AADIVAVRAM - Others

రామాయణం - మీరే డిటెక్టివ్ 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రాముడికి తను ఇచ్చే అస్త్రాల వివరాలు ఇలా చెప్పాడు.
‘దేవ, రాక్షస, గంధర్వ, ఉరగ మొదలైన వారిని యుద్ధ రంగంలో జయించే ఈ దివ్యాస్త్రాలని నీకు ఇస్తాను. ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శివ శూలం, బ్రహ్మ శిరోస్త్రం, బ్రహ్మాస్త్రం, ఐషికాస్త్రం ఇంకా నిప్పులు కక్కే మోదకి, శిఖరి అనే గదలు, ధర్మపాశం, కాలపాశం, వారుణపాశం, వారుణాస్త్రాన్ని ఇస్తాను. రామా! ఇంకా శుష్కం, ఆర్ద్ర అనే రెండు పిడుగులని, పైనకాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, హయశిరస్సాస్త్రం, క్రౌంచాస్త్రం, ఇంకా రెండు శక్తులని నీకు ఇస్తాను. రాక్షసులు ధరించే కంకాళం, కపాలం, కంకణం అనే మూడు ముసలాలని కూడా ఇస్తాను. వైద్యాధరం అనే మహాస్త్రం, నందన ఖడ్గం, నిద్ర కలిగించే, నిద్ర తొలగించే గాంధర్వ, మానవాస్త్రాలని, సౌరాస్త్రాన్ని, దర్పణ, శోషణ, సంతాపన, విలాపనాస్త్రాలని, మదనాస్త్ర, మోహనాస్త్రాలని ఇస్తున్నాను. తీసుకో. తామస, సౌమనాస్త్రాలు, సంవర్థాస్త్రం, వౌసలాస్త్రం, సత్యాస్త్రం, మాయాధర్మాస్త్రం, తేజః ప్రభాస్త్రం, శిశిరాస్త్రం, సుదామనాస్త్రం, శితేషువు బాణం, మానవాస్త్రాలని తీసుకో. రామా! ఇష్టం వచ్చిన రూపాలని ధరించే, బలమైన ఈ ముప్పై ఒక్క అస్త్రాలు అన్నిటినీ వెంటనే తీసుకో’
హరిదాసు మిరియాల పానకం తాగి కథని ఇలా కొనసాగించాడు.
‘విశ్వామిత్రుడు శుచిగా, తూర్పు వైపు తిరిగి ఆ అత్యుత్తమమైన అన్ని అస్త్రాలని రాముడికి ఉపదేశించాడు. ఏ అస్త్రాలని పరిపూర్ణంగా స్వీకరించడం దేవతలకి కూడా అసాధ్యమో అలాంటి అస్త్రాలు అన్నిటినీ విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చాడు. ఆ అస్త్ర మంత్రాలు రాముడ్ని సేవించాయి. రాముడు ఆ అస్త్రాలని స్వీకరించాక అస్త్ర దేవతలు అందరూ రాముడికి నమస్కరించి ఇలా చెప్పాయి.
‘రామా! మేమంతా నీ దాసులం’
రాముడు చేత్తో ఆ అస్త్ర దేవతలని తాకి ఆజ్ఞాపించాడు.
‘నా జ్ఞాపకంలో ఉండండి’
దేవతలు వెళ్లాక రాముడు విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘ఓ మునివర్యా! మీరు నాకు మూడు చక్రాలని, మూడు గదలని, మూడు పాసాలని ఇచ్చారు. దాంతో నేను ఈ అస్త్రాల ద్వారా దేవతలు కూడా ఎదిరించలేని వాడిని అయ్యాను. ఈ అస్త్రాల ఉపసంహారం కూడా తెలియచేయండి’
విశ్వామిత్రుడు ఆ పద్ధతిని కూడా ఉపదేశించాడు.
‘రామా! అలాగే. ఉపసంహారాలతోపాటు దృశాశ్వుని కొడుకులు, ప్రకాశించినవి, కామరూపం కలవి అయిన సత్యవంతం, సత్యకీర్తి, ధృష్టం, రభసం, ప్రతిహారతరం, పరాన్ముఖం, అవాగ్ముముఖం, లక్షాక్షం, విషమం, దృఢనాభం, సునాభం, దశాక్షం, శతవక్త్రం, దశశీర్షం, శతోదరం, పద్మనాభం, మహానాభం, దుందునాభం, సునాభం, జ్యోతిషం, కృశనం, నైరాశ్యం, విమలం, యోగంధరం, హరిద్రం, దైత్యం, ప్రశమనం, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతం, రుచిరం, పితృసౌమనసం, విధూతం, మకరం, కరవీరకరం, ధనం, ధాన్యం, కామరూపం, కామరుచి, మోహం, ఆవరణం, జృభకం, సర్వనాభం, సంతానం, వరణం అనే అస్త్రాలని కూడా ఇస్తున్నాను. వాటిని తీసుకో. నువ్వు వీటిని తీసుకోడానికి అర్హత గలవాడివి. నీకు క్షేమం అవుగాక!’
రాముడు సంతోషించి ఆ నలభై ఐదు అస్త్రాలని స్వీకరించాడు. ఆ అస్త్ర దేవతల్లో కొందరు ఎర్రగా కాలిన బొగ్గులా, కొందరు పొగలా కొందరు సూర్యచంద్రుల్లా ఉన్నారు. దివ్యమైన దేహాలు గల ఆ అస్త్ర దేవతలు కూడా ప్రత్యక్షం అయి, వినయంగా చేతులు కట్టుకుని రాముడితో ఇలా అన్నారు.
‘ఓ నరశ్రేష్ఠుడా! ఏం చేయాలో ఆజ్ఞాపించు’
‘మీరు నా మనసులో మెదలుతూ పని పడ్డప్పుడు నాకు సహాయం చేయండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు వెళ్లండి’ రాముడు చెప్పాడు.
వారంతా రాముడికి ప్రదక్షిణం చేసి వెళ్లిపోయారు. ఉపసంహార మంత్రాలు తెలుసుకున్నాక రాముడు నడుస్తూ విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘ఇటు వైపు పర్వతం మీద మృగాలతో నిండిన వృక్షాల గుంపుమేఘంలా చూడచక్కగా ఉంది. పక్షులు శ్రావ్యమైన పాటలు పాడుతూ ఈ ప్రదేశం ఆహ్లాదంగా ఉంది. కాబట్టి మనం ఆ భయంకరమైన అడవిలోచి బయటకి వచ్చామని అనుకుంటున్నాను. ఈ ప్రదేశం గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ ఉన్న ఆశ్రమం ఎవరిది? బ్రాహ్మణులని చంపేవారు, దుర్మార్గులైన ఆ రాక్షసులు ఎక్కడికి వచ్చి నీ యజ్ఞానికి విఘ్నం చేస్తున్నారు? నేను రాక్షసులని చంపి నీ యజ్ఞాన్ని రక్షించాల్సిన ప్రదేశం ఏది? నాకు తెలుసుకోవాలని ఉంది.’
(సర్గ 27-28)
ఆ హరికథ విన్న శ్రోతల్లోని ఓ వృద్ధుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘హరికథని మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, మీతో సాక్షాత్తు రాముడే తన కథని పలికిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన ప్రతీరోజు కథలో ఏడు తప్పులు ఉంటున్నాయి. ఇవాళ హరికథలో రెండు తప్పులే ఉన్నాయి. అవేమిటో చెప్తా వినండి. ఈ కథని మళ్లీ చెప్పినప్పుడు మీరీ తప్పులని చెప్పకపోతే సరి’
ఆ రెండు తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?
**
కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.మర్నాడు రామలక్ష్మణులు, విశ్వామిత్రుడితో కలిసి దాటిన నది గంగానది. సరయూ నది కాదు.
2.పడవలోంచి దిగింది ఉత్తర తీరంలో కాదు. దక్షిణ తీరంలో.
3.ఇంద్రుడు చంపిన రాక్షసుడు మహాకాయుడు కాదు. వృత్తాసురుడు.
4.తాటక బలం పదివేల ఏనుగుల బలం కాదు. వెయ్యి ఏనుగుల బలం మాత్రమే.
5.సుకేతుడు సంతానం కోసం శివుడి గురించి కాదు. తపస్సు చేసింది బ్రహ్మదేవుడి గురించి.
6.విరోచనుడి కూతురు కుసుమాలి కాదు. మంథర.
7.లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులని కత్తితో కోసెయ్యలేదు. బాణాలతో ఖండించాడు.
**

గత వారం మీ ప్రశ్నకి జవాబు

శ్రీమద్రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. క్రితం వారం
ఇదే ప్రశ్నకి 10 కాండలు అని ఇచ్చిన జవాబు తప్పనిమీరు గమనించారా?

మల్లాది వెంకట కృష్ణమూర్తి