పఠనీయం

కవి పాదుషాకు కర్పూర నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి పాదుషా పువ్వాడ- కవిత్వము, వ్యక్తిత్వం- సంకలనం:
పువ్వాడ తిక్కన సోమయాజి, పుటలు:360, వెల:రూ.250/-
ప్రతులకు: పువ్వాడ తిక్కన సోమయాజి, నెం.97, ఎల్‌ఐసి కాలనీ, విజయవాడ-520 008, విట్టల్ పువ్వాడ, నెం.212,
శోభా సన్‌ఫ్లవర్ అపార్ట్‌మెంట్స్, బసవనగర్, మెయిన్‌రోడ్ బెంగుళూరు మరియు వేణుగోపాల్ పువ్వాడ, నెం.39, 1-ఎ, మెయిన్ రోడ్,
ఆర్‌ఎమ్‌వి సెకెండ్ స్టేజ్, హెచ్‌ఐజి కాలనీ, బెంగుళూరు, శ్రీదేవి
గొల్లనపల్లి, ఫ్లాట్ నెం.3-బి, నీల్‌హోమ్ అపార్ట్‌మెంట్,
తెక్కమిట్ట, దుర్గామిట్ట, నెల్లూరు-524003
*
ఒక గణనీయ స్థాయికిగాని, ఇంకా గొప్ప స్థాయికిగాని ఎదిగిన కవులను సాధారణంగా ‘కవీశ్వర’, ‘కవిరాజ’, ‘కవిచంద్ర’ ‘కవితా పితామహ’, ‘కవి సార్వభౌమ’, ‘కవి సమ్రాట్’ మొదలైన బిరుదులు వర్తిస్తాయి. ‘కవి చక్రవర్తి’ అనే బిరుదు కూడా పొందినవారున్నారు. ఈ కవి చక్రవర్తి అనేదానికి సమానార్థకంగా ‘కవి పాదుషా’ అనే బిరుదుతో ప్రఖ్యాతిగాంచిన పండిత కవి గత శతాబ్దంలో కీ.శే. పువ్వాడ శేషగిరిరావుగారు. వారు రసరమ్య కావ్య నిర్మాతలుగా ప్రసిద్ధులు. వారి వైయక్తిక సాహిత్య జీవిత విశేషాల గురించి వారి కుమారుడు పువ్వాడ తిక్కన సోమయాజిగారు ఒక విలువైన, విశిష్టమైన సంకలన గ్రంథం రూపొందించారు. గ్రంథం పేరు ‘కవి పాదుషా పువ్వాడ - కవిత్వము, వ్యక్త్విము’.
ఈ గ్రంథంలో శేషగిరిరావుగారి సాహిత్య సృజన మీద డా. శలాక రఘునాథశర్మ, డా.తుమ్మపూడి కోటేశ్వరరావు, డా.జి.వి. సుబ్రహ్మణ్యం మొదలైన ముప్ఫై ఎనిమిది మంది ప్రముఖుల పసందైన వ్యాసాలు, చెళ్ళపిళ్ల వెంకట శాస్ర్తీగారు, అద్దేపల్లి లక్ష్మణస్వామిగారు, కొండేపూడి సుబ్బారావుగారు మున్నగు పదహారుగురు ఉద్దండ కవుల పద్య ప్రశంసలు, శ్రీరమణ, కొండముది శ్రీరామచంద్రమూర్తి, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు ప్రభృతులైన నలభై మూడుమంది అందించిన ‘పువ్వాడ’ సాహిత్యపు ముచ్చట్లు, 45కుపైగా పువ్వాడ వారి స్వీయ కవితలు- వ్యాసికలు, పువ్వాడ వారి కుటుంబ సభ్యులు ఒక పదిహేను మంది పువ్వాడ శేషగిరిరావుగారితో తాము కలిగి ఉండిన అనుభవాలు, ఆత్మీయతానుభూతులు చోటుచేసుకున్నాయి.
శేషగిరిరావుగారి మహోన్నత వ్యక్తిత్వం గురించి వారి కుమారుడు తిక్కన సోమయాజిగారు అద్దంపట్టి చూపించిన రీతిలో ఎన్నో వివరాలు అందించారు (327 నుంచి 334వ పుట వరకు). ఉదాహరణకు; పువ్వాడ వారి కొన్ని రచనలకు పారితోషికం కింద ‘్భరతి’ మాసపత్రికవారు ఆ రోజుల్లోనే నూటపదహారు రూపాయల చెక్కు పంపిణీ చేస్తే, ‘నా సరస్వతిని అమ్ముకునే ఉద్దేశ్యం లేనందువల్ల’ చెక్కు తిప్పి పంపారట. అది తెలుసుకున్న దేశోద్ధారక, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావుగారు పువ్వాడ వారి రచనలను అన్నింటినీ ఒక సంపుటంగా తన సొంత ఖర్చుతో అచ్చువేయించారట. అది శేషగిరిరావుగారి సాహిత్య మహోన్నతికి దక్కిన అద్భుతమైన గౌరవం.
పువ్వాడవారి కమ్ర కవిత్వ ప్రౌఢిమ గురించి ఈ పుస్తకంలో ఉదాహరణలు అసంఖ్యాకంగా అగుపిస్తాయి. 75వ పుటలో సిహెచ్.బృందావనరావుగారు ఇచ్చిన మనోజ్ఞమైన మచ్చు ఒకటి. అది ఏమిటి అంటే, సుల్తాన్ ఔరంగజేబు తన ఉధృత సేనావాహినితో ఆగ్రా కోటను ఆక్రమించుకునే సన్నివేశ వర్ణన.
‘‘ఆహవాగ్ని చలచ్ఛిఖాగ్ర సూచక నట / ద్భ్రమిత కేతన పటాగ్రములతోడ.. / ఆగ్రహోదగ్రుడౌరంగు డాక్రమించె’’ అనే పద్యం అది.
సుశిక్షిత, పరాక్రమోపేత సైన్యపు ఒడుపును, ఉద్ధతిని, ఝటితి దండయాత్రను వర్ణించే ‘ఆరభటి వృత్తి’ లిఖితమైన ఈ ‘ఘాటైన’ పద్యపు తత్సమపద భూయిష్టత పాఠకుడిని మళ్లీ మళ్లీ చదివింపజేస్తుంది.యుద్ధాగ్ని కీలలా అన్నట్లు అరుణ పతాకాలు ఎగురుతూ వస్తున్నాయి. మధించిన ఏనుగులు ప్రళయ సమయ మేఘాల ఉరుములా అన్నట్లు ఘీంకరిస్తూ వస్తున్నాయి. గుఱ్ఱపు గుంపుల గిట్టల ధ్వని రాను రాను పెరిగిపోతోంది. ఆ అశ్వాలు తమ పద ఘట్టనలకు లేచిన దుమ్ములో కలిసిపోయి కదంతొక్కుతున్నాయి సమరోత్సహంతో. సైనికుల కత్తుల మెఱపులు దిగంతాల చీకట్లలోకి దూసుకుకుపోతున్నాయి. రక్తపుటెఱుపు కన్నులతో ఆగ్రహోదగ్రుడైన ఔరంగజేబు ముందుకు తోసుకొస్తున్నాడు. ఇక్కడి ఉత్ప్రేక్ష, స్వభావోక్తి అలంకారాలు, రౌద్ర, భయానక, వీర రసావిష్కారాలు పద్యానికి శోభనిచ్చాయి. ఆ హవం అనే అగ్ని ఎరుపు. సైనిక, రథ పతాకాలు ఎరుపు. ఔరంగజేబు కనుల కోప సూచక రక్తము ఎరుపు. అన్నీ భయానక బీభత్స అరుణారుణ వరాణలే. ఆగ్రహ ఉదగ్రుడుగా ‘ఔ-రంగు’డు (ఎరుపు రంగువాడు) అంటూ శబ్ద ధ్వని చమత్కారాన్ని చూపించాడు పువ్వాడ. అంతేకాదు సీస పాదాల్ని నాలుగింటినీ దీర్ఘ సంస్కృత సమాసతతో నింపి, ఎత్తుగీతిని మాత్రం ‘తళుకుపచ్చలు’, ‘వెలుగు పులుగు’, ‘జిలుగునెల తొలిగొడుగు’ మొదలైన తెలుగు పదాల సొగసు పోహళింపుతో ‘రమింజేయటం’ ఒక చమత్కార రీతి. జిలుగు నెల తొలి గొడుగు (అర్థచంద్ర బింబం) మహమ్మదీయుల మత చిహ్నం అనేది ఇక్కడ ఒక సూచనా చమత్కారం.
244, 245వ పుటలలో ‘కవిబ్రహ్మ’ అనేది బిరుద నామమా అంటూ ప్రశ్నించుకుంటూ శేషగిరిరావుగారు చేసిన చర్చ - చిన్నదైనా- మన్నికైనది. చాలా బాగుంది. ‘కవిబ్రహ్మ అనునది తిక్కనకు బిరుదు కాదు. ఆయనకు ‘ఉభయ కవిమిత్రుడు’ అన్నదే త్రిభువనముల నెగడిన బిరుదము. ఎఱ్ఱన యొక్క ‘తన కావించిన సృష్టి తక్కొరుల చేతంగాదు..’ అనే పద్యంలోని వాణి యొక్క ‘వాణినే నత్తు’ (నలువరాణి నత్తిగా మాట్లాడుతుంది) అనే అర్థాన్ని విడమరిచి చెప్పారు పువ్వాడ. తిక్కనగారు సరస్వతిని ఉల్లసమాడ (పరిహాసమాడ) గలవాడు అని ఎఱ్ఱనగారి కవి హృదయం అంటూ చమత్కరించారు శేషగిరిరావుగారు.పువ్వాడవారు ‘కురుక్షత్రం’లో అభిమన్యుడుగా ఒకసారి, అశ్వత్థామగా మరోసారి నటించి ప్రేక్షకులను మెప్పించారట- ఇది 237వ పుటల గెల్లి రామమోహనరావు చెప్పినమాట.
ఆనాటి చాలామంది భారతీయ కవులయొక్క, పువ్వాడ వారు పాల్గొన్న సభల యొక్క ఛాయాచిత్రాలు కూడా ఇందులో పొందుపరచారు సంకలనకర్త. అది ముదావహం. ఆ ఛాయాచిత్రాలన్నీ గొప్ప పురాస్మృతి- దృశ్యానుభూతి ప్రదాయికాలు. ఈ పుస్తకం చాలా విస్తృతమైన రచనం. వివిధ ఆసక్తికర విశేషాల సంకలనం. ఇది రుూనాటి తెలుగు ఆసహిత్యపు దర్బారులో ఎందరో ఆధునిక సాహితీ రత్న సభాసదులు కవి పాదుషాకు కమనీయ మణిమయమైన పళ్ళెరంలో ఎత్తిపట్టిన కర్పూర నీరాజనం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం