రివ్యూ

అజితోత్సాహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వాసం ** ఫర్వాలేదు

తారాగణం: అజిత్‌కుమార్, నయనతార, జగపతిబాబు, తుంబి రామయ్య, రోబో శంకర్, వివేక్, కోవైసరళ, యోగిబాబా, రవిప్రకాష్ తదితరులు
సంగీతం: డి.ఇమాన్
నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ
===============================================
కథపై, కథాక్రమంపై ఉంచాల్సిన ‘విశ్వాసం’ చిత్రంలోని తారాగణంపై అతిగా ఉంచడంవల్ల ప్రేక్షకుల అభిమాన విశ్వాసాన్ని అంతగా చూరగొనలేకపోయింది. వివరాల్లోకి వెళితే...
ఆ ఊరిలోని పంచాయితీలన్నీ పరిష్కరించి ఊరి పెద్దగా పేరు తెచ్చుకున్న వీర్రాజు (అజిత్‌కుమార్)ని ఆ గ్రామానికి వైద్య శిబిరం నిర్వహణకొచ్చిన డాక్టర్ నిరంజన (నయనతార) మనసుపడి మనువాడుతుంది. కానీ అతను తరుచు చేసే గొడవల పరిష్కారంవల్ల ఒకసారి ఎదురైన సంఘటన ద్వారా వారి కుమార్తె ప్రాణాపాయంలో పడుతుంది. దానివల్ల భర్తతో విడిపోయి కూతురుతో బొంబాయిలో ఉంటుంది. ‘నీకెందుకిలా ఒంటరి బ్రతుకు? వెళ్లి భార్యా బిడ్డను తీసుకురా’ అన్న ఊరి వారి కోరికతో ముంబై వెళ్లిన వీర్రాజు అక్కడ తన కూతురికి ఉన్న ప్రాణభయ కారణాలు తెలుసుకొని, వాటిని అధిగమించి, తిరిగి అందరి ‘విశ్వాసం’ చూరగొనడంతో సినిమా ముగుస్తుంది. ముందే ఊహించతగ్గ అనేక సన్నివేశాల కథాబలంలో తర్కానికి అందని తంతులు అనేకం. అయితే ‘ఎడారిలో నీళ్లు, కమర్షియల్ చిత్రంలో లాజిక్‌లు’ అనే్వషించడం అవివేకం కనుక ఆ పక్కకు పోవడం లేదు. అయినా హద్దుమించిన ఈ బాపతువాటినోసారి స్పృశించక తప్పదు. ఎవరైనా ఆరోగ్య శిబిరాలు పరిశుభ్రమైన ప్రదేశాల్లో నిర్వహిస్తారు కానీ ఇందులో రైసుమిల్లు వంటి అనువుకాని ప్రాంగణంలో నిర్వహిస్తారు. అది హీరోకు చెందినదైనా ఎంతవరకూ సమంజసం? అలాగే తన ఊళ్ళో ఎలాగైతే మందీ, మార్బలంతో హల్‌చల్ చేస్తాడో, అదే రీతి హంగామా ప్రదేశం కాని ప్రదేశమైన ముంబైలోనూ చేసేస్తాడు. ఇదెలా సాధ్యమో అన్న దానిపై శివ (దర్శకుడు) వివరించలేదు. అదే రీతిలో ముందు వైద్యురాలిగా ఉండి అనంతరం పెద్ద పారిశ్రామికవేత్తగా మారిన హీరోయిన్ వైనాన్ని డైరెక్టర్ కొద్దిగానైనా సినిమాలో చర్చిస్తే బాగుండేది. వీటన్నిటినీమించి, అది గ్రామీణ నేపథ్య చిత్రమైనా, మరోరకంగా బ్యాక్‌డ్రాపున్నా అందుబాటులో వుండే ఆధునిక సాంకేతిక సమాచార మాధ్యమాల్ని నేర్పుగా ఉపయోగించుకునే తీరుని, ఈ చిత్రమూ ఉపయోగించుకున్నా చట్టం, న్యాయం సంగతుల్ని అన్ని చిత్రాల్లాగే ఇదీ తుంగలో తొక్కేసింది. ఉదాహరణకు కథానాయకుడు తన ప్రాంతమైన రావులపాలెంలోనూ, అన్యప్రాంతమైన ముంబాయిలోనూ యధేచ్చగా వీరవిహారం చేసినా, ఎక్కడా పోలీసు ప్రస్తావన ఉండదు. మరి ఈ తరహా సన్నివేశాల కల్పన, సామాన్య జనాలకి ఇందాక మనం ప్రస్తావించుకున్న చట్టం తదితరాలపై ఎలాంటి విశ్వాసాన్ని పాదుకొల్పుతాయో దర్శకుడు ఆలోచిస్తే బావుండేది. ఇక చిత్ర బృందం నటీనటుల నటనపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ముచేయకుండా (అతి విశ్వాసాన్ని పరిహరించాలి) అజిత్, నయనతార, వారి కుమార్తె పాత్రధారిణి నటించారు. ఫైట్స్, సాంగ్స్‌లో ఎలాగూ అజిత్ ఫస్టే. దాంతో పాటు ఇందులో ఉద్వేగభరిత సన్నివేశాల్లో ఆయన ఆర్ద్రపూరిత నటన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. పతాక సన్నివేశంలో తల్లిదండ్రుల లక్ష్యాలను పిల్లలపై బలవంతంగా రుద్దకూడదు. ఆ ఒత్తిడితో పద్ధెనిమిదేళ్ల పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఆత్మహత్యగా కాకుండా హత్యగా చూడాలి అన్నపుడు అజిత్‌నటన ఎన్నదగినదిగా ఉంది. దాంతో పాటు ‘మా ఇద్దరి అభిప్రాయాలూ ఒకటే’ అన్నదానికి సంకేతంగా అజిత్, వారి కుమార్తె పాత్రధారణి ‘హా..’ అంటూ చేతిని విచిత్రంగా తిప్పిన సీన్స్ బాగా పండాయి. జగపతిబాబు పాత్ర పరిధి తక్కువైనా ఉన్నంతలో తన మార్కు విలనిజం బాగా చూపారు. వారి భార్య పాత్రధారిణి సురేఖావాణికైతే ఒక్క డైలాకునీ కల్పించలేదు. సినిమాలో వివేక్, కోవైసరళ, హీరో పక్క పాత్రలద్వారా కన్పించిన కామెడీ చిత్ర నిడివిని పెంచింది తప్ప ఏవిధంగానూ అలరించలేదు. సినిమా మొత్తానికి బాగా శ్రద్ధ తీసుకున్న విభాగాలు నృత్యం, పోరాటాలు. బర్త్‌డే సీన్‌లో ఫైటింగ్, ‘డింగా డింగా’ పాట కొరియోగ్రఫీ ఇందుకు ఉదాహరణలు. ఇమాన్ స్వరాల్లో ‘చిన్నారి తల్లీ.. నా నింగి జాబిలీ’ పాట మంచి మెలోడీతో సాగింది. ఈ పాటలో ‘జాబిలి, లోగిలి, కావిలి’ అంటూ చక్కటి అంత్యప్రాసల్ని సమకూర్చారు పాట రచయిత. అలాగే ఒక పాటలో ‘వీర్రాజు’ అన్న పదాన్ని గమ్మతె్తైన విరుపు గాయకుడు పాడిన విధానం బాగుంది. ‘నవ్వు’కీ ‘సంతోషానికీ’ వున్న భేదాన్ని సంభాషణాకర్త ఇంకా బాగా వివరిస్తే పరిపూర్ణంగా ఉండేది. ఇంకో సందర్భంలో కథానాయకుని గురించి చెపుతూ ‘చెడ్డకు మాత్రమే చెడ్డవాడు’ అన్నది ఆడియెన్స్‌కు బాగా చేరింది. ఎంత ఇది తమిళ (ఈ చిత్రం ఇదే పేరుతో తమిళంలో గత జనవరి 10న విడుదలైంది) తర్జుమా చిత్రమైనా తెలుగుకొచ్చేసరికి ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా మార్చడమో, విషయాన్ని కుదించడమో చేసుంటే ‘విశ్వాస’ పరిధి ఫర్వాలేదు స్థాయినుంచి పైకి వెళ్లేది.

-అన్వేషి