AADIVAVRAM - Others

అన్ని మతాల సారాంశం ఒక్కటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం॥
భగవద్గీత నాలుగో అధ్యాయంలోని 7 వ శ్లోకమిది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి.. ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి పొందునో ఆ సమయమన నేను అవతరింతును అన్నారు.
భగవంతుడు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ జన్మలన్నీ పూర్తిగా గుర్తుంటాయి. సాధారణ మనిషి కూడా అనేక జన్మలను ఎత్తుతుంటాడు. కాని ఎవరికీ కూడా గత జన్మస్మృతులు గుర్తుండవు. అదే విషయాన్ని శ్రీకృష్ణుడు గీతాబోధన సందర్భంగా మరొక చోట చెప్పారు.
భారతదేశం యోగులు, రుషులు, భగవత్ అంశ కలిగి ఉన్నవారు, సిద్ధులు, గురువులు, మహానుభావులకు పుట్టినిల్లు. స్థూలంగా చెప్పుకుంటే త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడి అవతారాలుగా చెప్పుకుంటాం. కలియుగంలో వేంకటేశ్వరుడు శిలారూపంలోకి మారి ప్రజలను రక్షిస్తూ ఉన్నారు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు భగవత్ అంశతో జన్మించినవారుగా ప్రఖ్యాతి చెందారు. పరమ శివుడు ‘ఆదియోగి’గా ప్రఖ్యాతి చెందారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమే దత్తాత్రేయుడి అవతారం. కలియుగంలో దత్తాత్రేయుడు అనేక రూపాల్లో జన్మమెత్తుతున్నాడు.
ఒక పర్యాయం మన గురువులు, యోగులు, రుషులు తదితరుల పేర్లను పరిశీలిస్తే, భారత్ వేదభూమి, పుణ్యభూమి అని అర్థమవుతుంది. వేదవ్యాసుడు, వాల్మీకి, అగస్త్య మహాముని, 12 మంది ఆళ్వారులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు, పెద్ద జీయర్ స్వామి, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, జిల్లెలమూడి అమ్మ అనసూయాదేవి, స్వామి చిన్మయానంద, చంద్రశేఖర సరస్వతి, దయానంద సరస్వతి, సద్గురు (జగ్గి వాసుదేవ్), కబీర్, మాధవాచార్యులు, మాతా అమృతానందమయి, రమణ మహర్షి, షిర్డీ సాయిబాబా, సమర్థ రామదాసు, సత్యసాయి బాబా ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక మంది ఉన్నారు. వీరంతా సమసమాజం కోసం పాటుపడ్డవారే.
ఈ కోవలోకి చెందినవారే భగవాన్ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్. విశ్వశాంతి కోసం విశ్వంజీ ఎనలేని కృషి చేస్తున్నారు. ప్రపంచంలో అన్ని మతాలు సమానమేనన్నది స్వామి అభిప్రాయం. మానవత్వమే మనిషి మతమని బోధిస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన, శిక్కు, జోరాష్ట్రియన్ తదితర మతాల సారాంశం ఒక్కటేనని స్వామి అంటారు. మతం పేరుతో మారణ హోమాలు జరగకూడదని, విశ్వకల్యాణం కోసమే మతం ఉపయోగపడాలని చెబుతున్నారు. ప్రతివ్యక్తి సొంత మతాన్ని అభిమానించాలని, ఇతర మతాలను గౌరవించాలని, మత మార్పిడిలు చేయడం మంచిదికాదని చెబుతున్నారు.
పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశాలను కలుషితం కాకుండా చూడాలని, ఇవి కలుషితం అయితే ప్రకృతివైపరీత్యాలు వస్తాయని చెబుతున్నారు. రసాయన పరిశ్రమల వల్ల భూమి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయని, మనిషి మనుగడకే ముప్పు వాటిల్లుతోందని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రపంచానికి చెప్పేందుకు అమెరికాతో సహా వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు. పంచభూతాలు కలుషితం అవుతుండటం వల్లనే ప్రకృతివైపరీత్యాలైన మంచు తుపాన్లు, అగ్నివర్షాలు, మహాకుంభవృష్టి, కొన్ని ప్రాంతాల్లో వానలు లేని వర్షాభావ పరిస్థితి ఏర్పతుతోందని హెచ్చరించారు. ఈ పరిస్థితి నుండి మానవ సమాజాన్ని కాపాడుకునేందుకు, ప్రకృతిని కాపాడుకునేందుకు వీలుగా పంచభూతాలను కాలుష్యం నుండి రక్షించాలని వివిధ దేశాధినేతలకు పిలుపు ఇచ్చారు.
ప్రపంచం అనే శరీరంలో హృదయం భారతదేశమైతే, మెదడు అమెరికా అని చెబుతూ, గుండె పంపించే మంచి రక్తాన్ని శరీరంలోని వివిధ అంగాలకు మెదడు సరఫరా చేస్తుందని, తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుందని అంటారు. అలాగే భారత్ నుండి వెళ్లే శాంతి సందేశం అమెరికా ద్వారా వివిధ దేశాలకు చేరాలన్నదే స్వామి సంకల్పం. హృదయం భారతదేశమని, మెదడు అమెరికా అని, ఇతర దేశాలన్నీ శరీరంలోని వివిధ అంగాలని వివరించారు. గత రెండు దశాబ్దాల నుండి ఏటా అమెరికా వెళ్లి విశ్వవిద్యాలయాలు, పరిపాలనా విభాగాలు, విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలు, సామాజిక సంస్థలు నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటూ విశ్వశాంతి సందేశాన్ని ప్రపంచానికి చేరవేస్తున్నారు. ఏటా జనవరి నుండి జూన్-జూలై దాకా భారత్‌లో ఉండే విశ్వంజీ మిగతా రోజుల్లో అమెరికాలో పర్యటిస్తుంటారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, వివిధ పట్టణాల్లో ఆయన పర్యటన కొనసాగుతోంది. స్వామి వివేకానంద తర్వాత అనేక మంది యోగులు అమెరికాలో పర్యటిస్తూ, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వారిలో విశ్వంజీ ముఖ్యుడిగా పేర్కొనవచ్చు.
జన్మదినోత్సవం
2020 మార్చి 5 న విశ్వంజీ 76వ జన్మదినోత్సవ వేడుకలు గుంటూరు సమీపంలోని ‘విశ్వనగర్’లో జరుగుతున్నాయి. మార్చి 1 నుండి 5 వ తేదీవరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1944 మార్చి 5 న (స్వభాను నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ద ఏకాదశి) విశ్వంజీ గుంటూరు జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు గుంటూరు జిల్లాలోని చమళ్లమూడిలో నివసించేవారు. వాస్తవంగా వీరిది నెల్లూరు జిల్లా. వీరి పూర్వీకులు గుంటూరు జిల్లాలో స్థిరపడ్డారు. తండ్రి గుర్రప్పడియ ఆంజనేయులు..మంచి విద్యావేత్త, కవి, రచయిత, దైవభక్తుడు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. తల్లి వరలక్ష్మమ్మ. గృహిణి. విశ్వంజీ అసలు పేరు విశ్వనాథ శాస్ర్తీ. అన్న విద్యాసాగర శర్మ. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌గా పనిచేశారు. ఇద్దరు అక్కలు సీతారావమ్మ, హేమరేఖ. విశ్వనాథశాస్ర్తీ బాబాయి సత్యనారాయణమూర్తి టీచర్‌గా పనిచేసేవారు. బాబాయితో విశ్వంజీ చనువుగా ఉండేవారు.
చమళ్లమూడి గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన విశ్వనాథుడు, గుంటూరులో తన ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. బీఏ, బీఈడీ చదివి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వీరిది పేద కుటుంబం. విశ్వనాథశాస్ర్తీకి తరగతిలో తోటి విద్యార్థులకన్నా మంచి మార్కులు వస్తుండటంతో రాజమండ్రిలోని ఆదుర్తి రామారావు పేరుతో ఇచ్చే ఉపకారవేతనం (స్కాలర్‌షిప్) పొందేందుకు ఎంపికై, ఉన్నత చదువుల వరకు ఈ స్కాలర్‌షిప్‌లతోనే చదువుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన తర్వాత గుంటూరులోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. విశ్వనాథశాస్ర్తీ అన్న విద్యాసాగర శర్మ వృత్తిరీత్యా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు డిగ్రీకాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే వారు. అన్నగారి వద్దకు వెళ్లిన విశ్వనాథశాస్ర్తీకి 1967 లో బీష్మ ఏకాదశి రోజు జడ్చర్లలోని దత్తమందిరంలో మహారాష్టక్రు చెందిన దత్తాత్రేయ వాడీకర్ అనే గురువు అష్టాక్షరీ మహామంత్రోపదేశం చేశారు. అదే సమయంలో విశ్వనాథశాస్ర్తీకి వివాహ ప్రయత్నం జరగగా, ఆయన సున్నితంగా తిరస్కరించి, బ్రహ్మచారిగా కొనసాగేందుకే మొగ్గు చూపారు. ఇంట్లో పెద్దలు కూడా అందుకు అంగీకారం చెప్పారు.
దాంతో విశ్వనాథశాస్ర్తీ సామాన్య జీవితం నుండి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది. యోగసాధన మొదలైంది. విశ్వనాథశాస్ర్తీ యోగసాధన మూడు భాగాలుగా చూడవచ్చు. 1967 కు ముందు ఆయన జీవనం బాల్యం, విద్య వరకు ఒక భాగంగా చూడవచ్చు. ఉద్యోగంలో కొనసాగుతూనే, గురువుగారు దత్తాత్రేయ వాడీకర్ నుండి మంత్రోపదేశం తర్వాత 1967 నుండి 74 వరకు ఆధ్యాత్మిక ప్రస్తానం రెండో దశగా భావించవచ్చు. విశ్వమందిరంలో చేరిన తర్వాత 1974 నుండి 88 వరకు దత్తాత్రేయ అవతారం ప్రారంభాన్ని మూడో దశగా భావించవచ్చు. 1985 లో జిలెల్లమూడి అమ్మ అయిన అనసూయాదేవి, అదే సంవత్సరం పుట్టపర్తి సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో ఆధ్యాత్మిక శక్తిని విశ్వనాథుడు పొందారు. 1974 లో జమ్మలమడక మాధవరామశర్మ ద్వారా శక్తివంతమైన ‘శ్రీచక్రం-శంఖు’ను విశ్వనాథుడికి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి పంపించారు. వీటన్నింటి వల్ల విశ్వనాథుడు శక్తిసంపన్నులయ్యారని స్పష్టమవుతోంది. 1988 నవంబర్ 11 ఉపాధ్యాయ వృత్తికి విశ్వనాథశాస్ర్తీ రాజీనామా చేసి పూర్తి ఆధ్యాత్మిక జీవనం మొదలు పెట్టారు. ఆ తర్వాత 21 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు ద్వారా యోగశక్తి, ఆధ్యాత్మిక శక్తి సంపన్నులయ్యారు. మనిషి త్రికరణ శుద్ధితో, నిరంతరం సాధన చేస్తే దివ్యత్వాన్ని సాధించగలడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని విశ్వనాథశాస్ర్తీ ఆచరణలో నిరూపించారు. జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం, మనస్సును విశ్వమనస్సుతో అనుసంధానం చేయడంలో స్వామి కృతకృత్యులయ్యారు. మనిషి ఇంద్రియ నిగ్రహం చేత, స్వార్థరాహిత్యం చేత, త్యాగనిరతి చేత ధ్యాన స్థితుడై విశ్వశక్తిని (కాస్మిక్ ఎలక్రో మాగ్నెటిక్ పవర్) కైవసం చేసుకోగలుతారని విశ్వనాథుడు నిరూపించారు. సచ్చీలత, బ్రహ్మచర్యం, నిస్వార్థం, నిష్కామం, నిరహంకారం, భూతదయ, సాత్విక గుణాలను అలవరచుకోవడంలో కృతకృత్యులయ్యారు. ప్రతివ్యక్తిలోనూ హృత్‌శక్తిగా, చిత్‌శక్తిగా, ఆత్మశక్తిగా వెలుగొందుతూ, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులుగా భాసిల్లుతూ, విష్ణు, బ్రహ్మ, రుద్ర సమైక్య స్వరూపంగా తేజరిల్లే దివ్యశక్తే దత్తశక్తి. త్రికరణశుద్దిగా ఉండే వారి హృదయంలో భగవంతుడు ఉంటాడని ఆచరణలో చూపారు. ‘దేహమే దేవాలయం-హృదయమే దైవపీఠం’ అని విశ్వసించడమే కాకుండా దీనే్న భక్తులకు బోధిస్తున్నారు. ఈ పరిణామాల తర్వాత విశ్వనాథ శాస్ర్తీ విశ్వయోగిగా మారారు. విశ్వంజీని దత్తాత్రేయుడి తొమ్మిదో అవతారంగా భక్తులు భావిస్తున్నారు. అయితే విశ్వంజీ ఎప్పుడు కూడా తాను భగవత్ అవతారమని, దత్తాత్రేయుడి అవతారమని చెప్పుకోలేదు.
విశ్వంజీ ఈ లోకానికి అందించిన మహామూల మంత్రం ‘ఓం శ్రీ సాయిరాం గురుదేవదత్త’. ఈ మహామంత్రం భక్తులకు రక్షాకవచంగా ఉంటోందని అనేక ఉదంతాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సమాజ వికాసం
వ్యక్తి వికాసం ద్వారా కుటుంబ వికాసం జరగాలని, కుటుంబ వికాసం ద్వారా సమాజ వికాసం జరగాలని విశ్వంజీ బోధిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, ఆత్మనిష్ట, ఆత్మనిగ్రహం, ఆత్మానందం, ఆత్మసాక్షాత్కారం అనే పంచసోపానాలు ఆత్మశక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయి. బండరాయిని సక్రమ పద్దతిలో తొలిస్తే చక్కని విగ్రహం ఏర్పడినట్టే, మనిషిలోని దుర్గుణాలను పారదోలితే ఆధ్యాత్మిక శక్తివంతుడౌతాడు. అందుకే సాధనదశకు, సిద్ధదశకు పోలిక ఉండదు. సిద్ధదశ నూతన జన్మగా భావించవచ్చు. సూక్ష్మశరీరం (ఆస్ట్రల్ బాడీ) కొత్త పరిణామం ఎత్తుతుంది. రావణుడిని సంహరించేందుకు శ్రీరాముడికి దేవతలంతా తమ తమ శక్తిని దారపోసి, మరింత శక్తివంతుడిని చేస్తారు. అలాగే సాధారణ వ్యక్తికి గురువులు తమ తపశ్శక్తిని ధారపోస్తారు. దత్తాత్రేయ వాడేకర్, జిల్లెలమూడి అమ్మ, కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి తదితరులంతా విశ్వంజీకి తమ శక్తులను అందించారు. విశ్వంజీ తన రసస్యాలను ‘శాంతిప్రేమదాయి’ శతకం ద్వారా సమాజానికి వివరించారు.
ప్రతివ్యక్తిలోనూ దేవుడున్నాడని, దత్తశక్తి ఉంటుందని విశ్వంజీ పేర్కొంటున్నారు. సాధన ద్వారా ఈ శక్తి వెలుగులోకి వస్తుందంటారు. అనురాగలహరి పుస్తకం ద్వారా ఉపాసకుడు, ఉపాసదైవం నుండి శక్తిని పొందుతాడని గుర్తు చేశారు.
ప్రతివ్యక్తి దైవీగుణాలైన భయరాహిత్యం, స్వీయస్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మికజ్ఞాన సముపార్జన, దానగుణం, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణం, వేదాధ్యయనం, తపస్సు, సరళత్వం, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యం, త్యాగం, శాంతి, లోభరాహిత్యం, మృదుత్వం, సిగ్గు, ధృడనిశ్చయం. తేజము, క్రమాగుణం, ధైర్యం, శుచిత్వం, అసూయారాహిత్యం, గౌరవవాంఛ లేకుండా ఉండాలని స్వామి సూచిస్తున్నారు.
గుంటూరు కేంద్రం
విశ్వంజీ ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. గుంటూను నుండి 16 కిలోమీటర్ల దూరంలో (గుంటూరు-చిలకలూరిపేట మార్గం) చినకొండ్రుపాడు గ్రామ పరిధిలో స్వామి ఆశ్రమం ‘విశ్వనగర్’ ఉంది. స్వామి ఎక్కువగా గుంటూరు పట్టణంలోని కృష్ణానగర్ మూడోలైన్‌లోని ‘విశ్వమందిరం’ లో ఉంటారు. ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులు ఈ భవనాన్ని నిర్మించి, స్వామి వారికోసం కేటాయించారు. తరచూ ఆశ్రమానికి వెళుతుంటారు. భక్తులు విశ్వంజీని ‘స్వామి’ అని సంబోధిస్తుంటారు. స్వామి అందించిన మూలమంత్రం అందరికీ రక్షగా పనిచేస్తోంది. స్వామి ఇచ్చే విభూతి అత్యంత మహిమగలదిగా భక్తులు భావిస్తారు.
సుఖినోభవంతు
*

-పి.వి. రమణారావు 98499 98093