అమృత వర్షిణి
సిద్ధ విద్యాధరి వీణ ధనమ్మాళ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మనకు, మన తాత ముత్తాతలు గుర్తున్నా, లేకపోయినా సంసార వృక్షం వారివల్లే విస్తరిల్లిందనే మాట నిజం.
సమాజంలో పెద్దలైన వారు కొందరుంటారు. వివిధ రంగాలలో ప్రముఖులైన వారూ వుంటారు. వారు బాధ్యతగా ప్రవర్తిస్తే మిగతా సమాజంలోని వ్యక్తులంతా వాళ్లను ఆదర్శంగా భావిస్తారు. యింటి యజమాని బాధ్యత గుర్తెరిగి, క్రమశిక్షణతో, ఒక పద్ధతిలో నడిస్తే ఆ మార్గానే్న పిల్లలు అనుసరిస్తారు. సమాజం అందుకే పెద్దలైన వారిని గమనిస్తూంటుంది. తప్పైనా, ఒప్పైనా సరే.
అటువంటి సందర్భాల్లో పెద్దలైన వారు తమ ప్రవర్తనను గమనించుకుంటూ నడిస్తే వాళ్లే సమాజాన్ని మార్చేస్తారు. తాళం తీయడానికి తాళం పగులకొట్టక్కర్లేదు. తాళం చెవితోనే తాళం వస్తుంది. ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛ భారత్ పేరున మొత్తం సమాజానే్న మార్చేద్దామంటే కుదిరే పని కాదు. పెద్దలైన వారిలోనే మార్పు రావాలి- రావలసిన మార్పు బుద్ధికే. స్వాతంత్య్ర సమరం జరిగే రోజుల్లో మహాత్మాగాంధీ కేవలం తన ప్రవర్తనతోనే మొత్తం జాతిని మార్చిపారేశాడు. వ్యవహారాన్ని ఒక ఉద్యమంలా నడిపాడు.
ఆయన ఖద్దరు కట్టాడు. జనమంతా ఖద్దరు బట్టలవైపు మ్రొగ్గారు. రాట్నం పట్టాడు. జాతి జనులు కూడా రాట్నాలు పట్టారు.
సత్యాగ్రహమన్నాడు. జనమంతా సరేనన్నారు. శాంతి అహింసా మార్గమే మేలన్నాడు. జాతి బతికి బట్టకట్టింది - ప్రజలంతా ఒక్కతాటిపై ఆయనను అనుసరించే బ్రతికారు - ఇదంతా ప్రజల్లో ఏర్పడిన మార్పునకు సంకేతం. ఇదంతా ఎప్పుడో జరిగింది కాదు. మన తాత ముత్తాతలంతా చూశారు. ఆశ్చర్యపోయారు. రోజులు హాయిగా గడుస్తున్నాయి.
కొన్నాళ్లకు గాంధీ తప్పుకున్నాడు. అంతే. ప్రజలు జారిపడటం ప్రారంభించారు. ఖద్దరు కనుమరుగైంది. రాట్నాలన్నీ అటకెక్కాయి. సత్యాహింసలు తప్పుకున్నాయి.
సంప్రదాయ సంగీతం కూడా అంతే. మూర్తిత్రయం వారి అడుగుజాడల్లో నడిచిన విద్వాంసులంతా మంచి సంగీతం పాడారు. ఆదర్శంగా నిలిచారు - పదిమందికీ ‘ఓ దిశ’ చూపించి వెళ్లారు. ఎలా గానం చేస్తే బ్రహ్మానందం అనుభవించగలరో పాడి చూపించారో. అప్పుడూ, యిప్పుడూ కర్ణాటక సంగీతం పాడేదీ, విని ప్రోత్సహించేదీ దక్షిణాదిలోనే. ఆదర్శవంతమైన పాట అక్కడే పెరిగింది.
ప్రతి ఏడాదికోసారి విద్వాంసులంతా ‘తన సమాధి చుట్టూ చేరి తన కీర్తనలు పాడతారనుకోలేదు’ త్యాగయ్య? ఆయన మార్గం వేరు. లక్ష్యం వేరు.
నాదానంద సుఖానుభవం బాగా తెలిసి అనుభవించిన మహనీయుడాయన. లౌకికమైన కీర్తి ప్రతిష్ఠల కోసం అర్రులు చాచిన వాడు కాదు. ఆయన శిష్య ప్రశిష్య సంతతిలో అటువంటి సంగీత సుఖాన్ని అనుభవించిన సిద్ధ విద్యాధరి వీణ ధనమ్మాళ్.
విద్వాంసులు ఈమెను తలచుకోకుండా ఉండరు. 1900 - 1930 మధ్యకాలంలో మద్రాసు నగరంలో జార్జిటౌన్లో, ఓ సన్నని వీధిలో ‘మంజుల వీణానాదం’ మంద్ర స్థాయిలో వినిపిస్తుండగా ఆ వీధంతా నిశ్శబ్దం ఆవరించేది.
వీధిలో సరుకులు అమ్మే వాళ్లు సైతం ‘అమ్మ వీణ వాయిస్తోంది’ అని మెల్లగా గుసగుసలాడుకునేవారట. పూల సౌరభంతో నిండిన గదిలో పరిమళ ద్రవ్యాలు అలదుకుని శ్రావ్యమైన సంగీతంతో గంధర్వ లోకంలో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తూ ఉండేది.
ఆ సంగీత సామ్రాజ్ఞి వీణ ధనమ్మాళ్.
ఒకప్పుడు దేవదాసీ వ్యవస్థ వుండేది. సంగీతాన్నీ నాట్యాన్నీ సుసంపన్నం చేసి భగవదారాధనగా అంకితం చేసిన దేవదాసీ కుటుంబంలో పుట్టిందీమె.
ముఖ్యంగా దక్షిణాదిలో ఆడపిల్ల పుడితే దేవుడికి సమర్పించే ఆచారం వుండేది. ఆ పిల్లలు పెరిగి పెద్దైన తర్వాత దేవుడితో వివాహమైనట్లు భావించేవారు.
దేవుడి ఎదురుగా ఆడి పాడేవారు. వీరికి సమాజంలో ఎంతో గౌరవం కూడా ఉండేది. పైగా వీరి జీవనోపాధికి దేవాలయ భూములిచ్చేవారు.
తంజావూరు దేవదాసీ కుటుంబం నుండి వచ్చిన కామాక్షీ అమ్మాళ్, సుందరమ్మాళ్కు దత్తతగా తీసుకోబడిందీ ధనమ్మాళ్. అలాగే పెరుమాళ్ కోయిల్ నారాయణమ్మ. ‘లలితాంగి’ అనే ఆమెను దత్తత తీసుకుంది. ఈమే ప్రఖ్యాత విద్వాంసురాలు ఎం.ఎల్. వసంతకుమారి తల్లి.
సంగీత త్రిమూర్తులలోని శ్యామశాస్ర్తీ పుత్రుడైన సుబ్బరాయ శాస్ర్తీ దగ్గర కామాక్షీ అమ్మాళ్ సుందరమ్మాళ్ సంగీతం నేర్చుకున్నారు. ఈ ధనమ్మాళ్ గొంతు బాగా సన్నగా ఉండటం వల్ల అమ్మమ్మ కామాక్షీ అమ్మాళ్ ఆమెను గాత్రానికి బదులు వీణ నేర్చుకోమంది.
వీణ ధనమ్మాళ్ మొదటి గురువు అలఘు శింగరి.
ఆమె జీవితమంతా మహావిద్వాంసుల మధ్యనే గడిచింది.
త్యాగరాజ కీర్తనలతోపాటు ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్ర్తీ కీర్తనలు బాగా పాఠం చేసింది.
ముఖ్యంగా మన తెలుగువాడైన క్షేత్రయ్య రాసిన పదాలకు వనె్న పెట్టి వినిపించినది ఆవిడే. ఆమె కుటుంబం లో అందరూ క్షేత్రయ్య పదాలకు ప్రాణం పోసినవారే. ఆ రోజుల్లో ఆ పదాలు పాడటం, పదాలకు తగ్గ అభినయం - రెండూ నభూతో న భవిష్యతి’
ఈ పదాలు చాలావరకూ మరుగయ్యాయి. ఒక్కటే కారణం. పదాలు అందరూ పాడలేరు. రాగానుభవం పుష్కలంగా ఉండాలి. పదాలలోని సాహిత్యంపై అవగాహన కూడా ఉండాలి. ప్రధానంగా అసలు నేర్చుకోవాలనే తపన ఉంటే తప్ప, ఓ పట్టాన ఈ పదాలు వొంటికి పట్టవు. వెనకటి రోజుల్లో ఈ పదాలు పాడిన వారందరికీ రాగ సౌందర్యం మీదే దృష్టి వుండేది.
ధనమ్మాళ్ మనవరాళ్లు బృంద ముక్తలు ఈ పదాలు గానం చేయటంలో వారికి వారే సాటి - నిజానికి ఆ ఇంట్లో పదాలు పాడని వారెవరూ లేరు.
సాత్తనూర్ పంచనదయ్యర్ అనే విద్వాంసుడి చర్యంలో ఆమె నేర్చుకున్న వర్ణాలు, పురందరదాస కీర్తనలు, మరి కొన్ని తమిళ కీర్తనలు ఆమె వీణా వాద్యానికి పదును పెట్టాయి.
ఆ రోజుల్లో మైసూర్‌లోని వీణ శేషన్న, వీణ సుబ్బన్న, పిఠాపురంలో సంగమేశ్వర శాస్ర్తీ, విజయనగరంలో వీణ వెంకట రమణదాసు తమదైన బాణీలు సృష్టించుకుని ప్రసిద్ధులైతే, వీణ ధనమ్మ, బాణీ వీరందరి కంటే విలక్షణమైనది.
గొంతును పెంచి గట్టిగా అరిచి పాడటం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. నిజానికి వీణకు లయను సూచించే తీగలుంటాయి. వీణకు లయ స్వతస్సిద్ధంగా వున్నప్పుడు మృదంగ సహకారం అనవసరమని ఆమె భావిస్తూండేది.
జావళీలకు సంగీత కచేరీలకు ప్రాతినిధ్యాన్ని కల్పించిన ఘనత ధనమ్మదే. ధర్మపురి సుబ్బరాయర్, పట్ట్భారామయ్య, తిరుపతి నారాయణ స్వామి, పట్నం, మొదలైన వారెందరో జావళీలు రచించి ప్రసిద్ధులయ్యారు. ముఖ్యంగా ధర్మపురి సుబ్బరాయరు ధనమ్మాళ్ అంటే ప్రత్యేక అభిమానం. పరస్పర గౌరవాభిమానంతో ఆయన ధనమ్మాళ్ ఇంట్లోనే ఉంటూ, ఎన్నో జావళీలు రాశాడు.
‘్ఫరజ్’ రాగంలో జావళీని కంపోజ్ చేసి, ధనమ్మకు అంకితం చేశాడు. ధర్మపురి. (‘స్మర సుందరాంగుని సరిఎవ్వరే’)
ధనమ్మాళ్‌కు నమ్మినబంటుగా ప్రసిద్ధి చెందిన వైణికుడు, ఆమె శిష్యుడు.. రంగ రామానుజయ్యంగార్. ధనమ్మాళ్ గొప్పతనాన్ని వర్ణిస్తూ ధనమ్మాళ్ పోషకుడుగా లక్షలాది రూపాయల ఆస్తిని ఆమెకు ధారాదత్తం చేసి, ఆమెకు ఏ లోటూ రాకుండా చూసుకునేవాడు ధర్మపురి సుబ్బరాయరు.
కర్ణాటక సంగీత రచనలతోబాటుగా హిందుస్థానీ బాణీలోని సంగతులను అలవోకగా వాయించేది.
ఇప్పటి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వ్యవస్థాపకుడు టి.టి.కృష్ణమాచారి వీణ ధనమ్మాళ్ సంగీతానికి ముగ్ధుడై ఆమెకు అభిమాని అయ్యాడు. ఆయన ప్రోద్బలంతోనే ఆమె కొన్ని గ్రామఫోన్ రికార్డులిచ్చింది.
విజయవాడ ఆలిండియా రేడియో లైబ్రరీలో ధనమ్మాళ్ ఘనరాగ పంచకం, బేగడ, తోడి వంటి రాగాలతో వున్న రికార్డులున్నాయి. ఒక కార్యక్రమం కూడా ప్రత్యేకంగా వివిధ భారతిలో సమర్పించాను.
ఆమె వైదుష్యాన్ని డా.శ్రీపాద పినాకపాణి గారి ద్వారా విన్నాను. ఆమె రాగాలాపనలోని విశిష్టమైన అంశాలు తరచు ప్రస్తావించేవారు. వీణధనమ్మాళ్ ఘనరాగ పంచకం రాగాలాపనను డా.పాణి స్వరబద్ధం చేశారు కూడా. పాణిగారు 1930-31 సం.ల్లో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ నిర్వహించే డిసెంబర్ ఉత్సవాల్లో కచేరీలు వినేందుకు వెళ్తూండేవారు. ద్వారం నాయుడిగారి కచేరీ విన్న తర్వాత, ‘పాణీ! రేపుదయం ఓ శ్రీమంతుని ఇంట్లో ‘్ధనమ్మాళ్’ అని ఒకావిడ వీణాగానం చేస్తారు. అటువంటి వాద్యం మీరిటు పైన వినబోరు. ఆమె వయస్సు మీరి ఉంది. ఆమె వాద్యం విని వెళ్లండన్నారు నాయుడుగారు.
హాలులో తివాసీపై ధనమ్మ, ఆమె కుమార్తె జయమ్మాళ్ కూర్చుని ఉన్నారు. ‘నాయుడుగారూ! రండి! దయచేయండి’ అని సవినయంగా ఆహ్వానించారు.
‘్ధనమ్మ వీణ శ్రుతి చేసుకుని రెండు గంటలు వాయించి ముగించారు. అలా వింటున్నంతసేపూ ఒళ్లు తెలియలేదు - ఏదో లోకంలో విహరించిన అనుభూతి కలిగింద’న్నారు పాణి. సమ్మోహనకరమైన ఆ వాద్యాన్ని పాణి, ద్వారం నాయుడు లాటి మేధావులే ప్రశంసిస్తే చెప్పేదేముంది? గమకాలలో వుండే సొగసు, రవ్వజాతి సంగతులలోని పులకరింత, సమపాళ్లలో మిశ్రమం చేసి వాయించే ఆమె వీణావాదన ప్రతిభ అనన్య సామాన్యం’ అనేవారు డా.పాణి.
పరిశుద్ధమైన కర్ణాటక సంగీత బాణీకి చిరునామా వీణ ధనమ్మ వీణాగానం.
బుద్ధిలో మెదలిన సంగతి వీణలోనూ, గాత్రంలోనూ క్షణంలో ఒకే రీతిగా వినిపించగల - సామర్థ్యం ఆమె సొత్తు. ఆ రోజుల్లో అసమాన ప్రతిభా సామర్థ్యం కలిగిన వయొలిన్ విద్వాంసుడు తిరుక్కోడి కావల్ కృష్ణయ్యర్. వీణా వాదనంలో అసహాయ శూరురాలని ప్రశంసించాడు.
* * *
సంగీతానికి మాతృక వీణ. వీణనుండియే సంగీతం పెరుగుతూ వచ్చింది. తెల్లవారగనే చూడతగిన మంగళకర వాద్యాలు వీణ, వేణువు, మృదంగం.
రాగాలాపన తర్వాత ‘తానం’.
వీణావాద్యంలోని విశిష్టమైన ప్రక్రియ.
ఈ తానాన్ని వీణా వాద్యంలోనే వినాలి. మన ఆంధ్రదేశంలో వీణ విద్వాంసులకు కొదవలేదు. గుర్తింపు ఉన్న మేధావులు కొందరున్నారు. యోగ్యత ఎంతో వున్నా యోగం లేనివారు మరికొందరు. అసమాన ప్రజ్ఞతో వాయించి వెళ్లిపోయారు. అటువంటి మహా విద్వాంసులలో 18, 19 శతాబ్దాల్లో జీవించిన ఘట్కాల వీణ వెంకట రమందాసుకు తాతగారైన పెదగురాచార్యులు, దూర్వాసుల సూర్యనారాయణ, నందిగాన వెంకన్న, తుమరాడ, ఈమని శంకరశాస్ర్తీ, చిట్టిబాబు మొదలైన వారంతా వీణా వాదనా లోలురైనవారే.
ప్రాచీన కవుల దగ్గర నుంచి ఆధునిక కవుల వరకూ వీణ ప్రస్తావన లేని సాహిత్యమంటూ లేదు.
‘వీణా వాదన తత్వజ్ఞః శ్రుతి జాతి విశారదః
తాళజ్ఞశ్చా ప్రయాసేన మోక్ష మార్గం సగచ్ఛతి॥
అనే శ్లోకంలో చెప్పినట్లు, శ్రుతి జ్ఞానం, లయ జ్ఞానం అసాధారణంగా వున్నవారు మాత్రమే ఈ వాద్యం నేర్చుకోవాలి. అంటే శ్రుతికీ అపశ్రుతికీ తేడా బాగా వాళ్లకు తెలియాలి - మరొకరు చెప్పే వరకూ చాలామంది వీణ నేర్చుకుని వాయించే వారికి ఈ శ్రుతి జ్ఞానం అస్సలు తెలియదు.
క్షణ క్షణానికీ శ్రుతి చేస్తూ వీణా విద్వాంసులు పెట్టే హింసను శ్రోతలు ఎక్కువసేపు భరించలేరు కదా మరి? అసలు మూలాధారజమైన నాదం ఏమిటో ముందు తెలియాలి. నాదంలోని రుచి, సుఖం తెలియాలి. తెలియని వారికెప్పుడూ తెరమరుగౌతూ త్రిశంకు స్వర్గంలా మధ్యలో ఊగుతూ ఉంటారు.
అందుకే సంగీతం ఒక యోగ విద్య.
వీణకు ఆకర్షణ ఉంది. ఈ కారణాన్ని అడ్డం పెట్టుకుని ఏమి వాయించినా జనం వింటారనుకోవడం పొరబాటు. చాలామంది విద్వాంసుల్లో, అపశ్రుతి దోషాన్ని వీణ వాయించే వారి కంటే ముందు శ్రోతలే పసిగడతారు. వీణకున్న తీగలన్నీ శుద్ధంగా శ్రుతి చేయగలగడం వీణ నేర్చేందుకు గల మొదటి అర్హత. వైణికుడు సూక్ష్మ అంతర శ్రుతులను (మైక్రో టోన్స్) వినిపించడానికి ఉపయోగించే వ్రేళ్ల కదలికలు అనుభవంలో రావాలి.
ప్రతి రాగంలో వున్న గమక సౌందర్యం మనసుకు ముందు తెలియాలి. ఆ గమకాన్ని వీణపై పలికించగలిగే సామర్థ్యం అనుభవంతో తెలుసుకోవాలి. పెద్దలు చూపిన మార్గాన్ని అవగాహన చేసుకోవాలి. ‘వీణా వాదనలోలుడౌ శివమనో విధమెఱుగరు’ అంటాడు త్యాగయ్య.
పరమ శివుడు వీణా వాదనా లోలుడు. శివుని మనోవిధం ఏమిటి? వీణావాదన లోలుడైన శివుని మనస్సు ఎలా ఉంటుంది? ముక్తుని మనస్సు కూడా అలాగే ఉండాలి.
నాదానికి రెండు రూపాలున్నాయి. కంటికి కనిపించే రూపం కాదు. వింటూ అనుభవానికి తెలిసే నాదం.
సాధారణ స్తితిలో స్పృహకు తెలియనిదీ, భౌతికంగా మనకు వినిపించే నాదం ఈ వైఖరీ వాక్కు వల్లే కలుగుతోంది. ప్రాణాగ్ని సంయోగంతో ఏర్పడిన నాదం అనుభవానికి వస్తే అదే ఆహత నాదం.
ప్రాణం లయించినప్పుడు తెలిసే ‘వాక్కు’ బాపతు ‘నాదం’ అవాహత నాదం!
ఆ నాదమే ఈ సమస్త జగత్తు మొత్తం వ్యాపించి ఉంది. దీనికి శరీర యంత్రం, స్వరపేటిక, నాభి, హృదయమూ అవసరం లేదు.
ప్రాణం తన మూలంలోకి వెళ్తేనే ఇది తెలుస్తుంది. అప్పుడు మనస్సూ లేదు. ప్రాణమూ లేదు. అన్నిటికంటే అతీతమైన హృదయ స్థితి. అదే పరానాదం (అంటే వాక్కు) అదే అనాహతం. అటువంటి ప్రణవాకార దివ్యమైన నాదానుభవం చాలా కొద్దిమందికే లభిస్తుంది. సంగీత త్రిమూర్తులు అనుభవించినదీ, కంచి పరమాచార్యులు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణులు మొదలైన యోగులు దర్శించినది కూడా ఇదే. ‘ప్రణవ నాదంలోనే పరబ్రహ్మ నివాసం’ అని గుర్తెరిగిన త్యాగరాజు లోకమే తానైన పరమాత్ముణ్ణి చూడమంటూ వాక్కునకు అధిష్టాన దేవత వాగధీశ్వరి రాగంలో పాడుకున్నాడు.