్నంతలో అలెక్స్, రంగారెడ్డి, కృష్ణ పాత్రల షేడ్స్‌ను పండించడానికి ప్రయత్నించారు ప్రభుదేవా. ఎప్పటిలాగా కోవైసరళ లాయరక్క పాత్రలో తనకలవాటైన ఓవర్‌డోస్డ్ నటనని మరోసారి ఇందులో ప్రదర్శించారు. కానీ దెయ్యాలతో కాంట్రాక్ట్, వగైరాలతో వాస్తవ విషయాలను అపహాస్యం చేయడం విచారకరం. బుజ్జిగా సప్తగిరి సినిమాలో కన్పడింది తక్కువసేపే. అయినా తన వరవడి మాడ్యులేషన్‌ను మరోసారి ఇందులో బందించేశారు. నందితాశే్వత, డింపుల్ హయత్ అందంగా కన్పడడం మినహా వారి పాత్రలకు మరే పరిధీలేదు. సోనూసూద్ పతాక సన్నివేశంలోనే ఎంట్రీ ఇచ్చి వెళ్లిపోతాడు. సామ్ స్వరాల్లో ‘రెడీ రెడీ’పాటే ఓ మాదిరిగా ఉంది. ఈ పాటలోనే తమన్నా అందాలు ఆరబోసే ప్రయత్నాలు జరిగాయి. కానీ అదీ ప్రేక్షకుల్ని ఆకర్షించలేక పోయింది. మారిషస్ అందాల్ని విస్తృతంగా చూపడానికి కెమెరామెన్‌కి ఆస్కారం లేకుండా, చిత్రం ఎక్కువ భాగం ఒక ఇంటిలోనే జరిగింది. అయినా బీచ్ తదితరాల్ని బాగా చూపారు. అభినేత్రులకున్న పాప్యులారిటీని సొమ్ముచేసుకుందామని చేసిన ఏ ప్రయత్నమైనా దానికి బలమైన కదాలంబన ఉంటేనే ఫలిస్తుందని గ్రహిస్తేనే ఇలాంటి అభినేత్రి-2లు వీక్షకుల దరికి చేరతాయి. ఏతావాతా భవిష్యత్‌లో అభినేత్రి-3 వంటి ప్రయత్నాలేవైనా ఉంటే అప్పుడైనా పై చెప్పిన ప్రాథమిక విషయాలు పరిశీలిస్తారని కోరుకుందాం.

-అనే్వషి