Others

బంధాలు - కర్తవ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంధం అనేది మిథ్య అని అందరికీ తెలుసు. ఈ జగత్తు మిథ్య. జగన్నాథుడే నిత్యమూ సత్యమూ అనీ తెలుసు. కానీ మనస్సు ఏ బంధంలోనైనా చిక్కుకుంటే దాన్నినుంచి విడివడడమనేది చాలా కష్టం. అందులో పుత్రవ్యామోహం, కళత్ర వ్యామోహంలో మనుషులు చిక్కుకుంటేనే సంసారం సాగరం అయిపోయింది. గుదిబండగా మారిపోతుంది. దాన్నుంచి ఎంతకీ బయటకు రాలేరు.
ఎంత వివేక విచక్షణలున్నా, జ్ఞానమున్నా సరే ఆ బంధాలు జిడ్డుగా మారిపోతాయి. అందుకే మనవాళ్లు చిన్నప్పటి నుంచి దేనినైనా అతిగా కోరకూడదంటారు. తామరాకుపై నీటిబొట్టుగా ఉండాలి కానీ సంసారంలో మునిగిపోకూడదు. అట్లాఅని కర్తవ్యాలను విస్మరించకూడదు. కర్తవ్యాన్ని విస్మరించినా, బంధంలో చిక్కుకున్నా చాలా కష్టపడాల్సి వస్తుంది.
మహారాజు అయి ఉండి కూడా ఏవిధంగా బంధాల్లోను ఇరుక్కున్నాడో దశరథుని కథ వింటే తెలుస్తుంది.
దశరథుడు మహాయోధుడు. దేవతలకే కదనరంగంలో కాలుకదిపి తన నైపుణ్యంతో వారికి విజయం చేకూర్చేవాడు. అట్లాంటి దశరథుడు మహాపట్టణం అని పేర్గాంచిన అయోధ్యాపట్టణానికి మహారాజు అయ్యాడు. ఆయన రాజ్యం ముక్కారు పంటలతో, విద్యాసుగంధాన్ని ధరించిన పౌరులతో నిండి ఎల్లవేళలా సస్యశ్యామలంగా విజయలక్ష్మి అధివష్టించిన భూమిలా విలసిల్లేది.
కానీ దశరథుడు నిస్సంతు. అతనికి ముగ్గురు రాణులుండేవారు. కానీ సంతాన విహీనుడై సదా తనకు వారసులు లేరని వాపోతుండేవాడు. తన ఆస్థాన పురోహితులను, వశిష్ట, వామదేవాది మహర్షులతో తన గోడును వివరించి తనకు సంతాన యోగం కలిగేటట్టు చూడమని ప్రార్థించేవాడు.
దశరథుడు ధర్మసంపన్నుడని ఖ్యాతి వహించాడు. అయోధ్యను ఇంద్రపురితో పోల్చేవారు. సాధువులు, సన్యాసులు, సిద్ధులు లాంటి వారంతా దశరథుడు వేయేండ్లు సుఖసంతోషాలతో పాలన సాగించాలని దీవించేవారు. అటువంటి దశరథుడు కదా అని మహర్షులంతా ఆలోచించారు. వారు వారి యోగదృష్టితో దశరథుని భావిని దర్శించారు. మహర్షులంతా దశరథుని చేత పుత్రకామేష్ఠి చేయిస్తామని చెప్పారు. ఋష్యశృంగుని పిలిపించమని చెప్పారు. దశరథుడు ఆనంద పరవశుడై యాగానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఋష్యశృంగుడను మహర్షి దశరథుని చే పుత్రకామేష్ఠి యాగం చేయించాడు. శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘు్నలను నలుగురు పుత్రులు కలిగారు. రాణులు, రాజు అమితానంద పడ్డారు. రాణీవాసంలో ఆ నలుగురు పుత్రులు అపురూపంగా పెరుగుతున్నారు. కాలక్రమంలో వారు పెద్దవారు అవుతూ యుద్ధవిద్యలు నేర్చుకునే సమయంలోనే విశ్వామిత్రుడు దశరథుని దగ్గరకు వచ్చాడు. దశరథుడు ఆ మహామునికి స్వాగత సత్కారాలు చేశాడు. ఏదైనా పని నిమిత్తం వచ్చి ఉంటే తెలుపుమని దానిని నిర్వర్తిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం తన పుత్రులైన రామలక్ష్మణులను విశ్వామిత్రుడు యాగరక్షణార్థం పంపమని దశరథుని కోరుకున్నాడు.
దశరథుడు ఎంతో వేదనతో వారిని వదిలి ఉండలేక, మహర్షికి ఇచ్చిన మాట వదలలేక ఆయనతో పంపలేకపోయాడు. అయ్యో లేక లేక పుట్టిన పిల్లలు కదా. వారిని ఏ విధంగా మీతో పంపాలని వ్యధచెందాడు. కాదంటే పోలా అనుకొన్నాడు. దశరథునిలోని పుత్ర వ్యామోహం మాట ఇచ్చి తప్పడమనే మహాపాపానికి కూడా వెరవనివ్వలేదు. భావి తెలిసిన వశిష్ఠ మహర్షి మెల్లగా దశరథునికి నచ్చచెప్పాడు. విశ్వామిత్రుని కోపస్వభావం గురించి చెప్పాడు. ఆయనకు పుట్టిన కుమారులు సాధారణ పిల్లలు కారని కారణ జన్ములని వివరించారు. వారికి ఎన్నో విద్యలను విశ్వామిత్రుడు నేర్పుతాడని లోకానికే కీర్తితెచ్చే వీరులుగా విశ్వామిత్రుడు వారిని తీర్చిదిద్దుతాడని ఎంతో చెప్పిన తరువాత అపుడు దశరథుడు చేసేది ఏమీ లేక ఎంతో వేదన చెంది మెల్లగా తన అనురాగాన్ని బలవంతంగా ఆపుకుని రామలక్ష్మణులిద్దరినీ మహర్షి వెంట పంపించారు. చూశారా! బంధం వదిలించుకోవడం అంటే ఎంత కష్టమో. కొన్నాళ్లు దూరమైతేనే ఉండలేనట్టున్నాడు. అంతటి జ్ఞాన నిధి అయిన దశరథుడు. ఇక మామూలు జనం గురించి ఏమి చెప్పాలి.
ఆ తరువాత వచ్చిన ఘట్టం చూడండి. దశరథునికి ఏమి మిగిల్చిందో!
విశ్వామిత్రుని వెంట నడిచిన రామలక్ష్మణులు ఆయన్ను మెప్పించి ఎన్నో గాథలను విని, అస్తశ్రస్త్రాలను మహర్షి ద్వారా గ్రహించి విశ్వామిత్రుడు తలపెట్టిన యాగాన్ని రక్షించారు. ఆ మహర్షి ఆశీర్వాదాన్ని పొందారు.
దారిలో మిథిలానగర ప్రవేశం చేసిన రామలక్ష్మణులు జనకుని దగ్గర ఉన్న శివధనుస్సును చూశారు. మహర్షి ప్రోత్సాహంతో రాముడు శివధనుర్భంగం చేశాడు. జనకుడు తన మాట ప్రకారం రామునికి తన కుమార్తె అయిన సీతమ్మను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పగా రాముడు తన తండ్రి అభీష్టం మేరకు తాను వివాహం చేసుకొంటానని చెప్పాడు.
జనకుడు, ఆయన తమ్ముడు కుశధ్వజుడు దశరథుని వివాహం చేయడానికి ఆజ్ఞను పొందాడు. అపుడు దశరథుడు, జనకుడు, కుశధ్వజులు బంధువులు, పురప్రజలు ఇలా అందరి సహకారంతో రామలక్ష్మణ భరత శత్రుఘు్నలకు సీత, ఊర్మిళ, మాండవి, శుత్రకీర్తిలను ఇచ్చి వివాహం చేశారు.
కొన్నాళ్లకు దశరథునికి రాముని పట్ట్భాషేకం చేద్దామని తలంపునకు వచ్చాడు. కానీ విధివశాత్తు కైకమ్మకు దశరథుడు ఇచ్చిన రెండు వరాల వల్ల రాముడు వనవాసం చేయాల్సి వచ్చింది. విషమ పరిస్థితి చూసి దశరథుడు తట్టుకోలేకపోయాడు. ఆఖరికి కైక కాళ్లు పట్టుకుని బతిమిలాడడానికి కూడా వెనుకంజ వేయలేదా మహారాజు. ఎంతో వేదనకు గురయ్యాడు. దుఃఖభారంతో వేయిసంవత్సరాలు మీద పడినవానిగా మారిపోయాడు. కానీ కాలధర్మం మారుతుందా? ఎవరో వగుస్తున్నారని, మరెవరో సంతోషపడుతున్నారని కాలం తన పని చేయకుండా ఆగుతుందా? ఎట్టకేలకు రాముడు తన తండ్రిని బాధపెట్టి అయినా సరే ఆయన మాటను నేను వింటాను అనే సత్యాన్ని లోకానికి చాటాలనుకొన్నాడు. వెంటనే వనవాసానికి బయలుదేరాడు. రామునితో పాటు సీత, లక్ష్మణులు కూడా వనవాసానికి బయలుదేరారు. వారు దశరథునికి తమ తల్లులకు ప్రణామాలు అర్పించి వనాల బాట పట్టి రాజ్యాధికారాన్ని వదులుకుని వెళ్లిపోయారు. కానీ దశరథుడు-
ఆ ముగ్గురిని వనవాసం చేయవద్దని చెప్పలేక, కైక మాటను కాదనలేక దశరథునికి నిస్సత్తువ కలిగింది. చేసేది ఏమీ లేక పుత్ర వ్యామోహాన్ని దూరం చేసుకోలేక, బంధాన్ని విడవలేక చివరకు ప్రాణాలను వదిలేశాడు. చూశారా! బంధం ఎంత బలవత్తరమైందో రాముడు అడవుల పాలు కాకపోయి ఉంటే దశరథుడు ఇంకొన్నాళ్లు జీవించి ఉండేవాడేమో అనిపిస్తుంది. కానీ ఇట్లా ఆలోచించడమూ తప్పే మరణం నిశ్చయమైన తరువాతే జీవి శరీరమనే ఉపాధిని పొందుతుంది. అంటే పుట్టినప్పుడే ఆ జన్మ కాలమెంతో నిర్ణయించబడే ఉంటుంది. కానీ కాలమెప్పుడూ నెపాన్ని తన మీద వేసుకోదట. అందుకే అయ్యో పాపం! రాముడు దూరమైనందుకే దశరథునికి మృత్యువు దాపురించింది అనుకొంటారు. కానీ కాల ధర్మం ప్రకారం దశరథుని కాలం తీరింది అనుకోలేకపోతారు.
అందుకే కాలం గురించి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. దూరమైన కాలాన్ని దక్కించుకోలేము. రాబోయే కాలాన్ని ఒడిసి పట్టలేము. కనుక ఎవరైనా సరే కర్తవ్యనిష్ఠ సత్యధర్మాలను ఆచరణలో పెట్టుకుంటే చాలు కాలం మనలను బాధించదు.

- డా. రాయసం లక్ష్మి