ప్రార్థన

యేసు అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశము నుండి భూమికి దిగిన మొదటి అడుగు..
మొట్టమొదటి అడుగు తగ్గింపు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గానీ మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని తన్నుతానే రిక్తునిగా చేసికొనెను. అంతే కాదు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. -్ఫలిప్పీ 2:5-8
ఎవరైనా యేసుతో నడవాలనుకుంటే తన్నుతాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి. అంతేగానీ తగ్గింపు లేకుండా ప్రభువును వెంబడించలేము. చాలావరకు మనుష్యులు ప్రభువును వెంబడించాలని ఆశపడుచున్నారు కానీ తగ్గింపు లేని కారణంగా ఉపయోగముండటం లేదు. కోపం తగ్గటం లేదు. హోదా తగ్గటంలేదు. ఈగో పోవటం లేదు. దేనిలోనూ తగ్గటంలేదు. చివరకు బట్టలు చెప్పులలో కూడా తగ్గటంలేదు. ఇక ఆస్తిపాస్తులు బంగారం లాంటి విషయాలలో చెప్పనవసరం లేదనుకుంటా. నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమని ధనవంతుడైన యవ్వనుని అడిగినప్పుడు వ్యసనపడి వెళ్లినట్లు చూస్తున్నాము. తగ్గింపు మొదటి అడుగు. ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రభువు, సమీపించరాని తేజస్సుతో ఉన్న ప్రభువు అల్పులము అయోగ్యులమైన మనకొరకు దాసునిగా తగ్గించుకున్నాడు. తగ్గింపు లేకపోతే ప్రభువును వెంబడించలేము. ఇహ లోక విషయాలలో ముడిపడి ఉండే మనం వెంబడించేది ప్రభువును మాత్రము కాదని అర్థం చేసుకోవాలి.
దావీదు మహారాజైనప్పటికీ యెహోవా నా కాపరి అనే మాటలు వ్రాసి తనను తాను తగ్గించుకున్నాడు. నిజానికి ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ మహోన్నతుని ముందు మనమేపాటి వారము. దుమ్ము ధూళి వంటి వారమే గదా. అయినా ఏంటో పరువు ప్రతిష్ఠ అనే అహంభావంతోనే ఉంటారు.
ఇంకొక అడుగు: బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. -యోహాను 13:14-15. యేసు ఇక్కడ తన నిరాడంబర సేవను గూర్చి తెలియచేస్తున్నాడు. ప్రతి చిన్న విషయాలలో కూడా ఒకరికొకరు చేయవలసిన విధానము ప్రభువు చూయించాడు. విశ్వాసులకు అంటి ఉన్న పాపాలు కడుగుటకు దేవుని వాక్యముతో హెచ్చరించవలసి ఉన్నది. అది పాదాలు కడిగినంత తగ్గింపుతో వాక్యాన్ని చెప్పాలి. ఎందుకంటే దేవుని అమూల్యమైన మాటలు మనకున్న మలినాలను కడిగివేస్తాయి.
నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. -యోహాను 15:3.
చివరకు మన కోసం ప్రభువు సాగిలపడి తండ్రి సన్నిధిలో ప్రార్థించాడు. శిష్యుల పాదాలు కడుగుట తగ్గింపు అనుకుంటే, మన కొరకు సాగిలపడి చెమట రక్తముగా మారునంతగా చేసిన ప్రార్థన పూర్తి తగ్గింపుగా చూడవచ్చు. ఈ ప్రేమ ఎటువంటిదో ఈ త్యాగమెటువంటిదో వర్ణించలేము.
ప్రేమ: ఇది ఇంకొక అడుగు. నిస్వార్థమైన నిష్కళంకమైన ప్రేమ ప్రాణమిచ్చిన ప్రేమ. ప్రేమ లేకుండా ప్రభువును వెంబడించటం వ్యర్థం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడే. ఆతనియందు అభ్యంతర కారణమేమియు లేదు. అయితే తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు - 1 యోహాను 2:10-11.
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన యెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను పవిత్రులుగా చేయును. ప్రేమలో నడిస్తేనే పరిశుద్ధత ఉంటుంది. ద్వేషము మనలను అపరిశుద్ధత లోనికి నడిపిస్తుంది.
సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా? ప్రభువు చెప్పిన మాటలు వినకుండా పాటించకుండా ఆయనతో నడవగలమా? ఆయన మాటలకు సమ్మతించి వెంబడిస్తేనే ఉపయోగము. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగా ఉంటూ ప్రభువు మార్గములో నడచుచు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు. కొంతమంది ఎడమకు వెళ్లరు గానీ కుడికి వెళ్తారు. ఇంకొంతమంది కుడికి వెళ్లరు కానీ ఎడమకు జరుగుతూ ఉంటారు. అయితే ప్రభువు మనలను కోరుకునేది ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ నడవాలని. అలా నడవటం చాలా కష్టమే అన్నట్టుగా సాతానుడు మనతో మాట్లాడుతుంటాడు. చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. రూపాయి దొంగతనమైనా కోట్ల దొంగతనమైనా వాడు దొంగే. సంగతేమంటే ఎవరి పరిధిలో ఎవరు చేయగలిగింది వారు చేస్తూ, అది అంత తప్పేమీ కాదు.. నేను తప్పు చేయలేదు అని సమర్థించుకుంటున్నారు.
ఆయన వెంబడి నడిచిన వారిని, ప్రభువు, మనుషులను పట్టువారినిగా చేస్తానన్నాడు. ఆయన మార్గములో నడిచి ఎంతో శ్రమించి చివరకు ప్రాణాలు అర్పించిన వారి ఫలమే మనము. పూర్వీకులు ఆది అపొస్తలులు ప్రభువు మార్గములో నడిచి ప్రాణాలు పోయేవరకు కూడా ప్రభువు మార్గములోనే నడిచి మనకు సువార్తను అందించారు. వారివలె మనము కూడా ప్రభువు మార్గములో నడవాలి. ప్రభువే మార్గము. ప్రభువు వేసిన ఆ మార్గములో ఆది అపొస్తలులు నడిచారు. మన పూర్వీకులు నడిచారు. ఇప్పుడు మన వంతు. మనం అలా ప్రభువు మార్గములో నడువకపోతే మనకు నష్టమే. మనముందు తరాలకూ నష్టమే. ఎంతోమంది ఈ మార్గములో నడిచారు కనుక క్రీస్తుకు కలిగిన మనసు ఉంటే మనము కూడా సుళువుగాని ప్రభువు మార్గములో నడిచి దేవుని రాజ్యానికి వారసులమవ్వగలము.
ఈ మార్గములో నడుస్తూ ఉండే వారు క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఇది కూడా ముఖ్యమైన అడుగే. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుచు సహించుకుంటూ నడవాలి. ఓపికతో నడవాలి. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తాలి. దేవుని అడుగుజాడలలో నడిచే వారికి ఓపిక ఉండాలి. మిల్లిగ్రాముల్లో కాదు టన్నుల కొద్దీ ఓపిక కలిగి ఉండాలి. ఎందుకంటే మనముందు ఉంచబడిన ఆనందము ఎంతో విలువైనది. ఎంతోమందికి రక్షణ మనకు మోక్షము గనుక చాలా ఓపికతో ఈ మార్గములో నడవాలి. ఇక చాలు అన్నట్లు అలసిపోతాము. ప్రభువు మార్గములో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అలసటతో విసిగి వెనుతిరుగక సాతానుడు పెట్టే శోధనను జయించిన ప్రభువును తలంచుకుంటూ ముందుకు సాగాలి.
ఇంకా గడిచిన కాలములో తమ పరుగును తుదముట్టించిన సాక్షుల సమూహమును జ్ఞాపకముంచుకోవాలి.
విశ్వాసముతో నడవాలి: వెలి చూపును బట్టి కాదు గానీ విశ్వాసమును బట్టి నడవాలి. ఆత్మానుసారముగా నడవాలి. అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చడు. ప్రభువు అడుగు జాడలలో నడిచేటప్పుడు లోకము అనేక రీతులుగా మార్గము తప్పించడానికి సాతానుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. చాలా తెలివిగా త్రోవ తప్పించటానికి ప్రయత్నిస్తాడు. చాలా సాత్వీకముగా నడవాలి.
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వీకముతోను నడుచుకొనవలెనని పౌలు భక్తుడు ఎఫెస్సి విశ్వాసులకు తెలియజేస్తూనే ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానులవలె నడుచుకోవాలి. ప్రభువు నందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. దైవ జ్ఞానముతో సాగిపోవాలి. ఎందుకంటే సాతానుడు ఎంతో తెలివైనవాడు, తెలివితో మనలను పడగొట్టటానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. మోసపరుస్తాడు. ఏర్పరచిన వారిని సహితము మోసపరుస్తాడు. జాగ్రత్త!! క్రీస్తు బిడ్డలైనటువంటి వారు క్రీస్తు ఎలా నడిచాడో అలానే నడవాలి. మన జీవితములో క్రీస్తును ప్రతిబింబింపజేయాలి. క్రీస్తు మార్గములో నడిచేవారు చీకటిలోనికి వెళ్లరు. వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు.
ప్రభువుకు మనతో నడవటం ఇష్టం. ప్రభువుతో నడవటానికి మనము ఇష్టపడాలి. హనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. (ఆది.5:22) నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై యుండెను. నోవాహు దేవునితో నడచినవాడు - ఆది.6:9. అబ్రహాము దేవునితో నడచినవాడు. ఇస్సాకు దేవునితో నడిచాడు.
11 మంది శిష్యులు యేసు పిలుపును అందుకొని ఆయనను వెంబడించి, ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకొని పరిశుద్ధాత్ముని వరాలు పొందుకొని అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. క్రీస్తు సంఘాన్ని స్థాపించారు. దేవుని దృష్టిలో గొప్పవారయ్యారు.
ఈ చీకటి లోకములో అంటే గలిబిలిగా ఉన్న లోకములో అహంకారము దుర్మార్గము దుష్టత్వము ద్వేషముతో పాపముతో నిండియున్న ఈ లోకములో ఎటు వెళ్లాలో తెలియదు. ఎలా వెళ్లాలో తెలియదు. ఏమి చేయాలో ఎలా చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో యేసు మన ముందు చక్కని బాటను వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపి, ఆయన గాయములో నుండి మనకు ఈ మార్గాన్ని వేశాడు. యేసే మన మార్గము. ఆయన అడుగుజాడలలో నడుస్తూ సాతానుడు వేసే అడ్డులన్నీ తొలగించి, ఎటువంటి పరిస్థితులైనా శోధనలైనా సమస్యలైనా కష్టనష్టాలైనా చివరకు ప్రాణం పోయినా మార్గమును తొలగక ముందుకు సాగి లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుందాము. ఆ ఉన్నత రాజ్యమును పొందుకుందాము. త్రొటిల్లకుండ మార్గము తప్పిపోకుండా మనలను కంటికి రెప్ప వలె కాయుచున్న ఆ ప్రధాన కాపరికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్.

-మద్దు పీటర్ 9490651256