Others

మహిళా చైతన్య దీప్తి ఆమె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు సావిత్రిబాయి పూలే వర్థంతి
*
భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య పునాదులు ఇంకా పూర్తిగా పడని రోజులవి. స్వాతంత్య్ర ఉద్యమ ప్రక్రియ ప్రారంభం కాని సమయమది. స్వదేశీరాజులు, నవాబులు తాము పాలించే ప్రాంతాలని బ్రిటీష్‌వారి నుండి ఏ విధంగా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతున్న కాలమది. అటువంటి సమయంలో ప్రజా సంక్షేమం గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఇటువంటి పరిస్థితులలో కేవలం మహారాష్టక్రే కాదు, యావత్ భారతదేశంలోని మహిళా లోకానికి దిశానిర్దేశం చేసి గొప్ప సామాజిక విప్లవకారిణిగా పేరుపొందిన సావిత్రిబాయి పూలే జన్మించారు. ఆమె మహారాష్టల్రోని సతారా జిల్లా, ఖండాలా తాలూకా నయాగావ్ గ్రామం లో 1831 జనవరి 3న ఖండోజీ నవ్‌సే పాటిల్, లక్ష్మీబాయి దంపతులకు జన్మించింది.
తొమ్మిదేళ్ళ వయస్సులో మహాత్మా జ్యోతిరావుని వివాహమాడి భర్త సహకారంతో చదువుకొని, తనలాగానే మిగతా మహిళలు చదువుకుంటే సమాజంలో తరతరాలుగా నెలకొన్న సాంఘిక దురాచారాలని రూపుమాపవచ్చని భావించిన ఆమె 1848 మే 12న బహుజనుల కోసం పూనెలోని బుధవార్‌పేటలో తొలి పాఠశాల ప్రారంభించింది. తర్వాత దేశంలోనే మొదట ఉపాధ్యాయురాలిగా చరిత్రలో స్థానం పొందింది. నాలుగేళ్ళలో అనేక అవరోధాలు ఎదుర్కొని, 20 పాఠశాలలు ప్రారంభించి ఉచిత విద్యనందించింది. సావిత్రిబాయి పూలే జీవిత ప్రస్థానంలో ఆమె భర్తతో పాటు మరో ఇద్దరి మహిళల పాత్ర గురించి ప్రస్తావించాల్సిందే. వారిలో ఒకరు ఫాతిమా బేగం షేక్ కాగా మరొకరు సుగుణాబాయి. 2008లో వౌంటెన్ పీక్ పబ్లిషర్స్ వారు ‘ఎ ఫర్‌గాటెన్ లిబరేటర్’ పేరుతో సావిత్రి జీవిత చరిత్రని ఆంగ్లంలో ప్రచురించారు. ఈ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలున్నాయి. జ్యోతిరావు తన కులం కారణంగా బడికి దూరం కావాల్సి వచ్చింది. అయితే పర్షియన్ పండితుడైన గఫార్ బేగ్ మన్షీ, లిజిత్ సాహెబ్ అనే బ్రిటీష్ అధికారి సహాయంతో ఆయన విద్యాభ్యాసాన్ని కొనసాగించడమే కాకుండా తన భార్యని కూడా చదివించాడు. పూలే దంపతులు వివక్షతకు గురైనవారి కోసం మంచినీటి బావిని త్రవ్వించడమే గాకుండా, వారి చదువుకోసం అహిల్యాశ్రమ్ అనే పాఠశాలని ప్రారంభించారు. 1849లో పూలే దంపతులని సంఘ బహిష్కరణ చేశారు. అయినా వీరు ఏ మాత్రం నిరుత్సాహం చెందకుండా తమ కార్యక్రమాలని కొనసాగించారు. ఆఖరికి జ్యోతిబా తండ్రి కూడా పూలే దంపతులని ఇంటికి రానీయలేదు. జ్యోతిబా స్నేహితుడైన ఉస్మాన్ షేక్ వారికి ఆశ్రయం ఇచ్చాడు. ఉస్మాన్ సోదరి ఫాతిబా బేగం షేక్‌తో సావిత్రికి పరిచయం ఏర్పడింది. ఉస్మాన్ ప్రోత్సాహంతో ఫాతిమా ఉన్నత విద్య నభ్యసించింది. సావిత్రి, ఫాతిమాలిద్దరూ 1849లో ఉస్మాన్ నివాసంలోనే ఓ పాఠశాలను ప్రారంభించారు. వీరికి మరో మహిళ సుగుణాబాయి కూడా తన ప్రోత్సాహాన్ని అందించింది. భారతదేశంలో ఇదొక గొప్ప మహిళా ఉద్యమంగా వర్ణించవచ్చు. వీటిని చరిత్రకారులు ఎవ్వరూ రికార్డు చేయకపోవడం విచారకరం. 1852లో సావిత్రీబాయి పూలే మహిళా హక్కుల కోసం ‘మహిళా సేవా మండల్’ను ప్రారంభించింది. భ్రూణహత్యలు నియంత్రించడానికి మరో గృహాన్ని ప్రారంభించింది. యశ్వంత్ అనే బాలుడిని దత్తత తీసుకొని విద్యాబుద్ధులు నేర్పింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడింది. వితంతువుల పునర్వివాహానికి పునాదులు వేసింది. 1897లో మహారాష్టల్రో ప్లేగు వ్యాధి రావడంతో తన కుమారుడితో కలిసి చికిత్సకు నడుం బిగించారు. ప్లేగు వ్యాధి ఆమెకు కూడా సోకడంతో 1897 మార్చి 10న మరణించింది.
1997లో భారత ప్రభుత్వం సావిత్రీబాయి పూలే స్మారకార్థం తపాలా స్టాంపు విడుదల చేసింది. భర్త స్థాపించిన సత్యశోధక్ సమాజ్ కూడా ఆమె విజయవంతంగా నిర్వహించింది. ఆమె జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి మహిళా ఉపాధ్యాయులని ఘనంగా సత్కరిస్తోంది. ఉపాధ్యాయురాలిగా, రచయిత్రిగా, సంఘ సంస్కర్తగా ఆమె చేసిన సేవలు మరువలేనివి. సావిత్రిబాయి పూలే కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడితే, ఫాతిమా కులం లేని సమాజం కోసం పరితపించింది. వీరిద్దరూ ఆనాటి సమాజంలో వున్న అనేక సాంఘిక రుగ్మతలను రూపుమాపడానికి విశేషమైన కృషిచేశారు. అయినప్పటికీ నేటి సమాజంలో బాల్య వివాహాలు, వరకట్నం, భ్రూణహత్యలు, మహిళలపై లైంగిక వేధింపులు వంటి అసాంఘిక కార్యక్రమాలు ఏదో రూపంలో జరుగుతూనే వున్నాయి. ముఖ్యంగా బహుజన మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని బహుజనులు, ముస్లింలు ఐక్యంగా పోరాటాలు చేసి తమ హక్కులని సాధించుకోవాల్సిన అవసరం వుంది.

- యం. రాంప్రదీప్ 9492712836