అమృత వర్షిణి

ఆనంద సాగరమీదని దేహము భూమి భారము (అమృతవర్షణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభ్యాస సంగీతంలో వున్న సరళీ స్వరాలు, జంట స్వరాలు అలంకారాలు; స్వరం యొక్క ఉనికిని తెలియజేస్తూ వుండే రచనలు. మన సంప్రదాయంలో, స్వరం అనేది కేవలం పొడిగా వినిపించేది కాదు. స్వరాన్ని అలంకరిస్తేనే తప్ప రాగ స్వరూపం ఏర్పడదు. కీర్తనలకు లయా నిర్దేశం చేసేవి కూడా స్వరాలే. స్వర వర్ణాలతో అలంకరించ గలిగే స్థితికి సాధకుడిని ప్రేరేపించేవే, ఈ స్వరాలు.
యోగ సాధనలో, ఓంకార సహితమైన నాదంతో, ఉచ్ఛ్వాస నిశ్వాసల రాకపోకలెలా ఉంటాయో సంగీత సాధన కూడా అంతే.
సంగీత పరమార్థం ‘నాదోపాసనే’ అని భావించిన మహానుభావులు మనకు చూపించిన మార్గం ఇదే. సారమతి రాగంలో త్యాగయ్యగారి కీర్తన: మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులు కాని వారలకు॥ సాక్షాత్కార! నీ సద్భక్తి - సంగీత జ్ఞానవిహీనులకు॥
ప్రాణానల సంయోగము వల్ల - ప్రణవ నాదము సప్తస్వరము లెబరగ/ వీణావాదన లోలుడౌ శివమనో - విధమెరుగరు, త్యాగరాజ వినుత (మోక్షము)
సద్భక్తి ఏర్పడాలంటే నిశ్చల చిత్తం ఉండాలి. అదెలా సాధ్యం?
‘సత్సంగత్వే నిస్సంగత్వం
ని స్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చల తత్వమ్
నిశ్చల తత్వే జీవన్ముక్తిః’ అంటాడు ఆదిగురువు.
భగవంతుడి కరుణకు పాత్రులైన వాళ్లతో చేసే సాంగత్యం గొప్పది. మనకు మంచి మార్గం చూపించే వారితో చేసే స్నేహం వల్ల నిర్మోహత్వం ఏర్పడుతుంది. ఆ తర్వాత బుద్ధిలో మార్పు. అదే జీవన్ముక్తి స్థితి.
ఈ స్థితిని కల్పించడంలో సంగీత జ్ఞానం చూపించే మార్గం ఏకంగా మోక్ష స్థితికే - ఇటువంటి వారికి అదే లోకం. లౌకిక విషయాలేవీ అంటవు. ‘సారమతి రాగం’లోని ఈ కీర్తన రాగభావం బాగా వొంటబట్టించుకుని గురుముఖంగా సాధన చేస్తే తప్ప లొంగదు. సరళమైన మాటలే అయినా ఎంతో లోతైన వేదాంతార్థం ఉంది. అద్భుతమైన కీర్తన.
నా బాల్యంలో ఈ కీర్తనను నేదునూరి కృష్ణమూర్తి పాడగా విన్నా. ‘సాక్షాత్కార! నీ సద్భక్తి’ అను అనుపల్లవితో ప్రారంభించి ఒళ్లు జలదరించేలా పాడిన అనుభూతి ఇంకా, నా మనసులో మెదుల్తూనే ఉంటుంది. ‘ఆవేళ సారమతి’ రాగం బాగా పాడారాయన.
నాదమే శరీరంగా కలిగిన పరమశివుడు మెచ్చే సంగీతం ఎలా ఉంటుందో మనం ఊహించలేమా? రాగ సుధారస పానం చేస్తూ అటువంటి దివ్యమైన సంగీతాన్ని పాడుకున్న త్యాగరాజు తన అనుభవాన్ని మన ముందుంచాడు. అంతేకాదు. ఎటువంటి సంగీతాన్ని అభ్యసించి పాడాలో సూచించాడు. ప్రణవాకార నాదంలోని మర్మాన్ని చెప్పాడు. అంతేకాదు. కలియుగంలో మనిషి తరించేందుకు ఇదొక్కటే మార్గమని వివరించి మరీ చెప్పాడు.
భగవద్గీతలో కృష్ణుడు ‘వేదానాం సామవేదోస్మి’ అన్నాడు.
దివ్యమైన ఓంకార నాదంలోని రుచి తెలియని వారికి చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లే. ఆ దాహం లేని వాళ్లు అసలు భూమికే భారమని తేల్చి చెప్పేశాడు త్యాగయ్య.
* * *
వెనకటి రోజుల్లో విద్వాంసుల సంగీత కచేరీలన్నీ 5,6 గంటలసేపు జరిగేవి. పెద్దపెద్ద సంస్థానాధీవుల గృహాల్లోనో రాజ దర్బార్లలోనో ఏర్పాటయ్యేవి.
పాలకులైనా శ్రోతలైనా ఇష్టపడి వింటూండేవారు. మొక్కుబడిగా (ఇప్పుడు జరిగే ప్రభుత్వ సంగీత కార్యక్రమాల్లా) ఉండేవి కావు.
కళాకారుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే రీతిలో సంస్థానాలుండేవి కావు. వారి ప్రతిభకు తగిన పారితోషికాలు, సత్కారాలూ దండిగా వుండేవి.
బహుమానాలతో, దక్షిణలతో కళాకారులను సత్కరించి పంపించడాన్ని ఎంతో గౌరవంగా భావించే రోజులవి.
అద్వితీయంగా పాడే అఖండ ప్రజ్ఞాదురంధరులైన సంగీత విద్వాంసులకు లోటు లేకుండా మాన్యాలు కూడా యిచ్చిన దాతలుండేవారంటే ఊహించండి.
‘వక్తా శ్రోతాచ దుర్లభా’ రసజ్ఞతను బట్టి పాట. రసికులు కాని వారికి కవిత్వం వినిపించే దౌర్భాగ్య స్థితి రాకూడదని కోరుకున్నాడు కాళిదాసు.
‘దిన యామిన్యౌ సాయం ప్రాతః
శిశిర వసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్చత్యాయుః
తదపిన ముంచత్యాశా వాయుః’
ఎంతటి భావోద్వేగంతో శంకరాచార్యులు మనకీ శ్లోకాలందించాడో గమనిస్తే చాలు. అంతవరకూ ఎందుకు? మన దైనందిన కార్యక్రమం ఎలా సాగుతోందో? గమనించండి.
తెల్లవారుతోంది. నిద్ర లేవగానే మనల్ని చుట్టుముట్టే విషయాలు రెండే రెండు. ఒకటి రాజకీయాలు - ఒకరు చేసినది మరొకరికి కిట్టదు. రెండోది సినిమా కబుర్లు. ఎవరెవరో నటీనటుల పుట్టినరోజులు లేదా వర్థంతులు.. ఆత్మోన్నతికి కించిత్తు ఉపయోగపడతాయా? ఆలోచించండి.
సుస్వరాన్ని గురించి సునాదాన్ని గురించి చెప్పినంత మాత్రాన వినగలిగే స్థితి ఎందరికుంటుంది? గతకాలమె మేలు వచ్చుకాలము కంటె - అన్నట్లుగా ఉంటుంది. తంజావూరు జిల్లాలో కావేరి ఐదు పాయలుగా విస్తరిల్లి ప్రవహిస్తూంటుంది. అందుకే దాన్ని ‘పంచనద క్షేత్రం’ అన్నారు. నేటికి రెండు శతాబ్దాల క్రితం జరగినది.
వెన్నార్ నది ఒడ్డున ప్రత్యేకంగా పందిళ్లు వేసి కొందరు జమీందార్లు, మరికొందరు మిరాశీదార్లు కలిసి సాయంత్రం 6 గంటలకు మహా విద్వాంసుడైన మహా వైద్యనాథ శివన్ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. శ్రోతలు ఎదురుచూస్తున్నారు. కావేరీ తీరంలో వైద్యనాథయ్యర్ సంధ్యావందనం చేసుకుంటున్నాడు. కిక్కురుమనకుండా అక్కడ గుమిగూడిన వేలాది శ్రోతలు ఆయన రాకను నిరీక్షిస్తూ కూర్చున్నారు. 7 గంటల సమయంలో ఆయన సభాస్థలికి రానే వచ్చాడు.
గాంధర్వ శారీరంతో వైద్యనాథ శివన్ పాట ప్రారంభమైంది. నుదుటి మీద వున్న విభూతి రేఖలతో పరమశివుడా అన్నట్లుగా సాగిన ఆయన గానాన్ని ఆలకించిన శ్రోతలంతా మరో లోకంలోకి వెళ్లిపోయారు.
మైకులు లేవు. చివరి వరుసలో కూర్చున్న వారకి సైతం అతి స్పష్టంగా వినిపించగలిగిన గాత్రం కలిగిన గాన గంధర్వులంటే వారే.
త్యాగయ్య శిష్య ప్రశిష్యుల్లో మొదటి తరానికి మహా విద్వాంసులెందరో తమ దివ్యమైన గానామృతాన్ని రసికులకు పంచేసి ప్రసిద్ధులై వెళ్లిపోయారు. ఓంకారనాదాను సంధానమైన గానంతో తదనంతరం విద్వాంసులంతా పూర్వ విద్వాంసుల అడుగుజాడల్లోనే నడిచారు. వారి సంగీత మాధుర్యాన్ని మనసారా రసికులు అనుభవించారు.
అటువంటి సంగీత విద్వన్మణులూ వారిని పెంచి పోషించిన ఘనులూ, పరవశించి విన్న సంగీత రసికులూ ఈ వేళ లేరు.
వినాలనే కోరిక తగ్గిపోయింది. జీవితాలే యాంత్రికంగా సాగిపోతున్నాయి. శుద్ధమైన సంగీతానికున్న విలువలు గ్రహించగలిగే సంస్కారులైన శ్రోతలు తగ్గిపోతున్నారు. మీరు గమనించే వుంటారు. మురుగు నీరు ప్రవహించే చోట, ఆ దుర్గంధం భరిస్తూ, ఆత్రంగా ఆబగా ఆరగించే మహానుభావులెందరో కనిపిస్తారు, మనకు. ఏమి తినాలో ఎలా తినాలో తెలియదు. ఆకలేస్తే కంటికి కనిపించింది తింటున్నారు - సంగీతం కూడా ఇలాగే ఉంది. ఏం వినాలో ఎలా వినాలో కూడా తెలియటంలేదు. వినగానే చప్పట్లు కొట్టేస్తూన్నారు. ఆ విన్నదేమిటో మరుక్షణం గుర్తుండటం లేదు. అసలే భాషలో పాడుతున్నారో తెలియదు. వినిపించే మాటల్లో స్పష్టత ఉంటేగా? ఆ కాసేపూ - ఇంద్రియాలను సుఖపెట్టడమే పరమావధిగా, అందులోనే ఏదో ఆనందాన్ని అనుభవిస్తూ బ్రతికేస్తున్నారు. వ్యామోహం కాదూ?
* * *
1980 ప్రాంతాల్లో విజయవాడ మొగల్‌రాజపురంలోని ఒక పెద్ద హాలులో ప్రసిద్ధ వైణికుడు చిట్టిబాబు వీణా వాద్య కచేరీ ఏర్పాటైంది. మహాజనంతో ఆడిటోరియం నిండిపోయింది. మోక్షము గలదా కీర్తన.. రాగాలాపన ప్రారంభమైంది. చిత్రవిచిత్ర విన్యాసాలతో వీణావాద్య సాగుతోంది. ఆ వేళ చిట్టిబాబు వినిపించిన రాగం ‘సారమతి’. గాత్ర ధర్మం వేరు. వాద్య ధర్మం వేరు. వాద్యాల్లో వినబడే సంగతులకు పరిమితి వుండదు. మూడు స్థాయిల వరకూ వాయించగలిగే సావకాశం మెండుగా ఉంటుంది.
గాత్ర సంగీతానికి కొన్ని పరిధులుంటాయి.
గాత్రంలో మూడు స్థాయిల్లోనూ గమకాలతో కూడిన సంచారాలు పలికించటం వీలు కాదు. గాత్రం అనుకూలించగలవారు కొంత స్థాయి వరకే గానం చేస్తారు. వీణపై రాగాలాపన చేస్తూ తారస్థాయిలో కొన్ని సంచారాలు దురిత కాలంలో వాయించే సమయంలో, అలవాటు కొద్దీ ఎదురుగా కూర్చున్న శ్రోతలు కరతాళ ధ్వనులకు సిద్ధపడుతూండగా గమనించిన చిట్టిబాబు ‘ఆపండ’ని నివారించి (చిరునవ్వుతో) రెండు మూడు నిమిషాల్లో రాగాలాపన ముగించిన.. జనాలకు చిన్న సైగ చేయగానే కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి.
దీని భావమేమి తిరుమలేశ! అంటే ‘అమాయక శ్రోతల్లారా! పక్కవాణ్ణి చూస్తూ చప్పట్లు కొడ్తున్నారు గానీ నిజంగా నా వాద్యంలో మీకు నచ్చిన అంశం ఏమిటో మీకు తెలియదు. తెలిసీ, తెలియని మిడిమిడి జ్ఞానంతో చప్పట్లు కొడితే ఎలా?’ అని జనాన్ని హెచ్చరించినట్లుగా లేదూ?
వీణ ధనమ్మాళ్ గొప్ప వైణికురాలు. ప్రతి శుక్రవారం సాయం సమయాల్లో రెండు గంటలసేపు తన గృహంలో కొందరు సంగీత రసికుల కోసమే (విద్వాంసులు) వాయించేది. (్ఛంబర్ మ్యూజిక్)
ఆమె వాద్యాన్ని గురించి మాట్లాడే సాహసం కూడా వుండేది కాదు. పరిపక్వత చెంది, నాదమయమై పండితులను పరవశింపచేసే ఆమె వీణావాద్యం కోసం పెద్దపెద్ద విద్వాంసులే ఆసక్తిగా వినేవారు. అమృతోపమానమైన వాద్యం ఆమెది. అలా కూర్చుని విన్నంతసేపూ వౌనంగానే ఉండాలి. ‘ఆహా! ఓహోలు గానీ, శభాష్‌లు గానీ ఆమెకు వినిపించాయా?’ అంతే సంగతులు. వెంటనే ముగించేసి ఇంట్లోకి వెళ్లిపోయేది.
జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధిలా అభిరుచిని బట్టి సంస్కారాలు లేదా సంస్కారాన్నిబట్టి అభిరుచులుంటాయి.
తరతరాలుగా ఎందరో మహనీయుల వల్ల పెరిగిన సంగీత సంప్రదాయాన్ని వదిలేసి, శాశ్వత విలువలు లేని తేలిక పద్ధతుల్లో జిమ్మిక్కులతో పాడే సంగీతం ఎంతకాలం నిలబడుతుంది. అటువంటి సంగీతం ఎంతకాలం వింటారు? మనస్సులో నాలుగు నిమిషాలు నిలబడలేని పాట వింటే ఏమి? వినకపోతే ఏమి?
అంతర్ముఖమైన మనస్సే ఆత్మ. ఆత్మానందమంటూ లేని సంగీతం వల్ల ఏం ప్రయోజనం. దృఢమైన ఆరోగ్యం, మంచి వనం, పుష్కలంగా ఐశ్వర్యం, అధికారం కలిగి, వేధావియై యుండి, ఏ కొరతా లేని జీవితం కలిగి, సద్గుణవతియై సౌందర్యరాశి యైన భార్య ఉన్న వ్యక్తి పొందే సంతోషాన్ని ఊహించండి.
‘ప్రతి దశలోనూ ఆ వ్యక్తి పొందే సంతోషంతో పోల్చి చూస్తే, బ్రహ్మానంద సాగరంలో పైన తేలే నురువు (నురగ) కంటే ఎక్కువ కాదు’ అంటాడు త్యాగరాజు.
కర్ణాటక దేశంలో పేరెన్నికగన్న వైణికులలో ‘వీణ శేషన్న’ అగ్రగణ్యుడు. సుకుమారమైన వాద్యానికి మారుపేరు. వాద్యాలన్నింటిలోనూ, సూక్ష్మతను నాదం వున్న వాద్యం వీణ.
వీణ చేతబట్టి నాలుగైదు వేల శ్రోతలను మూగ బొమ్మల్లా కూర్చోబెట్టి సమ్మోహనకరంగా వాయించగల దిట్ట శేషన్న.
చిన్న సంఘటన. సితార వాద్యంలో ఆ రోజుల్లో బాగా పేరున్న బర్ఖత్ అలీఖాన్.. శేషన్న ఇంట్లో సితార వాయించాడు.
బర్ఖత్ అలీఖాన్ వాయించిన పీలూ రాగానికి పరవశుడై పోయిన శేషన్న పరిశుద్ధమైన నాదపుష్టితో రాగాన్ని ఆవిష్కరించిన ఆ మహా విద్వాంసుడ్ని అభినందిస్తూ ఉండబట్టలేక, పెట్టెలో దాచి యుంచిన కాశ్మీర్ శాలువాతో సత్కరించి, కన్నీళ్ల పర్యంతమై పులకించిపోయాడు.
ఈ సన్నివేశాన్ని బాగా గమనించండి.
వీణ శేషన్న బాగా కీర్తిప్రతిష్టలున్న వైణికుడు - సన్మానించబడిన వ్యక్తి చూస్తే సితార్ వాద్య విద్వాంసుడు. యిద్దరూ పేరున్న విద్వాంసులే.
వీరికంటే గొప్పవారు, ఉండవచ్చు. కానీ మరో విద్వాంసుణ్ణి మెచ్చుకోగల సంస్కారమున్న వారుంటారా? నాద సౌఖ్యాన్ని అర్థం చేసుకుని అనుభవించ గలిగిన వారుంటారా?
ఓసారి సంగీత కచేరీలో ఇదే వీణ శేషన్న, తాను ఎప్పుడో బర్ఖత్ అలీఖాన్ ‘పీలూ’ రాగాన్ని గుర్తు చేసుకుంటూ కాపీ రాగం విస్తారంగా వాయిస్తూ కన్నీళ్లతో వీణపై తలదాల్చి, నాద సమాధిలో మునిగిపోయి తడబడుతూ ‘ఇంక వాయింపలేను. ముసలివాణ్ణి మన్నించండి’ అని శ్రోతల నుద్దేశించి పలికిన మాటలకు ముగ్ధులై పోయారు జనం. ఆ సభలో కూర్చున్న కొమ్ములు తిరిగిన సంగీత విద్వాంసులనుకున్నారట. ఇనే్నళ్లుగా పాడుతున్నాం. ఇటువంటి పారవశ్యం, అటువంటి తాదాత్మ్య స్థితి, మాకు లభించలేదే’ యనుకుని సిగ్గుపడ్డారట. గాయకులందరికీ నాదసిద్ధీ లభించదు. కారణం అది పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మానంద స్వరూపాన్ని కొంతవరకూ చూపించగలిగేది ఈ ప్రపంచంలో ఒక్క నాదమే. అది సాధనతోనే సిద్ధిస్తుంది.
సంప్రదాయ సంగీతాన్ని త్రికరణ శుద్ధిగా నేర్చుకుని దేహ, మనశ్శక్తులను ధారపోసి సాధించి మనకు వదిలిన ఈ దివ్యమైన సంగీత విలువలను మనం రక్షించాలనే దృఢ సంకల్పముండవద్దా?
ఎంతో వైవిధ్యమున్న కర్ణాటక సంగీత వ్యాప్తికి జీవితాలను అంకితం చేసిన మహానుభావులను స్మరించుకుంటూ భావితరానికి వారి సంప్రదాయాన్ని కొనసాగించే దృఢమైన లక్ష్యం వుండవద్దా?

చిత్రం....వీణ శేషన్న, సుబ్బన్న

- మల్లాది సూరిబాబు 9052765490