రివ్యూ

భావోద్వేగ మజిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**మజిలీ
**
తారాగణం: అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశకౌశిక్, సుబ్బరాజు, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అతుల్ కులకర్ణి, సుహాస్, మహేష్ సంగీతం: గోపీసుందర్
నేపథ్యసంగీతం: తమన్ ఎస్.ఎస్.
నిర్మాతలు: సాహుగారపాటి, హరీష్ పెద్ది
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు,
దర్శకత్వం: శివ నిర్వాణ
**
ప్రేమ విఫలమవడం, విరామం అనంతరం మరొకర్ని పెళ్లిచేసుకున్నా ముందు అమ్మాయిని మర్చిపోలేకపోవడం వంటి సంఘర్షణ తరువాత ఏమవుతుందీ అన్న కథావస్తువుతో తెలుగులో అనేక చిత్రాలొచ్చాయి. ఆ బాటనే అనుసరించిన ‘మజిలీ’ చిత్రీకరణపరంగా కొంత, నటీనటుల ప్రాణ సమాన నటననావిష్కరణతో ఇంకొంత ఓకేనన్న ప్రయాణానికి చేరింది.
మంచి క్రికెటర్ కావాలనుకున్న మధ్య తరగతి రైల్వే ఉద్యోగి (రావు రమేష్) కుమారుడు పూర్ణ (అక్కినేని నాగచైతన్య)కు తారసపడిన అన్షు (దివ్యాంశ కౌశిక)తో ప్రేమ చిగురిస్తుంది. కానీ వారి ప్రేమకు అనేక ప్రతిబంధకాలు వస్తాయి. తర్వాత అన్షు కుటుంబం వూరు వదిలేసి వెళ్లిపోతుంది. ఆమెను మర్చిపోలేక, క్రికెట్‌పై ఏకాగ్రత కనపర్చలేక దురలవాట్లకు బానిసవుతాడు పూర్ణ. కానీ ఇతనే్న వివాహం చేసుకుంటానని ఎదురింటి శ్రావణి (సమంత) పంతం పట్టి పెళ్లిచేసుకుంటుంది. ‘నువ్వు నా గదిలోకి వచ్చినా నా మనసులోకి రాలేవు’ అని ఖరాఖండిగా చెప్పిన పూర్ణ, శ్రావణిని మనస్ఫూర్తిగా మనసులోకి ఎలా ఆహ్వానించాడన్నది మిగతా కథ. మజిలీ సినిమా ప్రచార సమయంలో దర్శకుడు శివ నిర్వాణ ఎక్కడా బోరు కొట్టదన్నాడు. అది అతిశయోక్తే! ఎందుకంటే చెప్పదల్చుకున్న విషయాలు ఎస్టాబ్లిష్ అయినా అనవసరపు సీన్లతో ఎక్స్‌టెండ్ చేశారు. దానివల్ల బోరు కొట్టింది. చిత్రం నిడివీ (రెండున్నర గంటలు) పెరిగి ఆసక్తి సన్నగిల్లింది. ‘ప్రేమ’ అంశం ఎంత పాతదైనా, సరికొత్తగా అందరి జీవితాల్లో వున్నా, దాన్ని ఆధునిక కాలానికి అన్వయింపచేసుకుంటే బావుంటుంది. ఈ సినిమాలో ఆ పని చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు తను ప్రాణంకన్నా మిన్నగా ఇంకా చెప్పాలంటే ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ప్రేమించిన అమ్మాయి అలా సడెన్‌గా ఊరు విడిచి వెళ్లిపోతే కలవటానికి చేసిన ప్రయత్నాల తీవ్రత సినిమాలో ప్రస్తావించలేదు. ఏదో ఒక మామూలు మనిషి అన్నట్లు ఫోన్ నెంబరూ లేదు.. అంటూ కథానాయకుడి స్నేహితుడితో చెప్పించడం చాలా సిల్లీగా ఉంది అనుకుంటే, అందులోనూ తనక్కావాలసిన వ్యక్తి ఆనుపానులు ఆధునిక వ్యవస్థ అందించే సహాయంతో కనుగొనడం కష్టమా? అన్నది ఎవరికైనా స్ఫురించే సంగతి. దురదృష్టవశాత్తూ ఆ విషయంపై శివ నేత్రం సారలేదు. సినిమాలో అన్షు పదమూడేళ్ల కూతురు మీరాను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా రూపుదిద్దుతా వంటి సన్నివేశాలూ వగైరా ఇటీవల అజిత్ నాయకుడిగా వచ్చిన అనువాద చిత్రం ‘విశ్వాసం’ సన్నివేశాలు గుర్తుకుతెచ్చాయి. రెండింటి నేపథ్యం వేరైనా సెంట్రల్ ఇష్యూ ఒక్కటే. సినిమా సెకెండాఫ్‌కు ఓ క్షణం ముందొచ్చిన శ్రావణి (సమంత) పాత్రే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ. ఈ పాత్రను సమంత చాలా అవలీలగా పోషించింది. పూర్ణ పరాన్నభుక్కు తత్వాన్ని నిరసిస్తూ అతని తండ్రి ఫోనులో చేసిన సంభాషణకు కౌంటర్‌గా మరో ఫోనులోంచి జవాబు చెప్పిన చమత్కార సన్నివేశంలో ఎంత బాగా నటించిందో, భర్త తనపై ఆధారపడుతున్నట్లుకాక, అతని డబ్బే ఇది అంటూ, ‘మీరు ఉతకడానికి పెట్టిన పేంటులో వెయ్యి రూపాయలు దొరికాయి’ అని ఇచ్చిన భావోద్వేగ సన్నివేశంలోనూ అంత బాగా నటించింది. అలాగే పతాక సన్నివేశంలోనూ. సమంతకు చిన్మయి గాత్రదానమూ మంచి వరమైంది. పూర్ణగా నాగచైతన్యకు వాస్తవానికి ఇది అతని వయసుకి మించిన పాత్ర. అయినా కష్టపడి నటించాడు. అయితే పదమూడేళ్ళ గర్ల్‌కి ఫాదర్‌గా చైతూననుకోవడం కష్టమనిపించింది ప్రేక్షకులకు. క్లైమాక్స్‌లో నాగచైతన్య చాలావరకూ భావప్రకటన చేయడంలో సఫలీకృతుడయ్యాడు. కానీ పెళ్లి పదాన్ని పెల్లిగా పలకడం మానేస్తే మరీ బాగుండేది. అన్షుగా దివ్యాంశ కౌశిక్, పాత్రకు తగ్గ రీతిలో నటించింది. ముఖ్యంగా ‘ఉత్తరాది అమ్మాయిలు పెళ్లికిముందు కాబోయేవాణ్ణి చెక్ చేసుకుంటారు అన్న విషయం తప్పు అని చెప్పిన సన్నివేశంలో చక్కటి నటనను ప్రదర్శించింది. చాలాకాలానికి పోసానికి మంచి పాత్ర ఇందులో సమంత తండ్రిగా వచ్చింది. దాన్ని సద్వినియోగపరచుకున్నారాయన. అలాగే కధానాయకుడి తండ్రిగా రావు రమేషూ తన మార్కు నటనను మరోసారి బాగా ప్రదర్శించారు. పూర్ణ స్నేహితుడు చాందీ పాత్రదారి ఆకట్టుకునే నటనను ప్రదర్శించాడు. దర్శకుడు రచయిత కూడా కావడంతో సంభాషణల్ని మంచి ఫోకస్ పెట్టి వదిలారు. ‘పెళ్లికి ముందు కన్పడినట్లు ప్రేమ పెళ్లయిన తర్వాత కంటికి కన్పడదు’, ‘చిన్నపుడు నడక రాక పడిపోతావని పట్టుకున్నాను. ఇపుడు తాగినది ఎక్కువై తూలుతూ ఎక్కడ పడిపోతావో అని పట్టుకుంటున్నాను’, ‘లవ్‌లెటర్ మీద రాసిన అమ్మాయిపేరు వెడ్డింగ్ కార్డుమీద ఉండదు’, ‘ఆడి పెళ్లికి ఆడే వస్తాడనుకోలేదు’ అన్న డైలాగుకు ఆడిటోరియంలో బాగా స్పందనొచ్చింది. డైలాగ్స్ విషయంలో ఇంకో ప్రత్యేకతేమిటంటే, ఫిల్మ్స్‌లో మామూలుగా ప్రధాన పాత్రధారులు పలికే సంభాషణల సంగతుల్లోనే మంచి పట్టు చూపుతారు. కానీ ఇందులో సహాయ పాత్రలకూ క్లాప్స్ కొట్టించే సంభాషణలందించారు. ‘నిన్ను మేం దత్తత తీసుకుంటాం’ అని సమంత, నాగచైతన్య పాత్రలంటే, అందుకు మీరా పాత్రధారిణి ‘ముందు మీరు వైఫ్ అండ్ హజ్బెండ్‌గా ఉండండి’ అనడం థియేటర్లో టెరిఫిక్‌గా రిసీవ్ అయ్యింది. అలాగే ఇంకోచోట ‘నేను స్ట్రేంజర్‌తో రూమ్ షేర్ చేసుకోను’ అంటే కౌంటర్‌గా ‘నేను చేసుకుంటాను’ అనిపించడమూ బావుంది. గోపీసుందర్ రాగాల్లో కాలభైరవ, నిఖిత బృందం గానంచేసిన ‘ఏడెత్తు మల్లెలే...’ పాట ఆకట్టుకుంటుంది. తమన్ అందించిన నేపథ్య సంగీతంలో కొన్ని చోట్ల ‘వౌనరాగం’ ఛాయలు దోబూచులాడాతాయి. డెహ్రాడూన్, వైజాగ్ అందాలు కెమెరా బాగా పట్టింది. తెరకందించే ప్రాజెక్టుపై కావాల్సిన కసరత్తు చేసే తత్వంగల శివ నిర్వాణ ఇంకాస్తగా వాస్తవ పరిస్థితుల్ని కలుపుకుని ఉంటే మజిలీకి మరిన్ని మార్కులు పడేవి.

-అనే్వషి