రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం.. 100 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(అయోధ్యకాండ 100వ సర్గ - 11వ శ్లోకం నించి)
హరిదాసు ఆ రోజు కథని ఇలా మొదలు పెట్టాడు.
‘రాముడు భరతుడ్ని మళ్లీ కుశల ప్రశ్నలు వేయడం కొనసాగించాడు. ఈ సర్గలో రాముడు భరతుడికి చెప్పే విషయాలన్నీ రాజు విధులు. ఇవి అన్ని కాలాలకి, అన్ని దేశాలకి వర్తించేవి. ఇవాళ ఈ సర్గని పూర్తి చేస్తాను.
‘వినయ సంపన్నుడు, ఉత్తమ కులంలో పుట్టినవాడు, అసూయ లేనివాడు, అధికమైన శాస్త్ర జ్ఞానం గలవాడు, కర్తవ్య విషయాలని బోధించే వాడైన పురోహితుడ్ని సత్కరిస్తున్నావు కదా? శాస్త్ర విధి తెలిసినవాడు, బుద్ధిమంతుడు, కపటం లేనివాడైన పురోహితుడు నీ ఆజ్ఞల విషయంలో శ్రద్ధ కలవాడై ఎప్పుడు ఏ హోమాలు జరిగాయో, ఎప్పుడు ఏ హోమాలు జరగాలో నీకు చెప్తున్నాడు కదా? నాయనా! నువ్వు దేవతలని, తల్లులని, తండ్రులని, గురువులని తండ్రితో సమానులైన బంధువులని, వృద్ధులని, బ్రాహ్మణులని గౌరవిస్తున్నావు కదా? శ్రేష్ఠమైన బాణాలు, అస్త్రాలు కలవాడు, రాజనీతి శాస్త్రంలో పండితుడు, ఉపాధ్యాయుడైన సుధన్వుని గౌరవిస్తున్నావు కదా? నువ్వు, నీతో సమానులు, శూరులు, జితేంద్రియులు, ఉత్తమ కులంలో పుట్టినవాళ్లు, మనసులోని భావాలని తెలుసుకో గలిగిన ధనవంతులనే మంత్రులుగా నియమించావు కదా? భరతా! శాస్త్ర పండితులు, తమ ఆలోచనలని తమలోనే ఉంచుకోగల వారైన మంత్రులు రహస్యంగా ఉంచే ఆలోచనల వల్లే రాజులకి విజయం లభిస్తుంది కదా? నువ్వు నిద్రకి లొంగిపోవటం లేదు కదా? తగిన సమయంలో మేలుకుంటున్నావు కదా? నువ్వు ఒక్కడివే ఆలోచించడం లేదు కదా? చాలా మందితో కూడా ఆలోచించడం లేదు కదా? నీ ఆలోచన రాజ్యంలోని వారందరికీ తెలిసిపోవడం లేదు కదా? నాయనా! ఇతరులు ఎవరైనా ఊహల చేత కాని, యుక్తి చేత గాని, ఇతర ఉపాయాల చేత కాని నీ ఆలోచనలని, నీ మంత్రులు చేసిన ఆలోచనలని తెలుసుకోవడం లేదు కదా?
‘్భరతా! తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలాన్ని సాధించే పనులనే ఎన్నుకుని, ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెడుతున్నావు కదా? ఇతర రాజులు నువ్వు చక్కగా పూర్తి చేసిన పనులని లేదా చాలా వరకు పూర్తి చేసిన పనులని మాత్రమే తెలుసుకుంటున్నారు కదా? ముందు ముందు నువ్వు చేద్దామనుకునే పనులు వారికి తెలీడం లేదు కదా? వెయ్యి మంది మూర్ఖులని విడిచైనా ఒక్క పండితుడ్ని చేరదీయడానికి ప్రయత్నిస్తున్నావు కదా? ఎందుకంటే పనిలో కష్టం ఏర్పడినప్పుడు పండితుడు గొప్ప సహాయం చేయగలడు. రాజు వేల కొద్దీ లేదా పది వేల కొద్దీ మూర్ఖులని చేరదీసినా వాళ్లు ఎలాంటి సహాయం చేయలేరు. మేథావి, శూరుడు, సమర్థుడు, పండితుడైన మంత్రి ఒక్కడున్నా రాజుకి లేదా చిన్న ప్రభువుకి గొప్ప అభివృద్ధి కలిగేట్లు చేయగలడు. నువ్వు అధిక సమర్థత గల సేవకులని మంచి పనులు చేయడానికి, సామాన్యమైన సమర్థత గల వారిని సామాన్యమైన పనులు చేయడానికి, చాలా తక్కువ సామర్థ్యం గలవారిని అధమమైన పనులని చేయడానికి నియమించావు కదా? రహస్యమైన పరీక్షలకి నిలిచిన తంఅడీ, తాతల నించీ వస్తున్న వారు, పరిశుద్ధమైన నడవడిక గలవారైన, శ్రేష్టులైన మంత్రులని మంచి పనులు చేయడానికి నియోగిస్తున్నావు కదా? భరతా! నీ రాజ్యంలోని ప్రజలందరూ తీవ్రమైన శిక్షలతో భయపడుతూండగా నీ మంత్రులు ఊరికే చూస్తూండరు కదా? భయంకరమైన చెడ్డ దానాలని తీసుకునే పతితుడ్ని సదాచార సంపన్నులైన ఋత్విక్కులు అవమానించినట్లు, స్ర్తిలు, కాముకుడ్ని అవమానించినట్లు మంత్రులు నిన్ను అవమానించడం లేదు కదా? ఉపాయాల్లో నేర్పుండి, విద్యావంతుడైన, శూరుడైన వాడు అధికార వాంఛతో రాజు ఆంతరంగిక సేవకుల్లో అపోహల్ని కలిగించడానికి ప్రయత్నించినట్లైతే రాజు అలాంటి వాడిని చంపేయాలి. అలా చేయకపోతే ఆ రాజే నశిస్తాడు. తృప్తి కలవాడు, శూరుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, నిజాయితీ కలవాడు, ఉత్తమ కులంలో పుట్టినవాడు, రాజభక్తి కలవాడు, సమర్థుడైన వాడినే సేనాపతిగా చేసావు కదా? బలవంతులు, యుద్ధంలో నేర్పు గలవారు, పూర్వం ఎన్నో ఘనకార్యాలు సాధించినవారు, శూరులైన వీరుల్ని సత్కరించి, గౌరవిస్తున్నావు కదా? సైన్యానికి ఇవ్వతగిన ఆహారాన్ని తగు విధమైన జీతాన్ని ఆలస్యం చేయకుండా సమయానికి ఇస్తున్నావు కదా? ఆహారం, జీతం అందాల్సిన సమయంలో అందకపోతే సేవకులు రాజు మీద కోపం వచ్చి అతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. ఇందువల్ల గొప్ప అనర్థం కలుగుతుంది. ప్రజలంతా, ప్రధానంగా ఉత్తమ వంశీయులైన క్షత్రియులంతా నీ విషయంలో అనురాగంతో ఉన్నారు కదా? వాళ్లంతా ఐకమత్యంతో నీ పనులు చేయడం కోసం ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా? భరతా! స్వదేశంలో పుట్టిన వాడు, విషయాలు తెలిసినవాడు, సమర్థుడు, సమయస్ఫూర్తి కలవాడు, చెప్పిన విషయాన్ని విన్నది విన్నట్టుగా చెప్పేవాడు, పండితుడైన మగవాడ్ని దూతగా నియమించావు కదా? శతృపక్షంలోని పద్దెనిమిది తీర్థాల్లో, నీ పక్షంలోని పదిహేను తీర్థాల్లో ఇతరులకి తెలీని ముగ్గురు, ముగ్గురు గూఢచారుల ద్వారా అన్నీ తెలసుకుంటున్నావు కదా? నీ చేత ఓడించబడి తిరిగి వెళ్లిపోయిన శత్రువుల గురించి ‘వీళ్లు బలహీనులే కదా?’ అని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉన్నావు కదా?
‘లోకాన్ని గురించే ఆలోచించే నాస్తికులైన బ్రాహ్మణులు నీ దగ్గరకి చేరకుండా చూసుకుంటున్నావు కదా? మేమే పండితులమని తలచే ఈ అజ్ఞానులు అనేక అనర్థాలని కలిగిస్తారు. ఈ దుష్ట పండితులు ప్రధానమైన ధర్మశాస్త్రాలున్నా వాటిని కాదని, శుష్క తర్కాన్ని అవలంబించి నిరర్థకంగా ఏదేదో మాట్లాడుతూంటారు. నాయనా! వీరులైన మన పూర్వులు పూర్వం రక్షించింది, శత్రువులు వచ్చి యుద్ధం చేయడానికి అసాధ్యమైంది అవడం వల్ల దానికి ‘అయోధ్య’ అనే నిజమైన పేరు వచ్చింది. ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండినది, ఎప్పుడూ తమ తమ పనులు చేయడంలో ఆసక్తిగల, ఇంద్రియాలని జయించిన, గొప్ప ఉత్సాహం కల, పూజ్యులైన వేల కొద్దీ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు నివసించేది, దృఢమైన తలుపులు అనేక ఆకారాలు గల రాజభవనాలతో కూడినది, పండిత జనాలతో నిండినది, సర్వ సమృద్ధమై ఆనందంతో నిండినది అయిన మన నగరాన్ని రక్షిస్తున్నావు కదా? అక్కడక్కడా భూముల సరిహద్దులు చూపించే రాళ్లు కలది, చక్కగా నివాసం ఏర్పరచుకున్న జనాలతో నిండింది, దేవాలయాలతోను, చలివేంద్రాలతోను, చెరువులతో కళకళలాడేది, సంతోషించే స్ర్తి పురుషులు గలది, సమాజంలో జరిగే ఉత్సవాలతో కళకళలాడేది, చక్కగా దున్నిన భూములు, సమృద్ధిగా పశువులు కలది, హింస లేనిది, కేవలం వర్షం మీదే ఆధారపడనిది, క్రూర జంతువుల భయం లేక అందంగా ఉండేది, ఎలాంటి భయాలు లేనిది, గనులతో నిండినది, పాపులు నివసించనిది, నా పూర్వీకుల చేత రక్షించబడినది అయిన మన దేశం సుఖసమృద్ధులతో అలరారుతున్నది కదా?’

(అయోధ్య కాండ సర్గ 100 46వ శ్లోకం దాకా)

ఆశే్లష బయటకి వెళ్లబోయే ముందు హరిదాసు చెప్పిన ఆ రోజు కథలో తప్పులు ఉన్నాయి అని ఐదుగురు లేచి ఆయనకి ఐదు తప్పులని చెప్పడం విన్నాడు. ఆయన వెంటనే ఆ సర్గ తెరచి చూసి అది నిజమేనని ఒప్పుకున్నాడు. వాటిని మీరు కనుక్కోగలరా?

1.లేళ్ల, దున్నపోతుల పేడతో చేసిన పిడకలు అని వాల్మీకి రాశాడు. హరిదాసు ఉత్త పేడని చెప్పాడు తప్ప ఈ రెండు జంతువుల పేర్లు చెప్పడం విస్మరించాడు.
2.రాముడి పర్ణశాల, సాల, తాళ, అశ్వకర్ణ వృక్షాల ఆకులతో కప్పబడి ఉంది అని వాల్మీకి రాశాడు. కాని హరిదాసు ఆ మూడు వృక్షాల పేర్లు చెప్పలేదు.
3.రామలక్ష్మణులు ఆకాశంలోని సూర్యచంద్రులు, శుక్రుడు, బృహస్పతులని కలిసినట్లు అడవిలో సుమంత్రుడ్ని, గుహుడ్ని కలిశారు. కాని హరిదాసు శుక్రుడు బదులు గురుడు అని చెప్పాడు.
4.ప్రళయకాల సూర్యుడిలా, ప్రణయకాల సూర్యుడిలా కాదు.
5.అయోధ్య కాండలోని 99వ సర్గలోని మిగిలిన భాగం తర్వాత చెప్పుకుందాం అని హరిదాసు చెప్పాడు కాని నిజానికి ఆయన వదిలింది 100వ సర్గ.
*
మీకో ప్రశ్న

అయోధ్యకాండలోని వందో సర్గకి కచ్చిత్ సర్గ అని ఎందుకు పేరు వచ్చింది?
*

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

ఆ పర్ణశాల సర్పాలతో ఉన్న భోగవతిలా ప్రకాశిస్తోంది వాల్మీకి చేసిన ఈ వర్ణనలోని భోగవతి అంటే ఏమిటి?
పాతాళంలోని ఒక నగరం.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి