Others

ఏది నిజం (ఫ్లాష్‌బ్యాక్@ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగేశ్వరరావును చిత్రరంగానికి పరిచయం చేయటమేకాక తమ
‘బాలరాజు’ ద్వారా హీరోవర్షిప్ అందించినవారు ఘంటసాల బలరామయ్య.
వారి తదనంతరం వారి పెద్దకుమారుడు ఘంటసాల కృష్ణమూర్తి ప్రతిభా
బ్యానర్‌పై ‘పీటలమీద పెళ్ళి’ (1954), నాగభూషణాన్ని హీరోగా పరిచయం చేస్తూ ‘ఏది నిజం’ (1956) నిర్మించారు. తరువాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ (తెలుగు, తమిళం) నిర్మించారు. మార్చి 10, 1956న విడుదలైన ‘ఏది నిజం’
చిత్రం 60 ఏళ్లు పూర్తి చేసుకుంది.

రచన: సుంకర సత్యనారాయణ
నృత్యం: వెంపటి సత్యం
కెమెరా: ప్రకాష్
కళ: చలం
కూర్పు: ఎఆర్‌యస్‌బి మణి
సంగీతం: మాస్టర్ వేణు,
వైణిక విద్వాంసుడు ఎస్ బాలచందర్

నిర్మాత, దర్శకత్వం:
ఘంటసాల కృష్ణమూర్తి.

ఊరి మునసబు (గుమ్మడి) మేకవనె్నపులి. అతని ఇంట్లో పనిమనిషి సీతమ్మ (హేమలత). ఆమె కూతురు రామి (జానకి). కాయకష్టంతో బ్రతికే వ్యక్తి తిరపతి (జోగారావు) ఆమెను చెల్లెలుగా భావిస్తుంటాడు. కట్టెలు కొట్టుకు జీవించే కోటయ్య (నాగభూషణం), రామి ఒకరినొకరు ఇష్టపడతారు. శివాలయం పూజారి సుబ్బయ్యశాస్ర్తీ (వంగర). డాక్టరు డేంజర్ (రమణారెడ్డి). మేనమామ నరసయ్య కూతురు నాంచారమ్మతో పెళ్ళికిష్టపడని మునసబు, రామి అందాన్ని చూసి ఎలాగైనా ఆమెను పొందాలని ఆశపడతాడు. రామికి, కోటయ్యకు తన ఖర్చుతో పెళ్ళిచేసి, సీతమ్మను యాత్రలకు పంపుతాడు. ఒకనాడు కోటయ్య తన పేరు వ్రాసిన కత్తి గుడిలో మర్చిపోతాడు.
మునసబు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రామిని బలవంతం చేయబోగా, రామి అతన్ని విసిరి కొడుతుంది. అంతలో అక్కడకు వచ్చిన తిరపతి, మునసబుపై తిరగబడి నీ అంతు చూస్తానని హెచ్చరిస్తాడు. దాంతో కోపగించిన మునసబు -రామికి, తిరపతికి సంబంధం ఉందని పూజారి ద్వారా పుకారు పుట్టిస్తాడు. తిరపతిని హత్యచేసి ఆ నేరం కోటయ్యమీద పడేలా చూస్తాడు. పూజారి, డాక్టరు తప్పుడు సాక్ష్యంవల్ల కోటయ్యకు 20ఏళ్ల కఠిన శిక్ష పడుతుంది. ఒంటరియైన రామిని చేపట్టాలనుకున్న మునసబు పథకం పారదు. నిజం తెలుసుకోవాలని కోటయ్య జైలునుంచి తప్పించుకు వస్తాడు. అతన్ని చూడగానే పూజారి గుండె పగిలి మరణిస్తాడు. కోటయ్య బంధువు నాగన్న (సీతారాం) అతన్ని గుహలో దాస్తాడు.
రామి అక్కడకు వచ్చి వెళ్తుంటుంది. ఒకనాడు ఆమెకు పురిటి నొప్పులు రావటంతో డాక్టర్‌ను తీసుకువస్తున్న కోటయ్యను అనుసరించిన మునసబు, డాక్టర్‌ను కత్తితో పొడుస్తాడు. మునసబును తరిమిన కోటయ్యను అతడు చంపాలని చూడటం, కోటయ్య నిర్ధోషి అని పోలీసులకు డాక్టరు మరణవాంగ్మూలం ఇవ్వటం, పోలీసులు మునసబును అరెస్ట్‌చేయటంతో కోటయ్య నిర్ధోషిగా విడుదలవుతాడు.
మునసబు నౌకరు మోతాదుగా బొడ్డపాటి, నాటక దర్శకునిగా పేకేటి, జడ్జిగా వైవి రావు, లాయర్‌గా జగ్గయ్య నటించారు.
ఈ చిత్రంలో తొలిసారి హీరోగా నటించిన నాగభూషణం -అమాయకుడు, కాయకష్టం చేసే నిజాయితీగల యువకునిగా, రామిపట్ల ప్రేమ, తిరపతిపట్ల స్నేహం, వ్యక్తులపట్ల నమ్మకం, తనను అన్యాయంగా, దోషిని చేసినందుకు నిజం తెలుసుకోవాలని జైలులో నిశ్చయం, తప్పించుకుని వచ్చాక డాక్టరును నిలదీసి వదిలేయటం, చివరివరకూ మునసబు దోషి అని తెలియక ఇబ్బంది పడటం, తెలిశాక అతనితో తలపడటం లాంటి సన్నివేశాల్లో ఎంతో సహజంగా, పరిణితి చెందిన నటనతో మెప్పించారు. రామిగా జానకి -తెలివి, చొరవ, ధైర్యం, వివేకం, సుగుణంకల యువతిగా నిగ్రహంతో కూడిన నటనను ప్రదర్శించింది. మునసబుగా గుమ్మడి విలనీని మాటల్లో, చేతల్లో, చూపుల్లో, నయవంచకునిగా, కరుకుగా సన్నివేశానుగుణంగా ప్రదర్శించగా, తిరపతిగా నటించిన జోగారావు ఎంతో సునాయాసంగా తన పాత్రలో రాణించారు. గజదొంగగా నాటకంలో కోపం, పట్టుదల, మునసబుపట్ల నిరసన వ్యక్తం చేయటం, కోటయ్యవద్ద అమాయకంగా, ప్రేమగా మెలగటం, ఆకట్టుకునేలా చూపటం విశేషం. (ఈ చిత్రంలో అతను హత్య కావించబడతాడు. తరువాత అతను నిజంగానే స్వర్గస్తుడు కావటం విచారింపవలసిన విషయం)
దర్శకులు సన్నివేశాలను ఎంతో సహజంగా పట్టుతో నడిపారు. కోటయ్య తన కత్తి పూజారివద్ద మర్చిపోవటం, దాంతోనే మునసబు తిరపతిని చంపటం, డాక్టరు నిజం చెప్పాడేమోనని మునసబు అతన్ని బెదిరించటం, చివర గుమ్మడి, నాగభూషణంల ఫైట్ ఎంతో విపులంగా కొండలపై థ్రిల్లింగ్‌గా చిత్రీకరించటం, ఇన్‌స్పెక్టర్‌ను కూడా గుమ్మడి కాల్చటం వంటి సన్నివేశాలను పట్టుతో నడిపారు.
‘ఒక కార్యం సాధించాలంటే మనిషి చాలా నాటకాలు ఆడాలి’ (గుమ్మడి). ‘రెక్కల కష్టంమీద బ్రతికేటోళ్ళం. మా కష్టం మాకు దక్కితే చాలు’ (తిరపతి). ‘అందానికి అంతస్తు ఏమిటి?’/ ‘నీతి నిజాయితీ వున్నవాడికి తిండి వుండదు’ వంటి డైలాగులు, పాటలతో రచయిత మెప్పించారు. రామి పెళ్ళిలో జరిగిన నృత్య గీతంలో ఇవి సరోజ నృత్యం, నర్తకుని డప్పువాద్యంతో బసవరాజు అప్పారావు వ్రాసిన గీతం ‘గుత్తివంకాయ కూరోయి బావా కోరి వండినానోయి (గానం-జిక్కి), జానకి, నాగభూషణం, జోగారావు, హేమలత తదితరులపై చిత్రీకరించారు. జానకి అడవిలో కోటయ్యను తలచుకుంటూ పాడే గీతం -నేడు నా మనసు ఉయ్యాల లూగెనే (జిక్కి), గుహలో శివలింగం ముందు జానకి పాడే గీతం -ఒకానని దైవమా బీదల రోదన వినవా నిరుపేదల వేదన కనవా (జిక్కి), ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్, నేపథ్య గీతం, కుండలపై నటీనటుల పేర్లు, రహదారి సూచికలపై సాంకేతిక నిపుణులు, బండరాళ్ళు, కుండ, పెంకులు, కొండలపైన మిగిలిన వారి పేర్లు చూపుతూ చిత్రీకరించటం విశేషం. ఆ గీతం -ఏది నిజం ఏది నిజం మానవుడా (ఘంటసాల, మాధవపెద్ది బృందం). నాటకంలోని పద్యం -ఎవడయినా తెగించి ఎదిరించెను నన్ను.. జంట కవులుగా పేరొందిన సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్‌రావు కలిసి చిత్రానికి పాటలు, మాటలు అందించారు. చిత్రానికి రాష్టప్రతి యోగ్యతాపత్రం లభించింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి