రివ్యూ

అంటే.. సరిపోదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎవడు తక్కువ కాదు * బాగోలేదు

తారాగణం: విక్రమ్ సహిదేవ్, ప్రియాంకా జైన్, మధుసూదన్‌రావు, అదుర్స్ రఘు, చమ్మక్ చంద్ర, తార తదితరులు
సంగీతం: సాయికార్తీక్, హరి గౌర
నిర్మాత: శ్రీ్ధర్ లగడపాటి
దర్శకత్వం: రఘు జయ
============================================
‘లారీల్లోంచి దిగిన మూటలకైనా నెంబర్లుండి గుర్తింపుంటుందికానీ, మాలాంటివారికి ఆ మాదిరి గుర్తింపూ లేదు’ అంటూ కథానాయకుడు మధు (విక్రమ్ సహిదేవ్) చేత అనిపించిన మాటే -‘ఎవడు తక్కువ కాదు’కు అద్భుతమైన, ప్రపంచవ్యాప్తంగా అనాధలు అనుభవిస్తున్న ఆక్రందనకు అసలుసిసలైన ఆవేదనా రూపం. అయితే దాన్ని తెరకెక్కించే విధానంలో అత్యంత నైపుణ్యలేమి కారణంగా అసలు విషయం ప్రతిఫలించలేదు. దాంతో అనేక సన్నివేశాలు నిస్సారం, నిరుత్సాహంగా సాగి ప్రేక్షకుడిని నిరాశపర్చాయి. ఎంత కాదనుకున్నా -చివరికి అన్నిట్లోనూ సినిమా ‘తక్కువే’ననిపించింది. కథాక్రమంలోకి వెళ్తే.. మార్కెట్లో మూటలు మోసే అనాధ పిల్లలు మధు, రాజా, బండ, చిన్న జీవితాలకు ఆశాజ్యోతిగా కాస్తంత పెద్దతరహాలో వ్యాపారం చేసే పూర్ణక్క ఉంటుంది. ‘అనాధలా పుట్టడం మీతప్పు కాకున్నా, అనాధలా చావడం మాత్రం మీ తప్పే అవుతుంది’ అన్న ఆమె దృక్పథానికి అనుగుణంగా ఆ మార్కెట్‌లో ఏకచ్ఛత్రాధిపత్యం సాగించే రాయుడు (మధుసూదన్‌రావు) సాయంతో ఆ అనాధలతో హోటల్ పెట్టిస్తుంది. ఆ హోటల్ వ్యాపారం జరిగే విధానంలో వారికి రాయుడు బృందం ద్వారా వచ్చిన అవరోధాలూ, వాటిని అధిగమించి అతనిలో పిల్లలు తెచ్చిన మార్పుతో చిత్రం ముగుస్తుంది. ఇది తమిళంలో విజయవంతమైన ‘గోలీసోడా’ చిత్రానికి రీమేక్. అందువల్ల కొన్ని తమిళవాసనలు తప్పనిసరిగా ఇందులో దర్శనమిచ్చాయి. ఉదాహరణకు పరువు పోయిందనడానికి ప్రతిగా వెంట్రుకలు తెగ్గోయడం, కోసుకోవడం వంటి కంటెంట్‌కు అక్కడివారు కనెక్టైనంత తీరులో తెలుగునాట అవుతారని అనుకొనే అంచనా అంతగా సరికాదు. ఇందులో ఇలా కేశాల తొలగింపుతో జోడీ అయిన సన్నివేశాలు రెండు ప్రధానంగా ఉన్నాయి. అవి ఒకటి సోడాబుడ్డి మొహం (ఎస్‌బియం) అన్న అమ్మాయి ద్వారా, రెండోది రాయుడు పాత్ర ద్వారా ఈ తతంగాన్ని చూపారు. అంతకన్నా తెలుగువారికి దగ్గరయ్యేలా మరొకటి ఎంచుకుంటే సరిపోయేది. మరి ఇదే ‘ఏ న్యూ వే ఆఫ్ రివెంజ్’ (సినిమాకిచ్చిన ఉపశీర్షిక) అని చిత్ర బృందం అనుకుందేమో. ఈ సినిమాకొచ్చిన ప్రధాన లోపం మరొకటేమిటంటే, చిత్రంలోని కథానాయక పాత్ర అయిన మధు (విక్రమ్ సహిదేవ్)తో అనిపించిన ‘మేం తిరగబడి కొట్టేంత పెద్దవాళ్లం కాదు. పారిపోయేంత చిన్నపిల్లలం కాదు’ మాదిరి ప్రధాన పాత్రధారుల వయసంతా కౌమారప్రాయంది కావటంతో సన్నివేశాలు పండాల్సిన రీతిలో పండలేదు. పోనీ పండేలా చేయడానికి మోతాదు మించుదామా అంటేవారి వయసు అడ్డొస్తుంది. అందుకే నాయకి పూర్ణక్క కూతురు (ప్రియాంకా జైన్), నాయకుల మధ్య యుగళగీతాలకు (కనీసం కల రూపంలోనైనా) పోకుండా దర్శకుడు రఘు జయ సంయమనం పాటించడం ప్రశంసనీయం. కానీ చిత్రం రెండోసగంలో మార్కెట్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం, మధ్యలో అదుర్స్ రఘు ద్వారా ఓట్ల వేటలో రాజకీయ నాయకుడు అనుసరించే అప్రియకర పద్ధతులు పేరిట చూపిన సన్నివేశలు సినిమా లక్ష్యాన్ని పక్కదారి పట్టించేశాయి. పిల్లలు నలుగురూ కలవడానికి వీల్లేకుండా నాలుగు దిక్కుల్లో వదిలేయడం, తిరిగి వారి ఉనికిని కనిపెట్టే ప్రక్రియలో చూపిన సన్నివేశాలను ఇంకాస్త బలం చేకూర్చేలా చూపితే బావుండేది. తమకు వ్యతిరేకమైన అమ్మాయిల్ని ఛేజ్ చేసే విధానంలో అలా వెంటపడే రౌడీ కూతురు చదివే పాఠశాలకు రావడం, అక్కడ జరిగిన సీనూ బాగా చిత్రీకరించారు. మధుగా విక్రమ్ సహిదేవ్ తన వయసుకు తగ్గట్లు, కొన్నిచోట్ల వయసుకి మించి నటించాడు. చిత్ర ప్రారంభంలో ఓ పెద్ద హీరో పరిచయ గీతంలా పెట్టిన పాటలో వేసిన డాన్సుల్లో అయితేనేమీ, మధ్యలో చేసిన ఫైట్స్ విషయంలో అయితేనేమి, ఈతరం హీరోలకెవరికన్నా ఏమాత్రం తక్కువ కాదన్న రీతిలో నటించాడు. కాకపోతే ఆ వయసులో పలకని కొన్ని భావప్రకటనలవల్ల కలిగిన అపరిపక్వ దశను దాటలేకపోయాడు. ప్రియాంక జైన్ అందంగా కనిపించింది. బండ, సోడాబుడ్డి మొహం అమ్మయిగా పిలిపించుకునే పాత్రధారులు కూడా బాగా నటించారు. ముఖ్యంగా ‘మా తల్లిదండ్రులు వారికున్న కారణాల ద్వారా విడిపోయారు. అది నా తప్పెలా అవుతుంది?’ అని అమాయకంగా అడిగిన సన్నివేశంలో ఆ పాత్రధారిణి నటన బావుంది. విలన్‌గా రాయుడు నటనవరకూ ఓకే అయినా వెనకాల కూర్చిన కొన్ని సన్నివేశాల్లో సరైన బలం చేకూరివుంటే అదింకా రాణించేది. ‘అదుర్స్’ రఘు, చమ్మక్ చంద్ర హాస్యం చూస్తుంటే టీవీల్లో జబర్దస్త్ చూసినట్టు అనిపించింది తప్ప సినిమా బాపతు భావన కలగలేదు. పూర్ణక్క పాత్రధారణి బాగా నటించింది.
సంభాషణల్లో కొన్ని శృతిమించి సాగాయి. ప్రత్యేకించి అదుర్స్ రఘు పాత్ర మందుకొట్టి మాట్లాడిన సందర్భాలలో ఈ ధోరణి మరీ కొట్టొచ్చినట్టు కనిపించింది. ‘రింగులో ఫింగర్, రింగులో ఫిగర్’ ఇందుకు నిదర్శనాలు. అయితే కొన్నిచోట్ల సందర్భోచితంగా సాగి ఆలోచనలు రేకెత్తించాయి. ముఖ్యంగా అనాధ పిల్లల్ని సమాజంలో కొందరు చూసే మొరటు విధానానికి ప్రతిగా ‘వీడు వీళ్ళమ్మా నాన్నలకు పెళ్లికిముందే పుట్టినట్టున్నాడు’ లాంటివి ఇందుకు దృష్టాంతాలు. పాటల్లో ‘నీకు తోడుంటే’ అన్న థీమ్ సాంగ్ బావుంది. అలాగే భగవద్గీత శ్లోకసారంతో చేసిన సాంగ్ చిత్రాంతంలో అందరూ నిష్క్రమించే సమయంలో చూపడంవల్ల అది ప్రభావితం చేయలేకపోయింది. లోకంలో ఎవరూ ఎవరికన్నా తక్కువ కాదు, అందరూ సమానమేనన్న ఆదరణీయ సమ సమాజ ఆకాంక్షాదృక్పథం కథా వస్తువుగా వున్న ఈ చిత్ర ఆవిష్కరణలో రఘు జయ (దర్శకుడు) కాస్తంత ఆమోదనీయ నేర్పు ప్రదర్శించివుంటే సినిమా విజయం అంచులను అందుకునేదేమో!

-అన్వేషి