రివ్యూ

మెచ్చదగని ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యన్‌టిఆర్- మహానాయకుడు ** ఫర్వాలేదు

తారాగణం: బాలకృష్ణ, విద్యాబాలన్, మంజిమామోహన్, సచిన్ ఖేద్కర్, కల్యాణ్‌రామ్, దగ్గుబాటి రానా, సుమంత్, వెనె్నలకిశోర్, భరత్‌రెడ్డి, పృథ్వీ, సమీర్ తదితరులు.
సంగీతం: ఎంఎం కీరవాణి.
నిర్మాతలు: నందమూరి వసుంధరాదేవి, నందమూరి బాలకృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.
=================================================================
మనుషుల్లో మహామహులు కొందరే ఉంటారు. అలాటి మహామహుల మార్గదర్శకత్వ వైభవాన్ని ముందుతరాలకు తెలియజెప్పడం కోసమే వారి జీవిత చరిత్రల్ని సినిమాలుగా, గ్రంథాలుగా చేయడం పరిపాటి. ఆ ఒరవడిలో వచ్చిందే యన్‌టిఆర్ ‘మహానాయకుడు’. అయితే, అనేకానేక అంశాల సమ్మిళితం ఎన్టీఆర్ జీవితం కనుక, దీన్ని రెండు భాగాలు చేయాల్సి వచ్చింది. మొదటి భాగం కథానాయకుడు జనవరి 9న విడుదలైంది. ద్వితీయ భాగం యన్‌టిఆర్ మహానాయకుడు తాజాగా థియేటర్లకు వచ్చింది. వసూళ్ల మాటెలావున్నా -కథానాయకుడులో బాలయ్య అభినయ కౌశలం వరకూ విమర్శకుల నుంచి ఓకే వచ్చింది. కానీ ‘మహానాయకుడు’ పరిస్థితి మరింత భిన్నం. ఓ మాదిరి లక్షణాలు లేకపోగా, కొన్నిచోట్ల గందరగోళం, ఇంకొన్నిచోట్ల ప్రాధాన్యతలేని అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినట్టుగా తోచింది. సో కొంతవరకే అనుకున్న అంచనాలకు న్యాయంచేసిన ‘మహానాయకుడు’ వైనాన్ని ఇక్కడ చూద్దాం.
మొదటి భాగం (కథానాయకుడు) రామారావు రాజకీయ ప్రవేశంతో అంతమైతే, అక్కడినుంచి ‘మహానాయకుడు’ ప్రయాణం ఆరంభమైంది. ముఖ్యమంత్రి కావడం, అనంతరం 1984 ఆగస్టు సంక్షోభంలో పడటం, ఆ తదుపరి జాతియావత్తూ ఒక్కటై ఆ సంక్షోభం సమసిపోవడానికి సహకరించడంతో పూర్తవుతుంది. సమాంతరంగా ఎన్టీఆర్ సతీమణి బసవరామతారకంతో ఎన్టీఆర్‌కున్న సాన్నిహిత్యం, ఆమె అనారోగ్యంతో మరణించడం కూడా చూపారు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన విప్లవాత్మక సంస్కరణలూ తదితరాలకు సమయం తక్కువనిచ్చి, వారు ఎదుర్కొన్న రాజకీయ సమస్యల నుంచి ఎలా బయటికి వచ్చారన్న అంశాలకే ద్వితీయార్థం ఎక్కువ అంకితమైంది. దీంతో సినిమా ఫోకస్ దేనిపై ఉందన్నది గందరగోళంలో పడింది. అన్యాయంగా అన్నగారిని పదవీచ్యుతుణ్ణి చేయడం అందర్నీ క్షోభింపచేసినా, తిరిగి గద్దెనెక్కడానికి అవలంభించిన శాసనసభ్యుల రహస్య విడిదిలులాంటివి అనివార్యమైనా అవెప్పటికీ వాంఛనీయం కాదన్న సంగతి అందరూ అంగీకరిస్తారు. వాటిని హైలైట్ చేయడం, అవి చేయించిన వారిని ‘బాబు మామూలోడుకాడు...’ లాంటి డైలాగులతో పదే పదే చెప్పడం సినిమా వౌలిక లక్ష్యానికి వనె్న తగ్గించింది. అయితే తొలిభాగం బసవరామ తారకం పరంగా చూపించారు. కనుక ఆ ఫీల్‌ని కొనసాగిస్తూ ఇందులోనూ చూపడం, భార్యాభర్తల అనురాగానికి, వారి అంతరంగ విశే్లషణకు బాగా పనికొచ్చింది. అలాగే రామారావు అప్పట్లో ఎన్నికలకు క్యాండిడేట్లను ఎంపిక చేసుకున్న విధానాలూ వగైరా తప్పనిసరిగా అందరూ అనుసరించాల్సిందే. అదే సందర్భంలో నాదెండ్ల భాస్కరరావు, కొందరి పేర్ల జాబితాను ఎన్నికల కోసం తీస్తే పక్కనే ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు వారంతా యోగ్యులుకారు- అంటారు. దానికి నాదెండ్ల, వాళ్లంతా గెలిచి తీరతారు అంటాడు. అదే నా భయం కూడా అని ఎన్టీఆర్ అంటారు. అంటే యోగ్యుల ఎంపికే ముఖ్యమన్న వారి భావానికి ఈ సన్నివేశం అద్దంపట్టింది. మద్దతు తెలిపిన వారి సంతకాలూ, ఫోర్జరీ అన్ని అభియోగాలపై అసందిగ్ధత ఉన్నా, జరిగినది ప్రజాస్వామ్య పతనమన్నది తెలుస్తూనే ఉంది. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఉమ్మడి రాష్ట్రం మొత్తం కదంతొక్కింది. ఎంఎల్‌ఏల కేంపింగ్ సన్నివేశాల కొనసాగింపులో వారంతా బీర్లు కోరుతున్నారు లాంటి వివరణల పర్వం పరిహరించతగ్గవి. వాటినుంచి ఎవరూ స్ఫూర్తిపొందరు. అసలలాంటి అప్రస్తుత అంశాలను తొలగిస్తే, మరికొన్ని ప్రయోజన సన్నివేశాలకు చిత్రంలో చోటు దొరికేది. ఈ విషయాన్ని కాస్తంతసేపు పక్కకు పెట్టి పాత్రధారులు పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే నిశ్చయంగా ఎన్టీఆర్ పాత్రను ఆవహింప చేసుకున్న బాలకృష్ణను ముందు చెప్పుకోవాలి. కంప్యూటర్ భాషలో బైడిఫాల్టులుగా బాలకృష్ణకు తండ్రితత్వం అప్రయత్నంగా వచ్చేసిందని కూడా చెప్పవచ్చు. దాన్ని ఆయన ఎక్కడా అతి చేయకుండా స్వయం నియంత్రత విధానంలో చేశారు. ముఖ్యంగా తనకీ, భార్య బసవరామ తారకానికీ ఉన్న అనుబంధాన్ని, ఆమె అనారోగ్యం తీవ్రమైందనే సంగతిని ఆసుపత్రిలో తెలుసుకున్నప్పుడు గద్గద స్వరంతో అభినయించిన తీరు శిఖరాయమానమై నిలిచింది. ప్రత్యేకించి ‘ఆమె నాకు పదహారవ సంవత్సరం పెళ్లినాడు ఎలా అమాయకంగా కనపడిందో అదే అమాయకత్వాన్ని ఇప్పటికీ నేను చూస్తున్నాను’ అని చెప్పినపుడు చూపిన ముఖ కవళికలు హృద్యంగా ఉన్నాయి. తొలిభాగంలో విద్యాబాలన్ (యన్టీఆర్ భార్య పాత్రలో) చూపిన శ్రద్ధ, ఎన్నతగిన అభినయ కౌశలానే్న ద్వితీయ భాగంలోనూ చూపారు. తనకు మృత్యువు సమీపంలో ఉందని తెలిసినా కుటుంబ బాధ్యతలూ, భర్త ఆశయ సాధనపైనే దృష్టి పెట్టడం లాంటి సన్నివేశాల్లో విద్యాబాలన్ విశిష్ట నటనని ప్రదర్శించారు. ఈ భాగంలో వీరిద్దరితోపాటు నారా చంద్రబాబునాయుడి పాత్రలో రానా ప్రేక్షకుల నుంచి ఎక్కువ మార్కులు పొందారు. చంద్రబాబునాయుడి ప్రత్యేకమైన మాటల విరుపు, చూపు, చేతి సంజ్ఞలూ అన్నిటినీ నూటికి నూరుపాళ్లూ తనలో కనిపింపచేశారు రానా. నాదెండ్ల పాత్రలో సచిన్‌ఖేద్కర్ ఒదిగిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర పరిధి తక్కువైనా, దాన్ని పోషించిన నటుడూ మూలపాత్రకు భంగం లేకుండా నటించారు. నారా భువనేశ్వరిగా మంజిమామోహన్ కనిపించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రధారీ, ఆయన (దగ్గుబాటి) ఎలా అయితే ముక్కుపుటాలు పైకీ క్రిందకూ ఎగరవేస్తారో, అలాగే నటించి ఆకట్టుకున్నారు. సాయిమాధవ్ బుర్రా భారమైన మాటల్ని ఎంతో భావగర్భితంగా చిన్న చిన్న మాటలతో రాయడం బాగుంది. ‘నువ్వుంటే, నేను లేకపోయినా ఉన్నట్లే’ ‘అంతవరకూ యముడొచ్చినా గడప దగ్గరే నిలబెట్టేస్తా!’ ‘కొన్ని సందర్భాలలో వౌనం మారణాయుధంతో సమానం’ లాంటివి సూటిగా తగిలాయి. పాటల పరంగా కీరవాణి పనితనం పెద్దగా కనపడకపోయినా, నేపథ్య సంగీతం, సన్నివేశ సందర్భం ఉన్నతికి ఉపకరించింది. చిత్రంలో పెద్దలోపం కొన్ని సన్నివేశాల్లో రికార్డింగ్ సరిగా లేకపోవడం. ఎక్కువభాగం సినిమా జనంమధ్యలో నడిచినా, దాన్ని కొంత నియంత్రిస్తూ ధ్వని సరిగ్గా ప్రేక్షకుణ్ణి చేరేటట్లు చేస్తే చక్కగా ఉండేది. ప్రతి చిన్న విషయ ఆవిష్కరణలోనూ ప్రశంసనీయ కృషిచేసే క్రిష్ (దర్శకుడు) సినిమా అంశాల ప్రాముఖ్యతాపరంగా ‘మహానాయకుడు’లో ప్రవేశం కల్పించి ఉంటే చిత్రం ‘్ఫర్వాలేదు’ స్థాయినుంచి ఇంకా పైకెళ్లి ఉండేది. అయితే జీవిత చరిత్ర అంటే మొదటినుంచి తుదివరకూ అన్న సామాన్య అర్థాన్ని తీసుకునేవారికి మాత్రం మహానాయకుడు తీవ్ర నిరాశే కలిగిస్తుంది.

-అన్వేషి