రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..73 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడు గంగని దాటి దక్షిణ తీరం చేరిన తర్వాత గుహుడు సుమంత్రుడితో చాలాసేపు మాట్లాడాడు. వారు అక్కడే ఉండి సీతారామ లక్ష్మణులు భరద్వాజుడి దగ్గరకి వెళ్లి ఆయనతో గడిపి చిత్రకూటానికి వెళ్లడం గురించి తెలుసుకున్నారు. గుహుడు చాలా దుఃఖంగా తన ఇంటికి తిరిగి వెళ్లాడు. తర్వాత రాముడి అనుమతి పొందిన సుమంత్రుడు ఉత్తమమైన గుర్రాలని రథానికి కట్టి, విచారంతో అయోధ్యకి తిరిగి బయలుదేరాడు.
సువాసనలు గల అడవులని, నదులని, సరస్సులని, గ్రామాలని, నగరాలని చూస్తూ సుమంత్రుడు వాటిని వేగంగా దాటాడు. ఐదో రోజు సాయంత్రానికి అయోధ్యకి చేరి ఆనందం లేని నగరాన్ని చూశాడు. అతను వేగంగా పరిగెత్తే గుర్రాలతో నగర ద్వారంలోంచి నగరంలోకి ప్రవేశించాడు. నిశ్శబ్దంగా, పాడుబడ్డట్లుగా ఉన్న అయోధ్యని చూసి మనసులో బాగా బాధపడుతూ ‘ఏనుగులు, గుర్రాలు, మనుషులు, రాజుతో కూడిన ఈ నగరం రాముడి గురించిన విచారంతో బాధపడుతూ శోకాగ్నిలో కాలిపోలేదు కదా?’ అనుకున్నాడు. సుమంత్రుడి రాకని చూసిన వేల కొద్దీ ప్రజలు ‘రాముడు ఎక్కడ? రాముడు ఎక్కడ?’ అని అడుగుతూ రథం వెంట పరిగెత్తారు.
‘నేను గంగా తీరంలో రాముడికి వీడ్కోలు చెప్పి, ధర్మాత్ముడైన ఆ మహాత్ముడి అనుమతితో తిరిగి వచ్చాను’ అతను వారికి జవాబు చెప్పాడు.
సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి వెళ్లారని విన్న ఆ ప్రజలు ‘అయ్యో! ఛీ!’ అని తమని తామే నిందించుకుంటూ ‘హా! రామా!’ అని అరిచారు. ‘రాముడు ఇక మనకి కనపడడు. మనం చచ్చిన వాళ్లతో సమానం అయ్యాము. దానాల్లో, యజ్ఞాల్లో, పెళ్లిళ్లలో, గొప్ప సమాజాల్లో మనం రాముడ్ని చూస్తూండే వాళ్లం. ఇక అతను మనకి కనిపించడు. రాముడు తండ్రిలా ఈ జనానికి ఏది అవసరమైంది? ఏది ఇష్టమైంది? ఏది వీళ్లకి సుఖం కలిగిస్తుంది? అని అనేకసార్లు ఆలోచించి ఈ నగరాన్ని పరిపాలించేవాడు’ అని గుంపులు గుంపులుగా చేరి అనుకునే ప్రజల మాటలని సుమంత్రుడు విన్నాడు.
కిటికీల్లోంచి ఆడవాళ్ల ఏడుపులు, వీధుల్లో ప్రజల రోదనలని సుమంత్రుడు విన్నాడు. సుమంత్రుడు రాజమార్గం మీద దశరథుడి ఇంటికి చేరాడు. రథం దిగి, వేగంగా రాజగృహంలోకి ప్రవేశించాడు. మిద్దెల్లోను, ఏడంతస్థుల మేడల్లోను, ప్రాసాదాల్లోను ఉన్న స్ర్తిలు సుమంత్రుడిని చూసి రాముడు కనపడకపోవడంతో నీరసించి హాహాకారాలు చేశారు. విచారంతో బాధపడే వాళ్లు వేగంగా కన్నీరు కార్చడంతో ఒకరినొకరు సరిగ్గా చూసుకోలేక పోయారు. రామశోకంతో బాధపడే దశరథుడి భార్యలు ప్రాసాదాల్లో మెల్లగా ‘రాముడితో కలిసి వెళ్లి ఇప్పుడు రాముడు లేకుండా తిరిగి వచ్చిన సుమంత్రుడు దుఃఖించే కౌసల్యకి ఏం సమాధానం చెప్తాడు?’
‘వద్దన్నా వినకుండా కొడుకు దూరంగా వెళ్లిపోయాక కూడా కౌసల్య బతికే ఉంది. ఇలా జీవించడం చాలా కష్టం. అది అంత సులభంగా చేయగలిగే పనికాదు’ అనుకోవడం సుమంత్రుడు విన్నాడు.
ఈ మాటలు వింటూ సుమంత్రుడు శోకంతో రగులుతున్న ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. తెల్లటి ఇంట్లో దీనుడై, పుత్రశోకంతో ముఖవర్ఛస్సు కోల్పోయి విచారంతో కూర్చున్న రాజుని చూశాడు. ఆయన్ని సమీపించి నమస్కరించి, రాముడు పంపిన సందేశాన్ని యథాతథంగా చెప్పాడు. రాజు దాన్ని వౌనంగా విన్నాడు. ఆయన మనసు కలత చెంది, దుఃఖంతో మూర్ఛతో నేల మీద పడ్డాడు. వెంటనే అంతఃపురంలోని వారంతా చేతులెత్తి ఏడ్చారు. నేలపై పడ్డ భర్తని కౌసల్య, సుమిత్ర లేవదీశారు. సుమిత్ర ఆయనతో చెప్పింది.
‘రాజా! ఎవరూ చేయలేని పనులు చేసిన రాముడి దూతగా సుమంత్రుడు అడవి నించి వచ్చాడు. ఆయనతో దేనికి మాట్లాడటంలేదు? చెయ్యకూడని పని చేసి ఇప్పుడు ఈ విధంగా ఎందుకు సిగ్గు పడుతున్నావు? లే. మాట నిలుపుకున్న పుణ్యం లభించింది కదా? ఇలా విచారిస్తే ఎవరు సహాయం చేస్తారు? ఏ కైకేయికి భయపడి సుమంత్రుడితో రాముడి గురించి మాట్లాడటం లేదో ఆ కైకేయి ఇక్కడ లేదు. నువ్వు నిర్భయంగా మాట్లాడచ్చు’
విచారంతో నిండిన కౌసల్య కన్నీటితో డగ్గుత్తికగా మాట్లాడుతూ వెంటనే కింద పడిపోయింది. ఇలా నేల మీద పడి విలపించే కౌసల్యని, మూర్ఛపోయిన భర్తని చూసి ఆ స్ర్తిలంతా గట్టిగా ఏడ్చారు. అంతఃపురం నించి బయలుదేరిన ఆ రోదన ధ్వనిని విని అన్నిచోట్లా వృద్ధులు, యువకులు, స్ర్తిలు ఏడ్చారు. అప్పుడు మళ్లా ఆ నగరం దుఃఖంతో నిండిపోయింది. (అయోధ్యకాండ సర్గ 57)
కొద్దిసేపటికి రాజు తేరుకుని రాముడి గురించి తెలుసుకోవడానికి సుమంత్రుడ్ని పిలిచాడు. అతను చేతులు జోడించి, రాముడి గురించే ఆలోచిస్తూ శోకంతో కృంగిపోయిన దశరథుడి దగ్గరికి వెళ్లాడు. వృద్ధుడైన దశరథుడు బాగా కాలిపోయే మనసు గల కొత్తగా పట్టుకు వచ్చిన ఏనుగులా దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆరోగ్యం లేని ఏనుగులా ఆలోచిస్తున్నాడు. శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి, దీనంగా కన్నీటితో నిండిన మొహంతో తన దగ్గరికి వచ్చిన సుమంత్రుడ్ని చూసి రాజు చాలా విచారిస్తూ ఇలా చెప్పాడు.
‘సుమంత్రా! ధర్మాత్ముడైన ఆ రాముడు ఎక్కడ చెట్ల కింది నివసించగలడు? ఇంతవరకూ చాలా సుఖపడిన రాముడు ఏం తినగలడు? రాజకుమారుడైన రాముడు ఎన్నడూ దుఃఖాలకి అలవాటు పడ్డవాడు కాడు. ఉత్తమమైన పరుపుల మీద పడుకోవడానికి అలవాటుపడ్డ అలాంటి రాముడు అనాథలా నేల మీద దుఃఖంతో ఎలా పడుకుంటున్నాడు? ఏ రాముడు ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తూండగా కాలి బంట్లు, రథాలు, ఏనుగులు వెంట వెళ్లేవో ఆ రాముడు నిర్జనమైన అడవిలో ఎలా నివసిస్తాడో? సీతారామ లక్ష్మణులు క్రూర మృగాలతోను, తాచుపాములతోను నిండిన అడవికి ఎలా చేరారు? దీన ఐన సుకుమారి సీతతో కలిసి ఆ రాజకుమారులు రథం నించి కిందకి దిగి పాదచారులై అడవిలోకి ఎలా ప్రవేశించారు? సుమంత్రా! అశ్వనీ దేవతలు మందర పర్వత ప్రాంతానికి ప్రవేశించినట్లు, అడవిలో ప్రవేశించే నా కొడుకులని చూడగలిగిన నువ్వు ఎంత అదృష్టవంతుడివి? అడవికి చేరిన తర్వాత రాముడు ఏమన్నాడు? లక్ష్మణుడు ఏమన్నాడు? సీత ఏమంది? సుమంత్రా! రాముడు ఎక్కడ కూర్చున్నాడో, ఎక్కడ పడుకున్నాడో, ఎక్కడ తిన్నాడో చెప్పు. ఆ విషయాలని వింటూ నేను సత్పురుషుల వల్ల భృగు మహర్షి జీవించినట్లు జీవిస్తాను’
దశరథుడి ఈ ప్రశ్నలని విని సుమంత్రుడు విచారంతో తడబడే మాటలతో రాజుకి ఇలా చెప్పాడు.
‘మహారాజా! రాముడు ధర్మానే్న పాటిస్తూ చేతులు జోడించి, తలని వంచి నీకు నమస్కరిస్తూ నాతో ఇలా చెప్పాడు. ‘సుమంత్రా! గొప్ప బుద్ధిగల మహాత్ముడు, నమస్కరించదగిన వాడైన నా తండ్రికి నేను తలని వంచి నమస్కరిస్తున్నట్లుగా చెప్పు. అంతఃపురంలోని వారిని అందరినీ ఎలాంటి తేడా లేకుండా క్షేమం అడిగానని, ఆయా వ్యక్తులకి వారి యోగ్యతని బట్టి అభివాదం చేసానని చెప్పు. నా తల్లి కౌసల్యకి నా క్షేమాన్ని, నా అభివాదాన్ని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఈ మాటలు కూడా చెప్పు. ‘అమ్మా! ధర్మంలో స్థిరంగా ఉంటూ సమయానికి అగ్ని గృహంలో అగ్నిహోమాలు మొదలైనవి చేస్తూ, దేవతలకి సేవ చేస్తున్నట్లుగా దశరథుడికి సేవ చేస్తూ ఆయన్ని రక్షించు. అమ్మా! అహంకారాన్ని, నేను పట్టపు రాణిని అనే ఆలోచనని వదిలి నా మిగిలిన తల్లుల విషయంలో అభిమానంగా ఉండు. పూజ్యురాలైన కైకేయి రాజుకి అనుకూలంగా ఉండేలా చేయి. భరతుడు నీకూ కొడుకే. అతన్ని కూడా రాజులా గౌరవించు. రాజులు సంపదలో గొప్పవాళ్లు కదా? రాజధర్మాన్ని గుర్తుంచుకో. భరతుడి క్షేమం అడిగి, అతనితో ‘తల్లులందరి విషయంలో న్యాయంగా ప్రవర్తించు’ అని చెప్పు. ఇక్ష్వాకు వంశానికి ఆనందకరుడైన భరతుడితో మరో మాట కూడా చెప్పు. ‘నువ్వు యవ రాజ్యాన్ని పొందాక మహారాజుగా ఉన్న తండ్రి అనుమతి ప్రకారం రాజ్యపాలన చెయ్యి. రాజు చాలా ముసలివాడయ్యాడు. ఏ విషయంలోను ఆయన్ని నిర్బంధించకు. ఆయన ఆజ్ఞని పాటిస్తూ నీ యవ రాజ్యాన్ని పాలించు’ అధికంగా కన్నీరు కారుస్తూ నాతో రాముడు మళ్లీ భరతుడికి చెప్పమని ఇలా చెప్పాడు. ‘కొడుకు మీద అధిక ప్రేమగల నా తల్లిని నీ తల్లిలా చూసుకో’. మహారాజా! కమలాల్లాంటి ఎర్రటి కళ్లు, కీర్తిగల రాముడు నాతో ఇలా మాట్లాడుతూనే బాగా ఏడ్చాడు. లక్ష్మణుడు మాత్రం కోపంతో నిట్టూరుస్తూ ఇలా చెప్పాడు. ‘ఈ రాజకుమారుడు ఏం తప్పు చేసాడని ఇతన్ని వెళ్లగొట్టారు? రాజు కైకేయికి ఇచ్చిన తుచ్ఛమైన వరాన్ని పాటించి చెయ్యకూడని పనిని చేయదగ్గ పనిని చేసినట్లుగా చేసాడు. దీంతో మేమంతా కష్టపడాల్సి వచ్చింది. రాముడు రాజ్యం మీద దురాశతో వెళ్లగొట్టబడినా, వరం అనే కారణంతో వెళ్లగొట్టబడ్డా చేసిన పని మాత్రం చెడ్డపనే. ఈ రామ త్యాగం అనేది నేను రాజుని కదా అని దశరథుడు ఇష్టం వచ్చినట్లు చేసిందే తప్ప వేరే కారణం నాకు కనపడటంలేదు. సరిగ్గా ఆలోచించకుండా, తెలివితక్కువగా రాముడ్ని అడవికి పంపడం విచారాన్ని కలిగిస్తోంది. నేను రాజుని తండ్రిలా చూడను. నాకు సోదరుడైనా, ప్రభువైనా, బంధువైనా, తండ్రైనా రాముడే. సకల జనాలు ప్రేమించే, వారి మంచి కోరే రాముడ్ని వదిలేసిన నీ విషయంలో ఎవరికి అనురాగం ఉంటుంది? సకల జనాల మనసుని దోచిన, ధార్మికుడైన రాముడ్ని అడవికి పంపి ప్రజలందరితో విరోధం తెచ్చుకున్న నువ్వు రాజుగా ఎలా ఉండగలవు?’
‘మహారాజా! ఆత్మాభిమానం గల సీత నిట్టూరుస్తూ తనని తాను మర్చిపోయి దెయ్యం పట్టిన దానిలా, ఉన్మాదిలా నిలబడింది. పూర్వం ఎన్నడూ ఇలాంటి అనుభవం లేని సీత విచారంతో ఏడుస్తూ నాతో ఏం మాట్లాడలేదు. తిరుగు ప్రయాణమైన నన్ను చూసి సీత వాడిపోయిన ముఖంతో భర్త వైపు చూస్తూ కన్నీరు కార్చింది. రాముడు కూడా కన్నీటితో నిండిన మొహంతో చేతులు జోడించి నమస్కరిస్తూ లక్ష్మణుడి భుజాన్ని ఆనుకుని నిలబడ్డాడు. దీనురాలైన సీత ఏడుస్తూ నా వైపు, రాజరథం వైపు చూస్తూండిపోయింది’ సుమంత్రుడు చెప్పాడు (అయోధ్యకాండ సర్గ 58)
ఆ కథ విన్నాక తిరిగి ఇంటికి వెళ్తూ ఆశే్లషతో వచ్చిన వాడి తల్లి శారదాంబ చెప్పింది.
‘హరిదాసు కంఠం బావుంటుంది. భావయుక్తంగా కథ చెప్తాడు. కానీ ప్రతీసారి కొన్ని తప్పులు చెప్తూంటాడు. ఈ రోజు కథలో ఐదు తప్పులు చెప్పాడు.’
మీరా ఐదిటిని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న

శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు రాముడి మీద రాసిన పుస్తకం పేరేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:

యమునా నది సోదరుడు ఎవరు?
యమధర్మరాజు
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
1.్భరద్వాజ మహర్షి రామలక్ష్మణుల వెంట కొంత దూరం వెళ్లి సాగనంపాడు. దీన్ని హరిదాసు చెప్పలేదు.
2.గంగాయమునల సంగమానికి వెళ్లాక యమునా నది ప్రవహించే పడమటి వైపు దాన్ని అనుసరించి వెళ్లమని భరద్వాజుడు చెప్పాడు. హరిదాసు తప్పుగా తూర్పు వైపునకు అని చెప్పాడు.
3.‘యమునా నది సూర్యుడి కూతురు’ అని భరద్వాజుడు చెప్పాడు. ఇది హరిదాసు విస్మరించాడు.
4.రాముడు ఇంకా నిద్రపోయే లక్ష్మణుడ్ని మెల్లిగా తట్టి లేపాడు. కాని హరిదాసు దీనికి వ్యతిరేకంగా లక్ష్మణుడు రాముడ్ని లేపినట్లుగా చెప్పాడు.
5.లక్ష్మణుడు చంపిన లేడి పవిత్రమైన కృష్ణసారం అనే లేడి. ఇది హరిదాసు చెప్పలేదు.
6.చిత్రకూట పర్వతం మీది నది పేరు మాల్యవతీ నది. ఈ పేరుని హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి