అమృత వర్షిణి

సంగీతం.. సంస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వమొకప్పుడు నారదుడు, తుంబురుడి సంగీతాతిశయాన్ని పరీక్షింపదలచి తుంబురుడి ఆశ్రమానికి వెళ్లాడు. తుంబురుడు లోపల నున్నాడు వీణ మాత్రం యివతల వున్నది. నారదుడు, తుంబురుని కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో కాస్త వాయువు ఆ వీణ మీదుగా ప్రసరించి వెళ్లింది. అంతే.. ఆ కాస్త గాలికి వీణాతంత్రులు మ్రోగి, శ్రవణానందంగా సప్త స్వరాలు చెవికి సోకాయి - అంతేకాదు, ఆ సప్త స్వర సుందరులు కంటికి కనిపించారు. నారదుడు విస్మయం చెందాడు. అందుకే త్యాగయ్య, ‘సప్త స్వర సుందరుల భజింపవే మనసా!’ అన్నారు.
‘లింగ పురాణాంతర్గతమైన’ కథను దృష్టిలో ఉంచుకుని త్యాగయ్య ఈ మాటనుదహరించారు. సప్త స్వరాలన్నీ ఏవేవో పొడిపొడి స్వరాలు కాదు - స్వరాల్ని అలంకరిస్తే వచ్చేదే రాగం. ఈ స్వరాల్ని రాగభావం వచ్చేంతవరకూ అలంకరించే ప్రక్రియ మీదనే మొత్తం కర్ణాటక సంగీత సౌందర్యమంతా ఆధారపడి ఉంది. సుస్వరంతో నిండి, స్వర వర్ణాల చేత అలంకరించగలిగే శక్తియుక్తులున్న సద్గురువులు వల్లనే ఈ జ్ఞానం కలుగుతుంది - వాగ్గేయకారుల కీర్తనలు, కృతులూ, ఇలా ఏర్పడినవే - మధురమైన ఫలాలలో రుచి ఎలా నిక్షిప్తమై ఉంటుందో, మాధుర్య భావం నిండిన ఈ కృతులలో రాగస్వరూపమంతా నిండిపోయి ఉంటుంది. తాళంతో కీర్తనవుతుంది. తాళం లేకుండా పాడితే రాగమవుతుంది.
అందుకే సంగీత మూర్తుల రచనలు పాడిన ప్రతిసారీ, అనిర్వచనీయమైన ఆనందాన్ని కల్గిస్తాయి - విసుగనిపించదు. ‘సామజవరగమన’ అనే కీర్తన ఎన్ని దశాబ్దాల నుండి, వింటూ వున్నాం? మరి? ఎందరెందరో పాడుతున్నా, విన్న ప్రతిసారీ, కొత్తగా అప్పుడే పాడినట్లు, విన్నట్లు అనిపించటానికి కారణం ఒక్కటే. ‘రాగం యొక్క రూపం, నడక. అంతా ఆ కీర్తనలో ఉంది మరి. అన్ని సంగతులూ గమకాలూ పలుకవు కదా అని కీర్తనంతా పొడిపొడిగా, సినిమా పాటలా పాడేస్తే, సంగీత జ్ఞానం లేని సామాన్య శ్రోతక్కూడా నచ్చదు.
ధనవంతుణ్ణి అభినందిస్తే నచ్చదు. విద్యాహీనుణ్ణి విమర్శిస్తే నచ్చదు. సంగీత రంగం కూడా ఇంతే. ఎవరినైనా ‘నీకు మంచి కంఠం భగవంతుని వరంగా లభించింది సుమా! జాగ్రత్తగా సాధన చేస్తే వృద్ధిలోకి వస్తావు - అని అడిగి చూడండి. ‘సాధన’ అనే మాట కిట్టదు. అంతా వచ్చినట్లుగానే భావించటం వల్ల వచ్చిన బాధ అది. మహా సముద్రం లాంటి సంగీతం ముందు నేనెంత వాణ్ణి? నాకంటే విద్వాంసులెంత మంది లేరు? ఏదో నాకు తెలిసినది పాడుతున్నాను తప్ప - అని ఎవరైనా అన్నారనుకోండి. ఎప్పటికైనా అతనికి తెలియవలసినవన్నీ తెల్సుకునే మార్గాలు దొరుకుతాయి.
నేర్చుకుంటే లభించే విద్యలు లోకంలో చాలా వున్నాయి. కానీ సంగీత విద్య మాత్రం మనసు పెట్టి నేర్వాల్సిన విద్య. మనస్ఫూర్తిగా చెప్పవలసిన విద్య. దగ్గర దారులేమీ లేవు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఎంత కాలం గురువు చెప్పినా సంగీతం స్వాధీనమవుతుందనే నమ్మకం లేదు. వారివారి అదృష్టాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి మాత్రమే ఉంటుంది.
ఆత్మను ప్రబోధనం చేస్తూ నాదమయ జగత్తులో, శిష్యుణ్ణి నడిపిస్తూ తాను, తరించి, శిష్యుల్ని తరింపజేసే మోక్ష విద్య సంగీతం.
త్యాగయ్య గారికి, శొంఠి వెంకట రమణయ్య, శ్యామాశాస్ర్తీకి పచ్చి మిరియం ఆది అప్పయ్య లభించినట్లుగా, సద్గురువులు అందరికీ లభించరు - ఎవరి సుకృతం వారిది. సంగీతానికి ఒక లక్ష్యం ఉండాలి. దిశానిర్దేశం చేయగల సద్గురువు దొరకాలి. అభిరుచి ఒకటే సరిపోదు. అర్హత వుండాలి - శ్రద్ధ, భక్తి ఉండాలి.
దివ్యమే ప్రణవాకారమనే దాహం తెలియని వారంతా, ఏమీ తెలియకపోయినా, అన్నీ మాకే తెలుసని అహంకరించే వాళ్ల వల్ల, మేలు కంటే కీడు ఎక్కువ అంటారు త్యాగయ్య. (‘వర రాగ లయజ్ఞులు తామనుచు వదరేరయ్యా’ - చెంచు కాంభోజి రాగ కీర్తన) ఈ బాపతు వాళ్లు ఆయన కాలంలోనే వున్నారంటే, ఈ కాలం గురించి వేరే చెప్పాలా?
న కర్మణా, న ప్రజయా ధనేన,త్యాగేనైకే/ అమృతత్వ మానశుః
అంటే...
కర్మచేత కాదు, సంతానం వల్ల కాదు, ధనం చేత కాదు. త్యాగంతో మాత్రమే ముక్తి పొందుతారని’.
ఏమిటా త్యాగం?
ఎంతో విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్నీ, లెఖ్ఖ చేయకుండా, ధన సంపాదనే ధ్యేయంగా కాకుండా, శిష్యుణ్ణి ఉద్ధరించాలనే కోరిక కలిగి వున్న గురువును మాత్రమే, ఈ లోకం గుర్తుంచుకుంటుంది.
నేర్చుకున్నన్నాళ్లూ, కాళ్లరిగేలా గురువు చుట్టూ తిరిగీ తిరిగీ, సంగీతంలో ఏమీ సాధించలేక, ఏ అభివృద్ధి లేక, త్రిశంకు స్వర్గంలో వేలాడే శిష్యులు నిరాశతో, నిస్పృహతో, అదే గురువును దూషిస్తూ, మరో గురువును ఆశ్రయించి, మళ్లీ మొదటికి వచ్చి, ఉభయ భ్రష్టత్వం పొందే శిష్యులు లేరంటారా?
ముఖే ముఖే సరస్వతీ అంటారు.
ఎంత నేర్చుకున్నామో, దానికి పది రెట్లు వినాలి. వివిధ విద్వాంసుల గానంలోని మెళకువల్ని తెలుసుకుంటూ వెళ్లాలి. పెద్దవాళ్ల పాట వింటూంటే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఎంత కృషి చేయాలో తెలుస్తుంది. ఒక్క గురువే అన్నీ చెప్పలేడు - ఎప్పుడో జరిగిన సంఘటన - మహావిద్వాంసుడు, వేణుగానం కోసమే పుట్టిన మేధావి అయిన టి.ఆర్.మనోలింగం కచేరీ జరుగుతోంది. అసంఖ్యాకమైన శ్రోతల్లో, మొదటి వరుసలో, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, నెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ కూర్చుని వింటున్నారు. అత్యద్భుతంగా మూడున్నర గంటలసేపు సాగిన ‘మాలి’ కచేరీ విన్న తర్వాత వారిద్దరికీ చిన్న ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
జి.ఎన్.బి: ఇంతకాలం నుండి పాడుతున్న మనం సంగీతం వదిలేసి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మంచిదేమో!
నెమ్మంగుడి: నిజమే. ఈ కచేరీ విన్న తర్వాత, నాకూ అలాగే అనిపించింది సుమా! మీరు గ్రాడ్యుయేట్ కాబట్టి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఇంక నా సంగతి అంటారా? మా ఊరికెళ్లిపోయి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను’ అన్నారు.
ఆసక్తికరమైన ఈ సంభాషణ విన్నప్పుడు వారిలో నిక్షిప్తమై ఉన్న సంస్కారం తెలుస్తుంది. ‘మాలి’ వాద్యానికి పరవశులైన ఇద్దరు సీనియర్ విద్వాంసులిచ్చిన గొప్ప కితాబు.
వ్యక్తులలోని సంస్కార గుణమంటే అది. స్పర్థయా వర్ధతే జ్ఞానం’ అని ఊరికే అన్నారా?

చిత్రం.. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ సంగీత కచేరీ

-మల్లాది సూరిబాబు 9052765490