Others

విప్రనారాయణ (అలా.. అన్నమాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి రామకృష్ణ దర్శకత్వంలో భరణీ సంస్థ నుంచి వెలువడిన ఆరో సినిమా -విప్రనారాయణ (1954). వైజయంతీ విలాసం, విప్రనారాయణ చరిత్ర కావ్యాల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. విప్రనారాయణునిగా అక్కినేని అసమాన నటన ప్రదర్శించిన చిత్రమిది. ఈ చిత్రం నిర్మితమవుతున్న టైంలోనే.. కెవి రెడ్డి ‘దొంగరాముడు’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఓ సందర్భంలో అక్కినేనితో కెవి రెడ్డి ‘నీకు దేవుడిమీద నమ్మకం లేదు. ఇదేమో పరమభక్తుడి పాత్ర. నువ్వెలా వేస్తావ్ ఆ వేషం’ అని అడిగారు. ‘దుష్ట పాత్ర ధరించేవాడు బయటకూడా దుష్టుడా? తక్కిన పాత్రల్లానే ఇదీ వేస్తాను. మీరు పోతన వేషం వేయించిన నాగయ్య స్టైల్లోనే అర్థ నిమీలిత నేత్రాలతో భుజాలు దించుకొని, భక్త్భివంతో చేస్తాను. నటుడు అనే వానికి కావలసింది శ్రద్ధకాని, పాత్ర మీద నమ్మకం కాదు’ అన్నారట. అక్కినేని సరసన దేవదేవిగా భానుమతి హావభావాలు ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేశాయి. క్షేత్రయ్య పదం -రారా నా సామి రారా, సారంగపాణి పదం -ఎవ్వడే అతడెవ్వడే అంటూ భానుమతి చేసిన నృత్యాలు ప్రేక్షకుల్ని అలరించాయి. మల్లీశ్వరి (1951) తరువాత యస్ రాజేశ్వరరావు అందించిన పెద్ద మ్యూజికల్ హిట్ ఇది. ప్రతి పాటా ఆణిముత్యంలా తయారైంది. గీతగోవిందంలోని జయదేవుని అష్టపది ‘సావిరహే’ భానుమతి గొంతులో కొత్త అందాల్ని సంతరించుకుంది. భానుమతి గాత్రంలో మాధుర్యం, లాలిత్యంతోపాటు పులకరింపజేసే తీక్షణత కూడా ఉంటుంది. అరబిక్ పర్షియన్ స్టైల్లో సాగే ‘ఎందుకోయి తోటమాలి’ భానుమతి పాడిన తీరు అన్యులకు అసాధ్యమనిపిస్తుంది. ‘పాలించరా రంగా’, ‘చూడుమదే చెలియా’ ‘అనురాగాలు దూరమూలాయెనా’ పాటలు ఆంధ్ర దేశమంతటా మారుమ్రోగాయి. ‘ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం’ పాట రేలంగి పాడటం, సముద్రాల సీనియర్ మాటలు, పాటలు వ్రాయడంతోపాటు భానుమతితో కలసి స్క్రీన్ ప్లే తయారుచేయటం, అన్ని పాటలు ఎయం రాజా ప్లేబ్యాక్ పాడటం, నాటకాలలో దేవదేవి పాత్రను పోషించిన అక్కినేని విప్రనారాయణ వేషం వెయ్యటం, దర్శకుడు రామకృష్ణ ఎడిటింగ్ నిర్వహించటం ఈ చిత్రం విశేషాలు. చోళమహారాజుగా సౌండ్ రికార్డిస్టు వి శివరాం, రంగదాసుగా రేలంగి, మధురవాణిగా సంధ్య, రంగసానిగా ఋష్యేంద్రమణి నటించారు. నృత్యం పసుమర్తి కృష్ణమూర్తి, ఫొటోగ్రఫీ సెల్వరాజ్.
1937లో కలకత్తాకు చెందిన అరోరా ఫిలింస్ -అహీంద్రచౌదరి దర్శకత్వంలో కస్తూరి నరసింహారావు, కాంచనమాలతో ‘విప్రనారాయణ’ తొలిసారిగా నిర్మించటం జరిగింది. ‘బుద్ధిమంతుడు’ (1969) చిత్రంలో అక్కినేని వేసిన పూజారి పాత్రకు, విప్రనారాయణ పాత్రకు మేకప్‌లో చాలా పోలిక వుంది. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘అమరజీవి’ (1983)లో ఒక నృత్యనాటికలో అక్కినేని విప్రనారాయణునిగా, దేవదేవిగా జయప్రద నటించారు. భరణీవారి ఈ చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది. మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ భానుమతికి ఉత్తమ నటి పురస్కారం అందించారు. రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ అడుగడుగునా కనపడే ‘విప్రనారాయణ’ క్లాసిక్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.

-పూజారి నారాయణ