అమృత వర్షిణి

భక్తికొలది వాడే పరమాత్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్యాగంలోని గొప్పతనం, ఔన్నత్యం, హుందాతనం, నిర్భరత్వం, గుర్తించటం తెలియకపోవడం వల్లనే సంకుచిత భావాలు, స్వార్థం మితిమీరిపోయాయంటారు పెద్దలు. శరీర నిర్మాణంలోని ప్రధానాంశమే త్యాగం. గమనించండి.
ఈ త్యాగభావంతో బ్రతికినన్నాళ్లు బ్రతకడం నేర్చుకుంటే, సంసార విముక్తుడై పరంపరగా జీవన్ముక్తి స్థితిని పొందగలుగుతా మంటాడు.. త్యాగానికి మారుపేరైన త్యాగరాజు. ఈ మాటలు చెప్పేందుకు చాలా బాగుంటాయి. వినగానే ఎంతో సుళువుగా కనిపించినా, పర్యవసానంగా ‘గుడికి మేకపోతుని తోలుకుపోయినట్లు, స్వార్థం మూట కట్టుకునే పోవాలి. ఉన్నన్నాళ్లూ తెలుసుకోలేక, చివరకు తెలిస్తే ఏమిటి ప్రయోజనం? ఉపయోగం సున్నా. మనకు ముందు బ్రతికిన పెద్దలు చెప్పినదే వేదం. వాళ్ల మార్గమే సర్వశ్రేష్ఠం. అదే దిక్కు. మనకు తోచినట్లుగా చేస్తే గమ్యం... శూన్యమే.
‘నౌకా చరిత్రం’ ‘ప్రహ్లాద భక్త విజయం’ అనే రెండు యక్ష గానాలు త్యాగయ్య నుండి వెలువడ్డాయి. వీటిలో పద్యాలు, గద్యాలు, ద్విపదలు కూడా వున్నాయి.
పోతన పుట్టినది పద్యాల కోసం. త్యాగయ్య పుట్టినది గేయాల కోసం (కీర్తనలు). భాగవత పద్యాలు చదివి చూడండి. ఏ పాత్రలో పద్యముంటే ఆ పాత్రలో లీనమై పోయాడు పోతన.
ఎవరిని ఉద్దేశించి ఉంటే ఆ వ్యక్తిని తనలో నిక్షేపించుకుని ఆర్తితో పాడుకున్నాడు త్యాగయ్య. సిద్దేంద్రయోగి నృత్యం కోసమే పుట్టాడు.
వీరంతా కారణజన్ములై, నిర్వహింపవలసినవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్లిపోయారు. కష్టసుఖాలన్నీ మనం అనుభవించినట్లుగా వారూ అనుభవించారు. కానీ స్థితప్రజ్ఞులుగానే బ్రతికారు. రీతిగౌళ రాగంలో
‘నన్ను విడచి కదలకురా! రామయ్య! రామ! పట్ట్భారామా! కోదండరామా!
నిన్ను బాసి అరనిముసమోర్వనురా! అబ్ధిలో మునిగి శ్వాసమును బట్టి ఆణిముత్యము కన్నట్లాయె శ్రీరమణ! నన్ను-
-తరము గాని ఎండవేళ కల్ప
తరునీడ దొరికినట్లాయె నీ వేళ! నన్ను-
-వసుధను ఖననము చేసి ధనబాండమబ్బిన రీతి కనుగొంటిడాసి
-బాగుగ ననే్నలుకొమ్ము అల్ల త్యాగరాజ నుత! తనువు! నీ సొమ్ము!
ఈ కీర్తన ప్రహ్లాద భక్త విజయంలోది. విద్వాంసులంతా పాడే కీర్తన.
సిద్ధేంద్రుని ప్రభావంతోనే త్యాగయ్య ఈ యక్షగానం రచించాడంటారు. యోగీశ్వరుడూ కూచిపూడి సంప్రదాయాన్ని ప్రతిష్ఠ చేసినవాడు సిద్ధేంద్ర యోగి.
శ్రీకృష్ణ పారిజాతంలోని తొలి ఘట్టం ‘్భమాకలాపం’.
భావ ప్రకటన కోసం చేసే దరువులు, శబ్దాలు, జతులూ లాంటివన్నీ త్యాగయ్యగారు ఆదర్శంగా తీసుకున్నట్లు చెప్తారు. సిద్ధయ్యగా తిరుగుతూ, యోగియైన సిద్ధేంద్రయోగి కూచిపూడి నివాసి. తల్లిదండ్రులు అంధులు.
సిద్ధేంద్రుడు ఊళ్లో ఉంఛ వృత్తి చేసి వారిద్దరినీ పోషించేవాడట. సిద్ధయ్య సౌజన్యాన్నీ, పితృభక్తి వినయాలనూ చూసిన ‘అతనికి’ ఒక యోగి శ్రీకృష్ణ మంత్రం ఉపదేశించి ఆశీర్వదించాడు. ఆయన ఎవరో కాదు. సాక్షాత్తూ కృష్ణ భక్తుడైన నారాయణ తీర్థులవారే యతీంద్రుల రూపంలో సిద్ధేంద్రునికి కనిపించాడు.
అక్కడ్నుంచి కృష్ణుణ్ణి గురించి పాడుకుంటూ నర్తిస్తూంటే, శ్రీకృష్ణుడే సిద్ధేంద్రుడితో ఆటపాటల్లో పాల్గొనేవాడట.
నీతో ఆడుకుంటున్న వాడెవడబ్బారుూ? అని వృద్ధులైన తల్లిదండ్రులు అడిగితే, శ్రీకృష్ణ భగవానుడనగానే విస్తుబోయి, అంధులమైన మాకు శ్రీకృష్ణ స్వామి దర్శనం చేయించమని కోరారు. నిష్కళంకమైన భక్తితో సిద్ధేంద్రుడు వెంటనే శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు.
ఆ రాత్రి ఒకరికి కృష్ణుని వేషం, మరో యిద్దరికీ సత్యారుక్మిణుల వేషాలూ వేయించి, గుగ్గిలపు మంట వేయిస్తే తాను దర్శనమిస్తానని శ్రీకృష్ణుడు సిద్ధేంద్రునికి చెప్పినట్లూ, ఆ ప్రకారం వేషాలు వేయించగానే ఆ గుగ్గిలపు మంటల వెలుతురులో శ్రీకృష్ణుడి దర్శనం అయిందని చరిత్ర. అంధులైన ఆ వృద్ధ దంపతులకు ఒక్క మెరుపులో దర్శనమయితే కలిగే అనుభూతి ఎలా ఉంటుందో చెప్పడానికి మాటలు సరిపోతాయా? భోరుమని ఏడవాలనిపిస్తుంది.
త్యాగయ్యకు కూడా సరిగ్గా అటువంటి అనుభూతి కలిగింది. ప్రహ్లాదుణ్ణి తనలో నిలుపుకున్న త్యాగయ్య, ఆనందంతో పాడుకున్న కీర్తన, ఆర్తిగా ‘నన్ను విడచి కదలకురా రామయ్య రామ!’
పరమార్థం లేని, రాగభావం లేని త్యాగరాజ కీర్తన ఒక్కటి కనిపించదు మనకు.
ముక్కుపచ్చలారని చిన్న వయసులో ఏళ్ల తరబడి కఠోరమైన దీక్షతో నారాయణ మంత్రమే జపించి తపస్సు చేసిన పరమ భక్తుడైన ప్రహ్లాదుడికి ఒక్కసారిగా దైవ దర్శనమైంది. ఆ పరిస్థితిలో ఎవరికైనా నోట మాట వస్తుందా? ‘ఈయనేనా శ్రీహరి?’ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. సకల బాధలూ పెట్టిన తండ్రి అత్యంత భీకరంగా మరణించినా లేదు బాధ. మా బాగా అయినదనుకోలేదు. ఇన్నాళ్లుగా నే పడ్డ శ్రమకు తగ్గ ఫలం దొరికిందనుకున్నాడు. ఏమిటా ఫలం?
మహామునులకు దొరకని దర్శన భాగ్యం ఒక్కసారిగా కనిపించగానే, నన్ను వదిలి వెళ్లద్దని వేడుకున్నాడు. త్యాగయ్య తానే ప్రహ్లాదుడై ఆర్తిగా స్వామి ఎదురుగా గొంతెత్తి పాడుకున్నాడు. ప్రహ్లాదుడికీ త్యాగయ్యకూ అభేదం అని భావించకండి.
ప్రహ్లాదుడు సంభ్రమాశ్చర్యాలతో-
‘అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తములన్ నిన్ను బహు ప్రకారముల నిత్యంబున్ విచారించి పా
రము ముట్టన్ నుతిసేయ నోపరట నే రక్షస్తనూజుండ గ
ర్వమదోద్రిక్తుడ బాలుడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే..
అంటూ ఒక్కసారి నరసింహస్వామి పాదాలపై పడిపోయాడు. ఈ స్థితి ఎందరికి లభిస్తుంది?
కూపస్థ మండూకంలా, యిదే శాశ్వతమని, యిదే స్వర్గమని భావిస్తూ ‘క్షీణవౌతూ, మళ్లీ పుట్తూ, ఛస్తూ నానా బాధలనుభవిస్తూండే వారికి ఒకరు చెప్పినా బుర్రకెక్కదు. సత్యం తెలియదు.
వారి బుద్ధికీ తోచదు. అడవుల్లో కూర్చున్నా ‘హరి’తత్వం బోధ పడదు సుమా?! అని తనకు తాను చెప్పుకున్నాడు ప్రహ్లాదుడు. పల్లెత్తు మాట ఎవరినీ అనలేదు. శ్రీకైవల్య పదం చేరుకోవటానికే అన్ని బాధల్నీ ఆనందంగా సహించాడు. జన్మ చరితార్థం చేసుకున్నాడు.
‘నన్ను వదిలేసి వెళ్లకయ్యా! స్వామి’ అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. అదీ భక్తికి పరాకాష్ట. ఏ కోరికా లేని వాడడిగేది యిదే!
పోతనామాత్యుని హృదయంలో, తిరుగాడిన ప్రహ్లాదుడు
సీ॥ తల్లి గర్భములోన ఁదగిలి నేనుండగా
నిలవౌని నిజమర్మమేల దెలిపె
ఉన్నతంబున నుండి నుర్విని ఁబడవేయ
నీ భూమిదేవి ననే్నల, బట్టి
హరినిగానని దేహమని యబ్ధిలో వేయ
నీ సాగరుడు గట్టుకేల తెచ్చే
గోముఖ వ్యాఘ్భ్రంగుల నన్ను ఁగొని యాడి
రుూలాగునను నిల్పిరేల నిచట
ఎందుకీ రీతి మరువైతి నిపుడు హరికి
నెవరితో దెల్పు దీ వేళ, నేమిసేతు
జీవుడే మేను కాసించి చిక్కుకొనెను
ఈశుఁగన లేని జన్మంబు ఇలకు బరువు’ అని చింతించాడు.
ప్రహ్లాదుడి ఆర్తిని నారదుడు గమనించి ‘సనక సనందనాదులతో చెప్పి, శిష్య వాత్సల్యంతో ప్రహ్లాద కుమారుడికి దర్శనమివ్వాలనుకున్నాడు. అంతే. ఆ ఉత్తర క్షణంలో నారదుని ‘మహతీ వీణానాదం’ ప్రహ్లాదుడి చెవిని పడింది.
ఈ సన్నివేశాన్ని త్యాగయ్య ‘ప్రహ్లాద విజయానికి నాంది’గా చూపించాడు.
కర్ణాటక సంగీతంలో ఆనంద భైరవి, రీతిగౌళ రాగాలు రెండూ ఆర్తిగా పాడతగినవే. రెండూ పక్కపక్క రాగాలే. రెండు రాగాల్లో వున్న కీర్తనలన్నీ ప్రసిద్ధమైనవే.
యిటువంటి కీర్తనలు శాస్త్రంలో చెప్పే విషయాలను దృష్టిలో వుంచుకుంటూ సభారంజకంగా పాడటమే మనకు తెలుసు.
కానీ నాభి హృత్కంఠ రసనల ద్వారా ఆర్తిగా పాడేందుకు సాధారణ సాధన సరిపోదు.
అసాధారణమైన నాదానుభవం కలిగిన విద్వాంసులు పాడుతున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందానుభూతిని పొందగలం. మొక్కుబడిగా పాడితే లభించేది కాదు - రాదు.
నారదుణ్ణీ, ప్రహ్లాదుణ్ణీ పరాశర రామదాసు మొదలైన వారిని భాగవత శ్రేష్టులుగా మనసులో నిలుపుకున్న త్యాగయ్య, హరినామ స్మరణతో ముల్లోకాలనూ తన వశంలో వుంచ్నున నారదుణ్ణి గురువుగా భావించాడు.
నిరంతరం నారాయణ స్మరణ చేసే వీణా వాదన తత్వజ్ఞుడైన నారదుడు, మాతృగర్భంలో ఉండగానే ప్రహ్లాదుడికి శ్రేయోమార్గాన్ని చూపించి పుణ్యం కట్టుకున్నాడు. భక్తుడైన ప్రహ్లాదుడు దానే్న పట్టుకుని తరించాడు.
ఈ మహానుభావులకు దక్కిన అదృష్టం తనకూ లభించాలని కోరుకున్న భాగవతాగ్రగణ్యుడు త్యాగయ్య.
* * *
మధ్యమకాలంలో తేలికగా పాడగలిగే నిండైన గమకాలతో రాగం మూర్త్భీవిస్తూ పాడే త్యాగరాజ కీర్తనలున్నాయి. ద్వైతము సుఖమా, జననీ నిను వినా (సుబ్బరాయ శాస్ర్తీ కీర్తన) లాంటి కీర్తనలు రాగానుభవం తెలిసేవరకూ, ఆ స్థాయి వరకూ సంగీత సాధన చేస్తేనే గానీ, రాగ సౌందర్యం ఓ పట్టాన అవగాహనకు రాదు.
గట్టుమీద కూర్చుని చూస్తే ‘లోతు’ ఎలా తెలుస్తుంది? నూతిలో తిరిగే కప్పలు అదే మహాసముద్రమనుకుంటూ బతికేస్తూంటాయి. బయటకొస్తే గజగజ వణికిపోతాయి.
సంప్రదాయ సంగీతం కూడా అంతే. పూర్తిగా తెలుసుకోవాలనే కోరిక బలంగా వున్నా, ఒక్క జన్మలో సిద్ధిస్తుందని భావించడానికి వీలులేదు.
ఎండమావిలా కనిపిస్తుంది, ఊరిస్తుంది.
సహజ పండితుడై, సంగీత సాగరాన్ని పుక్కిట పట్టిన త్యాగయ్య లాంటి వాడే
భక్తి జ్ఞాన వైరాగ్య భావనతో, రాగ జ్ఞానంతో పాడుకునే ఎందరో మహానుభావులకు చేతులెత్తి నమస్కరించాడు.
ఈ గురుత్వ భావన వల్ల మనకు త్యాగరాజు ఆత్మీయుడై ఆరాధించబడుతున్నాడు. త్యాగరాజ విరచిత కీర్తనలలో సంప్రదాయ సంగీతం పట్ల భక్తినీ, గౌరవాన్నీ కలిగించే కీర్తనలు కొన్నీ, ఎంచి చూస్తే మొత్తం 18 రకాల కీర్తనలుంటాయని మా పరమ గురువు డా.శ్రీపాద పినాకపాణి గారంటూండేవారు.
రాగసుధా మాధుర్యంతో నిండి, తాదాత్మ్య భావం కలిగించే కీర్తనలు పాడగలిగే విద్వాంసులు బహు అరుదుగా ఉంటూ ఇళ్లల్లోనే అటువంటి అనుభూతితో పాడుతూ కనిపిస్తారు. అటువంటి వారి ద్వారా మాత్రమే వినగలిగే కీర్తనల్లో ఈ ‘రీతిగౌళ’ ఒకటి.
* * *
‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన ‘శేషశైల వాసా’ రీతిగౌళ రాగాన్ని చక్కగా ప్రతిబింబించిన పాట. సంగీత విద్వాంసులు మెచ్చిన పాట. సంప్రదాయ సంగీతానికున్న గౌరవాన్ని గుర్తుచేసే పాట.
సినిమా పాటలకు శాస్ర్తియ సంగీత గౌరవాన్ని కల్పించి, ప్రేక్షకులకూ, శ్రోతలకూ మంచి సంగీతాభిరుచిని కలిగించి వెళ్లిపోయిన ఘంటసాల వేంకటేశ్వరరావు పాడిన వేలాది పాటల్లో ‘శేషశైల వాసా’ అనే పాటలో రీతిగౌళ రాగంలోని ఒదుగులూ, గమకాలు అన్నీ చక్కగా కనిపిస్తాయి. వినిపిస్తాయి.
అటువంటి పాటల అవసరం ఆయనతోనే పోయింది.
*

చిత్రాలు ..త్యాగయ్య *సిద్ధేంద్ర యోగి

- మల్లాది సూరిబాబు 9052765490