రాష్ట్రీయం

‘ప్రాణహిత’కు భూసేకరణ సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటవీ శాఖ నుండి అందని అనుమతులు

నిజామాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల పథకం పనులకు భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. రైతులకు చెందిన పట్టా భూముల సేకరణ విషయమై నష్టపరిహారం ఖరారు కాకపోవడంతో పాటు అటవీ శాఖ భూములను సేకరించడం ఇరిగేషన్ అధికారులకు తలకుమించిన భారంగా పరిణమిస్తోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఫారెస్టు భూముల కోసం నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే అనేక పర్యాయాలు అనుమతుల కోసం నివేదికలు పంపినప్పటికీ, అటవీ శాఖ నుండి క్లియరెన్స్‌లు లభించకపోవడంతో సంబంధిత ప్రాంతాల్లో పనులు ముందుకు ఎలా సాగుతాయన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో 3.04లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా ఈ పథకం కింద 20, 21, 22 ప్యాకేజీలను రూపొందించారు. ఇప్పటికే 20, 21వ ప్యాకేజీల కింద పనులను చేపట్టి సుమారు 800కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేశారు.
అయితే తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రాణహిత పథకం డిజైన్‌లో మార్పులు అనివార్యమని భావిస్తూ, దీని స్థానంలో కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గడిచిన 15మాసాల నుండి ప్రాణహిత పనులు ఎక్కడికక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం తలపోసినట్టుగా ఒకవేళ డిజైన్ మార్పు అనివార్యమైనప్పటికీ, నిజామాబాద్ జిల్లాలోని 20, 21, 22వ ప్యాకేజీల పనులను యథాతథంగా చేపట్టవచ్చని, వీటిలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి పాదయాత్రలు సైతం నిర్వహించింది.
ఈ తరుణంలోనే ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ నిజామాబాద్ జిల్లా ప్రగతిపై ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ప్రాణహిత ప్రాజెక్టుల పనుల విషయం కూడా చర్చకు వచ్చింది. అర్ధాంతరంగా నిలిపివేసిన ప్రాణహిత పనులను యథాతథంగా చేపట్టాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దాదాపు ఏడాదిన్నర కాలం నుండి స్తబ్ధత నెలకొన్న ప్రాణహిత పనులకు మళ్లీ జీవం పోసినట్లయ్యింది. ఇరిగేషన్ అధికారులకు కూడా పనులను చేపట్టే విషయంలో ఉన్నతాధికారుల నుండి వౌఖికంగా ఆదేశాలు అందాయి. ఈ పనులు పూర్తయితే జిల్లాలో మూడు లక్షల పైచిలుకు ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు సమకూరనుంది. అయితే 21, 22వ ప్యాకేజీల పరిధిలో ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. 20, 21, 22 ప్యాకేజీల కింద నిజామాబాద్, డిచ్‌పల్లి, బాల్కొండ, ఆర్మూర్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో గల 19మండలాల్లో 3.04లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు జలాలు అందించాలని తలపోశారు. ఇందుకోసం జిల్లాలో చేపట్టాల్సి ఉన్న పనులకు 3484కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు.
మొదటి ప్యాకేజీ కింద 853కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన పనులకు మూడేళ్ల క్రితమే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంతమైన నవీపేట మండలం బినోల వద్ద గ్రావిటీ కెనాల్ తవ్వకం, టనె్నల్ నిర్మాణాలను పూర్తి చేశారు. 21వ ప్యాకేజీ కింద 650కోట్ల పైచిలుకు రూపాయలను, మూడవ ప్యాకేజీ కింద 1379కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో 21వ ప్యాకేజీ పరిధిలోనూ పనులు చేపట్టి మొత్తంగా సుమారు 800కోట్ల రూపాయల వరకు నిధులను వెచ్చించారు. ప్రస్తుతం మాసాని ట్యాంకు నుండి మరో అప్రోచ్ చానెల్‌ను చేపట్టి బాడ్సి గ్రామంలోని కొండెంచెరువు, అక్కడి నుండి గ్రావిటీ కెనాల్, డిస్ట్రిబ్యూటరీల ద్వారా సిరికొండ మండలం గడ్కోల్ వరకు 77వేల ఎకరాలకు సాగు జలాలు అందించాలని సర్వే జరిపారు. 22వ ప్యాకేజీ కింద కొండెంచెరువు నుండి యాచారం మీదుగా సర్జ్‌పూల్ సహాయంతో టనె్నల్, పంప్‌హౌస్ నిర్మాణం జరిపి రామాయంపేట్, తాడ్వాయి, గాంధారి కాల్వల ద్వారా 1.56లక్షల ఎకరాలకు నీటిని మళ్లించాల్సి ఉంది.
తాజాగా ప్రభుత్వం పనులను చేపట్టేందుకు పచ్చజెండా ఊపినందున ప్రతిష్ఠంభన దూరమైనప్పటికీ, పలుచోట్ల స్థల సేకరణ విషయంలో అడ్డంకులు అలాగే ఉండిపోయాయి. ప్రధానంగా 400ఎకరాల అటవీ భూములను అందించే విషయంలో ఫారెస్టు డిపార్ట్‌మెంట్ నుండి క్లియరెన్స్ అందకపోవడం సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.