AADIVAVRAM - Others

అర్థం లేని రైమ్స్ పిల్లలకు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల చదువులు మాతృభాషా మాధ్యమంలోనే మొదలు కావాలని ఎందరో విద్యావేత్తల అభిప్రాయం. కానీ మన దేశంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు తప్పనిసరి అనర్థంగా పాతుకుపోయేయి. అందులోనూ చదువులు మొదలుపెట్టే పసిపిల్లలచే ఈ పాఠశాలలో వల్లె వేయిస్తున్న రైమ్స్ బ్రిటిష్ పుస్తకాల నుండి అరువు తెచ్చుకున్నవి. మన దేశ సంస్కృతి, ఆలోచనలకు ఏ మాత్రం సరిపోనివి.
ఉదాహరణకు కొన్ని ఇంగ్లీష్ రైమ్స్ చూద్దాం.
బా బా బ్లాక్ షీప్
ఇది మొదట ఇంగ్లండ్‌లో 1744లో ప్రవేశపెట్టారు. 13వ శతాబ్దంనాటి పాలకులు గొర్రెల నుండి వచ్చే ఉన్నిపై విపరీతంగా పన్నులు విధించేవారు. అందులో భాగంగా ప్రజలు తమ గొర్రెల నుండి తీసిన ఉన్నిలో మూడవ వంతు పాలకులకు పన్నుగా పంపించేవారు. మరో భాగం చర్చికి పంపించేవారు, ఇక మిగిలిన మూడవ భాగం గొర్రెల కాపరికి వెళ్లిపోయేది. ఈ అర్థం వచ్చేటట్లుగా వాళ్లు ఆ రైమ్ పాడుకుంటారు.
రెయిన్ రెయిన్ గో అవే
ఇది ఎలిజబెత్-1 (1533-1603) రాణి పాలించే రోజుల్లో రాసినది. ఇంగ్లీషు వారు స్పానిష్ ఆర్మడాపై యుద్ధం చేస్తున్నప్పుడు తుఫానులో చిక్కుకున్న సైనికులు భయంతో వర్షాన్ని వెనక్కి వెళ్లిపొమ్మంటూ పాడుకున్న పాట ఇది.
హంప్టీ దంప్టీ సాట్ ఆన్ ఎ వాల్
ఇంగ్లండ్‌లో 1642-49 మధ్య సివిల్ వార్ జరుగుతున్నప్పుడు రాసిన రైమ్ ఇది. జాన్ టెన్నియల్ రాసినట్లు హంప్టీ దంప్టీ అనేది ఒక గుడ్డు కాదు. ప్రత్యర్థి వర్గాలైన ఆర్మీ ఆఫ్ పార్లమెంటేరియన్లకు వ్యతిరేకంగా ఛార్లెస్-1 సైన్యం కోల్చెస్టర్ పట్టణంలో ఒక ఎతె్తైన చర్చి బురుజుపై నిలబెట్టిన చిహ్నాన్ని ఇది సూచిస్తుంది. ప్రత్యర్థుల దాడిలో ఎతె్తైన బురుజు నేలమట్టం కావడంతో హంప్టీ దంప్టీ కూడా కింద పడిపోయింది. అలా కింద పడ్డ ఆ చిహ్నం ఎవరికీ కనిపించకపోవడంతో దానిని ఎవరూ తిరిగి నిలబెట్టలేకపోయారు. అప్పుడు రాసినదే ఈ ‘హంప్టీ దంప్టీ సాట్ ఆన్ ఎ వాల్/ హంప్టీ దంప్టీ హేడ్ ఎ గ్రేట్ ఫాల్’ అనే రైమ్.
జానీ వాట్ పప్పా! జానీ?
జానీ జానీ వాట్ పప్పా?/ ఈటింగ్ షుగర్? నో పప్పా?
టెల్లింగ్ లైస్? నో పప్పా?/ ఓపెన్ యువర్ వౌత్! హాహాహా!
ఇది నేర్పడం ద్వారా అమాయకులైన పసిపిల్లలకి తల్లిదండ్రుల వద్ద అబద్ధాలాడవచ్చని చెప్పడం లేదూ?!
లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్
ఇది 1744కి చెందిన టామీ థంబ్స్ ప్రెట్టీ సాంగ్ బుక్‌లోనిది. మొదట లండన్ బ్రిడ్జి కట్టింది రోమన్ దేశస్థులు. సరైన మరమ్మతులు లేకపోవడం వల్ల ఆ బ్రిడ్జి తరచుగా కూలిపోతూ ఉండేది. అది గుర్తు చేసుకుంటూ ఈ రైమ్ రాశారు.
ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ సిటీ కౌన్సిల్ 1999లో బా బా బ్లాక్ షీప్, రెయిన్ రెయిన్ గో అవే, హంప్టీ దంప్టీ సాట్ ఆన్ ఎ వాల్ - లను పిల్లలకు నేర్పించడం వల్ల ఏ విధమైన ప్రయోజనమూ లేదనీ, వాటిని వారి పాఠ్యాంశాల నుండి తొలగించాలనీ నిర్ణయించింది.
పైన పేర్కొన్నవే కాకుండా మరి కొన్ని అర్థంలేని ఇంగ్లీష్ రైమ్స్‌ని గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి పాఠ్య పుస్తకాల నుండి తొలగించింది కూడా. వాటికి బదులుగా మన భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆలోచనా ధోరణిని తెలిపే పద్యాలను పాఠ్యాంశాలలో చేర్చింది. మన దేశ సంస్కృతిని ఏ విధంగానూ ప్రతిబింబించని, ఎందుకూ పనికిరాని ఇంగ్లీషు పద్యాలని పాఠ్యాంశాలలోంచి తొలగించగానే అదేదో పెద్ద నేరమన్నట్లు తమను అభ్యుదయవాదులుగా చెప్పుకునే వామపక్ష వాదులూ, కుహనా లౌకికవాదులూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం మతతత్వ చర్యలకు పాల్పడుతోందని గగ్గోలు పెట్టారు.
ఇలాంటి రైమ్స్ పాశ్చాత్య దేశాలలో ఆయా సందర్భాలలో సరదాగా రాసుకుని ఉండవచ్చు. వాటిలో చాలావరకూ ఇప్పుడు ఎందుకూ పనికిరానివని వారే అవతల పడేశారు. మరి మన దేశంలో మాత్రం స్వాతంత్య్రం వచ్చి 69 సంవత్సరాలు దాటినా ఇంకా ఇలాంటి అర్థం లేని రైమ్స్‌ని పిల్లలచేత వల్లె వేయిస్తూ గొప్పగా మురిసిపోతున్నాం. ఇది ఏ రకంగా విజ్ఞత అనిపించుకుంటుంది?
అసలు మనదైన తేట తెలుగులో ఎన్నో మధురమైన పద్యాలు ఉన్నాయి. చిన్నారి చిట్టి గీతాలు ఉన్నాయి. వాటిని ఎందుకని మన పిల్లలకి నేర్పించటం లేదు? మనం అంతగా భావ దారిద్య్రంలో కొట్టుకొని పోతున్నామా?

-దుగ్గిరాల రాజశేఖర్