రివ్యూ

కొత్త ఆత్మ.. పాత కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంచన-3 ** ఫర్వాలేదు
**
తారాగణం: రాఘవ లారెన్స్, వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి, కబీర్ దుహన్ సింగ్, దేవదర్శిని, కోవై సరళ, శ్రీమాన్, సూరి, తరుణ్ అరోరా, ఢిల్లీ గణేశన్, అనుపమ కుమార్ తదితరులు
సంగీతం: రాజ్, కపిల్, జెస్సీ
నేపథ్య సంగీతం: ఎస్‌ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, వెట్రి పళని స్వామి
ఎడిటింగ్: రూబెన్
నిర్మాణ సంస్థ: సన్ పిక్సర్చ్, రాఘవేంద్ర ప్రొడక్షన్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్
**
హారర్‌ను చూపెట్టి ఆడియన్స్‌తో ఆడుకోవడం రాఘవ లారెన్స్‌కు కొత్త కాదు. భయపెట్టడాన్ని బాగా అలవాటు చేసుకున్న కొరియోగ్రాఫర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ లారెన్స్ -రెండు మూడక్షరాల వెరైటీ టైటిల్స్‌తో ఒకే కథను తిప్పితిప్పి చూపిస్తూ -ఇప్పటి వరకూ ఆడియన్స్‌ని బాగానే ఎంటర్‌టైన్ చేశాడు. హారర్ కామెడీగా మొదట చూపించిన ‘ముని’ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయటంతో -హాలీవుడ్ స్టయిల్లో సిరీస్‌పై దృష్టిపెట్టాడు. ఆ పరంపరంలో వచ్చిన చిత్రాలే కాంచన (ముని-2), గంగ (ముని-3). రాఘవ హారర్ ప్రయోగాలను ఆడియన్స్ సైతం ఓపిగ్గా ఎంజాయ్ చేస్తుండటంతో -ఆ ఉత్సాసంతో ముని-4ని కాంచన-3గా స్క్రీన్స్‌కు తీసుకొచ్చాడు. ఒకే థ్రెడ్ స్టోరీకి మాసీ కమర్షియల్ ఫ్లేవర్‌ను అద్దుతూ మునిని ఇప్పటి వరకూ లాక్కొచ్చిన లారెన్స్ -ఈసారి ఆడియన్స్‌ని మెప్పిచేందుకు కాస్త డోస్ పెంచాడు. హంగు ఆర్భాటం.. గ్లామర్ యాక్షన్ మోతాదు పెంచి తెచ్చిన చిత్రమే కాంచన-3. తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేసిన ఈ సినిమా -ఆడియన్స్‌ని మెప్పిస్తుందో లేదో చూద్దాం.
కథ:
రౌడీ భవానీ (కబీర్ దుహన్ సింగ్) గ్యాంగ్ కొంతమంది పోలీసుల్ని చంపేస్తుంది. మరుసటి రోజే భవాని, గ్యాంగ్‌ని కాళి (రాఘవ లారెన్స్) లేపేస్తాడు. అదే టైంలో తన కూతురికి పట్టిన దెయ్యాన్ని బంధించి చెట్టుకు మేకులు కొట్టేస్తాడు ఒకడు. ఈ రెండు ఎపిసోడ్స్ బేస్‌తో కొత్త కథ మొదలవుతుంది. దెయ్యాలంటే అమితంగా భయపడుతుంటాడు రాఘవ. నిద్దట్లోనూ అవి దరిచేరకుండా చెప్పులు, నిమ్మకాయల్ని నమ్ముకునే పరమ పిరికోడు. అలాంటి రాఘవ, తన తల్లి (కోవై సరళ), వదిన (దేవదర్శిని), అన్న కూతురిని తీసుకుని తాతయ్య షష్టిపూర్తి కోసం ఆ వూరు బయల్దేరతాడు. మార్గమధ్యంలో ఓ చెట్టుదగ్గర విశ్రాంతి తీసుకుంటూ -అనుకోకుండా చెట్టుకున్న మేకులు పీకేస్తుంది ఆ కుటుంబం. అక్కడ్నుంచి తాతయ్య ఇంటికి చేరేసరికి సీన్ మారిపోతుంది. చిత్ర విచిత్రాలు అనుభవంలోకి వచ్చి దెయ్యం గోల మొదలవుతుంది. నిజంగానే ఇంట్లో ఆత్మలు సంచరిస్తున్నట్టు అఘోరాలు నిర్థారిస్తారు. అలా చేరిన ఆత్మ రాఘవని ఆవహిస్తుంది. అదే కాళి. రౌడీ భవానీని చంపేసిన కాళి -ఆత్మగా ఎప్పుడు ఎందుకు మారాడు. రాఘవనే ఎందుకు ఆవహించాడు? కాళి ఆత్మ లక్ష్యమేంటి? అది నెరవేరిందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలే కాంచన-3.
ఎలా ఉందంటే..?
లారెన్స్ ‘ఆత్మ’ కథలన్నీ సేమ్ ఫార్ములా. అతి భయస్తుడైన హీరోని ఆత్మ ఆవహించటం.. అందులోంచి పుట్టే కామెడీ.. తరువాత ‘ఆత్మ’ ఫ్లాష్‌బ్యాక్ తెలియటం.. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే ఆత్మకు హీరో శరీరం ఆయుధమవ్వడం.. ఊహించేవిధంగా ఓ ముగింపు. ఇప్పటి వరకూ వచ్చిన ముని సిరీస్ ఫార్మాట్టే కాంచన-3లోనూ కంటిన్యూ అయ్యింది. కథాగమనం, నేపథ్య సంగీతంలోనూ పాత చింతకాయ పచ్చడి రుచే కనిపించింది. కాకపోతే.. రెండు ఆత్మలున్న శరీరం ప్రవర్తనను చూపించడానికి రాఘవ డిజైన్ చేసిన కొరియోగ్రఫీని ఎంజాయ్ చేయొచ్చు.
బంగ్లాలో దెయ్యం.. దాన్ని చూసినప్పుడు కలిగే భయం.. అది కుటుంబంతో ఓ ఆటాడుకోవడం.. -లాంటి రొటీన్ కామెడీ ట్రాక్‌లో పసలేదు. కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కనుక -మూమెంట్స్ మీద మమకారాన్ని చూపించినా పాటలేమీ ఆకట్టుకోలేదు. మాస్ ఆడియన్స్‌ను మెప్పించేందుకు రాసుకున్న ఎక్కువ సన్నివేశాలు -కథా గమనంలోని నిదానాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ద్వితీయార్థంలో కాళి ఎపిసోడ్‌ను ఎమోషనల్‌గా డిజైన్ చేశాడు. ఆ పాత్రకు ఆడియన్స్ నుంచి సింపతీ తెచ్చేందుకు చేసిన మంచి పనుల ఫ్లాష్‌బ్యాక్ కాస్త కుదురుగా సాగింది. అయితే లోపించిన కొత్తదనం, శ్రుతిమించిన కామెడీ -పాజిటివ్ ఫలితాన్ని బ్యాలెన్స్ చేసేసింది.
రాఘవ, కాళి, కాళి ఆవహించిన రాఘవగా లారెన్స్ మూడు షేడ్స్‌ని ప్రజెంట్ చేశాడు. కాళి పాత్రను హైలెట్ చేయడం కొసం మిగిలిన రెండు షేడ్స్‌ని డల్ చేయకతప్పలేదు. ఆర్టిస్టు, కొరియోగ్రాఫర్‌గా లారెన్స్ ఓకే. డైరెక్టర్‌గా మాత్రం కాంచన-3ని బ్యాలెన్స్ తప్పించేశాడు. లారెన్స్ మరదళ్ల పాత్రలు పోషించిన ముగ్గురు కథానాయికల ఓవరాక్షన్, ఓవర్ మేకప్ భరించలేం. ‘అవకాశం దొరికినప్పుడల్లా చంక ఎక్కేయడం, ముద్దు ముచ్చట్లు’ అతి విసుగు పుట్టించింది. గ్లామర్ టచ్ కోసం, పాట కోసం తప్ప -ఏ పాత్రకీ ప్రాధాన్యం లేదు. ఎప్పటిలానే కోవై సరళ అరిచి గోలపెట్టింది. ఎప్పట్లానే రివేంజ్ ఫార్ములా కథతోనే వచ్చిన లారెన్స్ -ఈసారి మెప్పించడంలో మాత్రం విఫలమయ్యాడు. దేవుడి ఆశీర్వాదం, మానవ శరీరం సాయంతో ప్రతీకారేచ్ఛను తీర్చుకున్న ఓ ‘ఆత్మ’కథ ఇది. వినడానికి పాయింట్ బావున్నా -చూపించడంలో ఎక్కువైన కమర్షియల్ టచ్ కొంపముంచింది.
హెచ్చరిక: లీడ్ వేశాడు. ముని-5కి ఆడియన్స్ రెడీ అవ్వడం మంచిది.

-ప్రవవి