రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం..81 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి మాటలు విన్న వశిష్ఠుడు మిత్రులతో, మంత్రులతో, బ్రాహ్మణులతో ఇలా చెప్పాడు.
‘మేనమామ ఇంటి దగ్గర భరతుడు శతృఘు్నడితో కలిసి సుఖంగా ఉన్నాడు. వీరులైన ఆ అన్నదమ్ములు ఇద్దరినీ తీసుకుని రావడానికి వేగంగా పరిగెత్తే గుఅరాల మీద దూతలు వెంటనే వెళ్లాలి. దశరథుడే భరతుడికి రాజ్యం ఇచ్చాక ఆ విషయంలో ఇంక మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు’
‘అలాగే, దూతలని పంపుతాం’ వారు చెప్పారు.
‘సిద్దార్థా! జయంతా! విజయా! అశోకా! నందనా! రండి. ఏం చేయాలో మీరంతా వినండి. ఇక్కడ నించి మీరు వెంటనే బయలుదేరి వేగంగా ప్రయాణించే గుర్రాల మీద గిరివ్రజ నగరానికి చేరుకోండి. మనసులోని దుఃఖాన్ని పైకి కనపడనీకుండా భరతుడితో నా ఆజ్ఞగా ఇలా చెప్పండి. ‘పురోహితుడు, మంత్రులు అంతా నీ కుశలం అడుగుతున్నారు. వెంటనే నువ్వు బయలుదేరి రావాలి. నీతో చాలా తొందర పని ఉంది’ రాముడు ప్రవాసానికి వెళ్లినట్లు, అతని తండ్రి మరణించినట్లు, రఘువంశీయులకి ఆపద సంభవించినట్లు అక్కడ చెప్పద్దు. భరతుడికి పట్టువస్త్రాలు, ఉత్తమమైన అలంకారాలు తీసుకుని వెళ్లండి.’
కేకయ దేశానికి వెళ్లబోయే ఆ దూతలో దారిలో కావాల్సిన భోజనం లాంటి సామాగ్రిని తీసుకుని, మంచి గుర్రాల మీద వారి ఇళ్లకు వెళ్లారు. తర్వాత వారు ప్రయాణానికి చేసుకోవాల్సిన మిగిలిన పనులు పూర్తి చేసుకుని, వశిష్ఠుడి అనుమతి తీసుకుని త్వరగా వెళ్లారు.
వారంతా అయోధ్య నించి బయలుదేరి పడమర వైపు కొంత దూరం వెళ్లి అపరతాల పర్వతం చివరి దక్షిణ భాగాన్ని దాటి, అపరతాల - ప్రలంబ పర్వతాల మధ్యగల మాలతీ నదీ తీర మార్గంలో ఉత్తరంగా ప్రయాణించి పశ్చిమం వైపు మళ్లారు. హస్తినాపురంలో గంగానదిని దాటి పడమర వైపు ప్రయాణం కొనసాగించి, కురుజాంగల దేశాల మధ్యగా పాంచాల దేశానికి చేరి, అక్కడ నించి బాగా నీళ్లతో నిండిన సరస్సులని, నిర్మలమైన నీళ్లు గల నదులని చూస్తూ పని తొందరని బట్టి వేగంగా వెళ్లారు. ఆ దూతలు నిర్మలమైన నీళ్లు, వివిధ రకాల పక్షులు, జనాలతో నిండిన శ్రేష్ఠమైన శరగంగా నదిని దాటి వేగంగా ప్రయాణం కొనసాగించారు. తీరం మీద ఉన్న సత్యోపయాచనం అనే దివ్యవృక్షాన్ని చేరుకుని, నమస్కరించతగ్గ దానికి ప్రదక్షిణం చేసి కుళింగా నగరిలోకి ప్రవేశించారు. అక్కడ నించి అభికాలం అనే గ్రామాన్ని చేరుకుని, అక్కడ బోధిభవనం అనే పర్వతం నించి ప్రవహించే పవిత్రమైన ఇక్షుమతీ నదిని దాటారు. ఆ నదీ ప్రాంత దేశాన్ని దశరథుడి పితృపితామహులు అనుభవించారు. అక్కడ దోసిళ్లతో మాత్రమే నీళ్లు తాగి జీవించే వేద విద్వాంసులైన బ్రాహ్మణులని చూసి, బాహ్లిక దేశం మధ్యగా ప్రయాణించి సుధామ పర్వతాన్ని చేరారు. అక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని, విపాశా నదినీ, శాల్మలీ వృక్షాన్ని, వివిధ నదులని, దిగుడు బావులని, తటాకాలని, చిన్న చెరువులని, సరస్సులని, అనేక విధాలైన సింహాలు, పులులు, ఏనుగులు మొదలైన అడవి జంతువులని చూస్తూ రాజాజ్ఞని పాలించాలనే ఉత్సాహంతో, అతి పొడవైన దారిలో ముందుకి సాగారు.
అతి దూర ప్రయాణం వల్ల గుర్రాలు అలసిపోయినా దూతలు వేగంగా, చక్కగా రాజగృహ నగరికి చేరారు. వారు తమ ప్రభువుకి నచ్చే విషయాల్లో రాజకులాన్ని రక్షించే విషయంలో, రాజవంశాన్ని కాపాడే విషయంలో అశ్రద్ధ చూపించకుండా రాత్రయ్యేసరికి ఆ పట్టణాన్ని చేరారు. (అయోధ్యకాండ సర్గ 68)
ఆ దూతలు నగరంలోకి ప్రవేశించిన రాత్రే భరతుడికి ఓ పీడకల వచ్చింది. రాజాధి రాజకుమారుడైన భరతుడు తెల్లవారుఝామున వచ్చిన ఆ పీడకలకి చాలా కలత పడ్డాడు. అతని బాధని గ్రహించిన ఇష్టమైన పాటలు చెప్పే స్నేహితులు అతని మనసులోని వేదనని తొలగించడానికి సభలో అనేక విధాలైన కథలు, కబుర్లు చెప్పారు. భరతుడి మనసుకి శాంతి కలగడానికి కొందరు వాద్యాలని మోగించారు. ఇంకొందరు నాటకాలు ఆడించారు. మరి కొందరు అనేక హాస్యప్రధానమైన మాటలు చెప్పారు. వారు ఎన్ని నవ్వొచ్చే మాటలు చెప్పినా భరతుడికి సంతోషం కలగలేదు. శతృఘు్నడు ‘ఓ మిత్రమా! స్నేహితులు అంతా నీ చుట్టూ ఉన్నా కూడా నువ్వు ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు?’ అని ప్రశ్నించాడు. భరతుడు ఇలా జవాబు చెప్పాడు.
‘నేను ఇంత దైన్యంగా ఉండటానికి గల కారణాన్ని విను. నా తండ్రి మలినమైన శరీరంతో, జుట్టు విరబోసుకుని పర్వత శిఖరం మీంచి ఆవుపేడతో నిండిన గోతిలో పడుతున్నట్లు కల కన్నాను. ఆయన ఆ ఆవుపేడలో తేలుతూ మాటిమాటికీ నవ్వుతూ, దోసిలితో నూనె తాగుతున్నట్లుగా కనపడ్డాడు. తర్వాత నువ్వులు కలిపిన అన్నాన్ని తిని మాటిమాటికీ తలని కిందకి వంచుతూ శరీరం మొత్తానికి నూనెని పూసుకుని, నూనెలోనే ముణిగిపోయాడు. సముద్రం ఎండిపోయినట్లు, చంద్రుడు నేల మీద పడిపోయినట్లు, చీకటి కప్పడం చేత భూమి కనపడకుండా పోయినట్లు, ఉత్సవ సమయాల్లో రాజు ఎక్కే ఏనుగు దంతాలు విరిగిపోయినట్లు, మండుతున్న అగ్ని అకస్మాత్తుగా ఆరిపోయినట్లు, భూమి బద్దలైనట్లు, చెట్లన్నీ ఎండిపోయినట్లు, పర్వతాలు పగిలిపోయి పొగతో ఆవరింపబడినట్లు నాకు కలలో కనిపించింది. ఇనుముతో చేసిన పీఠం మీద నా తండ్రి నల్లటి దుస్తులు కట్టుకుని కూర్చున్నట్లు, ఆయన్ని చూసి నల్లటి, తెల్లటి స్ర్తిలు ఎగతాళిగా నవ్వుతున్నట్లు కలలో కనిపించింది. ధర్మాత్ముడైన నా తండ్రి ఎర్రటి పూల మాలల్ని ధరించి, ఎర్రటి చందనాన్ని శరీరానికి పూసుకుని, గాడిదలు కట్టిన రథం మీదకి ఎక్కి త్వరగా దక్షిణం వైపు వెళ్లినట్లు, ఎర్రటి దుస్తులు ధరించి వికృతమైన ముఖం గల ఓ రాక్షస స్ర్తి నవ్వుతూ దశరథ మహారాజుని లాగుతున్నట్లుగా నాకు కనిపించింది. ఈ రాత్రి నేను ఇలాంటి భయంకరమైన కల గన్నాను. నాకు కాని, రాముడికి కాని, లక్ష్మణుడికి కాని చావు రాబోతోంది. ఎవరు గాడిదలు కట్టిన రథం మీద ఎక్కి వెళ్లినట్లు కల వస్తే, కొద్ది కాలంలోనే అతన్ని దహించగా చితి నించి వచ్చే పొగ కూడా ఆ కల కన్నవాడికి కనిపిస్తుంది. అంవల్లే దీనంగా ఉన్న నేను మిమ్మల్ని ఆదరించడంలేదు. నా గొంతు ఎండిపోతున్నట్లుగా ఉంది. నా మనసు కూడా సరిగ్గా లేదు. దేన్ని గురించి భయపడాలో తెలీడంలేదు. కాని భయం మాత్రం కలుగుతోంది. నా స్వరం, కాంతి తగ్గాయి. కారణం ఏం లేకుండానే నా మీద నాకే అసహ్యం కలుగుతున్నట్లుంది. పూర్వం ఎన్నడూ ఊహించని అనేక రూపాలు గల ఈ కలని చూడటం వల్ల నా తండ్రి దశరథ మహారాజు దర్శనం గురించి ఇంక ఊహించుకునే పని లేదనే విచారం కలగడంతో పుట్టిన ఈ మహాభయం నా మనసులో ఉంది.’ (అయోధ్యకాండ సర్గ 69)
ఆ హరికథ విన్న శ్రోతల్లోని ఓ వృద్ధుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘హరికథని మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, మీతో సాక్షాత్తు రాముడే తన కథని పలికిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా వినండి. ఈ కథని మళ్లీ చెప్పినప్పుడు మీరీ తప్పులని చెప్పకపోతే సరి.’
*
మీకో ప్రశ్న

భరతుడి కొడుకుల
పేర్లేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
కేకయ రాజ్య రాజధాని రాజగృహకి గల మరొక పేరేమిటి? - గిరిప్రజ
1.బ్రాహ్మణులతో వచ్చిన మునులు మొత్తం ఏడుగురు. ఆరుగురి పేర్లే హరిదాసు చెప్పాడు. కాత్యాయనుడు పేరు చెప్పలేదు.
2.భరత శతృఘు్నలు ఉన్న నగరం పేరు రాజగృహ. ఇది హరిదాసు చెప్పలేదు.
3.రాజు లేని రాజ్యంలో జరిగే అరిష్టాలలోని ‘కొడుకు కాని, భార్య కాని ఇంటి యజమాని మాట వినరు’ అని వాల్మీకి రాసింది హరిదాసు చెప్పలేదు.
4.దిక్పాలకుల్లోని ఒకరు వరుణుడు. కాని హరిదాసు తప్పుగా సూర్యుడి పేరు చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి