ప్రార్థన

నా కాడి సుళువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక, మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.’ -మత్తయి 11: 28-30
ప్రభు యేసు మాటలు పాటించుట చాల సుళువు. మొదట కష్టంగా ఉన్నట్టుగా ఉంటాయి. రానురాను ఎంత తేలికగా, ఎంత ఉపయోగముగా, ఎంత లాభముగా ఉంటాయో తెలుస్తుంది. అదే సాతానుడు మాటలేమో చాలా తియ్యగా, లాభముగా ఉన్నట్టు ఉంటాయి. అందుకని మొదలుపెడితే మోయలేని భారము మీద పడుతుంది. మోయలేనంత అప్పుల భారము, పని భారము, కుటుంబ భారము మీద పడుతుంది. మొదట అప్పు చేయటం చాలా సుళువుగా ఉంటుంది. దానికి వడ్డీ, చక్రవడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ అని చివరకు తడిసి మోపెడైన సామెతలా ఉంటుంది. చాలావరకు ఈ భారముతో కృంగిపోతున్నారు.
అందుకే అప్పు చేయకూడదని బైబిల్ సెలవిస్తోంది. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడౌతాడట. (సామెతలు 22:7)
‘ఆశ పడకూడదు’ ఇది ప్రభువిచ్చిన ఆజ్ఞ. ఆశపరులు అనేకులు. అసలు ఆశకు హద్దులు లేవు. ఏవేవో ఎవరెవరివో ఎక్కడెక్కడివో అవసరమున్నా లేకున్నా ఆశపడుతూనే ఉంటారు. దానిని పొందుకోటానికి పడే బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఏవేవో చేసి ఎక్కడెక్కడో తిరిగి ఆశించిన దానిని చివరకు పొందుకుంటారు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగే ఉంటుంది. ఉద్యోగం ఊడిపోయి ఉంటుంది. అప్పులు కుప్పలై ఉంటాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక, కేసులూ, సమన్లు ఒకటి తర్వాత ఒకటి. ఏమి చేయాలో అర్థంకాక హృదయములో అలజడి, ఆందోళనతో ఉంటారు. ఈ వత్తిడి తట్టుకోలేక చాలామంది జీవితాన్ని ముగించుకోవాలనుకుంటారు. అటువంటి పరిస్థితులలో ఉన్నవారికి ప్రభువిచ్చే చల్లని పిలుపు - ప్రయాసముతో భారముతో ఉన్నవారలారా నా యొద్దకు రండని, విని వెంబడిస్తే భారము తొలగి సంతోషం మొదలౌతుంది. మనకు కలిగి ఉన్న దానితో తృప్తిగా ఉండాలి. దానిలో ఎంతో నెమ్మది, సంతోషముంటుంది. ఆశ దురాశగా మారుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఆశ - దురాశ= మరణము. తృప్తి= జీవము.
కలిగి ఉన్నదానిలో తృప్తిగా ఉంటే ఉండే సంతోషమును, కోట్ల రూపాయలతో కూడా కొనలేము. అంతేకాదు లోకములో ఉన్నదంతా కలిపినా తృప్తిలో ఉండే సంతోషము కొనలేము. అయితే దేవుని ప్రేమించి ఆయన మాటల ప్రకారము నడిచే వారికి ‘తృప్తి’ దేవుడిచ్చే వరం. ఆశకు పోయి ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నారు. పదవులు పోగొట్టుకున్నారు. రాజ్యాలు పోగొట్టుకున్నారు. దేవుడు అనంత జ్ఞాని కనుక ఎవరికి ఏవి ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. దానితో తృప్తిగా ఉంటే ఇంకా ఆశీర్వదిస్తాడు. అభివృద్ధి చేస్తాడు. ఆశ పడకుండా ఉండుట సుళువైన మార్గము. దేవుని మాట వింటే జీవితం సుళువు.
అబద్ధమాడకుడి. ఇది కూడా ఒక ఆజ్ఞ. ప్రభువు మాట ప్రకారము అబద్ధమాడకుండా ఉంటే అది ఎంత తేలికగా ఉంటుందో కదా! అబద్ధమాడుట మొదలుపెడితే ఒకటితో ఆగదు. ఒకదాన్ని కప్పటానికి ఇంకొకటి.. అలా పెరిగిపెరిగి అబద్ధాల పుట్ట కాదు కొండ తయారౌతుంది. అబద్ధాల కొండ క్రింద ఉన్నామనుకుంటాము కానీ కొండ మీద ఉన్నట్టే. లోకమంతా మనలను చూస్తూనే ఉంటుంది. ప్రభువు మాట ప్రకారము నిజం చెప్తే అప్పటికి కొంచెం కష్టముండవచ్చు కానీ, మనసులో నెమ్మది, ధైర్యముంటుంది. అయితే కొండల్లాంటి అబద్ధాలకు శిక్ష తప్పదు. శిక్ష పడేవరకు అబద్ధాల కొండను మోయటం కూడా పెద్ద శిక్షే. అబద్ధాలు ఆడే రోజులలో మనిషికి నెమ్మది ఉండదు. నిద్ర ఉండదు. సుఖం ఉండదు. అయితే ప్రభువు దగ్గరకు వచ్చి మనస్సు మార్చుకొని అబద్ధమాడకుండా ఉండటానికి నిర్ణయం తీసుకుంటే ప్రభువు సహాయము చేసి నెమ్మదినిస్తాడు. ఆయన మాటలను పాటించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానమిచ్చాడు. ఈ ఆశీర్వాదం కూడా వస్తుంది.
మద్యముతో మత్తులై యుండకుడి. దానిలో దుర్వ్యాపారము కలదు. - ఎఫెసి 5:18. చాలా తేటగా ఉన్న బైబిల్ మాట ఇది. మామూలుగా ఉంటే డ్యూటీ తరువాత నేరుగా ఇంటికి వచ్చి భార్యాబిడ్డలతో తల్లిదండ్రులతో కాలం గడిపి, కలిసి భోజనం చేసి, కుటుంబంతో సంతోషంగా ఉంటూ, సమయానికి నిద్రపోయి, సమయానికి లేచి సమయానికి తిరిగి డ్యూటీకి వెళ్లటం ద్వారా మంచి జీవితాన్ని గడపవచ్చు. లేకుంటే తాగుడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. యాక్సిడెంట్ కేసులు.. ఇంట్లో గొడవలు, కొట్లాటలు. ఈ కేసులన్నింటి ననుండి బయటపడటానికి డబ్బులు. అవి లేకపోతే అప్పులు. ఆఫీస్‌కి లేటుగా వెళ్లటం, తాగి రోడ్లపై పడిపోవటం, ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటం, వీధిన పడటం, ఇదంతా మోయలేని భారం అవుతోంది. కుటుంబమంతా కష్టాల ఊబిలో కూరుకుపోతుంది. చివరకు ప్రాణ నష్టం కలుగవచ్చు.
వ్యభిచరించవద్దు అని బైబిల్ చాలా తేటగా చెబుతోంది. ఇది ఆజ్ఞలలో ఒకటి. దేవుడు కలుగజేసిన వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది ఘనమైనది సుఖ సంతోషాలిచ్చేది. అయితే ఈ విషయములో చేయరాని పనులు చేస్తూ మోయలేని భారాన్ని మోస్తున్నారు. అనేకమైన ఇబ్బందులకు బాధలకు వ్యాధులకు గురౌతున్నారు. దీనిని ఎలా అరికట్టాలో తెలియక కొన్ని దేశాలు చట్టబద్ధం చేశాయి. దీనివల్ల వచ్చే నష్టాలు అన్నీ ఇన్నీ కాదు. జీవితాంతం భరించాల్సిందే.
రేపటిని గూర్చి చింతించకుడి - మత్తయి 6:34. ఇక ఈ విషయానికొస్తే దీని మించిన భారము ఏదీ ఉండదనుకోవచ్చు. రేపు ఏవౌతుందో వర్షం వస్తుందో ఎండ వస్తుందో లేదో పని ఉంటుందో లేదో.. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో.. ఏమి ధరించుకొందుమో అని రేపటిని గూర్చిన చింత ఈ రోజున ప్రశాంతంగా ఉండనివ్వదు. రేపటి సంగతులను గురించి ఈ రోజే ఆలోచిస్తూ.. దిగులుతో భారము కలిగి ఉన్నారు. పక్షులను అడవి పువ్వులను జంతువులను పోషించుచున్న దేవుడు వాడికంటె ఎంతో శ్రేష్ఠమైన మనలను, ఆయన రూపులో వున్న మనలను ఇంక ఎంతగా పోషిస్తాడో కదా!
ఇక అనవసరమైన చెత్తను కూడా మీద వేసుకొని, బాధపడుతున్న వాళ్లు అనేకులు. ఎటో పోయేదాన్ని కాలికి తగిలించుకొని బాధపడుతుంటారు. ప్రభువు అవమానాన్ని తృణీకరించి ముందుకు సాగినట్టు మనకు కనపడుతుంది. అయితే అవమానాన్ని మీద వేసుకొని కృంగిపోయేవారు అనేకులు. వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. సరిగ్గా వినపడని విషయాలు కూడా అడిగి మరీ వింటారు. బాధపడుతుంటారు. ‘ఏంటి ఏమన్నావ్ మళ్లీ చెప్పు’ అని చెప్పించుకొని మరీ బాధపడుతుంటారు.
మనము ప్రతి భారమును సులువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడై యున్నాడు. - హెబ్రీ 12:2
సుళువుగా చిక్కులుబెట్టు పాపభారము. అలుగుట బహు సుళువు కానీ వారాలు నెలలు సంవత్సరాలుగా సాగుతూనే ఉంటుంది. ఏ విషయంలోనైనా కోపం ఉన్నట్లయితే అది సూర్యుడస్తమించు లోపలనే సరిచేసుకోవాలని వాక్యం చెప్తోంది. సూర్యుడస్తమించు వరకు మీ కోపం నిలిపి యుండకూడదు - ఎఫెసి 4:26. అయితే కోపతాపాలతోనే పడకలకు వెళ్లి నిద్ర పట్టక ఏవేవో ఆలోచించి, అనవసరమైన వత్తిడులకు గురయ్యేక ప్రభువు చెప్పిన మాట వింటే ఎంత సుళువుగా ఉంటుందో చూడండి.
దేవుడిచ్చిన దానితో తృప్తిగా ఉండకుండా లేని దాని కొరకు ఆరాటపడటము కూడా భారము. ఉన్న దానితో తృప్తిగా ఉండక దాచిపెట్టుట కూడా భారమే.
ఇలా అనేకమైన అక్రమాలు చేసి భార భరితమైన జీవితాలు, సంతోషము సమాధానము లేకుండా, భారాన్ని మోయలేక, విడుదల కోరుకుంటున్న వారికి శుభవార్త. నా యొద్దకు రండని పిలుస్తున్న ప్రభు యేసుని పిలుపు. విశ్వసించి ఆయన దగ్గరకు వస్తే పాప భారమంతా తీసివేసి తేలిక చేస్తాడు. ఉచితంగా ఇచ్చే ఈ తేలిక మార్గాన్ని కొద్దిమందే తెలుసుకొంటున్నారు.
వాస్తవానికి లోకములో రెండు రకాల దుకాణాలు ఉన్నాయి. ఒకటి భారాలు అమ్మేది, ఇంకొకటి ఉచితంగా భారాలు తీసివేసేది. కేవలం క్రీస్తుయేసు నందు విశ్వాసముంటే చాలు. అయితే భారాలు అమ్మే దుకాణం దగ్గరే అనేకులు బారులు తీరి ఉన్నట్టు తెలుస్తుంది.
భారము మోసిమోసి విసుగేసి విముక్తి కోరుకుంటున్నారు. ఇవన్నీ పోయి స్వేచ్ఛగా ఉండాలని ఆశ పడుతున్నారు. ప్రశాంతత మనసు కోరుకుంటుంది. విశ్రాంతి కావాలనుకుంటున్నారు. క్రీస్తు నందున్న వారికి కోరుకున్న నూతన జీవితం దొరుకుతుంది. ఆయన మనకు ఉచితముగా ఇవ్వటానికి సిద్ధమే కాని, చాలా విలువైంది. ఆయన ప్రాణాన్ని ఖర్చు పెట్టి మనకు ఇస్తున్న విశ్రాంతి ఇది. ఈ సుళువైన మార్గములో క్రమముగా నడుస్తూ శాంతి సమాధానాలతో శేష జీవితం జీవిస్తూ ఆనందంగా సంతోషంగా ఉండటానికి, దేవుడు ఉచితముగా క్రీస్తులో ఇస్తున్న అవకాశము మనమందరము పొందుకోటానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయును గాక.

-మద్దు పీటర్ 9490651256