రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..67 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లారాక రాముడు అక్కడ లేకపోవడం చూసి ఆ పౌరులు నిశే్చష్టులై బాధపడ్డారు. వాళ్ల కళ్లు తడిసాయి. విచారంగా అటు, ఇటు చూసినా వారికి రాముడి జాడ కూడా తెలీలేదు. రాముడు లేకపోవడంతో మంచి మనసుగల ఆ పౌరులు విచారంతో పాలిపోయిన మొహాలతో దీనంగా మాట్లాడుకున్నారు.
‘్ఛ! ఈ నిద్ర ఎంత పని చేసింది? దీనివల్ల ఒళ్లు తెలీని మనం, విశాలమైన వక్షస్థలం గల, ఆజానుబాహువైన రాముడ్ని కోల్పోయాం. దృఢమైన చేతులు గల రాముడు చేసిన పనులు ఎప్పటికీ వృథా కావు. అలాంటి రామ భక్తులమైన మనల్ని విడిచి రాముడు ఎలా ప్రవాసానికి వెళ్లాడు? తండ్రి తన వారసులైన కొడుకులని పాలించినట్లుగా రాముడు సదా మనల్ని పాలించేవాడు. అలాంటి రాముడు మనల్ని విడిచి అడవికి ఎలా వెళ్లాడు? మనందరం ఇక్కడే మరణిద్దాం. లేదా మరణించే వరకు ఉత్తర దిక్కుకి నడిచి వెళ్దాం. రాముడు లేని జీవితం మనకి దేనికి? ఇక్కడ ఎండిన పెద్దపెద్ద కర్రలు అనేకం ఉన్నాయి. వాటితో చితిని రగిల్చి అంతా అగ్నిలో ప్రవేశిద్దాం. రాముడు లేకుండా తిరిగి వచ్చే మనల్ని చూసి అయోధ్యలోని స్ర్తి, బాల, వృద్ధులతో సహా అంతా దీనులై ఆనందాన్ని కోల్పోతారు. రాముడి గురించి అడిగే వారికి మనం ఏం చెప్పగలం? ప్రేమగా మాట్లాడే అసూయ లేని రాముడ్ని అడవికి పంపించి వచ్చామని ఎలా చెప్పగలం? ఆత్మనిగ్రహం గల ఆ రాముడితో కలిసి నగరాన్ని వదిలి బయటకి వచ్చిన మనం ఇప్పుడు రాముడు లేకుండా ఆ నగరానికి ఎలా వెళ్తాం?’
ప్రజలంతా ఇలా మాట్లాడుకుంటూ విచారంతో చేతులు పైకెత్తి లేగదూడల్లేని ఆవుల్లా విలపించారు. తర్వాత రథం జాడని అనుసరించి కొంచెం దూరం వెళ్లి, తర్వాత ఆ జాడలు కూడా కనపడక పోవటంతో గొప్ప శోకంతో ముణిగారు. వారంతా ‘ఇదేమిటి? రథం నడిచిన జాడలు కనపడటం లేదు? విధి వంచితులైన మనం ఇప్పుడు ఏం చేయాలి?’ అంటూ వెనక్కి మళ్లారు. తర్వాత వారంతా విచారిస్తూ వచ్చిన దారిలోనే శోకగ్రస్థులు, మంచి వారుండే అయోధ్యా నగరానికి వెళ్లారు.
వారంతా ఆ నగరాన్ని చూసి వచ్చిన ఆపద గురించి కలత చెంది, కన్నీరు కార్చారు. రాముడు లేని ఆ నగరం లోతైన ప్రదేశం నించి గరుత్మంతుడు సర్పాన్ని ఎత్తుకుపోగా మిగిలిన నదిలా ఏ మాత్రం కళగా లేదు. ఏ మాత్రం సంతోషం లేని ఆ పౌరులు సంపన్నమైన తమ ఇళ్లల్లోకి అతికష్టం మీద ప్రవేశించి, విచారంతో ఎదురుగా ఉన్న తమ వాళ్లని కాని, ఇతరులని కాని సరిగ్గా గుర్తించలేక పోయారు. (అయోధ్య కాండ సర్గ -47)
ఇలా రాముడి వెంట వెళ్లి తిరిగి వచ్చిన ఆ ప్రజలు శోకంతో బాధపడుతూ, మరణించాలనే కోరికతో కన్నీరు కార్చారు. విచారంతో ధైర్యాన్ని కోల్పోయి, ప్రాణం పోయిన వారిలా ఉన్నారు. వారంతా తమతమ ఇళ్లు చేరి, కొడుకులు, భార్యలు తమ చుట్టూ చేరగా కన్నీరు కారుస్తూ ఏడ్చారు. ఎవరికీ సంతోషంగా లేదు. ఏ పనినీ చేయడానికి మనసు రాలేదు. వర్తకులు వస్తువులని అమ్మలేదు. పుణ్య స్థానాలు కళ తప్పి ఉన్నాయి. గృహస్థులు వంటలు చేసుకోలేదు. పోయిన వస్తువు దొరికిన వాడు అందుకు సంతోషించలేదు. అధిక ధనం లభించిన వాడికి ఆనందం కలగలేదు. ఇంటింటా విచారంతో స్ర్తిలు ఏడుస్తూ ఇంటికి వచ్చిన భర్తని, ఏనుగుల్ని అంకుశంతో పొడిచినట్లుగా మాటలతో పొడిచారు.
‘రాముడ్ని చూడని వారికి ఇంటితో కాని, భార్యతో కాని, ధనంతో కాని, కొడుకులతో కాని, సుఖాలతో కాని ఏం లాభం? సీతతో వెళ్లిన రాముడికి సేవ చేయడానికి అతన్ని అనుసరించి అడవికి వెళ్లిన లక్ష్మణుడు ఒక్కడే ఈ లోకంలో సత్పురుషుడు. రాముడు ఏ పవిత్రమైన నీటిలో దిగి స్నానం చేస్తాడో ఆ నదులు, తామరలున్న చెరువులు, సరస్సులు పుణ్యం చేసుకున్నాయి. అందమైన చెట్ల సమూహాలున్న అడవులు, విశాలమైన, అధిక నీరున్న నదులు, లోయలు గల పర్వతాలు రాముడ్ని శోభించగలవు. రాముడు ఏ అడవికి, ఏ కొండకి వెళ్లినా అవి ప్రియమైన అతిథిలా అతన్ని ఆదరిస్తాయి. అనేక రకాలైన పువ్వులని చివర్లలో అలంకారంగా పెట్టుకున్న, అనేక పూలగుత్తులు గల, తుమ్మెదలతో ప్రకాశించే చెట్లు రాముడికి కనపడుతూ అతనికి ఆనందాన్ని కలిగిస్తాయి. పర్వతాలు తమ దగ్గరికి వచ్చిన రాముడికి దయతో అకాలంలో కూడా మంచి పూలని, పళ్లని ఇస్తాయి. రాముడి కోసం పర్వతాలు అనేక రకాల చిత్రమైన ప్రవాహాలని, స్వచ్ఛమైన నీటిని ఇస్తాయి. పర్వత శిఖరాల మీది చెట్లు రాముడికి ఆనందాన్ని కలిగిస్తాయి. శూరుడు, ఆజానుబాహువు, దశరథుడి కొడుకైన ఆ రాముడు మనకి దూరం కాకముందే అతన్ని అనుసరించి వెళ్దాం. మహాత్ముడైన ఆ ప్రభువు పాదాల నీడ శుభకరమైంది. సుఖాన్ని ఇచ్చేది. అతనే ఈ ప్రజలందరికీ నాతుడు. అతడే గతి. అతడే ఉత్తమమైన గమ్య స్థానం. మేము సీతని సేవిస్తాం. మీరు రాముడ్ని సేవించండి’ విచారంతో పౌర స్ర్తిలు తన భర్తలతో ఇలా అనేక మాటలు చెప్పారు.
‘మనం అడవిలో వున్నప్పుడు రాముడు మీ యోగ క్షేమాలని చూస్తాడు. సీత మా యోగ క్షేమాలని చూస్తుంది. ఈ అయోధ్యలో నివాసం మంచిది కాదు. ఇక్కడి ప్రజలంతా దిగులు పడ్డారు. ఈ నివాసం ఇక సుఖం కాక దుఃఖమయం. ఇక్కడ ఉంటే ఎవరు సంతోషిస్తారు? అనాధైన ఈ రాజ్యం ధర్మవిరుద్ధంగా కైకేయి చేతిలోకి వెళ్తే ఇక్కడ నివసించడంలో అర్థం లేదు. కొడుకులు, ధనం చేత కూడా ఇక్కడ లాభం లేదని చెప్పచ్చు. ఐశ్వర్యం కోసం భర్తని, కొడుకుని కూడా వదిలేసి, కులాన్ని అపవిత్రం చేసిన కైకేయి ఇక ఎవర్ని విడిచిపెడుతుంది? కైకేయి జీవించి ఉండగా మేము ఈ రాజ్యంలో ఎన్నడూ నివసించం. కొడుకుల మీద, మా పిల్లల మీద ఒట్టు పెడుతున్నాం. ఏ మాత్రం జాలి లేకుండా రాముడ్ని అడవికి పంపించిన అధర్మురాలు, దుష్టురాలు ఐన ఆమెతో కలిసి ఎవరు సుఖంగా జీవించగలరు? కైకేయి మూలంగా ఈ రాజ్యమంతా ఉపద్రవం పొంది, నాయకుడు, ఆధారం లేక నాశనం అవుతుంది. రాముడు అడవికి వెళ్లాక దశరథుడు బతికుండడు. ఆయన మరణిస్తే తర్వాత మిగిలేవి ఏడుపులే. మీ అందరి పుణ్యం క్షీణించింది. కష్టాల్లో ఉన్న మీరంతా విషం కలుపుకుని తాగండి. లేదా రాముడి వెంట వెళ్లండి. లేదా ఎవరికీ తెలీని ప్రదేశానికి వెళ్లిపోండి. సీతా, లక్ష్మణులతో సహా రాముడ్ని కుట్రతో దూరంగా పంపేసి, పశువులని కసాయి వాడికి అప్పజెప్పినట్లు దశరథుడు మనల్ని భరతుడికి అప్పజెప్పాడు. మహారథుడైన రాముడు పూర్ణచంద్రుడి లాంటి మొహం కలవాడు, నల్లని వాడు, శత్రువులని నశింప జేసేవాడు, పద్మాల వంటి కళ్లు కలవాడు, మోకాళ్ల దాకా పొడవైన చేతులు కలవాడు. లక్ష్మణుడికి అన్న. తియ్యని స్వభావం కల అతను సత్యానే్న పలుకుతాడు. మహాబలశాలి. శాంత స్వభావి. లోకానికి చంద్రుడిలా ప్రియమైన దర్శనం కలిగించేవాడు. పురుషుల్లో శ్రేష్ఠుడు. మదించిన ఏనుగులా నడిచేవాడు. అతను అడవుల్లో తిరుగుతూ వాటిని ప్రకాశింప చేయగలడు.’ (అయోధ్య కాండ సర్గ -48)
అయోధ్యా నగరంలోని స్ర్తిలంతా ఇలా విలపిస్తూ, మృత్యు భయం కలిగినట్లుగా విచారంతో ఏడ్చారు. ఇళ్లల్లోని స్ర్తిలు ఇలా రాముడి కోసం ఏడుస్తూండగా సూర్యుడు అస్తమించి రాత్రైంది. నగరంలో ఎవరూ నిప్పు రాజేయలేదు. స్వాధ్యాయనం కూడా చేయలేదు. అలాంటి అయోధ్య చీకటి పూసినట్లుగా ఉంది. దుకాణాలన్నీ మూసేశారు. ఎక్కడా ఆనందం కనపడలేదు. ఇలా నక్షత్రాలు కనపడని ఆకాశంలా ఉందా నగరం. ఆ స్ర్తిలంతా తమ కొడుకుని కాని, సోదరుడ్ని కాని దేశం నించి వెళ్లగొట్టినప్పుడు ఎంత విచారిస్తారో, రాముడి కోసం అంత విచారిస్తూ, బాధపడే మనసులతో దీనంగా ఏడ్చారు. రాముడంటే వారికి కొడుకు కంటే కూడా అధికమైన ప్రేమ. అప్పుడు ఆ నగరంలో సంగీతాలు కాని, ఉత్సవాలు కాని, నృత్య వాయిద్యాలు కాని లేవు. ఎక్కడా ఆనందానికి ఆశ్రయం లేదు. సమృద్ధిగా ఉన్న దుకాణాలు మూయబడే ఉన్నాయి. అలాంటి అయోధ్య నీరు తగ్గిన సముద్రంలా ఉంది. (అయోధ్య కాండ సర్గ -48)
ఆ కథ విన్నాక తిరిగి ఇంటికి వెళ్తూ ఆశే్లషతో వచ్చిన వాడి తల్లి శారదాంబ చెప్పింది.
‘హరిదాసు కంఠం బావుంటుంది. భావయుక్తంగా కథ చెప్తాడు. కాని ప్రతీసారి కొన్ని వదిలేస్తూంటాడు., ఈ రోజు కథలో ముఖ్యమైన నాలుగిటిని వదిలేశాడు’
ఆ నాలుగింటిని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
గాంధీ రాసిన పుస్తకం ‘రామనామ మహిమ’
ప్రభావంతో వినోబా భావే రాసిన
పుస్తకం పేరేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
గాంధీ రామాయణం మీద రాసిన పుస్తకం పేరేమిటి?
-రామనామ మహిమ
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.అయోధ్యకాండ సర్గ 45, 46 లని హరిదాసు ఆ రోజు చెప్పాడు. కాని సర్గ 44, 45లని చెప్పానని హరిదాసు తప్పుగా చెప్పాడు.
2.మిత్రబృందం, దశరథ మహారాజు బలవంతంగా వెనక్కి పంపబడ్డారు. కాని హరిదాసు తప్పుగా దశరథుడు కూడా రాముడ్ని అనుసరించాడు’ అని చెప్పాడు.
3.‘్భరతుడు వయసులో చిన్నవాడైనా జ్ఞానంలో వృద్ధుడు. మృదువైన స్వభావం, పరాక్రమం, సద్గుణాలు కలవాడు. అతను మీకు తగిన రాజై మీ సమస్త భయాలని తొలగిస్తాడు’ అని రాముడు ప్రజలతో భరతుడి గురించి చెప్పిన విశేషణాలని హరిదాసు చెప్పలేదు.
4.‘జ్ఞానం చేత, వయసు చేత, తేజస్సు చేత మూడు విధాలుగా వృద్ధులైన బ్రాహ్మణులు’ అని వాల్మీకి వాడిన విశేషణాలని హరిదాసు విస్మరించాడు.
5.‘వాజపేయ యాగం చేయడం వల్ల మాకు లభించిన, శరద్రుతువులోని మబ్బుల్లా తెల్లగా ఉన్న ఆ గొడుగులు మా వెనకే రావడం చూడు. నీడ లేక ఎండతో బాధపడే నీకు మేము మా వాజపేయ యాగం వల్ల లభించిన ఈ తెల్లటి గొడుగులతో నీడని కల్పిస్తాము’ అని రాముడితో వృద్ధ బ్రాహ్మణులు చెప్పిన మాటలని హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి