అమృత వర్షిణి
ఆడే బొమ్మలు వీరు.. ఆడించే సూత్రము నీవు.. (అమృతవర్షణి)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మనిషి ఆయుర్దాయం ఎంత? మహా అయితే వందేళ్లు. చాలామందికి అంత కూడా లభించదు. ఆ లభించిన దానిలో సగం రాత్రిలో విశ్రాంతికీ, నిద్రకూ ఖర్చయిపోయేదే. మిగిలిన సగ భాగం బాల్యంలో, వృద్ధాప్యంలో పోయేదే.
బాగా వయసులో వున్నప్పుడు ఓపిక నిండా ఉంటుంది. చిత్తమొచ్చినట్లు తిరిగేస్తాం? బాల్యం చూస్తే ఏమీ తెలియని దశ. వృద్ధాప్యంలో అన్నీ తెలిసినా శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన దశ.
ఈ రెండూ తీసి పక్కన పెట్టేస్తే, మిగిలిన సమయంలో కొంత భాగం తనకు ప్రాప్తించిన అనారోగ్యాలతోనో రోగాలతోనో గడిచిపోతుంది. ఎక్కువ భాగం తాను ప్రేమించే, తన వారికి కలిగే వ్యాధి, జరా, మరణాల గురించిన మనో వ్యధతో పోతుంది. మిగిలినదంతా ఉదర పోషణార్థం చేసే కొలువులో అగచాట్లతోనే సరిపోతుంది.
భూతద్దం పెట్టి వెదికినా సుఖాన్నిచ్చే సందర్భాలంటూ ఉండవు. వున్నా అవి కాసేపే.
అందుకే పరిమితమైన ఆయుర్దాయం కలిగిన మానవ జన్మలో లభించే ‘కాలం’ చాలా విలువైనది.
యిది తెలుసుకోవాలని చెప్పేందుకే యోగులు పుట్టారు. చెప్పవలసినదంతా చెప్పి వెళ్లిపోయారు. భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మను సార్థకం చేసుకున్న ఆ మహాపురుషులే మనకు మార్గదర్శకులు. గృహస్థ జీవితానికి పరమ ప్రయోజనం మన కంటికి కనిపించే సంతానం. కొడుకులుండీ, కూతుళ్లు లేకపోయినా కొరతే. కేవలం కూతుళ్లే వున్నా ఇబ్బందే. చివరికి ఈ తాపత్రయం పెరిగిపోయి సంసారం విస్తరణైపోతుంది. సంసారం నడవాలంటే ధనం కావాలి. ఎంత కావాలి? అంటే దీనికి సమాధానం ఎవరి దగ్గరా వుండదు. ఎంత వున్నా ‘ఇక చాలు’ అనుకునేవాడే భూప్రపంచంలో ఉండడు. ప్రాణం విసిగిపోతుంది. ఏదో కూడబెట్టామనుకుంటే, దాన్ని కాపాడటం కూడా పెద్ద సమస్యే. చోర భయమే కాదు, ఎవరి వల్ల విపత్తు సంభవిస్తుందో తెలియదు. ఇంట్లో వాళ్లను కూడా నమ్మని స్థితి ఏర్పడుతుంది.
-‘ఎంత వెలుగునకు అంతే చీకటి -
-‘ఎంత సంపదకు అంతే ఆపద’ అంటాడు అన్నమయ్య.
బాగా సంపద కలిగి నౌకర్లు చాకర్లూ భార్య, పిల్లలు వున్న కుటుంబాలన్నీ పరమ సంతోషంగా ఉంటారని భావించకండి. ఈ వలయంలో చిక్కుకుని తారుమారు పనులు చేస్తూ బుద్ధి నశించి జీవితం అంధకారమయం కాక ముందే మేల్కొని గమ్యాన్ని చేరే మార్గాన్ని చూపించమంటూ ‘్భక్తి బిచ్చమీయవే, భావుకమగు ‘సాత్త్విక’ భక్తి బిచ్చమీయవే’ అంటాడు త్యాగయ్య.
అంతేకాదు - ‘మోదకర శరీరమెత్తి ముక్తిమార్గమును తెలియక వాద తర్కమేల శ్రీమదాది త్యాగరాజ నుతుని భజన సేయవే’ అని సూచిస్తాడు.
మన వెంట వచ్చేది సంస్కారమే గాని, సంసారం కాదు. సంసార బంధం నుంచి బయటపడే మార్గాలను అనే్వషించిన నాదయోగుల మాటే మనకు శిరోధార్యం. ‘సంసారం వల్ల మోక్షం లేదని చెబితే దేవుణ్ణి తలుచుకుంటామా?’ అందుకే త్యాగయ్య, ‘సంసారులైతేనేమయ్యా! శిఖిపింఛావతంసు డెదుట నుండగ, క్రూరపు యోచనల దూరం చేసి తన దారపుత్రుల పరిచారకుల జేసి సారరూపుని పదసార యుగముల సారెసారెకు మనసార పూజించువారు! సంసారులైతేనేమయ్యా’ అని ఉపదేశించాడు.
సంసారమున్నంత మాత్రాన సాధించలేని దంటూ ఉండదు. అందులో వుంటూనే లబ్ధి పొందాలి. ఎవరెవరు ఏ వృత్తి వ్యాపారాల్లో వున్నా చేసే పని ధర్మబద్ధంగా వున్నంత కాలం చింత వుండదు. పైవాడు అంతా గమనిస్తూనే ఉంటాడు. సృష్టికి ఇవతల, అవతల కూడా ఉండేవాడు. అనంతుడూ, ఆద్యంతాలు లేనివాడు ఆయనే. మన కంటికి కనిపించేదంతా ఆయన రూపమే కాబట్టి, అన్ని ప్రాణుల్లోనూ ఆయనే్న దర్శించే స్థితికి వెళ్లాలి. అలాటి అనన్య చింతనకు సాక్షి ప్రహ్లాదుడు. ప్రతి కదలికలోనూ పరమాత్మనే దర్శించాడంటాడు పోతన. ‘పానీయంబులు దావుచున్ గుడుచుచున్ భాషింపుచున్ హాసలీ/ లానిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత/ శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సం/ ధానుండై మఱచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా!’
దాహాన్ని తీర్చుకుంటూ దేహాన్ని నిలబెట్తున్నాడు. ఆకలి కలిగించేవాడూ ఆయనే. ఆకలికి అన్నమూ ఆయనే. దేహంబతడే. దేహీ అతడే (అన్నమయ్య)
అన్నపానాలు కూడా యజ్ఞంగా భావించేవాడు, మాట్లాడించేవాడు, దైవమే. మాట దైవమే.
ఇలా జీవన వ్యాపారమంతా దైవమే అనే అనుభవానికి వస్తే చాలు. ఆ జీవితం ధన్యమే. అందరిలోనూ దేవుణ్ణి చూడటం ఒక గొప్ప యోగసాధన. కొంతమంది ‘అన్నం’ తింటే మరి కొంతమందిని ‘ఆశ’ తింటూంటుంది. అన్నవస్త్రాల కోసం, (అంటే జీవితావసరాల కోసం) చేసే పోరాటాల మధ్య సాగే జీవితమే ఓ పెద్ద నాటకమ’ని అన్నమయ్య చెప్పిన మాటే పాటయ్యింది; పాప పుణ్యాలు రెండూ ఆచరించే మనుషుల్ని చూసి నవ్వేకాలమే ‘నాటకం’ అంటూ.. నానాటి బతుకూ నాటకమూ కొనక కన్నది కైవల్యమూ/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్టనడిమి పని నాటకము/ యెట్టి నెదుట గలదీ ప్రపంచము/ కట్ట కడపటిది కైవల్యము ॥
కుడిచేదన్నము కోక చుట్టెడిది/ నడమంత్రపు పని నాటకము/ వొడిగట్టుకొనిన ఉభయ కర్మములు/ గడి దాటినప్పుడే కైవల్యము ॥
తెగదు పాపము తీరదు పుణ్యము/ నగి నగి కాలము నాటకము/ యెగువనె శ్రీ వేంకటేశ్వరుడే విక్తన?/ గగనము మీదిది కైవల్యము ॥
లోకంలో ప్రతీదీ నాటకమే. ఈ నాటక సూత్రధారి ఆ వేంకటేశ్వరుడు.
సినిమాకు డైరెక్టరే సూత్రధారి. ఆయన ఊహించినట్లుగానే పాత్రలన్నీ రూపొందుకుంటాయి. ఆయన చెప్పినట్లుగా నటిస్తేనే ఆ చిత్రం విజయవంతమవుతుంది.
అలాగే మన జీవన నాటకానికి సూత్రధారి ఆ పరమాత్మ. సూత్రధారి చెప్పినట్లు చేస్తే, ఆయనే్న నమ్ముకుంటే బతికిపోతాం. లేదంటే పునరపి జననం. పునరపి మరణం.
సాహిత్యమెప్పుడూ ఆలోచనామృతమే. పాటలోని మాటలు, వాటిని అర్థం చేసుకున్న కొద్దీ అనంతమైన గూఢార్థం కనిపిస్తూంటుంది. ఆలోచింపజేస్తుంది. ఆచరణలో పెట్టాలనుకునే వారికి ‘నిజమే సుమా! అని ఒక్క క్షణమైనా ఆగి ఆలోచించాలనిపిస్తుంది - నెమ్మది నెమ్మదిగా అనన్య చింతన ఏర్పడుతుంది. ఇందరు దేవుళ్లు లేరు. ఉండేది ఒక్కడే. వేరుగా కొలవవలసిన అవసరం లేదు. నేరుగా కొలవవచ్చు అని తెలుస్తుంది.
ఎవరికి నమస్కరించినా అందుకునే పరమేశ్వరుడొక్కడే అన్న భావన వచ్చేస్తుంది.
బ్యాంకుల్లో ఎనే్నసి జాయింట్ ఎక్కౌంట్లున్నా, ఆ సమయంలో మాత్రం ఎవరి ఎక్కౌంట్ వారిదే. కష్టపడి సంపాదించిన సొమ్ములన్నీ ఇక్కడే మూలుగుతూంటాయి. సంపాదించి కూడబెట్టినవాడు మాత్రం ఉండడు. ఇందుకే అన్నమయ్య, ‘నానాటి బతుకు నాటకము’ అన్నాడు. మనిషి జీవితంలో జరిగే పరిణామాలన్నీ ముందే ఊహించి చెప్పారు కాబట్టి ‘వాళ్లు ద్రష్టలు’.
* * *
పూవుకు పరిమళం ఎలాగో పాటకు రాగం అలా ఉంటుంది. ఒక్కోసారి మాటల్లో బలం లేకపోయినా రాగం కుదిరితే చాలు. మనసును ఆ పాట మైమరపింపజేస్తుంది. సర్వగమక యుక్తంగా భావంతో ఆలపిస్తే విన్న ప్రతిసారీ జన్మధన్యమైనట్లుగా ఒక దివ్యమైన అనుభూతిని మిగిలిస్తుంది. ఏ రాగానికైనా ఆరోహణ, అవరోహణ ఒక్కటే తెలిస్తే చాలదు. రాగ స్వరూపం కనబడాలి. మాటలకూ ఆ రాగానికీ పొందిక పొంతన... ఉండాలి. అపుడే మనసుకు చేరుతుంది. ఆ లక్షణాలు లేని పాటలు చెవి దగ్గరే ఆగిపోతాయి. అంతకు మించి లోపలకు వెళ్లవు. కానీ సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి స్వరపరచిన అన్నమాచార్య కీర్తనల్లో ఆణిముత్యం లాంటిదీ ‘నానాటి బ్రతుకు’ సంకీర్తన.
కర్ణాటక సంగీత సంప్రదాయంలో ‘రేవతి’ రాగంలో కంపోజ్ చేశారు. హిందూస్థానీ సంగీత సంప్రదాయంలో ‘బైరాగీ భైరవ్’ అంటారు. ఈ దేశీయ రాగంలో మూర్తిత్రయం వారి కీర్తనలు ఐదు స్వరాలే ఉంటాయి. కాబట్టి ఔడవ రాగం. ఎప్పుడూ సాహిత్యం కంటే ముందుగా ‘చెవికి’ చేరేది రాగ సౌందర్యమే. ఈ దేశీయ రాగంలో మూర్తిత్రయం వారి కీర్తనలు లేవు.’
రాగ మాధుర్యమే శ్రోతలను కూర్చోబెట్తుంది. పాలు, నీరులా కలిసిపోయ వుండే సంగీత సాహిత్యాలు రెండూ వినేవారికి పరవశాన్ని కలిగిస్తాయి. మహావిద్వాంసురాలు ‘్భరతరత్న’ శ్రీమతి సుబ్బులక్ష్మి -స్వయంగా నేదునూరిని ఆశ్రయించి నేర్చుకుని పాడిన ప్రసిద్ధమైన సంకీర్తన.
ఒకపరికొకపరి ఒయ్యారమై, ‘రామచంద్రుడితడు’ ‘అలరులు కురియగ ఆడెనదె’ ‘సింగారమూ..’ ‘పలుకుతేనెల తల్లి’ ‘్భవములోన భాహ్యమునందును’ ‘ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు’ లాంటివెన్నో నేదునూరి స్వరపరచగా ఎంతో బహుళ ప్రసిద్ధమై పోయిన సంగతి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి బాగా తెలుసు.
అంతేకాదు, ఆయన సంప్రదాయ సంగీత ధోరణిలో చేసిన ప్రతి సంకీర్తనా ప్రసిద్ధమైంది. కొందరు కంఠంలో గమకాలను పలికించలేని గాయకులు ఒక కూటమిగా చేరి క్రమంగా అన్నమయ్యను ఓ లలిత సంగీత గాయకునిగా మార్చేశారు. అలా పాడితే బాగా ప్రచారవౌతాయని ప్రచారం చేసుకున్నారు. పాపం.. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా నిజాయితీగా అది నిజమేనని నమ్మారు. ఈ మహానుభావుడి కీర్తనలు అలా క్రమంగా ఇప్పుడు లలిత సంగీత ధోరణి నుంచి సినిమా వరసల్లోకి మారాయి. టీవీ ఛానెళ్లలో మీరు దర్శించి వింటూనే ఉన్నారు. ‘సంగీత లక్షణసార గ్రంథం’ రాసిన అన్నమాచార్యుడికి సినీ ప్రముఖుల ద్వారా ప్రచారం కల్పించాలనే సంకల్పం అసలు ఎందుకు కలిగిందో ఆ శ్రీనివాసుడికే తెలియాలి.
బహుశా ఆయన ఈ పరిణామాలు ముందే ఊహించి ఉంటాడు- అందుకేనేమో? ‘దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. పూనీ నీ కీరితి పుష్పము లివి యయ్యా! ఒక్క సంకీర్తన చాలు వొద్దికై మమ్ము రక్షింపగ తక్కినవి భండారాన దాచి వుండనీ’ అన్నాడు.
‘నీలో గొప్పతనముంది కాబట్టి నిన్ను పొగిడేనయ్యా! ఇదేదో గర్వం కొద్దీ చెప్పే మాట కాదు సుమా! ఎక్కడా నేనే చేశానని పనిగట్టుకుని చెప్పుకోను. నా మీద నీకు ఎంతో దయ వుంది కాబట్టి యిన్ని సంకీర్తనలు నా చేత రాయించి నాకు పుణ్యం ప్రాప్తించేలా చేశావు’ అని ఎంతో వినమ్రంగా ఆ కీర్తనలు రాగి రేకుల్లో నిక్షిప్తం చేసి పెట్టాడు - అవి చాలాకాలం సంకీర్తన భాండారంలో ఉండిపోయాయి. మహనీయుల కృషి ఫలితంగా, దేవస్థానం పుణ్యమా అని కొన్ని కీర్తనలు లభ్యమయ్యాయి. అటువంటి పద కవితా పితామహుని కీర్తనలకు సంప్రదాయ సంగీత జాడ లేకుండా చేసి సినిమా రంగు పూసి, ప్రచారం పేరుతో స్థాయి దించేసే ప్రయత్నం మాత్రం హర్షించదగ్గ పరిణామం కాదని సంగీతజ్ఞులనుకునే మాట. అన్నమయ్య ఎలా పాడి వుంటాడో మనకు తెలియకపోవచ్చు. కానీ సినిమా వరసల్లో (ట్యూన్స్) మాత్రం పాడి వుండే అవకాశం లేదని సంగీత జ్ఞానం లేనివారు సైతం అంగీకరిస్తారు. మరో రహస్యం చెప్పమంటారా? డా.బాలాంత్రపు రజనీకాంతరావు పిలిచి అన్నమయ్య సంకీర్తనొకటి ఓ రోజు నా చేతుల్లో పెట్టి చదవమన్నారు. ఆయన మాదిరిగా కొన్ని కీర్తనలు వ్రాసి ఆయన వరుసలను (ట్యూన్స్) అనుకరించేవారు అన్నమయ్య కాలంలోనూ వుండేవారట.
‘నాదలోలుడైన శ్రీహరిని ఎటువంటి గానంతో మెప్పించాలో’ ఈ కీర్తనలో చెప్పాడు.
‘వెఱ్ఱులాల మీకు వేడుక గలిగితేను/ అఱ్ఱువంచి తడక లల్లంగరాదా!
సంక్షిప్తంగా దీని సారాంశాన్ని చిత్తగిస్తే అనుకరిస్తూ ఒకరు పాడిన పాటలు పాడే వారికీ, రచయితలకూ సరిగ్గా అన్వయిస్తుంది.
వెర్రి కవుల్లారా! మీ కంత వేడుకైతే మెడవంటి తడికలల్లుకోండి. అదే కవిత్వమనుకోండి. అంతేగాని ఇతరులను అనుకరిస్తూ రాస్తే (లేదా పాడితే) నవ్వుల పాలవుతారు సుమా!
పేరేమో నేతి బీరకాయ. అందులో నెయ్యి వుండదు. రాతితో నిలబెట్టిన వీరుడిలో పౌరుషం ఎక్కడ? బూరుగు పండు వొలిస్తే, అందులో దూదే తప్ప ఆస్వాదించగల పదార్థమంటూ ఉండదు. మీ వంటి వాళ్లను ఆ దేవుడు నిరశించడా? నాలుగు దిక్కులా మారుమ్రోగినట్లుగా ఎంతో ఉన్నతంగా శ్రీ వేంకటేశ్వరుణ్ణి కొలుస్తూ అన్నమయ్య కీర్తిస్తే ఎవడో ఓ కుకవి ‘అన్నమయ్యతో సమానమని భావించి ఏవేవో మాటలు రాసేసి అదే పాటంటే ఆ వేంకటేశ్వరుడు నవ్వుకోడా?
ఇదీ ఈ సంకీర్తన సారాంశం. ఇంతకంటే వివరణ అవసరం లేదేమో? విజ్ఞులు గ్రహించగలరు.
* * *
ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి కొండపై 365 రోజులూ జరిగే, శీఘ్ర, లఘు దర్శనాలు, సహస్ర కలశ, దీపాలంకరణ సేవలు, లడ్డూ ప్రసాద వితరణలు, స్వామికి చేసే నిత్య సేవలు, పక్షోత్సవ మాసోత్సవ, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లతో అంకితమై పోయిన అధికారులకు సంప్రదాయ సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతం, వీటికున్న వ్యత్యాసం, అన్నమయ్య సాహిత్యం, దానికి తగ్గ సంగీత ప్రమాణాలు మొదలైనవి తెలుసుకోవాలన్న కోరిక లేక, ఆ మహానుభావుడి కీర్తనల ప్రచారంపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా లేక, ఒకవేళ ఏ కొద్ది మంది విద్వాంసులో విజ్ఞప్తులు చేసిచేసి, విడమరచి వివరిస్తూ ఎన్నిసార్లు యధార్థం చెప్పాలని ప్రయత్నం చేసినా, వినాలనే ఆసక్తి అధికారులకు లేనంత కాలమూ మన అన్నమయ్య కీర్తనల్లో ఎటువంటి మార్పూ రాదు. పైగా వాగ్గేయకారులందరి కంటే ముందు పుట్టినవాడు. శ్రీనివాసుడితో మాట్లాడగలిగిన విశేష అర్హత కలిగిన పరమ భక్తుడు.
త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు మహా విద్వాంసులే పాడి ప్రచారం చేశారు. సంస్థానాలు, దేవస్థానాలూ కాదు. అలా ప్రచారం కావాలని కూడా ఆ మహానుభావులెవరూ కోరుకోలేదు. పైగా వాగ్గేయకారు లందరికంటే ఎక్కువ సంకీర్తనలు రాశాడు. ‘అనాహతమైన ఆధ్యాత్మిక, వేదాంత, వైరాగ్య సందేశాలతో నిండిన అన్నమయ్య కీర్తనలు త్యాగరాజ కీర్తనలకు ఏ మాత్రమూ తీసిపోవు.