రివ్యూ

ఎన్నదగిన కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యన్‌టిఆర్- కథానాయకుడు *** బాగుంది
***
తారాగణం: నందమూరి బాలకృష్ణ, విబ్యాబాలన్, ప్రకాష్‌రాజ్, రాణా, మురళీశర్మ, నరేష్, నిత్యామీనన్, ప్రణీత, శ్రీయ, సుమంత్, రకుల్‌ప్రీత్‌సింగ్, సత్యనారాయణ, శుభలేఖ సుధాకర్, భానుచందర్, జీవా, క్రిష్, దగ్గుబాటి రాజా, ఎన్ శంకర్, చింత, సిద్ధార్థ్, కాశీవిశ్వనాధ్, బ్రహ్మానందం, కళ్యాణ్
సంగీతం: ఎమ్‌ఎమ్ కీరవాణి
నిర్మాతలు: నందమూరి వసుంధరాదేవి, నందమూరి బాలకృష్ణ
కథ, కథనం, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
***
ప్రస్తుతం నలభైఅయిదో పడిలో పడినవారు -యన్‌టిఆర్ చిత్రాలు విడుదలైనపుడు చూసిన ప్రత్యక్షానుభవం... అరవైపైనున్నవారు చిత్రాలతో పాటు అప్పటివారి విషయాలు మరింతగా విన్న, చూసిన అనుభూతి కలిగినవారు... ఇలా ఇంచుమించు ఆ తరం, తర్వాతి తరాలకు తెలిసిన మహానటునిలోని స్ఫూర్తిదాయక అంశాలను తరతరాలకీ తరగని రీతిలో తెలియజేయడానికి చేసిన ‘యన్‌టిఆర్ -కథానాయకుడు’ ప్రయత్నం ఏవిధంగా చూసినా క్లిష్టమైనదే. కానీ దాన్నో బృహత్తర యజ్ఞంగా భావించి తీర్చిదిద్దిన బాలకృష్ణ, క్రిష్‌ల కృషి చాలావరకు నెరవేరిందనే చెప్పాలి.
ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నందమూరి తారక రామారావు మొట్టమొదట్లో మంగళగిరిలో చేసిన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంలో నెలకొనివున్న అవినీతి తదితరాలకు తలొగ్గక రాజీనామా చేస్తాడు. తర్వాత తనకున్న నాటకానుభవంతో, అంతకుముందే ఎల్‌వి ప్రసాద్ (సుప్రిసిద్ధ నిర్మాత, దర్శకుడు) నుంచి వచ్చిన ఉత్తరంతో మద్రాసులో సినీ ప్రయత్నలు చేస్తాడు. తర్వాత యన్‌టిఆర్ అక్కడ ఎదుర్కొన్న సమస్యలు, అధిగమించిన తీరు, ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ తదితరాల అఖండ విజయంతో అనంతర సినీ ప్రయాణంతో తొట్ట తొలి దక్షిణాది సూపర్‌స్టార్ స్థానం పొందటం, 1980 దశకాల్లో రాజకీయ రంగ ప్రవేశం ఆలోచన రావడం, దరిమిలా 1982లో ‘తెలుగుదేశం’ పార్టీ పెట్టడంతో కథ ముగుస్తుంది. ఈమధ్యలో ‘ఇన్నాళ్లూ నాకోసం బ్రతికాను. అరవయ్యో ఏట అనంతరం నన్నింతవాణ్ణి చేసిన జనం కోసం బతుకుతాను’ అనడం యన్‌టిఆర్ జీవితంలో మేలిమలుపు. అసలు జనం కోసం తపించే తహతహ రామారావు అంతరాంతరాల్లో ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే తన వద్దకొచ్చిన వారందరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం, వారు కొండంత కష్టాల్లోవుంటే నిధి సేకరించి ఇవ్వడం (రాయలసీమ క్షామనిధి, 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన బాధితుల నిధి వగైరా) వంటివి రాజకీయాల్లో రాకమునుపు చేసినవే. వాటిని కథానాయకుడులో చక్కగా చూపారు. అలాగే నటన కేవలం నటనే కాదు, తాదాత్మ్యం చెందాలన్న వారి ఊహకు ప్రతిగా తొలినాళ్లలో పల్లెటూరిపిల్లలో నిజమైన ఎద్దు పోరాటం, ‘మనదేశం’లో చేసిన లాఠీఛార్జి వగైరాలనూ చూపారు. అన్నిటికన్నా మించి సన్నివేశం పరిపుష్టత కోసం ‘సీతారామ కళ్యాణం’లో రావణ పాత్రలో దశకంఠ ప్రదర్శన కోసం దాదాపు ఇరవై గంటలపాటు కదలకుండా ఉండటం తదితరాలు చూపి ప్రేక్షకుల్ని అప్రయత్నంగా కరతాళధ్వనులు చేసేలా చేశారు. ఇలా యన్‌టిఆర్‌లోని మానవీయ కోణాన్ని, నటవైవిధ్యతను, స్నేహితుల కోసం ఆయన చేసిన సాయం వగైరాల్ని మనసుకి పట్టేలాచూపారు. ‘సినిమాను మించిన స్నేహితుడు లేడు’ అని త్రికరణశుద్ధిగా నమ్మిన యన్‌టిఆర్ తత్త్వాన్ని ముమ్మూర్తులా ఆవిష్కరించిన విధంబాగుంది. అయితే సినిమా నిడివి విషయంలో (2.52 గంటలు) ఎడిటర్ ఎర్రం రామకృష్ణ చొరవ తీసుకొని తగ్గించివుంటే కథనం మరింత వేగంగా వెళ్లివుండేదే.
నటీనటుల ప్రజ్ఞాపాటవాలు విషయానికి వస్తే.. -బాలకృష్ణే ఓ సందర్భంలో యన్‌టిఆర్ పాత్ర పోషించడం సులభమనిపించింది అన్నారు. అది ఏ ఉద్దేశంతో అన్నా, సదుద్దేశంలో మాత్రం పడిన కష్టం, కసితో చేసిన కృషి ప్రతి సన్నివేశంలో కనిపించింది. ప్రత్యేకించి అరవై పైబడిన యన్‌టిఆర్ పాత్రలో -ఆయనే దిగివచ్చాడా? అన్న భావం ప్రేక్షకులకు కలిగించటంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యాడు. వివిధ గెటప్పుల్లో ఎన్టీఆర్ రూపం అచ్చుగుద్దినట్టు బాలకృష్ణకు కుదిరింది. అయితే దాన వీర శూర కర్ణ చిత్రంలో దుర్యోధన పాత్రకు ఎన్టీఆర్ గొంతునే వాడి బాలకృష్ణతో లిప్ సింక్ చేయించడం చేదు గుళికలాంటిదే. సుదీర్ఘ సమాసభూయిష్ట సంభాషణలు పలకగలిగే ప్రయత్నం చేయగల బాలకృష్ణ -ఎందుకనో చేయలేకపోయాడు. బహుశ -‘బొబ్బిలిపులి’ చిత్రంలోని కోర్టు సన్నివేశంలో యన్‌టిఆర్ చెప్పిన సంభాషణలు చెప్పడంలో బాలకృష్ణ శ్రద్ధపెట్టలేకపోయినట్టు కనిపించింది. బహుశ అందుకే -దావీశూ కర్ణ డైలాగులూ సొంతగొంతులో పెట్టి ఉండకపోవచ్చు. యన్‌టిఆర్ అర్థాంగి బసవ రామ తారకం పాత్రలో విద్యాబాలన్ నటించింది అనడంకంటే జీవించిందనడం సముచితం. కొన్ని సందర్భాల్లో తన అభిప్రాయాన్ని కేవలం ముఖ కవళికల ద్వారా పలికించిన విధానం ఉత్తమోత్తమం. ‘యమగోల’ చిత్రంలోని ‘చిలకొట్టుడు కొడితే’ పాటను రామారావు కుటుంబసభ్యులతో చూస్తారు. పాటపై తమతమ నిష్కర్ష అభిప్రాయాలను కుమార్తెలు చెప్తారు. మరి నీ మాటేమిటి తారకం అని యన్‌టిఆర్ అడిగితే సమాధానంగా ఓ చూపుచూసి వౌనంగా వెళ్లిపోతుంది. ఆ వౌనపు చూపులోనే అనంతార్థాలు ఆమె పలికించగలిగింది. రామారావు చరిత్ర చెప్పేటప్పుడు అప్పటి సమవుజ్జీ ఏఎన్నార్ పాత్రనీ చెప్పుకోకతప్పదు. అలా ఏఎన్నాఆర్ పాత్రలో అక్కినేని మనుమడు సుమంత్ జీవం పోశాడు. హెయిర్ స్టైల్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బావుండేది. వెండితెరపై యన్‌టిఆర్ హయాంలోని మహామహుల పాత్రల్లో నటులంతా ఈజ్‌తో నటించగలిగారు. చాలా తక్కువ సమయమే కనిపించినా దగ్గుబాటి రానా (చంద్రబాబునాయుడి) బలమైన ముద్రవేశాడు. అలాగే హరికృష్ణగా కళ్యాణ్‌రామ్ ప్రశంసనీయ నటన కనబర్చాడు. సాయిమాధవ్ సంభాషణల్లో ద్యోతకమయ్యే అంతర్నిహిత అర్థాలు ఇందూలోనూ వింటాం. ‘నీకూ నాకూ రెండిస్టాలుంటాయా బావా?’, ‘మనగుండెలు ఆడడం మానేసినా, సినిమాలు ఆడతాయి’, ‘జనం కోసమే సినిమా అనుకున్నా’ ‘ఆ జనాల కోసం సినిమా అడ్డంకైతే, సినిమాల్నే వదులుకుంటా’, ‘నన్ను దేవుణ్ణి చేసిన మనుషుల కోసం మళ్లీ మనిషిగా మారతాను’లాంటివి మచ్చుకు మాత్రమే. పాటలపరంగా రామారావు గత చిత్రాల్లోని పాటలే ఇందులో ఉంటాయి కనుక చెప్పేదేం లేదు. కీరవాణి నేపథ్య సంగీతంపరంగా చక్కటి ప్రతిభ కనపర్చారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ -బసవతారకం పాత్రల చిత్రీకరణలో ఆత్మీయ అనుభూతులు పరంపర చిత్రీకరణ సమయంలో పలికించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హృద్యంగా ఉంది. ‘బంటు రీతి కొలువు’ పాటలో ‘కంటపడని నీడై, వెంట నడిచే తోడై’ అని సిరివెనె్నల అందించిన సాహిత్యం ఎన్నదగినది. అలాగే ‘కథానాయకా’ పాటలో ‘సాక్ష్యాసాక్షాత్కారికా’ అని కె శివసాయిదత్త కూర్చిన పదమూబాగుంది. ఇలాంటి పీరియాడిక్ చిత్రాల్లో కెమెరాకు పని ఎక్కువ. ఆ విధిని జ్ఞానశేఖర్ (డీవోపీ) లోపరహితంగా చేశారు. అలాగే అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించటంలో కళా దర్శకుడి కృషిని విస్మరించలేం. ఈ చిత్ర ప్రస్తావన సందర్భంలో ఇటీవలే వచ్చిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’ పోలికా అనివార్యంగా వస్తుంది. ఈ రెంటికీ ఏవిధమైన సౌమ్యం లేకపోయినా రెండూ హాస్పిటల్ నేపథ్యంలో రావడం కేవలం కాకతాళీయం కావచ్చు. స్ఫూర్తిదాయక అంశాల చిత్రీకరణకే ఇది పరిమితమైంది కనుక ఆవిధంగా చూస్తే చాలావరకు వీరి కృషి సఫలమైనట్టే. అయితే ఇందులో దొర్లిన చిన్న చిన్న తప్పుల్ని- ప్రధానంగా నిడివి విషయంలో తీసుకుని ఫిబ్రవరి 7న విడుదల కాబోయే ఎన్టీఆర్ -మహానాయకుడు విషయంలో తగిన జాగ్రత్తలు దర్శకుడు క్రిష్ తీసుకుంటాడని ఆశిద్దాం. అప్పుడిది ఇపుడున్న ‘బాగుంది’ స్థాయి నుంచి ‘చాలా బాగుంది’ స్థాయికి చేరొచ్చు.

- అన్వేషి