Others

పల్లె పిలుస్తోంది.. పదండి పోదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు పల్లెటూళ్లు ఎలా ఉండేవి..? తొలికోడి కూయగానే చిరు చీకట్లతోనే వళ్లు విరుచుకుని పల్లె నిద్ర లేచేది. పాలేర్లు వాకిలి ఊడ్చే పొలికట్టె చప్పుళ్ళు.. అరకలకు సిద్ధమవుతున్న ఎద్దుల మెడలోని గంటల గలగలలు, వంటింట్లో ఇల్లాలి చేతి మజ్జిగ కవ్వపు నాట్య రవళులు, చెట్లమీది పిచ్చుకలు చేసే కిచ కిచ శబ్దాలు.. ఒకటిని మించి మరొకటి శ్రవణపేయంగా, ప్రకృతి చేస్తున్న పాటకచ్చేరీలా ఉండేది. తెలతెలవారటం ఆలస్యం- ‘అంబా!’ అని అరిచే లేగదూడల అరుపులు, దూరం నుంచి ఠంగు ఠంగుమని వినిపించే గుడి గంటలు, జొన్నలు దంచుతున్న ఆడవాళ్ళ చేతిగాజుల గలగలలను మిళితం చేసుకున్న రోకటి శబ్దాలు వీనులకు విందు చేసేవి. పల్లెటూరు అంటేనే రకరకాల పనులకు పెట్టింది పేరు. ఓ ఇంటినుంచి రోకటి శబ్దమైతే, మరో ఇంటినుంచి తిరగలి శబ్దం వినిపిస్తూ రెండూ కలిసి యుగళగీతం ఆలపిస్తున్నట్లు ఉండేది.
ఆ రోజుల్లో పల్లెజనులు శ్రమైక జీవులు, ఇంట్లో ఉన్నపుడు ఇంటి పనులయితే.. పొలం వెళ్లినపుడు దుక్కి దున్నడం, విత్తులు నాటడం, చేనుకు నీళ్ళు పెట్టడం, పరిగె ఏరడం, ఎరువులు వేయడం, చీడ పీడలు ఏరిపారేయడం, పంట కోయించడం, కుప్ప నూర్పించడం.. ఎండా లేదు, వానా లేదు, పగలూ లేదు, రాత్రీ లేదు- అంతగా కష్టపడి స్వేదం చిందిస్తేగానీ ధాన్యం బస్తాలు ఇంటికి వచ్చేవి కావు. సంక్రాంతి పండుగకి కొత్త బియ్యంతో పాయసం వండితే గానీ రైతు కుటుంబం కళ్ళలో ఆనందం, తృప్తి వెల్లివిరిసేవి కావు..!
పల్లెటూళ్లలో ఎన్నో కులాల వారు వారి వృత్తులను చేసుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఎంతో గౌరవప్రదంగా జీవించేవారు. ‘మనిషి సంఘజీవి’ అని నిరూపించేవాళ్ళు. ఊరికి ఏ సమస్య వచ్చినా, వ్యక్తుల మధ్య ఏ గొడవలు వచ్చినా పోలీసు స్టేషన్లకు పరుగులు పెట్టకుండా ఊరి పెద్దల సమక్షంలో రచ్చబండ వద్దనే పరిష్కరించుకునేవారు. ఊరి పెద్దలు ఏది చెబితే అదే గ్రామస్థులకు వేదం అన్నట్లుగా ఉండేది.
ఊరి ప్రజలంతా ఆత్మీయతను పంచుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఏ ఇంట పెళ్లవుతున్నా ఊరంతా సందడే. కడవలతో పాలు.. కావిళ్ళతో కూరలు ఆ ఇంటికి తరలివెళ్ళేవి. ఆ రోజు ఊరి జనం అంతా ఆ పెళ్లి పందిరి కిందే ఉండేది .. పెళ్లి పందింట్లో పెద్దరికం చేస్తూనో, సహపంక్తి పప్పన్నాలు తింటూనో గడిపేవాళ్ళు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఆప్యాయత పంచుకునేవారు. నాటుమందో, మంత్రమో, తాయత్తో, విబూది బొట్టో ఎవరికి తోచిన సలహా వాళ్లిచ్చి ఇంటిముఖం పట్టేవాళ్ళు. ఆ కాలపు గాలి మహిమో, తిండి బలమో, అధిక శ్రమో తెలియదు గానీ, అకాల మరణాలకన్నా శతవృద్ధుల సహజ మరణాలే ఎక్కువగా వుండేవి. ఏ ఇంట్లోనైనా ఎవరైనా చనిపోయారని తెలిస్తే ఊరు మొత్తం ఉరుకులు పరుగులతో ఆ ఇంటికి చేరుకునేది. శవయాత్ర ముగిసేవరకూ ఏ ఇంటా పొయ్యి వెలిగేది కాదు.. మెతుకు ముట్టేవాళ్ళు కాదు. ‘ఒకరి కష్టం ఊరి కష్టం’ అన్నంతగా విషాదంలో ఉన్నవాళ్లను అక్కున చేర్చుకుని ‘మీకు మేమున్నాం’ అని అండగా నిలిచేవాళ్ళు. ఏ అగ్నిప్రమాదం జరిగినా ప్రతి ఇంటి నుంచీ జనం నీళ్ళ బిందెలతో పరుగులు పెట్టేవాళ్ళు. అంటురోగాలు మహమ్మారిలా ఊరి జనాన్ని కబళిస్తుంటే ఊరంతా కలిసి గ్రామ దేవతలకు బోనాలు జరిపి, మొక్కులు తీర్చుకుని ఊరి బాగు కోసం అహర్నిశలూ ఆరాటపడేవాళ్ళు. కొన్ని మూఢ నమ్మకాలు, దురాచారాలు ఉన్నా అవి వాళ్ళ అమాయత్వం, అజ్ఞానం కారణంగానే కానీ కావాలని ఎవరినీ బాధపెట్టాలని కాదు. అవి మూఢ నమ్మకాలు అన్న విషయం వాళ్లకూ తెలియనంతగా తరతరాల నుంచీ వస్తున్న ఆచారాలు వాళ్ళమీద ప్రభావం చూపటం అది వాళ్ళ తప్పు కాదేమోననిపిస్తుంది. ‘మన పెద్దలు ఇలా చెప్పారు.. ఇలాగే చెయ్యాలి..’ అన్న విషయం మాత్రమే వారికి తెలుసు.
నేటి ఆధునిక యుగంలో పల్లెల ముఖ చిత్రం అనూహ్యంగా మారిపోయింది.
ఆధునికత, ఫ్యాషన్లు వేలంవెర్రిలా పల్లెలకు సైతం పాకడం, సినిమాలు, రాజకీయాలు, సాంకేతికత అక్కడి స్వచ్ఛమైన మనసులను కలుషితం చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పల్లె అందాలు, ప్రశాంతత మసకబారిపోవడం నేడు అందరికీ ఆందోళన కలిగించే విషయమే.
పూరిళ్లు, పెంకుటిళ్ళు డాబాలుగా మారిపోవటం, పంట పొలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పడి ప్లాట్లుగా, ఫాట్లుగా మారడంతో వ్యాపార సంస్కృతి వేళ్లూనుకుంటోంది. వ్యవసాయం చేయడం అంటే ఇపుడు చాలామంది రైతులు నామోషీగా భావిస్తున్నారు. కన్నతల్లి లాంటి పంట భూములను వదిలి పట్టణీకరణ వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్నారు. కులవృత్తుల జాడ కానరావడం లేదు. పచ్చని పల్లెల్లో ఆధిపత్యం కోసం కులాల కుమ్ములాటలు నిత్యకృత్యమై పోయాయి. ఒకప్పుడు ఊరి మొత్తం మీద ఒకే గుడి, ఒకే చర్చి, ఒకే మసీదు ఉన్నా, ఎవరి దేవుళ్ళను వాళ్ళు ప్రార్థించుకుంటూ పరమత సహనానికి నిదర్శనంగా కనిపించేవి. నేడు ఎక్కడో నగరాల్లో తలెత్తే మతకలహాల ప్రభావానికి పల్లెలు సైతం గురవుతున్నాయి. ‘మనిషికి మనిషే కరువు’ అనే నగర సంస్కృతి ఇపుడు పల్లెలకూ పాకడంతో- ‘ఎవరికివారే’ అన్నట్టయి ప్రేమ పూరిత పలకరింపులకు దూరమై జనం ఒంటరి జీవితాలకు అలవాటుపడుతున్నారు. చెట్టూ, చేమా, పక్షి, పురుగు, గొడ్డూ గోదా, పాడీ, పంటా అన్నీ మాయమైపోతూ పల్లెల్లో ఎటు చూసినా కాంక్రాట్ కట్టడాలు తప్ప మరేమీ కనబడటం లేదు. ఊరిలో చెయ్యటానికి పని లేక, తినటానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక నగరాలకు, విదేశాలకు వలసపోతున్నారు. ఇపుడు గ్రామీణ వాతావరణం గుర్తు పట్టలేనంతగా మారిపోతున్నది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మనిషి మనుగడకు, పర్యావరణానికి, సంస్కృతీ సంప్రదాయాలకు అపార నష్టం జరగక తప్పదు. శిథిలావస్థకు చేరుకున్న గ్రామీణ వ్యవస్థ ఏదో ఒక రోజు అమాంతం కూలిపోక తప్పదు. ఈ వ్యవస్థకు మరమ్మతులు చేయాలన్న తపన ఎవరిలోనూ కనిపించడం లేదు. గనుక పల్లెలను నమ్ముకుని అక్కడే జీవితాలను వెళ్ళదీస్తున్న వారు, పట్టణాల్లో బతకడం దుర్లభం అని భావించేవారు ఇకనైనా తక్షణ చర్యలు తీసుకోకపోతే- గ్రామాల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది.

-కొఠారి వాణీచలపతిరావు