రివ్యూ

ఊపిరి -వేసవిలో చల్లని దొరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది ఊపిరి

తారాగణం:
నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్‌రాజ్, జయసుధ, తనికెళ్ల భరణి, అలీ, గాబ్రియాలా, అనుష్క, శ్రీయ తదితరులు
నిర్మాతలు:
ప్రసాద్ వి.పొట్లూరి, కవిన్ అనే్న
సంగీతం:
గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ:
పిఎస్ వినోద్
దర్శకత్వం:
వంశీ పైడిపల్లి
--
వీల్‌ఛెయిర్‌లో నాగార్జున. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ తర్వాత.. ఎవరైనా ‘మన్మథుడి’ రొమాన్స్ తాలూకు అనుభూతిని పొందాలనుకుంటారు తప్ప -వీల్‌ఛెయిర్‌కే పరిమితమైతే ప్రేక్షకుడి ‘ఊపిరి’ ఒక్కసారిగా ఆగిపోతుంది. అందులోనూ ‘ది ఇన్‌టచబుల్స్’ ఫ్రెంచి మూవీకి రీమేక్ ఇది. మనోళ్లు స్ట్రెయిట్ పిక్చర్స్‌తోనే తర్జనభర్జనలుపడి తల్లకిందులవుతూంటే.. ‘హార్ట్ టచ్‌బుల్స్’కి ఏమేరకు న్యాయం చేకూర్చగలరు? అన్న మీమాంస వేధిస్తుంది. మరోవైపు ‘బృందావనం’ ‘ఎవడు’ కమర్షియల్ చిత్రాల ధోరణి ఇంకా వీడక ముందే.. క్లాసిక్‌ని ‘టచ్’ చేయటంలో వంశీ ‘వశీకరణ’ మంత్రం ఏదైనా వేయగలడా? బోలెడన్ని సందేహాలు. ‘వంశీ’ ఇన్‌టచబుల్స్ కథకి రీమేక్ అన్నప్పుడు.. ఎవరికైనా కలిగిన మొదటి సందేహం ఇదే. ఆ ‘్ఫల్’ని చెడగొట్టడానికి కాకపోతే ఏంటి? అని. రీమేక్ అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. ఏమాత్రం అటు ఇటు అయినా.. కథ అడ్డం తిరుగుతుంది. అసలు తెలుగులో ‘హీరో-వీల్‌ఛెయిర్’ అంటే బుద్ధి ఉన్న ప్రేక్షకుడు ససేమిరా అంటాడు. కమర్షియల్ ‘వీల్’కీ, ఇమేజ్ చట్రాలకూ అలవాటు పడింత్తర్వాత -కొత్తదనం కోసం చేసే ఏ ప్రయోగమైనా.. ఇండస్ట్రీలో దెబ్బ కొట్టేస్తుంది. మరి వంశీ ఏంచేస్తాడా? అని ‘ఊపిరి’ బిగపట్టుక్కూర్చున్న ప్రేక్షకుల మదిలో ‘ఊపిరు’ లూదాడా? లేదా? అన్నది చూద్దాం.
-విక్రమాదిత్య (నాగార్జున) వేల కోట్లకు అధిపతి. ఒకానొక పరిస్థితిలో రెండు కాళ్లూ చచ్చుబడి ‘వీల్ ఛెయిర్’కి అతుక్కుపోతాడు. అతడి విశాల ప్రపంచం ఒక్కసారిగా కుంచించుకు పోతుంది. అడుగుతీసి అడుగు వేయలేని స్థితి. విక్రమాదిత్యకి అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి ప్రసాద్ (ప్రకాష్‌రాజ్). అసిస్టెంట్ కీర్తి తనని అనుక్షణం కనిపెట్టుకొని ఉన్నప్పటికీ ఏదో కోల్పోయానన్న బాధ విక్రమ్‌ని వేధిస్తూంటుంది.
శీను (కార్తీ)కి డబ్బుంటే చాలు. అదే జీవితం. చిన్నచిన్న దొంగతనాలు చేయటం జైల్లో కూర్చోవటం అతని వృత్తి. ఒక దొంగతనం కేసులో జైలుకెళ్లిన శీను పెరోల్‌పై ఇంటికొస్తే... అతని తల్లి (జయసుధ) అసహ్యించుకొంటుంది. ఇంట్లోంచి వెళ్లగొడుతుంది. తాను మారానని పోలీసులను నమ్మిస్తే తప్ప.. కేసుల్లోంచి బయటపడే ఛాన్స్ లేదు కార్తీకి. దొంగ అని తెలిసింత్తర్వాత ఉద్యోగం ఎవరిస్తారు? ఆ పరిస్థితుల్లో మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తాడు. అదీగాక ‘కీర్తి’ అంటే మనసు పారేసుకోవటంవల్ల ఆ ఉద్యోగానికి ఫిక్స్ అయిపోతాడు.
కీర్తిపై ఇష్టంతోనూ.. ఉద్యోగంపట్ల అయిష్టతతోనూ విక్రమ్ ఇంట్లో చేరిన కార్తీ.. రాన్రాను అతడికి దగ్గరవుతాడు. వారిద్దరి ‘జర్నీ’ వీల్‌ఛెయిర్‌తో మొదలై... దేశ దేశాల్నీ.. ప్రేక్షకుల మనసుల్ని చుట్టి వస్తుంది. క్లైమాక్స్‌లో ఏం జరిగిందన్నది చూడాల్సిందే.
ఏ కథలోనైనా.. రచయిత ఉద్దేశం నెరవేరిందా? లేదా? అన్నది తెలియాలంటే.. ప్రేక్షకుల్ని కూడా ఆయా పాత్రలు ‘టచ్’ చేయాలి. థియేటర్‌లోంచో.. పేజీల్లోంచో బయటికి వచ్చినప్పుడు వెంటాడాలి. వారితో చేసిన ‘ప్రయాణం’ మరికాసేపు ఉంటే బావుణ్ణు అనిపించాలి. ఎమోషన్‌కి మించిన ‘వశీకరణ మంత్రం’ మరొకటి లేదు. మానవుడు ఎంతగా ఆధునికత వైపు పయనించినప్పటికీ.. హార్ట్ టచ్ తాలూకు అనుభూతులు ఇంకా మనసు పొరల్లో ఉన్నాయి. కానీ- వాటిని వెలికితీసే ప్రయత్నమే ఎవరూ చేయటంలేదు. అలాంటి యాంత్రికతలోంచి సగటు ప్రేక్షకుణ్ణి ‘ఊపిరి’ పీల్చుకొనేట్టు చేసిందీ కథ.
ఓ పదిమంది అమ్మాయిల్తో సయ్యాట లాడుతూ.. రొమాంటిక్ చూపుల్తో.. రొమాంటిక్ మాటల్తో.. స్టెప్పులేసే నాగార్జునని ‘వీల్‌ఛెయిర్’కి పరిమితం చేస్తే... పరిస్థితి ఏమిటన్నది ఈ సినిమాలో విభిన్నంగా కనిపిస్తుంది. స్టెప్పులేసేవాడే హీరో కాదు. వీల్‌ఛెయిర్‌లో ఉన్నప్పుడూ హీరోనే. ఇక్కడ కొద్దిగా మనసు గురించి మాట్లాడుకోవాలి. ‘వీల్‌ఛెయిర్’ని పక్కనపెట్టి.. నాగార్జున పలికించిన హావభావాలు కానీ.. కంట తడి పెట్టించే సన్నివేశాలు కానీ.. ‘ఊపిరి’ ఆడటంలేదు.. నన్ను కాస్త బయటికి తీసుకెళ్తావా?’ అంటూ అడిగిన తీరుగానీ.. చూస్తే- ప్రేక్షకుడు కూడా తలాడిస్తాడు. ఆ వీల్‌ఛెయిర్‌ని తోసుకుంటూ ప్రేక్షకుడూ వెళ్లిపోతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే- ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ మల్టీ మిలియనీర్‌కీ.. డబ్బుకోసం ఏదైనా చేసే చిల్లరిగాడికీ.. పొంతన కుదురుతుందా? అనిపిస్తుంది. ఈ రెండు పాత్రలూ థియేటర్‌లోంచి.. స్క్రీన్ పైకి తీసుకెళ్లిపోతాయి. ఆ సీన్‌లో అటో ఇటో మనమూ ఉండాలనిపిస్తుంది. ఉంటాం కూడా. అంతగా ప్రభావితం చేస్తాయి. మనసు పొరల్లోని ఆత్మీయతనీ అనుబంధాల్నీ తీయటి అనుభూతుల డోలికల్లో ఊగిసలాడేట్టు చేస్తాయి. మనం మర్చిపోయిన బంధాల్నీ తట్టి లేపుతాయి. జీవితంలో ఇలాంటి వ్యక్తులు తారసపడితే బావుణ్ణనిపిస్తుంది. ఇలా ఒక్కటికాదు.. ఎనె్నన్నో అనుభూతుల మాలికల్తో మనల్ని ముంచెత్తి గాఢంగా ‘ఊపిరి’ పీల్చుకొని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ‘ది ఇన్‌టచబుల్స్’ ఫీల్‌ని -కాళిదాసు కవిత్వం కొంత... నా పైత్యం కొంత అన్నట్టుకాకండా.. ఎలాగూ ‘రీమేక్’ అని జబర్దస్త్‌గా చెప్పేశాం కాబట్టి.. ఉన్నది ఉన్నట్టుగా తీయటంలో తప్పేం లేదని ఫిక్స్ అయిపోయిన వంశీ.. తెలుగు నేటివిటీ కోసం ఏమాత్రం తాపత్రయ పడలేదు. రీళ్లు పెంచాలన్న ఉద్దేశంతో స్క్రీన్‌ప్లే రాసుకోలేదు. అనవసర సన్నివేశాల్ని జొప్పించలేదు.
ఇక నటనాపరంగా -పోటీ పడి జీవించారిద్దరూ. కార్తీకి ఇది తెలుగు స్ట్రెయిట్ పిక్చర్. కానీ ఏమాత్రం భేషజాల్లేకుండా శీను పాత్రలో వొదిగిపోయాడు. నాగార్జున చేసింది కూడా ఓవిధంగా ఛాలెంజింగ్ పాత్ర. ‘సోగ్గాడి’కి అస్సలు నప్పని కేరెక్టర్. కానీ.. ఏదో మత్తు జల్లాడు. ఒక్కో సందర్భంలో ‘నాగ్’కి సహాయకుడిగా మనం ఉంటే బావుణ్ణననిపిస్తుంది -అతడి మాటల తీరు చూస్తే. ఒంటరితనంతో.. అవిటితనంతో.. చాతకాని పరిస్థితిని బయటికి చెప్పుకోలేక.. జీవితాంతం ఒక్కరిపై ఆధారపడటం చూస్తే ఆ కేరెక్టర్ పట్ల జాలి కలుగుతుంది. అదే స్థాయిలో ‘్ఛలెంజింగ్’గానూ అనిపిస్తుంది. ఇలా విశే్లషించుకొంటూ పోతే ‘్ఫల్’ చెడుతుంది. కనుక -‘్ఫల్ గుడ్’ అనేద్దాం. ఏ శాఖ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వారివారి పరిధిలో ఆయా పాత్రలు తమకు నచ్చినట్టు, మనల్ని మెప్పించేట్టు ‘వీల్‌ఛైర్’ని తోసుకుంటూ వెళ్లిపోయాయి.

-ప్రనీల్