రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం -75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరే డిటెక్టివ్:
మీకో ప్రశ్న: తిక్కన సోమయాజి రాముడి మీద
రాసిన పుస్తకం పేరేమిటి?

ధర్మాత్ముడు, ఆనందం కలిగించే వారిలో గొప్పవాడైన రాముడు అడవికి వెళ్ళాక కౌసల్య చాలా దుఃఖంతో ఏడుస్తూ భర్తతో చెప్పింది.
‘‘దశరధుడు జాలి కలవాడు, ఇష్టంగా మాట్లాడేవాడు అనే మంచి పేరు నీకు మూడులోకాల్లో ఉండచ్చు. కాని చిన్నప్పట్నించీ సుఖంగా పెరిగిన సీతతో సహా నీ ఇద్దరు కొడుకులూ దుఃఖిస్తూ అడవిలోని కష్టాలని ఎలా సహించగలరు? సుకుమారి, సుఖాలకి అలవాటు పడినది, యవ్వనంలో ఉన్న సీత వేడిని, చలిని ఎలా సహించగలదు? ఇంతదాకా మంచి భోజనం తిన్న సీత అడవిలో లభించే నెనరు ధాన్యంతో చేసిన ఆహారాన్ని ఎలా తినగలదు? మంగళకరమైన పాటలని, వాద్య సంగీతాన్ని వినడానికి అలవాటు పడ్డ సీత అడవిలో సింహాల్లాంటి క్రూరమృగాల భయంకరమైన అరుపులని ఎలా వినగలదు? ఇంద్రు డి జెండాలా ఎతె్తైనవాడు, మహా బలవంతుడైన రాముడు పరిఘ వంటి చేతిని దిండుగా పెట్టుకుని ఎక్కడ పడుకుంటున్నాడో కదా? పద్మంలాంటి రంగు, అందమైన వెంట్రుకలు, పద్మాల సువాసనలాంటి శ్వాస, పద్మాల్లాంటి కళ్ళుగల ఉత్తముడైన రాముడి ముఖాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తానో? రాముడ్ని చూడకపోయినా నా మనసు వెయ్యి ముక్కలుగా బద్దలవడం లేదు. కచ్చితంగా ఇది వజ్రాలసారంతో చేయబడింది. సుఖాలని అనుభవించడానికి తగిన నా కొడుకు రాముడు మొదలైన వాళ్ళని నువ్వు దయ లేకుండా దూరంగా పంపేసావు. వాళ్ళు అడవుల్లో దీనంగా తిరుగుతున్నా నా మనసు బద్దలు కావడం లేదు.
‘‘రాముడు వనవాసం ముగించుకుని పదిహేనో సంవత్సరంలో తిరిగి వచ్చినా భరతుడు రాజ్యాన్ని, ధనాగారాన్ని విడిచి రాముడికి అప్పచెప్తాడని అనుకోను. కొందరు శ్రాద్ధంలో తమ బంధువులకి ముందుగా భోజనం పెట్టి ఆ తర్వాత బ్రాహ్మణోత్తములని భోజనానికి ఆహ్వానిస్తారట. అలా ఆహ్వానించబడ్డ వారిలో గుణవంతులు, విద్వాంసులు, దేవతలతో సమానులైన బ్రాహ్మణులు ఇతరులు భోజనం చేసాక తమకి అమృతం పెట్టినా స్వీకరించరు. తమ కంటే ముందు తిన్నవాళ్ళు బ్రాహ్మణులే ఐనా ఎద్దులు తమ కొమ్ములని విరిచేయడానికి ఎలా అంగీకరించవో అలా బుద్ధిమంతులైన బ్రాహ్మణులు ఇతరులు తిన్నాక తినడానికి అంగీకరించరు. పెద్దవాడు, ఉత్తముడైన అన్నయ్య తమ్ముడు అనుభవించిన రాజ్యాన్ని ఇలాగే నిరాకరించకుండా ఉంటాడా? హవిస్సు, నెయ్యి, దర్భలు, ఖదిర కాండంతో చేసిన యూపస్థంభాలని ఓసారి ఉపయోగించాక మళ్ళీ యజ్ఞంలో ఉపయోగించరు. అలాగే రాముడు ఇతరులు ఉపయోగించిన రాజ్యాన్ని సారం తీసేసిన చెరకుగడలా, ఓసారి యజ్ఞంలో ఉపయోగించిన సోమలతలా అంగీకరించడు. చాలా ఆత్మాభిమానం గల రాముడు ఈ అవమానాన్ని సహించడు. అతనికి కోపం వస్తే పదునైన బాణాలతో మందర పర్వతాన్ని కూడా చీల్చేయగలడు. కాని తండ్రి వలె గౌరవంతో ఆ మహాత్ముడు నిన్ను చంపలేదు. కోపం వస్తే సూర్యచంద్రులు లాంటి గ్రహాలతో కూడినది, నక్షత్రాలతో విచిత్రంగా ఉన్న ఆకాశాన్ని, దేవలోకాన్ని కూడా కిందకి పడగొట్టగల సమర్థుడైన రాముడు నీ మాట జవదాటలేదు. అతను తలచుకుంటే వందల కొద్దీ కొండలు గల భూమిని చీల్చేసి బాధించగలడు. బలం గల పులి ఎవరైనా దాని తోకని తాకితే ఎలా సహించదో అలాగే రాముడు ఈ అవమానాన్ని సహించడు. మహాయుద్ధంలో లోకాలన్నీ కలిసి వచ్చి ఎదిరించినా అవి రాముడికి భయం కలిగించలేవు. ఈ ధర్మాత్ముడు ధర్మం లేని లోకంలో ధర్మాన్ని నిలపగలడు. మహా పరాక్రమవంతుడైన రాముడు బంగారు బాణాలతో ప్రళయకాలంలా సకల భూతాలని, సముద్రాన్ని కూడా కాల్చివేయగలడు. సింహంలాంటి బలం, ఎద్దు కళ్ళలాంటి కళ్ళు గల ఆ పురుషోత్తముడ్ని తండ్రివైన నువ్వే స్వయంగా చేప తన పిల్లని చంపినట్లుగా నాశనం చేసావు. నువ్వు ధర్మాత్ముడైన కొడుకుని దేశం నించి వెళ్ళగొట్టావు. ఇది శాస్త్ర సమ్మతమా? బ్రాహ్మణులు అనుసరించే సనాతన ధర్మమేనా?
‘‘రాజా! స్ర్తీకి మొదటి గతి భర్త. కొడుకు రెండో గతి. జ్ఞాతులు మూడో గతి. ఆ మూడు గతులలో మొదటి గతైన నువ్వు నాకు లేనట్లే. రాముడా అడవికి వెళ్ళిపోయాడు. అతనితో అరణ్యానికి వెళ్ళలేకపోయాను. నువ్వు అన్నివిధాలా నన్ను గతి లేనిదాన్ని చేసావు. నువీ రాజ్యాన్ని, మంత్రులని నాశనం చేసి, నిన్ను నువ్వే నాశనం చేసుకున్నావు. నా కొడుకుని, నన్ను, ప్ర జలని కూడా నాశనం చేసావు. కేవలం నీ కొడుకైన భరతుడు, నీ భార్యైన కైకేయి మాత్రమే సంతోషిస్తున్నారు.’’
రాజు ఆ తీవ్ర మాటలని విని దుఃఖంతో తను చేసిన తప్పుని ఆలోచిస్తూ విచారంలో ముణిగాడు (అయోధ్య కాండ సర్గ 61)
విచారంతో ఉన్న కౌసల్య చాలా కోపంతో చెప్పిన ఆ కఠినమైన మాటలు విని మహారాజు చాలా విచారిస్తూ ఆలోచించాడు. దాంతో శరీరం కలతచెంది మూర్ఛపోయి చాలాసేపటికి అందులోంచి తేరుకున్నాడు. స్పృహలోకి వచ్చిన వెంటనే వేడి, దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ పక్కనే ఉన్న కౌసల్యని చూసి విచారించాడు. ఆలోచిస్తూండగా దశరథుడికి పూర్వం తను అజ్ఞానంతో శబ్దవేధి బాణాన్ని ప్రయోగించి చేసిన పాపకర్మ గుర్తొచ్చింది. ఆ పాపం చేయడం వల్ల కలిగిన విచారం, రామశోకం రెండూ మనసుని పీడించగా బాధపడ్డాడు. ఆ శోకాలు కాల్చివేయడంతో రాజు వణికిపోతూ ముఖాన్ని కిందకి వంచి కౌసల్యని ప్రసన్నం చేసుకోడానికి చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు.
‘‘కౌసల్యా! ఇదిగో.. నేను చేతులు జోడించి బతిమాలుతున్నాను. నువ్వు ఎల్లప్పుడూ ఇతరుల విషయంలో కూడా ప్రేమగా ఉండేదానివి. ఎప్పుడూ ఇలా కఠినంగా మాట్లాడలేదు. నువ్వు నిత్యం ధర్మంలో ఆసక్తిగలదానివి. లోకంలోని మంచి చెడ్డలు, పెద్ద, చిన్నా తారతమ్యాలు తెలిసిన నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా చాలా విచారించే నన్ను ఇలా దూషించకూడదు.’’
దశరథుడు దీనంగా చెప్పిన ఈ జాలి కలిగించే మాటలు వినగానే కౌసల్య నీటి గొట్టం కొత్త వాన నీటిని కార్చినట్లు కన్నీరు కార్చింది. ఆమె బాగా భయపడి, ఏడుస్తూ రాజు దోసిలిని పద్మంలా తన తలపై ఉంచుకుంటూ అక్షరాలు తొట్రుపడుతూండగా చెప్పింది.
‘‘రాజా! నేలమీద పడి తల వంచి నమస్కరిస్తూ ప్రా ర్థిస్తున్నాను. నన్ను ప్రార్థించడం ద్వారా నువ్వు నన్ను చంపినట్లైంది. నేను క్షమించరాని తప్పు చేసాను. మెచ్చదగినవాడు, బుద్ధిమంతుడైన భర్త చేత బతిమాలించుకునే స్ర్తీ ఇహలోకానికి, పరలోకానికి కూడా చెడుతుంది కదా. ధర్మాలన్నీ తెలిసిన ఓ రాజా! నాకూ ధర్మం తెలుసు. నువ్వు ఆడిన మాట తప్పవనే విషయం కూడా తెలుసు. ఐనా నేను పుత్ర శోకంతో బాధపడుతూ ఏవేవో అనరాని మాటలు అన్నాను. శోకం ధైర్యాన్ని నశింపచేస్తుంది. శోకం శాస్త జ్ఞానాన్ని నశింపచేస్తుంది. శోకం సర్వాన్ని నశింపచేస్తుంది. శోకం లాంటి శతృవు లేడు. శతృవు కొట్టిన దెబ్బనైనా సహించవచ్చు కాని హఠాత్తుగా వచ్చిన శోకం ఎంత చిన్నదైనా దాన్ని సహించడం కష్టం. ఓ వీరుడా! ధర్మవేత్తలు, శాస్త్ర జ్ఞులు, ధర్మార్థాల విషయంలో సందేహాలన్నీ తొలగిన వాళ్ళైన సన్యాసులు కూడా శోకంతో మనసు మూఢమై మోహం చెందుతారు. రాముడు అడవికి వెళ్ళి నేటికి పదిరోజులైందని లెక్కలు చెప్తున్నాయి. కాని శోకంతో సంతోషం నశించిన నాకు అది ఐదు సంవత్సరాల్లా ఉంది. నదీ వేగంతో సముద్రజలం అధికంగా వృద్ధి పొందినట్లుగా రాముడ్ని తలచుకున్న కొద్దీ నా హృదయంలో విచారం పెరుగుతోంది’’
కౌసల్య ఇలా మంచి మాటలు చెప్తూండగానే సూర్యకిరణాల కాంతి తగ్గి రాత్రి వచ్చింది. ఇలా కౌసల్య చేత అనునయించబడ్డ రాజు విచారంగానే నిద్ర పోయాడు. (అయోధ్యకాండ సర్గ 62)
ఆశే్లష హరికథ విన్నాక బస్‌స్టాప్‌కి చేరుకునేసరికి అక్కడ తన తల్లి కనిపించింది. ఎప్పటిలా ఆవిడకి తను విన్న కథని చెప్పాడు. పక్కనే ఉన్న ఓ సాధువు నవ్వి చెప్పాడు.
‘‘ఈ వయసులో నువ్వు రామాయణ హరికథకి వెళ్ళడం నీ కుటుంబ ఉత్తమ సంస్కారాన్ని తెలియచేస్తోంది. కాని బాబూ! నువ్వు చెప్పిన కథలో నాలుగు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా విను.’’
మీరా తప్పులని కనుక్కోగలరా?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
చిత్రకూటం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
మధ్యప్రదేశ్
1.గంగానదిని దాటి వారు ప్రయాగ వైపు వెళ్లారు. కాని హరిదాసు యమునానదిని దాటి అని తప్పుగా చెప్పాడు.
2.నా గుర్రాలు మాత్రం వేడి కన్నీళ్లు కారుస్తూ నడవడానికి నిరాకరించాయి అని సుమంత్రుడు చెప్పిన మాటలు హరిదాసు చెప్పలేదు.
3.రాముడు మళ్లీ పిలుస్తాడని సుమంత్రుడు మూడురోజులు ఉండిపోయాడు. హరిదాసు చెప్పినట్లు రెండు రోజులు కాదు.
4.‘రాముడి ప్రవాసం వల్ల శత్రువులు, మిత్రులు, తటస్థులు అంతా భేదం లేకుండా సమానంగా విచారిస్తున్నారు’ అని సుమంత్రుడు దశరథుడికి చెప్పిన మాటలని హరిదాసు చెప్పలేదు.
5.‘ఈ చరిత్ర లోకంలో స్థిరంగా నిలిచి ఉంటుంది’ అని సుమంత్రుడు కౌసల్యతో చెప్పిన ముఖ్యమైన మాటలు హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి