AADIVAVRAM - Others

చదువు విలువ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనకాపురంలో రామయ్య అనే బీద రైతు ఉండేవాడు. ఒకప్పుడు చాలా పొలాలు ఉండి బాగా బతికినవాడే అయినా, చదువు రాక, కామందు చేతిలో మోసపోయి, కూలి రైతుగా మిగిలాడు. కొడుకు బాబీ అయినా బాగా చదువుకుని పైకి రావాలని రామయ్య ఆశ.
బాబీ తెలివైనవాడే అయినా తండ్రి మాట వినేవాడు కాదు. సోమరి. అందువల్ల చదువు సరిగ్గా వొంటబట్టలేదు. అలా అని తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడా అంటే అదీ లేదు.
పండుగ వచ్చింది. బాబీకి లడ్డూలంటే చాలా ఇష్టం. అందుకని పండుక్కి తల్లిని అవి చెయ్యమని చెప్పాడు. కానీ రామయ్య సంపాదన గంజినీళ్లకే సరిపోయేది. లడ్డూలు ఎలా చేయించగలడు. అందువల్ల కాదని చెప్పేసింది తల్లి.
రామయ్యకి జాలి వేసింది. ఒక్కగానొక్క కొడుకు చిన్న కోరిక తీర్చలేకపోవడానికి తన అసమర్థతే కారణమని తనని తాను నిందించుకున్నాడు. ఎలాగైనా వాడి కోరిక తీర్చాలని అనుకున్నాడు. బాబీ కూడా అడవికి వచ్చి కట్టెలు కొట్టడంలో సాయపడితే కోరినట్టుగా లడ్డూలు చేయిస్తానని కొడుకుతో చెప్పాడు రామయ్య.
లడ్డూల మీది ప్రేమతో బాబీ బద్దకాన్ని పక్కనబెట్టి తండ్రి వెంట అడవికి బయల్దేరాడు. అడవిలో ముళ్లు తుప్పలు దాటుకుంటూ, విషపు పురుగుల బారిన పడకుండా జాగ్రత్త పడుతూ అడవి మధ్యలోకి చేరారు.
రామయ్య ఎండిపోయిన చెట్టు కొట్టసాగాడు. బాబీ లేత మొక్కలయితే త్వరగా నరకవచ్చని అవి నరుకుదామని అన్నాడు. కానీ రామయ్య లేత మొక్కలు నరికిస్తే ముందు ముందు చెట్లు ఉండక, పర్యావరణం దెబ్బతింటుందని, అది ముందు తరాలకు ముప్పు అని చెప్పి, ఎండిన చెట్లనే నరకమన్నాడు.
కష్టపడి ఇద్దరూ కట్టెలు కొట్టారు. బాబీకి తండ్రి రోజూ తమ కోసం పడే కష్టం అర్థమైంది.
పట్నం వచ్చి కట్టెలు కొట్టగా వచ్చిన డబ్బులు చూసి బాబీ చాలా సంతోషించాడు. ఇంటికెళ్లి తల్లితో చాలా లడ్డూలు చేయించుకు తినాలని అనుకున్నాడు.
తండ్రి పట్నంలో వున్న అన్న కొడుకుని చూసి వెళ్దామని చెప్పాడు. అతను పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగంలో చేరి, పట్నంలో స్థిరపడ్డాడు. రామయ్య అన్న రంగయ్య పల్లెటూరిలో వ్యవసాయం చేస్తున్నాడు.
రంగయ్య కొడుకు రమేష్, భార్య సీత రామయ్య బాబీలను చూసి చాలా సంతోషించారు. లడ్డూలు చెయ్యమని భార్యకి చెప్పాడు రమేష్. బాబీ ఆనందానికి అడ్డులేకపోయింది. ఇష్టమైనన్ని లడ్డూలు తిన్నాడు.
రమేష్ బాగా చదువుకోబట్టే, మంచి ఉద్యోగం సంపాదించుకొని చక్కటి జీవితాన్ని జీవిస్తున్నాడు. భార్యాపిల్లలతో ఆనందంగా ఉన్నాడు. వ్యవసాయంలో తండ్రికి ఆర్థిక సాయం అందిస్తూంటాడు. బాబీని పక్కన కూర్చోబెట్టుకొని రమేష్ చదువుకున్న విలువ గురించి చెప్పాడు.
చదువుకొనటం వల్ల ఎన్ని లాభాలున్నాయో అర్థమైంది బాబీకి. ముఖ్యంగా ఏది కావాలంటే అది తినొచ్చు. తల్లీ తండ్రి కష్టపడకుండా చూడొచ్చు. చదువువల్ల జీవితం సాఫీగా హాయిగా సాగిపోతుందన్న సంగతి బాబీకి అర్థమై.. ఆనాటి నుంచి చదువులో ముందంజ వేశాడు.

-ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి