రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..72 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతృవినాశకులైన ఆ రాజకుమారులు ఆ రాత్రి భరద్వాజాశ్రమంలో గడిపి, మర్నాడు భరద్వాజ మహర్షికి నమస్కరించి చిత్రకూట పర్వతానికి ప్రయాణమయ్యారు. వారిని భరద్వాజుడు ఆశీర్వదించి తన పిల్లలు వెళ్లేప్పుడు సాగనంపినట్లుగా సాగనంపాడు. గొప్ప తేజశ్శాలైన ఆ ముని నిజ పరాక్రమం గల రామలక్ష్మణులతో ఇలా చెప్పాడు.
‘ఓ రామలక్ష్మణులారా! గంగా, యమునల సంగమ ప్రదేశానికి చేరుకున్నాక అక్కడ నించి తూర్పు వైపు ప్రవహించే యమునా నదిని అనుసరించి వెళ్లండి. వేగంగా ప్రవహించే యమున దగ్గరికి వెళ్లి చాలామంది సేవించే అతి పురాతనమైన ఆ నదీ తీర్థాన్ని చూసి అక్కడ ఓ తెప్పని నిర్మించుకుని, ఆ నదిని దాటి వెళ్లండి. ఆ తర్వాత పచ్చటి ఆకులు గల శ్యామం అనే అతి విశాలమైన మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని చుట్టూ అనేక వృక్షాలు ఉంటాయి. దాన్ని ఆశ్రయించి సిద్ధులు నివసిస్తూంటారు. సీత ఆ మహావృక్షానికి నమస్కరించి శుభం జరగాలని కోరుకోవచ్చు. కావాలనుకుంటే దాని దగ్గర మీరు ఆగచ్చు. లేదా దాటి ముందుకి వెళ్లచ్చు. అక్కడ నించి ఓ క్రోసు వెళ్లాక మోదుగ, రేగు చెట్లతో యమునా తీరంలో పుట్టిన వెదురు డొంకలతో నిండిన అందమైన నీలి అడవి కనిపిస్తుంది. అదే చిత్రకూటానికి వెళ్లే దారి. నేను అనేకసార్లు ఆ దారిలో ప్రయాణం చేశాను. అది అందమైంది, సుఖకరం. అక్కడ దావాగ్ని భయంలేదు.’
రాముడు ‘అలాగే వెళ్తాం. మీరు వెనక్కి వెళ్లండి’ అని కోరి నమస్కారం చేశాడు. ఆయన వెనక్కి వెళ్లాక రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పాడు.
‘లక్ష్మణా! భరద్వాజ ముని మన మీద చూపే దయకి మనం అదృష్టవంతులం. మనం పుణ్యం చేసాం’
ఉత్తమమైన మనసులు గల ఆ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ, సీత ముందు నడుస్తూండగా యమునా నదిని చేరుకున్నారు. అక్కడ వాళ్లు వేగంగా ప్రవహించే యమునని ఎలా దాటాలా అని ఆలోచించి, కొన్ని ఎండిన కర్రలని తెప్పగా కట్టి, వాటి మీద ఎండిన వెదుళ్లు, గడ్డి పరిచారు. తర్వాత పరాక్రమవంతుడైన లక్ష్మణుడు నీటి ప్రబ్బలి చెట్ల కొమ్మలని, నేరేడు కొమ్మలని విరిచి తీసుకువచ్చి దాని మీద సీతకి సుఖకరమైన ఆసనాన్ని తయారుచేశాడు. రామలక్ష్మణులు దాన్ని గట్టిగా కదలకుండా పట్టుకున్నాక దశరథ కుమారుడైన రాముడు కొంచెం సిగ్గుపడే ప్రియురాలైన సీతని తెప్ప పైకి ఎక్కించాడు. సీత దుస్తులు, ఆభరణాలు, చిన్న గునపం, మేక తోలుతో చేసిన పుటిక, ఆయుధాలని కూడా రాముడు తెప్ప మీద సీత పక్కన ఉంచాడు. ముందుగా సీతని ఎక్కించాక వాళ్లు ఎక్కి దాన్ని నడుపుతూ యమునా నదిని దాటారు. నది మధ్యకి చేరినప్పుడు సీత ఆ నదికి నమస్కరించి ప్రార్థించింది.
‘ఓ యమునా దేవీ! నేను నిన్ను దాటి వెళ్తున్నాను. మాకు మంచి జరుగు గాక! నా భర్త అరణ్యవాసాన్ని పూర్తి చేసుకో గాక! రాముడు ఇక్ష్వాకులు పాలించే అయోధ్యకి తిరిగి వచ్చాక నీకు వెయ్యి ఆవులని, వంద కల్లు కుండలని సమర్పించి పూజిస్తాను’
మంచి వర్ఛస్సు గల సీత యమునా నదికి నమస్కరించి ప్రార్థిస్తూండగానే తెప్ప దక్షిణ తీరం చేరింది.
ఇలా సీతారామ లక్ష్మణులు అలలతో వేగంగా ప్రవహించే సూర్యుడి కూతురైన యమునా నదిని దాటారు. ఆ తెప్పని వదిలి అనేక వృక్షాలు గల తీరం నించి అడవిలోకి వెళ్లి పచ్చటి ఆకులతో నిండిన శ్యామం అనే చల్లటి మర్రిచెట్టుని సమీపించారు. సీత దానికి నమస్కారం చేసి ఇలా ప్రార్థించింది.
‘ఓ మహావృక్షమా! నీకు నమస్కారం. నా భర్త తన వ్రతాన్ని పూర్తి చేయుగాక. నేను మళ్లీ అయోధ్యని చేరి కౌసల్యా, సుమిత్రలని చూసెదను గాక’
తన ప్రియురాలు, విధేయురాలు, దోషాలు లేనిదైన సీత ప్రార్థన ముగిసాక రాముడు లక్ష్మణుడితో చెప్పాడు.
‘్భరతుడి తమ్ముడవైన ఓ లక్ష్మణా! నువ్వు సీతని తీసుకుని ముందు నడు. నేను ఆయుధాలని ధరించి వెనక నడుస్తాను. సీత ఏ పూలని, ఏ పళ్లని కోరుతుందో వాటిని, ఆమె మనసుకి సంతోషాన్ని కలిగించే ఇతర వస్తువులని ఆమెకి ఇస్తూండు’
రామలక్ష్మణుల మధ్య నడిచే సీత రెండు ఏనుగుల మధ్య నడిచే అందమైన ఆడ ఏనుగులా ప్రకాశించింది. తను పూర్వం చూడని ఏదైనా చెట్టు కాని, పొద కాని, పూలతో నిండిన లత కాని కనపడితే సీత దాని గురించి రాముడ్ని అడగసాగింది. వెంటనే లక్ష్మణుడు పూలతో నిండిన అందమైన అనేక రకాల పూలగత్తులని తెచ్చి ఇవ్వసాగాడు. సీత విచిత్రమైన ఇసక, నీరు గల, హంస, సారస ధ్వనులతో నిండిన యమునా నదిని చూసి ఆనందించింది.
వారు ఓ క్రోసు దూరం నడిచాక సోదరులైన రామలక్ష్మణులు ఆ యమునా తీరంలోని పవిత్రమైన అనేక జంతువులని చంపి తిన్నారు. ఆ యమునా నదీ తీర ప్రాంతం నెమళ్ల ధ్వనులతో నిండి ఉంది. అక్కడ కోతులు, ఏనుగులు నివసిస్తున్నాయి. అలాంటి ఆ ప్రదేశంలో విహరిస్తూ వారు అనుకూలమైన, మిట్టపల్లాలు లేని ఓ స్థానాన్ని చేరి ఆ రాత్రి అక్కడ విశ్రమించారు. (అయోధ్యకాండ సర్గ 55)
ఆ రాత్రి గడిచాక ముందుగా నిద్ర లేచిన లక్ష్మణుడు ఇంకా నిద్రపోయే రాముడ్ని మెల్లిగా తట్టి లేపాడు.
‘లక్ష్మణా! అడవి మృగాలు చేసే మధురమైన ధ్వనులని విను. ఇది మనం బయల్దేరడానికి తగిన సమయం. అందువల్ల బయలుదేరుదాం’
తెల్లవారుఝామున సోదరుడి చేత నిద్ర లోంచి మేలుకొలపబడ్డ రాముడు నిద్రని, సోమరితనాన్ని, అలసటని కూడా వదిలేసాడు. వారంతా లేచి మంగళప్రదమైన యమునలో స్నానం చేసి భరద్వాజుడు చెప్పిన చిత్రకూట పర్వత దారి పట్టారు.
తెల్లవారుఝామునే లక్ష్మణుడితో కలిసి ప్రయాణమైన రాముడు కమల రేకుల వంటి కళ్లు గల సీతతోచెప్పాడు.
‘సీతా! శిశిర ఋతువు వెళ్లిపోవడంతో ఈ కింశుక చెట్లు అంతటా పూసి ఎర్రటి పూలతో మండుతున్నట్లు ఉన్నాయి. వాటి పూలతోనే అవి మాలలు ధరించినట్లున్నాయి. చూడు. ఈ జీడి చెట్లు వికసించి, ఫల పుష్పాలతో వంగి ఉన్నాయి. కాని ఈ ఫలాలని అనుభవించడానికి ఇక్కడ మనుషులు ఎవరూ లేరు. వీటిని చూడు. ఇలాంటి చెట్లు గల ఈ ప్రదేశంలో మనం తప్పక సుఖంగా జీవించచ్చు. లక్ష్మణా! ప్రతీ చెట్టు మీద తేనెటీగలు పెట్టిన పెద్ద తేనె పట్లు తొట్టెల్లా వేలాడుతున్నాయి చూడు. పూలు రాలి దట్టంగా కప్పబడ్డ ఈ అందమైన అడవిలో వానకోయిల కూస్తూంటే నెమలి దానికి జవాబుగా కూస్తోంది. చాలా ఎతె్తైన శిఖరాలు గల ఈ చిత్రకూట పర్వతం మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. పక్షులు కూస్తున్నాయి. దీన్ని చూడు నాయనా! అనేక చెట్లతో నిండిన చదునైన నేల గల పవిత్రమైన ఈ చిత్రకూట పర్వత వనంలో సుఖంగా క్రీడిద్దాం’
నడిచి వెళ్లే సీతా రామలక్ష్మణులు అందమైన, మనసుకి ఇంపుగా ఉన్న చిత్రకూట పర్వతాన్ని చేరారు. దాని మీద అనేక జాతుల పక్షులు గుంపులుగా ఉన్నాయి. దుంపలు, పళ్లు అక్కడ అధికంగా లభిస్తాయి. మంచి రుచిగల నీళ్లతో ఆ పర్వతం అందంగా, సమృద్ధంగా ఉంది. దాని దగ్గరకి వెళ్లాక రాముడు చెప్పాడు.
‘లక్ష్మణా! అందమైంది, అనేక రకాల చెట్లు, లతలు, దుంపలు, పళ్లు గల అందమైన ఈ చిత్రకూట పర్వతం మీద సుఖంగా జీవించచ్చని నాకు అనిపిస్తోంది. దీని మీద మహాత్ములైన మునులు కూడా నివసిస్తున్నారు. మనం ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఆనందంగా ఉందాం’
ఇలా నిర్ణయించుకుని సీతారామ లక్ష్మణులు ఓ ఆశ్రమం దగ్గరికి వెళ్లి చేతులు జోడించి వాల్మీకికి నమస్కరించారు. ధర్మవేతె్తైన ఆ వాల్మీకి మహర్షి చాలా సంతోషించి, వాళ్లని పూజించి, స్వాగతం చెప్పి, కూర్చోమని కోరాడు. తర్వాత ఆజానుబాహువు, సర్వసమర్థుడైన రాముడు తన గురించి ఋషికి ఉన్నదున్నట్లుగా చెప్పి లక్ష్మణుడితో చెప్పాడు.
‘లక్ష్మణా! దృఢమైన, శ్రేష్టమైన కర్రలని తీసుకువచ్చి ఇంటిని నిర్మించు. ఒక నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాను’
లక్ష్మణుడు ఆ ఆజ్ఞ ప్రకారం అనేక రకాల చెట్లని తెచ్చి పర్ణశాలని నిర్మించాడు. చాపలతో ఆవరణని ఏర్పాటు చేసి కదలకుండా ఉండేలా కట్టిన ఆ అందమైన పర్ణశాలని చూసిన రాముడు చెప్పాడు.
‘లక్ష్మణా! ఎక్కువ కాలం ఉందామనుకునే వాళ్లు వాస్తు దేవతా శాంతిని చేసుకోవాలి. అందువల్ల మనం లేడి మాంసాన్ని తెచ్చి పర్ణశాలని పూజిద్దాం. ఒక లేడిని చంపి వెంటనే ఇక్కడికి తీసుకురా. శాస్త్రప్రకారం చెయ్యాలి కదా. ఈ ధర్మం నీకూ తెలుసు కదా’
శతృ వీరులని సంహరించే లక్ష్మణుడు రాముడు చెప్పినట్లుగా చేసాడు. మళ్లీ రాముడు లక్ష్మణుడితో చెప్పాడు.
‘ఓ సౌమ్యుడా! ఈ లేడి మాంసాన్ని ఉడికించు. పర్ణశాలకి పూజ చేద్దాం. ఈ రోజు, ముహూర్తం సిద్ధమైనవి’
తర్వాత లక్ష్మణుడు ఓ లేడిని చంపి దాన్ని రగిలే నిప్పులో పడేసి, దాని మాంసాన్ని ఉడికించాడు. బాగా కాలి, రక్తం తొలగిపోయిన ఆ లేడి బాగా ఉడికాక రాముడితో చెప్పాడు.
‘అంగవైకల్యం ఏమీ లేని ఈ కృష్ణ మృగాన్ని పూర్తిగా ఉడికించాను. దేవతలతో సమానమైన ఓ రామా! దేవతా పూజ చెయ్యి. అలాంటి పనులకి నువ్వే సమర్థుడివి’
గుణవంతుడు, జపించాల్సిన మంత్రాలు బాగా తెలిసిన రాముడు స్నానం చేసి, వాస్తు పూజా సమయంలో పఠించాల్సిన మంత్రాలు అన్నిటినీ నియమంగా, వివరంగా చదివాడు. దేవతలు అందర్నీ పూజించి పర్ణశాలలోకి పవిత్రంగా ప్రవేశించగానే అమితమైన తేజస్సు గల రాముడి మనసులో ఆహ్లాదం కలిగింది. రాముడు విశే్వ దేవతలకి, శివుడికి, విష్ణువుకి బలులు సమర్పించి వాస్తు శాంతికి సంబంధించిన మంత్రాలని నియమం ప్రకారం జపించి యధావిధిగా నదిలో స్నానం చేసి, పాపాలని నశింపచేసే ఉత్తమ బలిని ఇచ్చాడు. లక్ష్మణుడు ఆశ్రమంలో ఉండాల్సిన అరుగులని, ఆలయాన్ని, అగ్ని గృహాన్ని కూడా నిర్మించాడు. ఉత్తమ లక్షణాలు గల సీతారామ లక్ష్మణులు అడవిలో లభించే పూల మాలలు, ఫలాలు, దుంపలు, వండిన మాంసం, నీరు, దర్భలు, సమిధలు, కుశలు మొదలైన వాటితో యధావిధిగా భూతశాంతి చేసి శుభకరమైన పర్ణశాలలోకి ప్రవేశించారు. చెట్ల ఆకుల కప్పుగా, ఏ ప్రదేశంలో ఎలా వుండాలో అలా నిర్మించిన, గాలి తాకిడి లేని అందమైన పర్ణశాలలోకి సీతారామ లక్ష్మణులు ముగ్గురూ కలిసి, దేవతా గణాలు సుధర్మ అనే దేవసభలోకి ప్రవేశించినట్లుగా ప్రవేశించారు. జితేంద్రియులైన రామలక్ష్మణులు అనేక పక్షులు, జంతువులతో నిండి, చిత్రమైన పూల గుత్తులతో నిండిన చెట్లు, మదపుటేనుగులు, ఇతర జంతువుల ధ్వనులతో మారుమోగే ఉత్తమమైన ఆ అడవిలో సుఖంగా విహరించారు.
చాలా అందంగా ఉన్న చిత్రకూట పర్వతాన్ని, పక్షులు, జంతువుల దాహం తీర్చుకునే మంచి తీర్థాలు గల నదిని, చూసి వారు చాలా ఆనందిస్తూ తమ నగరాన్ని వదిలి వచ్చిన దుఃఖాన్ని మర్చిపోయారు. (అయోధ్యకాండ సర్గ 56)
అయ్యా! ఇది ఇవాళ్టి కథ. ‘రేపు మళ్లీ 57వ సర్గలో కలుద్దాం’ హరిదాసు చెప్పాడు.
ఇంటి దగ్గర ఆ రెండు కాండలు చదువుకుని వచ్చిన ఆశే్లష అమ్మమ్మ మీనమ్మ వెంటనే హరిదాసుతో చెప్పింది.
‘ఏమయ్యోయ్. ఇవాళ హరికథలో ఆరు తప్పులు చెప్పావు. ఇలా ఐతే ఎలా?’
మీరా తప్పులని కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
యమునా నది
సోదరుడు ఎవరు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
దశావతారాల్లో రామావతారం ఎన్నో అవతారం?
ఏడవ అవతారం
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.వాళ్లు పడుకుంది ‘ఓ చెట్టు కింద’ అని వాల్మీకి రాశాడు. కాని హరిదాసు ‘మర్రిచెట్టు’ అని తప్పుగా చెప్పాడు.
2.భరద్వాజ ముని ఆశ్రమాన్ని హరిదాసు మొదట్లో అగస్త్య ముని ఆశ్రమం అని తప్పుగా చెప్పాడు.
3.గంధమాదన పర్వతం. గంధమాధవ పర్వతం కాదు.
4.మనిషి ఈ చిత్రకూట పర్వత శిఖరాలని చూస్తున్నంత వరకు మంచి పనులనే చేస్తాడు. అతని మనసులో పాపం ప్రవేశించదు అని వాల్మీకి రాశాడు. దీన్ని హరిదాసు విస్మరించాడు.
5.ఆ పర్వతం మీద కినె్నరలు, ఉరగులు నివసిస్తూంటారు అని వాల్మీకి రాశాడు హరిదాసు కింపురుషులు, దేవతలు కూడా ఉంటారని తప్పుగా చెప్పాడు.