అమృత వర్షిణి

అనురాగము లేని మనసున.. సుజ్ఞానము రాదు (అమృతవర్షణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు జ్ఞానుల బోధలు సరైన కొలతల ప్రకారం కుట్టిన దుస్తుల్లా మనకు కుదిమట్టంగా సరిపోతాయి. మరి కొందరి బోధలు వదులు వదులుగా ఉంటాయి. మొదటి రకం పూర్తిగా అనుసరణీయం. రెండోది ఆలోచించి, అర్థమైతే అనుసరించేవి.
ఎన్నిసార్లు మనం స్నానం చేసినా మర్నాడు సహజంగానే శరీరం మలినవౌతుంది. మనం వేసుకున్న దుస్తులేనా అంతే. మనం వాడే వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మురికి పట్టేసి నల్లగా, తయారవుతాయి. బాగానే ఉంది. మరి కంటికి కనిపించకుండా మనల్ని ఓ ఆట ఆడించే మనస్సు, బుద్ధి, అహంకారాల సంగతేమిటి? వాటిపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టడం మాత్రం ఆచరణ సాధ్యమయ్యే విషయమేనా?
కస్తూరి మృగం ప్రారబ్ధం చూడండి. దాని మస్తిష్కం నుండి కస్తూరి ద్రవిస్తున్న సంగతి దానికే తెలియక అడవంతా అటూ ఇటూ తిరిగేస్తూ ఆ వాసన ఎక్కడి నుంచి వస్తోందోనని తికమక పడుతూంటుందిట.
మానవ జీవిత విధానాలు కూడా యిలాగే ఉంటాయనే సత్యాన్ని ఈ కీర్తనలో చెప్పే ప్రయత్నం చేశారు త్యాగయ్య. సరస్వతి రాగంలోని ‘అనురాగములేని మనసున సుజ్ఞానము రాదు - ఘనులైన అంతర్ జ్ఞానుల కెరుకేగాని॥ వగవగగా భుజియించే వారికి తృప్తౌ రీతి సగుణ ధ్యానముపైని సుఖము, త్యాగరాజనుత॥
సరళమైన భాషలో, తేలిక మాటలతో, బ్రహ్మాండమంత విషయాన్ని ఒక్క చిన్న కీర్తనలో యిమిడ్చి పాడటం చిన్న విషయమనుకోకండి. అది త్యాగయ్యకే చెల్లు. జఠరాగ్ని వేధించనంత వరకూ మనిషికి చాపల్యం ఎక్కువ. ఆకలి బాధతో వున్నప్పుడు మాత్రం నపక్వన్న రుచిః. ఆకలికి రుచి అక్కర్లా. అలాగే భగవంతుని పట్ల అనురాగం పెంచుకున్న వాళ్లకు ఏదో రూపంలో ఒక ఆలంబన దొరుకుతుంది. చాలు - ఎన్ని కథలు మనం వినలేదు?
మనకు ఎందరో దైవాలున్నారు. ‘ఏకంసత్, విప్రా బహుథా వదన్తి’ అన్నట్లు ఎందరున్నా సత్య రూపం ఒక్కటే అనే భావన రావాలి.
ఈ విషయంలో అన్నమయ్యను చూడండి. ఆయనకు శ్రీ వేంకటేశ్వరుడు సకల దేవతా స్వరూపుడై నిలిచాడు.
ఓ కీర్తనలో, ‘రాముడంటాడు’ మరో చోట ‘కృష్ణుడంటాడు’. ఆంజనేయుడు, వరాహమూర్తి, నారసింహుడు, ఇలా వేర్వేరు దైవ స్వరూపాల్లా కనిపించే పరమాత్మను అనురాగ భక్తితో అంతర్ముఖుడై దర్శించాడు. అదీ ఆయన గొప్పతనం.
ఒక్కసారి ఆ భక్తి భావం మనసుకు అలవాటైందా! ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువులోనూ పరమాత్మ దర్శనవౌతుంది.
అక్కడ తరతమ భేదాలుండవు. జంతువును స్వభావం నడిపిస్తుంది. ఆ స్వభావమే దానికి దిశా నిర్దేశం చేస్తుంది.
కానీ మనిషి మాత్రం బుద్ధి చేత గొప్పవాడు. ఏది మంచో, ఏది చెడో ఆ తారతమ్యాన్ని బాగా తెలిసికోగల వివేకం వున్నా అధమ స్థానంలోకి జారిపోతే మాత్రం ఎవరు రక్షిస్తారు?
అందుకే ‘అనురాగము లేని మనసుకు సుజ్ఞానం రాదు.’
సగుణ ధ్యానం ఎప్పటికైనా నిర్గుణ ధ్యానం వైపునకు లాక్కెళ్లుతుందంటాడు త్యాగయ్య.
ఉద్ధరేదాత్మనాత్మానం’ అనటమే దీనికి సాక్ష్యం.
ముఖ్యంగా సంసార సాగరంలో వున్నప్పుడు ఆత్మతో సహితంగా తనకు తాను పైకి లేవనెత్తుకోవాలి. ఆత్మే కదా బంధువు?
మొక్కల్ని చూడండి. అవి పుష్పించే దశకు వచ్చేసరికి ‘తుమ్మెదలు’ తమంతట తాము ఎవరూ పిలవ నవసరం లేకుండానే పుష్పాల దగ్గరకు చేరిపోతాయి.
అలాగే ఏ ఒక్కరైనా భగవద్భక్తితో ఆత్మసౌఖ్యాన్ని పొందగలిగితే పరిపూర్ణత్వ దిశలో అడుగులు వేస్తే లోకమంతా అతన్ని అనుసరిస్తుంది. ప్రత్యేకంగా దీనికి ప్రచారం అవసరం లేదు. నాలుగు ఎండు మిరపకాయలు గినె్నలో వేసి పొయ్యి మీద పెట్టి చూడండి. ఆ ఘాటు, ఆ వీధి వీధంతా వ్యాపించేస్తుంది. మనం చేసే సత్కర్మలైనా అంతే.
త్యాగరాజాది వాగ్గేయకారులంతా వారి అంతరంగంలోని భావాలకు మాటలను తొడిగి స్వగతంగానే పాడుకున్నారు. వాళ్లను వాళ్లు ఉద్ధరించుకునే ప్రయత్నంలో చేసిన లోకోపచారమైన బృహత్కార్యమది. అంతేకాదు. ఆయన లోకంలోని మానవుల అంతరంగాలను బాగా చదివారు. అంతర్ముఖులై మనసా వాచా కర్మణా ఆచరించి చూపించారు. చేసిందే చెప్పారు. ఆ మహానుభావులకు అదొక్కటే తెలుసు. లోపల ఒకటి, పైని ఒకటిగా బ్రతకలేదు. చెప్పిందే చేశారు - అందుకే కీర్తి శరీరంతో చిరంజీవులై మనకు ప్రాతఃస్మరణీయులయ్యారు. పాటకు ఒదిగే మాటలు జనానికీ మననానికీ పట్టేలా పాడేశారు - అంకిత భావంతో బ్రతికిన భక్తుల మార్గమే వేరు.
హై థింకింగ్, సింపుల్ లివింగ్ అనే మాటలు తరచుగా మనం వినేవే. ఈ వేళ యివి తారుమారై పోయాయి. రామభక్తుడైన భద్రాచల రామదాసు ‘దాశరథీ శతకం’లో ‘దాసిన చుట్టమా శబరి! దాని దయామతినేవినావు నీ/ దాసుని దాసుడా గుహుడు! తావక దాస్యమొసంగినావు నే/ చేసిన పాపమా! వినుతి చేసిన కావవు కావుమయ్య నీ/ దాసులలోన నేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ’ అంటాడు.
అనన్య భక్తికి సాక్షిగా త్యాగరాజు శబరి జీవితాన్ని ఆదర్శంగా భావించాడు. ఏ లక్ష్యంతో జీవించాలో, ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. శబరిని నేనోళ్ల పొగిడాడు. (ఎంతని నే వర్ణింతు శబరి)
భక్తులు భావాలు పంచుకుంటారు అనటానికి ఇదో నిదర్శనం.
కందమూలాలు తింటూ అడవుల్లో తిరిగి కాలక్షేపం చేస్తూ శుష్కించేంత వరకూ రామధ్యానమే జీవితంగా గడుపుతూ ‘రామదర్శనం’తో పులకించి పోయిన శబరి కంటే అదృష్టవంతురాలు ఈ లోకంలో ఉంటుందా? అని ఆమెను కొనియాడాడు.
ఉత్తమ కులాల్లో పుట్టిన వాళ్లెందరు లేరు? ఎందరు జితేంద్రియులైన యోగులు లేరు? తపశ్శక్తి సంపన్నులైన వారెవ్వరికీ లభించని పుణ్యం శబరికి లభించటానికి కారణాన్ని వెదకక్కర్లేదు.
సామాన్య జీవనానికీ అసామాన్యమైన భక్తికీ నిలువెత్తు నిదర్శనమే ఆమె జీవితం. తరించటానికి అది చాలు.
* * *
మూర్తిత్రయం వారి కీర్తనలను బాగా పాడి ప్రచారం జరిగినది దక్షిణాదిలోనే అనేది వాస్తవం.
తంజావూర్‌లో స్థిరపడినా తెలుగు భాషను పునీతం చేసిన త్యాగయ్య నిత్య వ్యవహారంలో మాత్రం తమిళంలో సంతకం చేసేవారని బాలమురళీకృష్ణ ఏదో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అదలా ఉంచండి. త్యాగరాజు గతించిన తర్వాత ఆయన సమాధిని పునరుద్ధరించి, ఆరాధనోత్సవాలు నిర్వహించటంలో బెంగుళూరు నాగరత్నమ్మ, ఆమె గురువు బిడారం కృష్ణప్ప లాంటి మహనీయుల కృషి లోకానికి తెలిసినదే.
త్యాగయ్య దగ్గర సంగీతం నేర్చుకుని ఆయన కీర్తనలను ప్రచారం చేయటం వాలాజీపేట తిల్లస్థానం, ఉమయాళ్పురం వారి సేవ కూడా ఎరిగినదే. ‘త్యాగరాజ పరబ్రహ్మ వైభవ ప్రకాశ సభ వారిని స్మరించుకోవటం కూడా ఇక్కడ ప్రస్తుతం. ఈ సభను ‘చిన్నకచ్చి’ అని పిలిచేవారు. ఆయన కీర్తనలు పాడి ప్రచారం చేసిన వారిలో తిల్లస్థానం పంజుభాగవతార్, తంజావూర్ పంచాపకేశ భాగవతార్, విశ్వనాథశాస్ర్తీ, చిదంబర భాగవతార్, పండిట్ లక్ష్మణాచార్, శూలమంగళం వైద్యనాథ భాగవతార్, పల్లడం సంజీవరావు (వేణుగాన విద్వాంసుడు) మొదలైనవారు ముఖ్యులు.
అంత ప్రచారమవ్వడానికి ఎంతో కృషి చేసిన వీరందరికీ తెలుగు మాతృభాష కాదు. ఉచ్ఛారణా దోషాలుండటం సహజం. త్యాగరాజు మన తెలుగువాడు. తెలుగు మాట్లాడే సంగీత విద్వాంసులు సైతం, (తెలిసో తెలియకో) ఉచ్ఛారణ దోషాలతో పాడకుండా వుంటే ఈ కీర్తనలకు మరింత గౌరవముంటుంది.
మాతృభాష కాకపోవటం వల్ల కొందరు విద్వాంసుల గానంలో అక్కడక్కడ ఉచ్ఛారణ దోషాలూ, భాష వల్ల సంక్రమించిన యాసతో సాహిత్యం, అందులోని భావం శ్రోతలకు చేరదనే విమర్శ అలా వుంచితే, దశాబ్దాలుగా, శిష్య ప్రశిష్యుల చేత ఈ త్యాగరాజ కీర్తనలు ఒక సంప్రదాయంలో పాడే విధానానికి బీజం వేసి, ఆ వొరవడిని సంగీత ప్రపంచంలో వ్యాపింపజేసిన ఘనత మాత్రం దక్షిణాది విద్వాంసులదే.
త్యాగరాజు వాడిన భాష జీవ భాష. మన భాష. చైతన్యం నిండిన భాష. ఒకవైపు రాగ సౌందర్యాన్నీ, మరోవైపు సాహిత్య భావాన్నీ ఏక కాలంలో చూపించిన ఆ నాదయోగి ‘కీర్తనలు’ అర్థం చేసుకుంటూ, తప్పులు లేకుండా పాడితే చాలు. అదే ఆ మహానుభావుడికి మనమిచ్చే ఘనమైన నివాళి.
* * *
త్యాగయ్య చెప్పిన ‘ఘనులైన అంతర్ జ్ఞానులు వున్నారు’ అని చెప్పేందుకే ఈ సంఘటన. భగవంతునితో శాశ్వతానుబంధాన్ని కలిగిన ఋషులూ వారి జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. 500 ఏళ్లనాటి వ్యక్తి. మహాపురుషుడైన అప్పయ్య దీక్షితుల వారి పేరు చాలా ప్రసిద్ధం. ఆయన గొప్ప శివభక్తుడు. ప్రజ్ఞగల మహా పండితుడు. సంస్కృతంలో అద్వైత, విశిష్టాద్వైత శాఖలకు సంబంధించిన వ్యాకరణ మీమాంసాది శాస్త్ర విషయాలకు సంబంధించి, శతాధికంగా గ్రంథాలు రచించిన మహానుభావుడు.
ఆదిశంకరుల తర్వాత మళ్లీ అంతటి మేధావి. ఓ రోజు ఆయనకో సందేహం కలిగింది. నేను చాలా కాలంగా శివభక్తుణ్ణి కదా? నిజంగా నాలో భక్తి ఉందా? అది నిజమైనదేనా? లేక ఉన్నట్లుగా అనిపిస్తోందా?
ఆపదలలో నాకు ఈశ్వర ధ్యాసగానీ, పరమేశ్వర స్మరణ కానీ ఉంటుందా? లేక ఆ కష్టాల్లో కూరుకుపోయి ఈశ్వరుణ్ణి మరచిపోతానా? అనుకుని తనను తాను పరీక్షించుకో దలిచారు. శివపూజ చేస్తున్నట్లు, శివారాధనలో మునిగిపోయినట్లు కలలు కూడా కంటూండేవాడాయన.
తనకు తానుగా ఉన్మత్తావస్థను తెచ్చుకుంటే ఆ సమయంలో తన మాటలెలా వుంటాయో తెలుసుకోదలిచాడు.
శిష్యుల్ని పిలిచి పిచ్చి రావడానికి మందులు ఇమ్మనీ, మళ్లీ ఆ పిచ్చి తగ్గేందుకు కూడా మందులు ఇవ్వమని ఆదేశించాడు.
పిచ్చిగా ఒళ్లెరగని స్థితిలో తానేమి వాగుతాడో అవన్నీ శిష్యుల్ని వ్రాయమన్నాడు.
మందులతో పిచ్చివాడై పోయాడు. అలా ఏమీ తెలియని స్థితిలో తిరిగాడు. ఉన్మాద స్థితి వచ్చింది. ఆయన నోటి వెంట వచ్చినవన్నీ ఏదో పిచ్చి మాటలని భావిస్తే పొరపాటు. ఆయన మహాజ్ఞాని. ఒళ్లెరుగని ఆ ఉన్మాద స్థితిలోనే ఏక బిగిన ఆశువుగా ఓ 50 శ్లోకాలు చెప్పేశారు. అదీ పిచ్చి. ఆ శ్లోకాలకు ‘ఆత్మార్పణ స్తుతి’ అనీ ‘ఉన్మత్త పంచశతి’ అని పేరు. కొంతసేపటికి నివారణ మందిచ్చారు. ప్రకోపం తగ్గిపోయింది.
ఉన్మాద స్థితి తొలగింది. ఇదీ.. భక్తికి పరాకాష్ఠ.
* * *
ప్రపంచాన్ని మనం చూసే దృష్టికీ, జ్ఞానుల దృష్టికీ తేడా ఉంటుంది.
సర్వం బ్రహ్మమయంగా తోస్తుంది జ్ఞానులకు. చీకటిలో వున్న వస్తువును చూడాలంటే కన్నూ, దీపం రెండూ కావాలి. దీపం చూడాలంటే ఒక్క కన్ను చాలు. సూర్యుణ్ణి చూడటానికి మరో దీపం అవసరం లేదు. ఒకవేళ తీసుకెళ్లినా దాని వెలుగు ఆ సూర్యకాంతిలో కలిసిపోతుంది.
అందుకే ఆత్మను అందుకోవడానికి మన బుద్ధి సరిపోదు. అంతర్ముఖమైన మనస్సు ఒక్కటే చాలు. సంగీత సద్గురువులే యిందుకు సాక్ష్యం. ఎప్పటికైనా సంగీత విద్వాంసులు సాధించవలసిన స్థితి. ఇదే. చెరువులో కమలం చుట్టూ లెఖ్ఖలేనన్ని క్రిమికీటకాలూ, ఠీవిగా, ఏదో జ్ఞానిలా అడుగులేస్తూ కొంగలు కూడా తిరుగుతూంటాయి.
పరమానందం లభించే భాగ్యం మాత్రం ఒక్క తుమ్మెదకే. సంగీతానందం కూడా యింతే.
ఎవార్డులూ, రివార్డులూ, సభలూ, సత్కారాలు అంతర్ముఖులై అనుభవించే ఆనందం కంటే ఏ మాత్రం ఎక్కువ కాదు.
*

చిత్రం.. త్యాగరాజ పరబ్రహ్మ వైభవ ప్రకాశ సభ (చిన్నకచ్చి)
కుర్చీలో కూర్చున్న వారు (ఎడమ నుంచి) విశ్వనాథ శాస్ర్తీ, తిల్లాస్థానం పంజు భాగవతార్, చిదంబర భాగవతార్, పండిట్ లక్ష్మణాచార్,
సూళమంగళం వైద్యనాథ భాగవతార్, పల్లడం సంజీవరావు (వేణువు), సబేష అయ్యర్.
(కూర్చున్నవారు) మహాలింగం, తంజావూరు పంచాపకేశ భాగవతార్, కృష్ణ అయ్యర్, ఆత్మనాథ అయ్యర్

- మల్లాది సూరిబాబు 9052765490