రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..74 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్రుడు చెప్పిన మాటలని విని దశరథుడు చెప్పాడు.
‘ఇంకా మిగిలిన విషయాలని కూడా చెప్పు’
సుమంత్రుడు కన్నీళ్లు పెట్టుకుని రాముడి సందేశాల్లోని వివరాలని మళ్లీ చెప్పాడు.
‘మహారాజా! నారచీరలు ధరించిన రామలక్ష్మణులు జటలు కట్టుకుని యమునానదిని దాటి ప్రయాగ వైపు వెళ్లారు. రాముడి రక్షణ కోసం లక్ష్మణుడు ముందు నడిచాడు. అలా వెళ్తున్న వాళ్లని చూసి, చేసేదేం లేక, రాముడు అడవికి ప్రయాణమైన తర్వాత నేను వెనక్కి మళ్లాను. రాముడు మళ్లీ నన్ను పిలుస్తాడనే ఆశతో గుహుడితో కలిసి అక్కడే రెండు రోజులు ఉండిపోయాను. తర్వాత నేను ఎలాగో ఆ దుఃఖాన్ని ఆపుకుంటూ రాజకుమారులకి నమస్కరించి, రథాన్ని ఎక్కి ప్రయాణమయ్యాను. రాజా! నీ దేశంలోని చెట్లు కూడా రాముడు దూరం అవడంతో కృశించి పూలు, చిగుళ్లు, మొగ్గలతో సహా వాడిపోయాయి. నదుల్లోను, చిన్న చెరువుల్లోను, సరస్సుల్లోను ఉన్న నీరు వేడెక్కింది. వనాల్లోను, ఉద్యానవనాల్లోను ఆకులు ఎండిపోయాయి. ప్రాణులన్నీ కదలకుండా పడి ఉన్నాయి. క్రూర మృగాలు కూడా తిరగడం లేదు. రాముడి వియోగ శోకంతో పీడించబడే ఆ అరణ్యం కూడా నిశ్శబ్దమైంది. పద్మసరసుల్లోని నీరు కలుషితమై పోయింది. పద్మాలు వాడిపోయి వాటి ఆకులు పైకి కనపడటం లేదు. ఆ సరస్సులోని చేపలు, పక్షులు అణగి పడి ఉన్నాయి. నీళ్లల్లో పుట్టే పువ్వులు, నేల మీద పుష్పించే సుగంధ పువ్వులు, ఫలాలు కూడా ఇప్పుడు సువాసన తగ్గిపోయి పూర్వంలా మనోహరంగా లేవు. అణగిపడి ఉన్న పక్షులు గల, నిర్జనమైన ఉద్యానాలని చూడలేకపోయాను.
‘అయోధ్యలో ప్రవేశించే నన్ను ఏ ఒక్కరూ అభినందించలేదు. రాముడు కనపడక ప్రజలంతా మాటిమాటికీ నిట్టూరుస్తున్నారు. రాముడు లేకుండా తిరిగి వచ్చిన రాజరథాన్ని చూసి రాజమార్గంలోని ప్రజలంతా దుఃఖంతో కన్నీరు కారుస్తున్నారు. తిరిగి వచ్చిన రథాన్ని మేడల మీంచి, విమానాలు, ప్రాసాదాల నించి చూసిన స్ర్తిలు రాముడు కనపడక పోవడంతో దుఃఖంతో హాహాకారాలు చేస్తున్నారు. వాళ్లు చాలా విచారంతో సదా కారే కన్నీరు నిండిన కళ్లతో ఒకర్నొకరు అస్పష్టంగా చూసుకుంటున్నారు. రాజా! సంతోషం లేని మనుషులు, దీనమైన ఏనుగులు, గుర్రాల పూడుకుపోయిన కంఠాల నిట్టూర్పు ధ్వనులు అంతటా వ్యాపించి, ఆనందం లేకుండా దుఃఖించే అయోధ్య నా దృష్టికి కొడుకు దూరమైన కౌసల్యలా కనిపిస్తోంది.’
డగ్గుత్తికతో సుమంతుడు మాట్లాడటం అవగానే దశరథుడు దీనంగా చెప్పాడు.
‘దుష్ట బంధుజనాలు, దుష్ట కోరికలు గల కైకేయి ప్రేరేపణతో, ఆలోచనల్లో నేర్పరులైన వృద్ధులని సంప్రదించకుండా నేను ఈ పని చేశాను. ఓ స్ర్తి మాట విని స్నేహితులతో, మంత్రులతో, పౌరులతో ఆలోచించకుండా తొందరపడి ఈ పని చేశాను. సుమంత్రా! ఈ విధంగా జరగాల్సి ఉండటంతో, ఈ కులాన్నంతా నాశనం చేయడానికి దైవవశం వల్ల ఈ గొప్ప కష్టం వచ్చి పడింది. నేను నీకు ఏమైనా ఉపకారం చేసి ఉన్నట్లైతే నన్ను రాముడి దగ్గరకి తీసుకువెళ్లు. నా ప్రాణాలు నన్ను తొందర పెడుతున్నాయి. ఇప్పుడు కూడా నా ఆజ్ఞ చెల్లడానికి వీలుంటే రాముడ్ని వెనక్కి తీసుకుని రా. రాముడు లేకుండా క్షణమైనా జీవించలేను. ఆజానుబాహువైన రాముడు దూరంగా వెళ్లిపోవడం వల్ల అతన్ని తీసుకురావడం సాధ్యం కాకపోతే ననే్న రథం ఎక్కించి తీసుకెళ్లి రాముడ్ని చూపించు. గొప్ప ధనస్సు ధరించిన గుండ్రటి దంతాలుగల రాముడు ఎక్కడ ఉన్నాడు? సీతాసమేతుడైన రాముడ్ని చూస్తేనే నేను జీవించగలను. మణికుండలాలు ధరించిన ఎర్రని కళ్లుగల రాముడ్ని చూడకపోతే నేను చచ్చిపోతాను. ఇక్ష్వాకు వంశానికి ఆనందం కలిగించే రాముడ్ని చూడలేని ఇంత దురవస్థ నాకు కలిగింది. ఇంతకంటే విచారాన్ని కలిగించేది ఏం ఉంటుంది? అయ్యో రామా! అయ్యో లక్ష్మణా! అయ్యో దీనురాలైన సీతా! అనాధుడిలా నేను మరణిస్తున్నాననే విషయం మీకు తెలీదు కదా?’
దుఃఖంతో మనసు బలహీనపడ్డ దశరథుడు దాటడానికి ఏ మాత్రం శక్యం కాని శోకసాగరంలో మునిగిపోయి మళ్లీ ఇలా కొనసాగించాడు.
‘ఓ కౌసల్యా! నేను శోకసముద్రంలో మునిగిపోయాను. ఇది రామశోకం అనే వైశాల్యం కలది. సీత విరహమే దీని అవతలి ఒడ్డు. నిట్టూర్పులే దీని తరంగాలు, సుడులు. ఇది కన్నీరు అనే నురుగుతోను, నీటితోను అల్లకల్లోలంగా ఉంది. కదులుతున్న చేతులే చేపల సముదాయం. ఏడుపులే మహాధ్వని. విరబోసుకున్న వెంట్రుకలే నాచు. కైకేయే పెద్ద బడబాగ్ని. గూని దాని మాటలే పెద్ద మొసళ్లు. క్రూరురాలైన కైకేయి అడిగిన వరాలే తీరాలు. రాముడ్ని దూరంగా పంపించడంతో ఇది అతి పొడవైంది. రాముడు లేకుండా దీన్ని నేను సజీవంగా దాటలేను. ఎంత కష్టం వచ్చి పడింది? ఇదే నా కన్నీటి వేగానికి కారణం. లక్ష్మణుడితో ఉన్న రాముడ్ని చూడాలనే కోరిక నాకున్నా నేను అతన్ని ఇక్కడ చూడలేక పోతున్నాను. ఇదే మాత్రం బాలేదు’ ఏడుస్తూ దశరథుడు మూర్ఛతో పక్కమీద పడిపోయాడు.
దశరథుడు పూర్వం కంటే రెట్టింపు దుఃఖంతో రాముడి కోసం అతి దీనంగా ఏడుస్తూ మూర్ఛపోవడంతో రాముడి తల్లి కౌసల్య చాలా భయపడింది. (అయోధ్యకాండ సర్గ 59)
అప్పుడు కౌసల్య దెయ్యం పట్టినదానిలా ఒణుకుతూ, స్పృహ తప్పినదానిలా నేల మీద మాటిమాటికీ దొర్లుతూ సుమంత్రుడితో చెప్పింది.
‘సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉన్నారో నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లు. వాళ్లు లేకుండా నేను ఇక్కడ క్షణమైనా జీవించలేను. రథాన్ని వెంటనే వెనక్కి తిప్పు. నన్ను కూడా దండకారణ్యానికి తీసుకెళ్లు. వాళ్లని అనుసరించి వెళ్లకపోతే నేను యమలోకానికే వెళ్తాను’
సుమంత్రుడు చేతులు జోడించి నమస్కరించి కన్నీటి వల్ల తొట్రుపడే మాటలతో కౌసల్యని ఓదార్చాడు.
‘శోకం, మోహం, దుఃఖం వల్ల కలిగిన తొందరపాటుని విడిచిపెట్టు. రాముడు ఏ కష్టాలు లేకుండా అడవిలో నివసించగలడు. ధర్మం తెలిసిన లక్ష్మణుడు కూడా జితేంద్రియుడై రాముడి పాద సేవ చేస్తూ పరలోకాన్ని సాధిస్తున్నాడు. సీత అడవిలో ఇంట్లోలా ఉంటూ, మనసుని రాముడి మీదే నిలిపి నిర్భయంగా విశ్వాసంతో ఉంది. సీతలో ఏ మాత్రం దైన్యం కనపడటం లేదు. ఆమె ఎన్నో ప్రవాసాలకి ఎప్పటి నించో అలవాటు పడ్డట్లు నాకు కనపడింది. గతంలో నగరంలోని వనాలకి వెళ్లి ఎలా ఆడుకుందో అలాగే నిర్జనమైన అడవుల్లో కూడా విహరిస్తోంది. పూర్తిగా రాముడి మీదే మనసు నిలిపిన సీత నిర్జనమైన అడవిలో చిన్నపిల్లలా విహరిస్తోంది. ఆమె మనసు సదా రాముడి మీదే లగ్నమై ఉంది. ఆమె జీవితం కూడా రాముడి మీదే ఆధారపడి ఉంది. రాముడు లేకపోతే అయోధ్య కూడా ఆమెకి అడవే అవుతుంది. సీత అయోధ్యకి క్రోసు దూరంలో ఉన్నా, అడవిలో ఉన్నా ఉద్యానవనంలో ఉన్నట్లు ప్రవర్తిస్తూ, తనకి కనపడ్డ గ్రామాలు, నగరాలు, నదీ ప్రవాహాలు, వివిధ చెట్లు మొదలైన వాటి గురించి రాముడ్ని, లక్ష్మణుడ్ని అడిగి తెలుసుకుంటోంది. సీతకి సంబంధించి ఈ విషయం మాత్రమే నాకు గుర్తుంది. కైకేయి గురించి ఆమె తొందరగా ఏదో అన్నది కాని అది నాకు గుర్తులేదు’
ఇలా కైకేయి గురించి సీత అన్న మాటలు నాలుక చివరి దాకా వచ్చినా సుమంత్రుడు కప్పిపుచ్చి కౌసల్యకి ఆనందం కలిగించే తియ్యటి మాటలు చెప్పాడు.
‘ప్రయాణం చేతగాని, వాయువేగం చేతగాని, కంగారు పడటం వల్ల కాని, ఎండ చేత కాని, చంద్ర కిరణాలతో సమానమైన సీత శరీర కాంతి ఏ మాత్రం వాడిపోలేదు. పూర్ణచంద్రుడి లాంటి వెలుగు కల, పద్మంతో సమానమైన ఆ సీత మొహం ఎంత మాత్రం పాలిపోలేదు. ఆమె పాదాలకి లత్తుక (పారాణి లాంటిది) రాసుకోకపోయినా అవి ఇప్పుడు కూడా లత్తుకలా ఎర్రగా ఉండి, పద్మాల మొగ్గల్లా కాంతితో ప్రకాశిస్తున్నాయి. సీత ఆడుకుంటున్నట్లు నడుస్తూంటే, ఆమె కాలి అందెలు ఆమె విలాసానికి ఘోషిస్తున్నట్లున్నాయి. రాముడికి ఆనందం కలిగించడానికి సీత ఆభరణాలని వేసుకుంది. అడవిలోని సీత రాముడి బాహుబలంతో రక్షించబడుతూ, ఏనుగుని కాని, సింహాన్ని కాని, పులిని కాని చూసి కూడా భయపడటంలేదు. వాళ్లని గురించి కాని, మనల్ని గురించి కాని, మహారాజుని గురించి కాని నువ్వు విచారించాల్సిన పని లేదు. ఆ సీతారామ లక్ష్మణులు విచారాన్ని వదిలి, సంతోషించే మనసులతో మహర్షులు నడిచే మార్గంలో స్థిరంగా ఉండి, అడవిలో ఆనందంగా ఉంటూ, అక్కడ దొరికే పళ్లని తింటూ, తండ్రి ఇచ్చిన మాటని పాలిస్తున్నారు’ సుమంత్రుడు ఈ విధంగా బాధని నివారించడానికి చాకచక్యంగా మాట్లాడుతున్నా, కౌసల్య పుత్రశోకంతో ‘ప్రియమైన రామా!’ అని అరవడం మానలేదు. (అయోధ్యకాండ సర్గ 60)
వెంటనే ఓ పాతికేళ్ల యువకుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘నా పేరు రామదాసు. నేను రామాయణం మీద రీసెర్చ్ స్కాలర్‌ని. మీరు చెప్పిన కథంతా బావుంది కాని కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని చెప్తాను వినండి.’
మీరా తప్పులని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
చిత్రకూటం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు రాముడి మీద రాసిన
పుస్తకం పేరేమిటి?
-పాదుకా పట్ట్భాషేకం
*
1.సుమంత్రుడు మూడో రోజు సాయంత్రానికి అయోధ్యకి చేరాడు. హరిదాసు తప్పుగా ఐదో రోజు అని చెప్పాడు.
2.సుమంత్రుడు తన మొహం ఇతరులకి కనపడకుండా కప్పుకుని దశరథుడి ఇంటికి చేరాడు. మొహం కప్పుకోవడం గురించి హరిదాసు చెప్పలేదు.
3.జనంతో కిక్కిరిసి ఉన్న ఏడు వాకిళ్లని సుమంత్రుడు దాటి ఎనిమిదో కక్షలోకి దశరథుడి దగ్గరికి వెళ్లాడు. ఈ సమాచారం హరిదాసు చెప్పలేదు.
4.కౌసల్య తప్ప సుమిత్ర ఈ సందర్భంలో దశరథుడితో మాట్లాడలేదు. హరిదాసు పొరపాటుగా సుమిత్ర మాట్లాడినట్లుగా చెప్పాడు.
5.యయాతి పేరు బదులు హరిదాసు భృగు మహర్షి పేరుని తప్పుగా చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి